
ఎక్కడైనా ఉద్యోగానికి లేదా ఇంటర్వ్యూలకు కొంత ముందు వస్తే, వాళ్ళ టైమ్ సెన్స్ చూసి.. జాబ్ ఇచ్చే సంస్థల గురించి విన్నాం. కానీ ఇంటర్వ్యూకు 25 నిముషాలు ముందుగా వచ్చాడని.. ఉద్యోగం ఇవ్వని ఓ కంపెనీ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ది బ్రదర్స్ దట్ జస్ట్ డు గట్టర్స్ ఓనర్ 'మాథ్యూ ప్రీవెట్'.. తాను షెడ్యూల్ చేసిన సమయానికంటే ముందుగా ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థిని రిజెక్ట్ చేశారు. దీనికి కారణాన్ని వెల్లడిస్తూ.. అతనికి సమయపాలన లేదని, ఇంటర్వ్యూకు ఐదు నుంచి 15 నిముషాలు ముందుగా వచ్చి ఉంటే.. ఆ అభ్యర్థి మీద మంచి అభిప్రాయం వచ్చి ఉండేదని అన్నారు. అంతే కాకుండా అతడు ముందుగా వచ్చి.. నా కాల్స్ వినడం కూడా కొంత ఇబ్బందిగా అనిపించిందని స్పష్టం చేసారు. సమయానికంటే ముందుగా రావడం మంచి అలవాటే.. కానీ మారీ ముందుగా రావడం అనేది ఒక లోపం అని మాథ్యూ ప్రీవెట్ అన్నారు.
ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు ఆ సంస్థ తీరుపై మండిపడుతున్నారు. రిజెక్ట్ చేయడానికి ఇలాంటి కారణాన్ని మేము ఎక్కడా వినలేదని కొందరు చెబుతుంటే.. అతని అడ్రస్ మాకు పంపించండి.. మేము ఉద్యోగం ఇస్తామని మరికొందరు చెబుతున్నారు.