4 కంపెనీలు రెడీ
19–23 మధ్య ఇష్యూలు
రూ. 2,730 కోట్లకు గురి
న్యూఢిల్లీ: ఓవైపు సెకండరీ మార్కెట్లు ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ మరోపక్క ప్రైమరీ మార్కెట్లు కళకళలాడుతున్నాయి. గత వారం 4 ఇష్యూలు మార్కెట్లను పలకరించగా.. గురువారం(19న) మరో 4 కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. 23న ముగియనున్న ఇవి 27న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టయ్యే వీలుంది. బుధవారం(18న) యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనున్నాయి. వివరాలు చూద్దాం..
ట్రాన్స్‌రైల్ లైటింగ్
ప్రధానంగా విద్యుత్ ప్రసారం, పంపిణీ సంబంధ ఈపీసీ సేవలందించే ట్రాన్స్‌రైల్ లైటింగ్ పబ్లిక్ ఇష్యూకి రూ. 410–432 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్ 1.01 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 839 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ జారీ నిధులను పెట్టుబడి వ్యయాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
డీఏఎమ్ క్యాపిటల్
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ డీఏఎమ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 269–283 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 2.97 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. తద్వారా రూ. 840 కోట్లు సమకూర్చుకోనున్నారు. ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్లు, విలీనాలు– కొనుగోళ్లు, ప్రైవేట్ ఈక్విటీ, బ్రోకింగ్, రీసెర్చ్‌లతోకూడిన సంస్థాగత ఈక్విటీల ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కంపెనీ నిర్వహిస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
కంకార్డ్ ఎన్విరో
పర్యావరణ సంబంధ ఇంజనీరింగ్ సొల్యూషన్ల సంస్థ కంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 665–701 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 175 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, ప్రస్తుత ఇన్వెస్టర్లు 46.41 లక్షల షేర్లను ఆఫర్ చేస్తున్నారు. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 500 కోట్లుపైగా సమ కూర్చుకోనుంది. ఈక్విటీ జారీ నిధులను వాటర్ ట్రీట్‌మెంట్ వ్యవస్థల కోసం ఏర్పాటు చేస్తున్న కొత్త అసెంబ్లీ యూనిట్(సీఈఎఫ్)లో ఇన్వెస్ట్ చేయనుంది. అంతేకాకుండా రోకెమ్ సెపరేషన్ సిస్టమ్స్‌పై మరికొన్ని నిధులను వెచి్చంచనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 21 షేర్ల (ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది.
సనాతన్ టెక్స్‌టైల్స్
విభిన్న యార్న్‌ల తయారీ కంపెనీ సనాతన్ టెక్స్‌టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 305–321 ధరల శ్రేణి ప్రకటించింది. ఐపీవోలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు కంపెనీ ప్రమోటర్, గ్రూప్ సంస్థలు రూ. 150 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇష్యూ ద్వారా మొత్తం రూ. 550 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 46 షేర్ల(ఒక లాట్)కు దరఖాస్తు చేయవలసి ఉంటుంది. టెక్నికల్ టెక్స్‌టైల్స్, ఇండ్రస్టియల్ పాలియస్టర్, కాటన్ తదితర యార్న్‌లను కంపెనీ రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment