21 శాతం వృద్ధితో రూ. 14.27 లక్షల కోట్లకు
ఎన్‌ఎస్‌ఐఎం సదస్సులో సెబీ చీఫ్ బచ్ అంచనా
రూ. 250 కనీస పెట్టుబడితో సిప్ పథకాలకు సై
ఎస్‌ఎంఈ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25)లో క్యాపిటల్ మార్కెట్ల ద్వారా నిధుల సమీకరణ జోరందుకున్నట్లు సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. మార్చితో ముగియనున్న పూర్తి ఏడాదికి 21 శాతం ఎగసి రూ. 14.27 లక్షల కోట్లకు చేరే వీలున్నట్లు అంచనా వేశారు. గతేడాది(2023–24)లో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి రూ. 11.8 లక్షల కోట్లు మాత్రమే సమకూర్చుకున్నట్లు ప్రస్తావించారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్‌ఎస్‌ఐఎం) నిర్వహించిన ఒక సదస్సులో బచ్ పలు అంశాలను వివరించారు. ఈ ఏడాది తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) కంపెనీలు ఈక్విటీల నుంచి రూ. 3.3 లక్షల కోట్లు, రుణ మార్గాల ద్వారా రూ. 7.3 లక్షల కోట్లు అందుకున్నట్లు తెలియజేశారు. వెరసి రూ. 10.7 లక్షల కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. ఇక చివరి త్రైమాసికాన్ని(జనవరి–మార్చి) కూడా పరిగణిస్తే ఈక్విటీ, డెట్ విభాగాల ద్వారా సుమారు రూ. 14.27 లక్షల కోట్లను అందుకునే వీలున్నట్లు బచ్ అంచనా వేశారు.
ఇకపై ఇన్విట్స్ అదుర్స్
నిజానికి ఈ ఏడాది తొలి 9 నెలల్లో మునిసిపల్ బాండ్లుసహా రియల్టీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్స్), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్విట్స్ ద్వారా సమీకరించిన నిధులు రూ. 10,000 కోట్లు మాత్రమేనని బచ్ వెల్లడించారు. అయితే వచ్చే దశాబ్దంలో వీ టిలో యాక్టివిటీ భారీగా పెరగనున్నట్లు అంచనా వే శారు. దీంతో ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి సమీకరించే నిధులను అధిగమించనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎన్‌ఎస్‌ఐఎంను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఏర్పాటు చేసిన సంగతి
తెలిసిందే.
ఎస్‌ఎంఈలకు దన్ను
చిన్న, మధ్యతరహా సంస్థ(ఎస్‌ఎంఈ)ల బోర్డు ప్రతిపాదనలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు బచ్ పేర్కొన్నారు. క్లియరింగ్‌లకు పడుతున్న సమయాన్ని కుదించే యోచనలో ఉన్నట్లు తెలియజేశారు. ఎస్‌ఎంఈ ప్రతిపాదనలను అనుమతించేందుకు సెబీ 3 నెలల గడువును తీసుకుంటున్నదని, బ్యాంకులైతే 15 నిముషాలలో ముందస్తు అనుమతులు మంజూరు చేస్తున్నాయని బచ్ వ్యాఖ్యానించారు. దీంతో అనుమతుల జారీలో మరింత సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలియజేశారు.
ఐపీవోల వరద
ఇటీవల కొద్ది నెలలుగా పబ్లిక్ ఇష్యూలు వెల్లువెత్తుతుండటంతో అప్రమత్తత పెరిగినట్లు బచ్ తెలియజేశారు. పలు కంపెనీలు సెబీ తలుపు తడుతున్నప్పటికీ ఇతర మార్గాలకూ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. వీటిలో ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్లు, ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్లు, రైట్స్ ఇష్యూలు తదితరాలను ప్రస్తావించారు. రైట్స్ జారీలో వ్యవస్థలను ఆధునీకరిస్తున్నట్లు, ఇందుకు కంపెనీలు సైతం సన్నద్ధంకావలసి ఉన్నట్లు వెల్లడించారు. కాగా.. మ్యూచువల్ ఫండ్ల కొత్త ఆఫర్లకు వేగవంత అనుమతులిస్తున్నామని, ఇకపై రూ. 250 కనీస పెట్టుబడులతో సిప్ పథకాలను అనుమతించనున్నట్లు తెలియజేశారు. గత కొన్నేళ్లలో దేశీయంగా పెట్టుబడులు పుంజుకోవడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడు నమోదయ్యే ఆటుపోట్లు తగ్గినట్లు
వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment