2026లో రూ. 3 లక్షల కోట్ల సమీకరణ
ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ తాజా అంచనాలు
న్యూఢిల్లీ: రానున్న రెండేళ్లలో మొత్తం 1,000 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టే వీలున్నట్లు దేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్(ఏఐబీఐ) తాజాగా అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ఆర్థిక వృద్ధి, సానుకూల స్టాక్ మార్కెట్లు, మెరుగుపడనున్న నియంత్రణా సంబంధ నిబంధనలు తోడ్పాటు నివ్వగలవని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) ద్వారా కంపెనీల నిధుల సమీ కరణ రూ. 3 లక్షల కోట్లను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. రానున్న రెండేళ్ల(2026, 2027)లో దేశీ క్యాపిటల్ మార్కెట్లు భారీ ప్రగతిని సాధించనున్నట్లు ఏఐబీఐ తెలియజేసింది. గత ఆరేళ్లలో 851 కంపెనీలు ఐపీవోలు చేపట్టడం ద్వారా మొత్తం రూ. 4.58 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించింది. వీటిలో 281 కంపెనీలు మెయిన్ బోర్డు నుంచి లిస్ట్‌కాగా.. 570 సంస్థలు ఎస్‌ఎంఈ విభాగానికి చెందినవిగా తెలియజేసింది.
గతేడాదిలో
గత ఆర్థిక సంవత్సరం(2023–24) స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా దేశీ కంపెనీలు ఉమ్మడిగా రూ. 67,955 కోట్లు సమకూర్చుకున్నట్లు ఏఐబీఐ పేర్కొంది. వీటిలో ప్రధాన కంపెనీలు రూ. 61,860 కోట్లు అందుకోగా.. ఎస్‌ఎంఈలు రూ. 6,095 కోట్ల పెట్టుబడులు సమీకరించాయి. మరోవైపు క్విప్ ద్వారా 61 కంపెనీలు రూ. 68,972 కోట్ల నిధులను సమీకరించాయి. ఐపీవోల పరిమాణంరీత్యా గతేడా ది భారత్ ప్రపంచవ్యాప్తంగా తొలి స్థానంలో నిలిచినట్లు ఏఐబీఐ చైర్మన్ మహావీర్ లునావట్ తెలియజేశారు. మొత్తం 335 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు వచ్చినట్లు వెల్లడించారు. తద్వారా యూఎస్, యూ రప్‌లను భారత్ అధిగమించినట్లు పేర్కొన్నారు. గత రెండేళ్ల బాటలో వచ్చే ఏడాదిలోనూ ఐపీవోలు రికార్డ్ సృష్టించనున్నట్లు అంచనా వేశారు. వెరసి క్విప్‌లు, ఐపీవోల ద్వా రా రూ. 3 లక్షల కోట్ల ను మించి పెట్టుబడుల సమీకరణకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
ల్యూమినో ఇండస్ట్రీస్ లిస్టింగ్ బాట
సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు
కండక్టర్స్, పవర్ కేబుళ్ల తయారీ కంపెనీ ల్యూమినో ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 600 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 400 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 420 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 15 కోట్లు పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది.
మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా ప్రొడక్ట్ ఆధారిత ఈపీసీ సేవలు అందిస్తోంది. కండక్టర్స్, పవర్ కేబుళ్లు, ఎలక్ట్రికల్ వైర్లతోపాటు విద్యుత్ ప్రసారం, పంపిణీకి చెందిన ఇతర ప్రత్యేక విడిభాగాలను సైతం రూపొందిస్తోంది. కంపెనీ క్లయింట్లలో కల్పతరు ప్రాజెక్ట్స్, మాంటె కార్లో, జాక్సన్ లిమిటెడ్, వరోరా కర్నూల్ ట్రాన్స్‌మిషన్ తదితరాలున్నాయి. అంతేకాకుండా దేశ, విదేశీ ప్రభుత్వ విద్యుత్ బోర్డులు సైతం కస్టమర్ల జాబితాలో ఉన్నాయి. 2024 సెప్టెంబర్‌కల్లా కంపెనీ ఆర్డర్ బుక్ విలువ రూ. 1,804 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఆదాయం 85% జంప్‌చేసి రూ. 1,407 కోట్లను తాకగా.. నికర లా భం రూ. 19 కోట్ల నుంచి రూ. 87 కోట్లకు ఎగసింది.
ఐపీవో గ్రే మార్కెట్‌పై సెబీ కన్ను
ప్రీలిస్టింగ్ ట్రేడింగ్‌ను అనుమతించే యోచన
పబ్లిక్ ఇష్యూల అనధికార క్రయవిక్రయాల(గ్రే మార్కెట్)కు చెక్ పెట్టే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా పేర్కొంది. ఇందుకు ఒక వ్యవస్థను ప్రవేవపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. తద్వారా ఐపీవోలో షేర్లను పొందగల ఇన్వెస్టర్లు ముందుగానే వీటిని విక్రయించేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. ఇటీవల కాలంలో పలు ఐపీవోలకు భారీస్థాయిలో స్పందన లభించడంతోపాటు.. అధిక లాభాలతో లిస్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా గ్రే మార్కెట్ లావాదేవీలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇన్వెస్టర్లు ఇలాంటి లావాదేవీలను కోరుకుంటుంటే నియంత్రణల పరిధిలో వీటిని ఎందుకు అనుమతించకూడదంటూ వ్యాఖ్యానించారు. దేశీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ల అసోసియేషన్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో బచ్ ఇంకా పలు అంశాలపై స్పందించారు. నిజానికి గ్రే మార్కెట్ లావాదేవీలు సరికాదని, ఆర్గనైజ్‌డ్ మార్కెట్ ద్వారానే క్రయవిక్రయాలు చేపట్టడం శ్రేయస్కరమని బచ్ తెలియజేశారు. ఇందుకు రెండు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్గదర్శకాలు సిద్ధమయ్యాక ఐపీవో షేర్లకు లిస్టింగ్‌కంటే మూడు రోజులు ముందుగా లావా దేవీలకు తెరతీయనున్నట్లు వివరించారు. షేర్ల కేటాయింపులు, లిస్టింగ్ మధ్యలో ఇందుకు వీలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
నిధుల దుర్వినియోగం
కొన్ని కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించిన నిధులను దురి్వనియోగపరుస్తున్నట్లు గుర్తించామని బచ్ తెలియజేశారు. క్యాపిటల్ మార్కెట్లలో ఇలాంటి సంస్థలు కార్యకలాపాలు నిర్వహించకుండా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు అడ్డుకోవాలని సూచించారు. ఐపీవో డాక్యుమెంట్లను వేగంగా పరిశీలించి అనుమతులిచ్చేందుకు వీలుగా ఒక సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఐబ్యాంకర్లకు ఇలాంటి కంపెనీలగురించి తెలుస్తుందని, ఇలాంటి వాటికి సహకరించవద్దని సలహా ఇచ్చారు. ఎస్‌ఎంఈ విభాగంలో ఇలాంటి ఐపీవోలు వెలువడితే అధిక సబ్ర్‌స్కిప్షన్ నమోదవుతున్నదని చెప్పారు. ఆపై షేరు ధర భారీగా పెరుగుతూపోవడం ద్వారా ప్రమోటర్లు త్వరితగతిన లాభపడుతున్నట్లు వివరించారు. సంబంధిత పార్టీ లావాదేవీల ద్వారా ఐపీవో నిధులను కొన్ని కంపెనీలు ప్రమోటర్ సంబంధ సంస్థలలోకి చేర్చడం లేదా రక్షణాత్మక ప్రాంతాలకు మళ్లించడం చేస్తున్నట్లు బచ్ తెలియజేశారు. ఈ నిధులను విదేశీ మార్కెట్లలో ఇతర సంస్థలు లేదా సాఫ్ట్‌వేర్ వంటి ప్రొడక్టుల కొనుగోలుకి వినియోగిస్తున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment