సెబీ నుంచి తాజాగా అనుమతులు
జాబితాలో ఎస్‌ఎంపీపీ, బ్రిగేడ్ హోటల్
ఆదిత్య ఇన్ఫోటెక్, కుమార్ ఆర్క్ టెక్..
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ(Sebi) తాజాగా 7 కంపెనీల పబ్లిక్ ఇష్యూలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ జాబితాలో డిఫెన్స్ తయారీ కంపెనీ ఏఎంపీపీసహా.. ఆదిత్య ఇన్పోటెక్, బ్రిగేడ్ హోటల్, కుమార్ ఆర్క్ టెక్, సోలార్ వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్, ఇండోగల్ఫ్ క్రాప్ సైన్సెస్, గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్, ప్రోస్టార్ ఇన్ఫోసిస్టమ్స్ చేరాయి. అయితే ఆటో విడిభాగాల సంస్థ వినే కార్పొరేషన్ ముసాయిదా పేపర్స్‌ను ఇటీవలే వెనక్కి తీసుకుంది. మర్చంట్ బ్యాంకర్ల వివరాల ప్రకారం ఇవన్నీ ఉమ్మడిగా రూ. 7,800 కోట్లు సమీకరించనున్నాయి.
రూ. 4,000 కోట్లపై కన్ను
ఐపీవో ద్వారా ఎస్‌ఎంపీపీ లిమిటెడ్ రూ. 4,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. దీనిలో భాగంగా రూ. 580 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 3,420 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ శివ్ చంద్ కన్సల్ విక్రయానికి ఉంచనున్నారు. ప్రస్తుతం ప్రమోటర్‌గా కన్సల్ 50 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 437 కోట్లు అనుబంధ కంపెనీ ద్వారా పెట్టుబడి వ్యయాలపై వెచ్చించనుంది.
రూ. 1,300 కోట్ల సమీకరణ
ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీవో ద్వారా రూ. 1,300 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. దీనిలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుండగా.. మరో రూ. 800 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ నిధుల్లో రూ. 375 కోట్లు రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
రూ. 900 కోట్లకు సై
ఆతిథ్య రంగ కంపెనీ బ్రిగేడ్ హోటల్ వెంచర్స్ ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. తద్వారా పెట్టుబడులను సమీకరించాలని ఆశిస్తోంది. వీటిలో రూ. 481 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 59 కోట్లు మెటీరియల్ అనుబంధ సంస్థ ఎస్‌ఆర్‌పీ ప్రోస్పరిటా హోటల్ వెంచర్స్‌కు కేటాయించనుంది. మరో రూ. 108 కోట్లు భూమి కొనుగోలుకి వెచ్చించనుంది.
రూ. 740 కోట్లపై దృష్టి
పీవీసీ బ్లెండ్ ఆధారిత బిల్డింగ్ మెటీరియల్ తయారీ కంపెనీ కుమార్ ఆర్క్ టెక్ ఐపీవో ద్వారా రూ. 740 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. రూ. 500 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనుండగా.. మరో రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీని కంపెనీ తాజాగా జారీ చేయనుంది. ఈ నిధుల్లో రూ. 182 కోట్లు అనుబంధ సంస్థ టేలియస్ ఇండస్ట్రీలో పెట్టుబడికి వెచ్చించనుంది.
రూ. 600 కోట్లకు రెడీ
సోలార్‌వరల్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. దీనిలో రూ. 550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 50 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు.
రూ. 200 కోట్లతోపాటు..
ఐపీవోలో భాగంగా ఇండోగల్ఫ్ క్రాప్‌సైన్సెస్ రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 38.55 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు.
1.9 కోట్ల షేర్ల జారీ
గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ ఐపీవోలో భాగంగా 1.9 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను పరికరాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
పబ్లిక్ ఇష్యూకు ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్
ఐపీవోలో భాగంగా పవర్ సొల్యూషన్లు, ప్రొడక్టుల తయారీ కంపెనీ ప్రోస్టార్మ్ ఇన్ఫో సిస్టమ్స్ 1.6 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. నిధులను రుణ చెల్లింపులు, అనుబంధ సంస్థలో వాటా కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్, సాధరణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
సెబీకి ఉయ్‌వర్క్ ఇండియా ప్రాస్పెక్టస్
వర్క్‌స్పేస్ సేవల సంస్థ ఉయ్‌వర్క్ తమ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి (ఐపీవో) సంబంధించి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమరి్పంచింది. ఈ ఇష్యూలో భాగంగా కంపెనీ 4,37,53,952 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) విధానంలో విక్రయించనుంది. ఐపీవో పూర్తిగా ఓఎఫ్‌ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇష్యూ ద్వారా వచ్చే నిధులు కంపెనీకి లభించవు. వ్యక్తులు, చిన్నా .. పెద్ద వ్యాపార సంస్థలు, అంకురాలు మొదలైన కస్టమర్లకు నాణ్యమైన వర్క్‌స్పేస్‌లను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment