న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో(ఏప్రిల్–జులై)లో ప్రైమరీ మార్కెట్ కళకళలాడింది. పబ్లిక్ ఇష్యూల ద్వారా మొత్తం 12 కంపెనీలు రూ. 27,052 కోట్లు సమీకరించాయి. ఈ బాటలో ఇకపైన కూడా మరిన్ని కంపెనీలు ఐపీవోలను చేపట్టేందుకు ప్రణాళికలు వేశాయి. ప్రస్తుతం నాలుగు కంపెనీలు దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, ఎగ్జారో టైల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల 4 నుంచి ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ ఏడాది (2021–22) మిగిలిన కాలంలోనూ మరో 40 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నట్లు శాంక్టమ్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఈక్విటీస్ హెడ్ హేమంగ్ కె తెలియజేశారు. వెరసి రూ. 70,000 కోట్లు సమీకరించే వీలున్నట్లు వెల్లడించారు.
సుప్రసిద్ధ బ్రాండ్లు
రిటైల్ ఇన్వెస్టర్లకు పరిచయమున్న పలు సుప్రసిద్ధ బ్రాండ్లు(కంపెనీలు) ప్రైమరీ మార్కెట్లను పలకరించనున్నట్లు ఇన్వెస్ట్19 వ్యవస్థాపక సీఈవో కౌశలేంద్ర సింగ్ ఎస్ తెలియజేశారు. జాబితాలో పేటీఎమ్, మొబిక్విక్, పాలసీ బజార్, కార్‌ట్రేడ్ టెక్, డెల్హివరి, నైకా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా సెకండరీ మార్కెట్లలో బుల్ ట్రెండ్ నెలకొనడం ఐపీవోలకు జోష్‌నిస్తున్నట్లు వివరించారు. దీంతో కంపెనీలు గరిష్ట విలువలతో నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఫలితంగా పలువురు ప్రమోటర్లు అధిక విలువలవద్ద తమ వాటాలను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు.
ఇన్విట్‌లు సైతం
సమీక్షా కాలంలో ఐపీవో బాటలోనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఇన్విట్) ద్వారా పీఎస్‌యూ దిగ్గజం పవర్‌గ్రిడ్ రూ. 7,735 కోట్లను సమీకరించింది. కాగా.. గతేడాది(2020–21) పబ్లిక్ ఇష్యూల ద్వారా 30 కంపెనీలు రూ. 31,277 కోట్ల పెట్టుబడులను అందుకున్నాయి. అంతక్రితం రెండేళ్లతో పోలిస్తే ఇవి అత్యధికమే. క్యాపిటల్ మార్కెట్ల మందగమనం కారణంగా 2019–20లో 13 కంపెనీలు రూ. 20,352 కోట్లు సమీకరించగా.. 2018–19లో 14 సంస్థలు రూ. 14,719 కోట్లు మాత్రమే అందుకోగలిగాయి. అయితే 2017–18లో పబ్లిక్ ఇష్యూల ద్వారా ఏకంగా 45 కంపెనీలు రూ. 82,109 కోట్లు సమకూర్చుకోవడం విశేషం!
స్టార్టప్‌ల జోష్
టెక్నాలజీ, స్పెషాలిటీ కెమికల్స్, డైరీ, ఫార్మాస్యూటికల్ తదితర విభిన్న రంగాల నుంచి కంపెనీలు నిధుల సమీకరణ చేపట్టడం ఇటీవల ఐపీవో మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇక పలు టెక్ స్టార్టప్‌లు సైతం పబ్లిక్ ఇష్యూ బాట పట్టడం పరిశ్రమకు మేలు చేయగలదని లెర్న్‌యాప్.కామ్ వ్యవస్థాపకుడు ప్రతీక్ సింగ్ అభిప్రాయపడ్డారు. దొడ్ల డైరీ, ఇండియా పెస్టిసైడ్స్, శ్యామ్ మెటాలిక్స్, తత్వ చింతన్, జీఆర్ ఇన్‌ఫ్రా, క్లీన్‌సైన్స్ తదితర ఐపీవోలకు 29–180 రెట్లు మధ్య స్పందన లభించడం, 14–110 శాతం మధ్య లాభాలతో లిస్ట్‌కావడం ఇన్వెస్టర్లను ఊరిస్తున్నట్లు ఈ సందర్భంగా మార్కెట్ నిపుణులు వ్యాఖ్యానించారు.
పాలసీబజార్ ప్రాస్పెక్టస్
ఐపీవో ద్వారా రూ. 6,108 కోట్లు సమీకరించేందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి పాలసీబజార్ తాజాగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూలో భాగంగా రూ. 3,750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. మరో రూ. 2,268 కోట్ల విలువైన షేర్లను కంపెనీ వాటాదారులు ఆఫర్ చేయనున్నట్లు దరఖాస్తులో వెల్లడించింది.
ఫిన్‌కేర్ స్మాల్ బ్యాంక్‌కు ఓకే పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు డిజిటల్ రుణాల ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌కు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 1,330 కోట్లు సమీకరించేందుకు కంపెనీ సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా ప్రమోటర్ సంస్థ ఫిన్‌కేర్ బిజినెస్ సర్వీసెస్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనుంది. అంతేకాకుండా మరో రూ. 330 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది.
అదానీ విల్మర్ ఐపీవో బాట
వంట నూనెల దిగ్గజం అదానీ విల్మర్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 4,500 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఫార్చూన్, ఆధార్ బ్రాండ్లతో కంపెనీ ప్రధానంగా వంట నూనెలను తయారు చేసి విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆదానీ గ్రూప్‌లోని మరో ఆరు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన సంగతి తెలిసిందే.
హెల్త్‌కేర్ కంపెనీల జోరు రానున్న రెండు వారాల్లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల నుంచి ఐదు కంపెనీలు ఐపీవోలకు రానున్నాయి. ఉమ్మడిగా రూ. 8,300 కోట్లు సమీకరించనున్నాయి. ఎమ్‌క్యూర్ ఫార్మా రూ. 4,000 కోట్లు, విజయా డయాగ్నోస్టిక్ రూ. 1,500 కోట్లు, క్రిస్నా డయాగ్నోస్టిక్స్ రూ. 1,200 కోట్లు, సుప్రియా లైఫ్‌సైన్సెస్ రూ. 1,200 కోట్లు, విండ్లాస్ బయోటెక్ రూ. 400 కోట్లు చొప్పున సమకూర్చుకునే యోచనలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment