Indian Banks Association
-
రుణ గ్రహీతల పూర్వ ధ్రువీకరణకు పోర్టల్
న్యూఢిల్లీ: రుణాలు కోరుకునే వారికి సంబంధించి పూర్వపు ధ్రువీకరణ వివరాలతో ఒక పోర్టల్‌ను సెంట్రల్ ఎకనమిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (సీఈఐబీ) ప్రారంభించింది. రుణాల మంజూరు విషయంలో బ్యాంక్‌లు సకాలంలో నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కావాల్సిన సమాచారాన్ని ఇది అందిస్తుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తెలిపింది. అతిపెద్ద బ్యాంక్ మోసాలకు సంబంధించి 2015 మే 13, 2019 నవంబర్ 6న ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాల మేరకు.. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు) రూ.50 కోట్లకు మించిన రుణాన్ని కొత్తగా మంజూరు చేసే ముందు, లేదా అప్పటికే ఎన్పీఏగా మారిన రుణ గ్రహీత విషయంలో సీఈఐబీ నుంచి నివేదిక కోరాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్బీఐ సహకారంతో సీఈఐబీ రూపొందించిన పోర్టల్ ఇప్పుడు బ్యాంక్‌ల పని సులభతరం చేయనుంది. పెద్ద రుణాలకు సంబంధించి సీఈఐబీ అనుమతిని ఈ పోర్టల్ ద్వారా బ్యాంక్‌లు పొందే అవకాశం ఏర్పడింది. -
యూనియన్ బ్యాంక్ నంబర్ వన్!
హైదరాబాద్: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకటించిన ఈజ్ రీఫార్మ్స్ ఇండెక్స్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి ర్యాంక్ దక్కించుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకులకు నిర్దేశించిన సంస్కరణల అమలులో అన్ని బ్యాంకుల్లోకి యూనియన్ బ్యాంక్ ముందుంది. అనలైటిక్స్ సామర్థ్యాలు, కస్టమర్లతో సంబంధాలు బలోపేతం, సమర్థవంతంగా రుణాల పర్యవేక్షణ, సమగ్రమైన డిజిటల్ వసూళ్ల నిర్వహణ విధానం, మోసాలు, సైబర్ దాడుల నుంచి తగిన రక్షణ చర్యలు, బ్యాంకింగ్ సేవలను అందించే విషయంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తదితర విభాగాల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పనితీరు చూపించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి అని బ్యాంక్ ప్రకటించింది. -
బ్యాంకుల స్థానాన్ని ఫిన్‌టెక్‌లు భర్తీ చేయలేవు
ముంబై: బ్యాంకుల స్థానాన్ని ఫిన్‌టెక్ సంస్థలు భర్తీ చేస్తాయన్నది అపోహ మాత్రమేనని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రవి శంకర్ తెలిపారు. అయితే, సాంకేతిక మార్పులను సత్వరం అందిపుచ్చుకోవడంలో బ్యాంకులు మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ‘బ్యాంకులు కొనసాగుతాయి. ఫిన్‌టెక్ సంస్థలు వాటి స్థానాన్ని ఆక్రమిస్తాయన్నది అపోహ మాత్రమే. అయితే, బ్యాంకింగ్ స్వరూపం చాలా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీల పురోగతితో వస్తున్న మార్పులను బ్యాంకులు కూడా వేగంగా అందిపుచ్చుకోవాలి‘ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రవి శంకర్ చెప్పారు. ఏకీకృత చెల్లింపుల విధానానికి (యూపీఐ) సంబంధించి సింహ భాగం వాటా నాన్ బ్యాంకింగ్ సంస్థలదే ఉంటోందని, బ్యాంకులు ముందు నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల అవకాశాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు. బ్యాంకింగ్ ప్రపంచంలోను, బైట వస్తున్న మార్పులకు అనుగుణంగా తమను తాము మల్చుకోవడానికి పెద్ద సంస్థలు కూడా ఇష్టపడకపోవడం ఆర్బీఐని ఆశ్చర్యపర్చిందని వ్యాఖ్యానించారు. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా శనివారం (19న) తలపెట్టిన సమ్మెను అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) వాయిదా వేసుకుంది. తమ డిమాండ్లలో ఎక్కువ శాతం పరిష్కారానికి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అంగీకరించినట్టు ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు యథావిధిగా కార్యకలాపాలు సాగిస్తాయని తెలిపింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్టు, దీంతో సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్టు వివరించింది. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి. ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించడం ఇందుకు కారణం. తొమ్మిది బ్యాంకు యూనియన్లకు నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఐబీఏతో చర్చలు జూలై 1 నుంచి మొదలు కానున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని ఉద్యోగ సంఘాలు బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి. పింఛన్ దారులందరికీ పెన్షన్‌ను నవీకరించడం, సవరించడంతోపాటు జాతీయ పెన్షన్ పథకాన్ని తొలగించడం, బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి డిమాండ్ల జాబితాలో ఉన్నాయి. -
బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరించాలి
ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు చాలాకాలంగా ప్రత్యేక కృషి జరుగుతున్నా ఇప్పటికీ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేని జిల్లాలు దేశంలో చాలా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. భారీ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగే కొన్ని ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సరీ్వసులు లభించకపోతుండటం ఆశ్చర్యకరమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సర్వీసులను మరింతగా విస్తరించేందుకు అన్ని బ్యాంకులు నడుం బిగించాలని మంత్రి సూచించారు. ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయి శాఖలనో లేదా కనీస సరీ్వసులైనా అందించే అవుట్పోస్ట్లనో ఏర్పాటు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 74వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) ఆమె పేర్కొన్నారు. ‘‘నేటికీ పలు జిల్లాల్లో పెద్ద పంచాయతీల్లో కూడా బ్యాంకు శాఖ అనేది ఉండటం లేదు. ఇకనైనా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉంటున్న ప్రాంతాలను గుర్తించడంపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతమే కావచ్చు ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో కొంతైనా బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండాలి కదా’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. బ్యాడ్ బ్యాంక్ అని పిలవొద్దు.. మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)ను ‘బ్యాడ్ బ్యాంక్’గా పిలవొద్దని నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం బ్యాంకుల ఖాతాలు మరిం త మెరుగ్గా ఉన్నాయని, దీనితో వాటికి అదనంగా మూలధనం సమకూర్చాల్సిన అవసరం తగ్గుతుం దని, తద్వారా ప్రభుత్వంపైనా ఆ మేరకు భారం తగ్గుతుందని ఆమె తెలిపారు. అన్ని రకాల వ్యాపార సంస్థల అవసరాలను బ్యాంకులు గుర్తెరిగి, తగు రీతిలో సహాయాన్ని అందిస్తేనే 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల భారీ లక్ష్యాన్ని దేశం సాధించగలదని మంత్రి పేర్కొన్నారు. ఎస్బీఐ సైజు బ్యాంకులు నాలుగైదు ఉండాలి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమ అవసరాలను తీర్చడానికి దేశీయంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ‘‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్థాయి’’ బ్యాంకులు 4–5 ఉండాలని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలికంగా డిజిటల్ ప్రక్రియలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. కాబట్టి, స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా భారతీయ బ్యాంకింగ్ ఎలా ఉండాలన్నది పరిశ్రమ వర్గాలు నిర్దేశించుకుని, తగు రూపం ఇవ్వాలని మంత్రి సూచించారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ సజావుగా సాగేలా బ్యాంకర్లు కృషి చేశారని ప్రశంసించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ విధులు నిర్వర్తిస్తూ, మహమ్మారికి బలైన బ్యాంకింగ్ సిబ్బందికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రికి జ్ఞాపికను బహూకరిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్ -
బ్యాడ్ బ్యాంక్‌కు సావరిన్ గ్యారంటీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులకు గురువారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్... ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారమే ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్ల నిధుల కేటాయింపు జరుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి తాజాగా తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. 2018 మార్చి నుంచీ చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నవంబర్‌కల్లా లైసెన్సులు బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. లైసెన్స్ మంజూరీకి గత నెల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఐబీఏ దరఖాస్తు చేసింది. వచ్చే రెండు నెలల్లో దీనికి ఆర్బీఐ ఆమోదముద్రవేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిర్వహణా తీరు ఇది... ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్ నుంచి మొండిబకాయి (ఎన్పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్ఏఆర్సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్ ఉంటాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. రిసిట్స్‌కు గ్యారంటీ ఐదేళ్లు... ఆర్థిక సేవల కార్యదర్శి దేబాíÙష్ పాండా తెలిపిన సమాచారం ప్రకారం, రిసిట్స్‌కు సావరిన్ గ్యారంటీ ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. రిసిట్స్ విలువకు ఎన్ఏఆర్సీఎల్ ఫీజుకూడా చెల్లించాలి. తొలి దశలో దీనికి 0.25 శాతం ఫీజు ఉంటుంది. మొండిబకాయిల పరిష్కారం విషయంలో ఆలస్యం అయితే ఈ ఫీజు 0.5 శాతం వరకూ పెరుగుతంది. ఈ బ్యాకప్ వ్యవస్థ మొత్తం మొండిబకాయిల భారం సత్వర పరిష్కారానికి, బ్యాంకింగ్‌కు త్వరిత గతిన నిధుల లభ్యతకు, తద్వారా తదుపరి బ్యాంకింగ్ రుణ పంపిణీ పురోగతికి దోహదపడే అంశమని ఆయన వివరించారు. 2021–22 బడ్జెట్ చూస్తే... 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ‘‘మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వాటాలు ఇలా.. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్ఏఆర్సీఎల్లో 16 మంది షేర్హోల్డర్లు ఉంటారు. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను ఎన్ఏఆర్సీఎల్ నిర్వహిస్తుందని (కొనుగోలు చేస్తుందని) అంచనా. ‘4ఆర్’ విధానం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపడ్డానికి ‘4ఆర్’ వ్యూహాన్ని కేంద్రం అనుసరిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. సమస్య గుర్తింపు (రికగ్నేõÙన్), పరిష్కారం (రిజల్యూషన్), అవసరమైన మూలధన కల్పన (రీక్యాపిటలైజేషన్), సంస్కరణలు (రిఫార్మ్) ‘4ఆర్’లో ఉన్నట్లు వివరించారు. కాగా, బ్యాడ్ బ్యాంక్ ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగే సందర్భాలు తక్కువగానే ఉండవచ్చని, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందని ఇప్పుడు ఊహించడం సరికాదని ఈ సందర్భంగా సూచించారు. అందువల్ల రిసిట్స్‌కు ప్రభుత్వ గ్యారెంటీ వల్ల ప్రస్తుతానికి ఆర్థిక భారం కేంద్రంపై ఉండబోదని స్పష్టం చేశారు. -
ఆర్బీఐ ముందుకు బ్యాడ్‌బ్యాంక్ లైసెన్స్ దరఖాస్తు!
న్యూఢిల్లీ: నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు సంబంధించి లైసెన్స్ కోసం ఆర్బీఐకి త్వరలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దరఖాస్తు చేసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగంలో వసూలు కాని మొండి బకాయిల సమస్యకు పరిష్కారంగా ఎన్ఏఆర్సీఎల్ఎల్ (బ్యాడ్ బ్యాంకు) ఏర్పాటును 2021–22 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రూ.100 కోట్ల అధీకృత మూలధనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఈ నెల 7న ఎన్ఏఆర్సీఎల్ను ఏర్పాటు చేసినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్స్ చెబుతున్నాయి. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చినట్టయితే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
బ్యాడ్ బ్యాంక్‌కు రంగం సిద్ధం!
న్యూఢిల్లీ: మొండి బకాయిల పరిష్కారంలో భాగంగా ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ లేదా నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. ఇందుకు తొలి అడుగుగా ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు త్వరలో కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర పడే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ గ్యారెంటీ తక్షణం దాదాపు రూ.31,000కోట్లు ఉంటుందని బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంచనావేసింది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్ఏఆర్సీఎల్ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్‌్ట్సగా ఉంటాయని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు సావరిన్ (ప్రభుత్వ) గ్యారెంటీ లభించేందుకు క్యాబినెట్ ఆమోదం తప్పనిసరని సంబంధిత వర్గాలు తెలిపాయి. అమల్లో కీలక అడుగు! : 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్యాడ్ బ్యాంక్ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదన అమలుకు తొలుత సెక్యూరిటీ రిసిప్‌్ట్సకు ప్రభుత్వం గ్యారెంటీకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కీలకం. ‘‘ప్రస్తుత మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పేర్కొంది. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్‌ఏఆర్‌సీల్‌లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తుందని అంచనా. ఎన్పీఏల పరిష్కారంలో ఇది మంచి పురోగతి అవుతుందని అంచనా. -
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు తీపికబురు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్బీ) 2020 నవంబర్‌లో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఎ)తో కుదుర్చుకున్న వేతన ఒప్పందం ప్రకారం పీఎల్‌ఐలను పంపిణీ చేస్తున్నాయి. దీనిలో భాగంగానే పనితీరు మెరుగ్గా ఉంటే ఉద్యోగులకు అదనపు ప్రయోజనం చేకూరనుంది. 2021లో కెనరా బ్యాంక్ నికర లాభం రూ.2,557 కోట్లు. దీంతో కెనరా బ్యాంక్ ఈ వారం తన సిబ్బందికి 15 రోజుల జీతం విలువైన పీఎల్ఐ(పనితీరు-ఆధారంగా ప్రోత్సాహకాల)ను చెల్లించింది. బ్యాంకులు మే 18న నాలుగవ త్రైమాసికంలో 1,010.87 కోట్ల రూపాయల స్వతంత్ర లాభాన్ని ఆర్జించాయి. 2020-21 నాలుగో త్రైమాసికంలో 165 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పీఎల్ఐ కింద నగదును తన ఉద్యోగులకు విడుదల చేసింది. అన్ని ర్యాంకులు, హోదాల్లోని ఉద్యోగులకు ఈ పీఎల్ఐలు వర్తిస్తాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఉద్యోగులకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఎస్బీఐలో 2.5 లక్షల మందికి ఈ లాభం పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం 2 శాతం నుంచి 5 శాతం మధ్య వస్తే వారికి 5 రోజుల వేతనం, 10 నుంచి 15 శాతం వస్తే 10 రోజుల వేతనం, 15 శాతం కంటే ఎక్కువ లాభం వస్తే ప్రోత్సాహకంగా ఉద్యోగులకు 15 రోజుల వేతనం అదనంగా లభిస్తుంది. చదవండి: నాలుగు బ్యాంకులపై జరిమానా విధించిన ఆర్బీఐ Income Tax Return: ఐటీ రిటర్నులకు మరింత గడువు -
‘వాయిదా’ మరో 3 నెలలు పొడిగింపు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్‌ను మరింతగా పొడిగించిన నేపథ్యంలో రుణాల వాయిదాలపై విధించిన మారటోరియంను కూడా మరో 3 నెలలు పొడిగించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ పరిశీలనలో ఉంది. లాక్డౌన్ కొనసాగింపు కారణంగా ఇటు వ్యక్తులు, అటు సంస్థలకు ఆదాయాలొచ్చే మార్గాలు లేనందున మారటోరియంను పొడిగించాలంటూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సహా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఆర్బీఐ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ నేపథ్యంలో మూడు నెలల పాటు వాయిదాల చెల్లింపులపై మారటోరియం విధిస్తూ మార్చి 27న ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీని గడువు మే 31తో ముగిసిపోనుంది. అయితే, లాక్డౌన్ పొడిగించడం, ఎత్తివేత తర్వాత కూడా రుణ గ్రహీతలకు తక్షణమే తగు ఆదాయాలు వచ్చే అవకాశం లేకపోవడం వంటి అంశాల కారణంగా మారటోరియంను పొడిగించడమే శ్రేయస్కరమని ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కష్టకాలంలో ఇటు రుణగ్రహీతలకు, అటు బ్యాంకులకు ఇది ఊరటనివ్వగలదని పేర్కొన్నారు. -
కావాలంటే.. మీరే చెప్పండి
న్యూఢిల్లీ: రుణాలపై నెలవారీ వాయిదాలపై (ఈఎంఐ) మారటోరియం కావాలనుకునే రుణగ్రహీతలు .. వారంతట వారు కోరితేనే అమలు చేయాలని ప్రైవేట్ రంగ బ్యాంకులు భావిస్తున్నాయి. ఇందుకోసం ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టాయి. ‘మూడు నెలల మారటోరియం వద్దనుకుంటే మీరు ఏమీ చేయనక్కర్లేదు. మీరిచ్చిన రీపేమెంట్ సూచనల మేరకు చెల్లింపులు యథావిధిగా జరిగిపోతాయి. కానీ, మారటోరియం కావాలనుకుంటే తెలియజేయండి‘ అంటూ ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ వెబ్సైట్లో రుణగ్రహీతలను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది. మరోవైపు మారటోరియం కావాలనుకునే వారు (ఆప్టింగ్ ఇన్) నిర్దిష్ట ఈమెయిల్ ఐడీకి మెయిల్ పంపించాలంటూ కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ కస్టమర్లకు సూచించింది. అటు రెండో అతి పెద్ద బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ దీన్ని కాస్త భిన్నంగా అమలు చేస్తోంది. వేతన జీవులకు సాధారణంగానే ఆప్ట్–ఇన్ ఆప్షన్‌ను, ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్న ట్రేడర్లు, చిన్న స్థాయి రుణగ్రహీతలకు ఆప్ట్–అవుట్ ఆప్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. స్వయం సహాయక గ్రూపులు, ఆభరణాలపై రుణాలు .. అన్సెక్యూర్డ్ వ్యాపార రుణాలు .. ఓవర్‌డ్రాఫ్ట్‌లు తీసుకున్నవారు, క్రెడిట్ కార్డుహోల్డర్లు మొదలైనవారు ఆప్ట్–అవుట్ కేటగిరీలోకి వస్తారు. వీరు ఒకవేళ చెల్లింపులు కొనసాగించదల్చుకున్న పక్షంలో బ్యాంకుకు తెలియజేయాల్సి ఉంటుంది. మిగతా టర్మ్ లోన్లు తీసుకున్న వారు ఆప్ట్–ఇన్ కేటగిరీలోకి వస్తారు. ఇక, యాక్సిస్ బ్యాంక్.. తామింకా స్కీమ్ అమలుపై కసరత్తు చేస్తున్నామని, ఇది పూర్తయ్యాక కస్టమర్లకు తెలియజేస్తామని వెల్లడించింది. డబ్బుంటే కట్టేయండి.. చేతిలో నగదు ఉన్న కస్టమర్లు వీలైనంత వరకూ ఈఎంఐల చెల్లింపులు కొనసాగించేందుకే ప్రాధాన్యమివ్వాలంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు సూచించింది. తద్వారా అదనపు వడ్డీ భారాన్ని, రుణ కాలవ్యవధి పొడిగింపునకు సమస్య ఉండదని పేర్కొంది. పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా మటుకు ఆప్ట్–అవుట్ ఆప్షన్నే అమలు చేస్తున్నాయి. చెల్లింపులు కొనసాగిస్తానని కస్టమర్లు ప్రత్యేకంగా తెలియజేస్తే తప్ప.. ఆటోమేటిక్‌గా మారటోరియం వర్తింపచేస్తున్నాయి. కరోనా సంబంధించిన లాక్‌డౌన్‌తో ప్రజల ఆదాయాలు గణనీయంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో రుణాల ఈఎంఐల చెల్లింపులపై కొంత వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం కట్టాల్సిన ఈఎంఐలను మూడు నెలల పాటు వాయిదా వేసుకోవచ్చు. ఐబీఏ వివరణ... అటు బ్యాంకుల అసోసియేషన్ (ఐబీఏ) కూడా మారటోరియం ప్రభావాల గురించి వివరించింది. ‘మీ ఆదాయాలు దెబ్బతిన్న పక్షంలో ఆర్బీఐ ప్యాకేజీతో ప్రయోజనం పొందవచ్చు. అయితే, ఆయా రుణాలపై వడ్డీ భారం ఉంటుంది. దీన్ని అప్పటికప్పుడు కట్టాల్సిన అవసరం లేకపోయినా.. అదనపు భారం పడుతుందని గుర్తుంచుకోవాలి‘ అని పేర్కొంది. అటు క్రెడిట్ కార్డు బాకీల గురించి కూడా వివరణ ఇచ్చింది. సాధారణంగా మినిమం అమౌంట్ కూడా కట్టకపోతే క్రెడిట్ బ్యూరోలకు బ్యాంకులు తెలియజేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే, ఆర్బీఐ సర్క్యులర్ కారణంగా మూడు నెలల పాటు వెసులుబాటు ఉంటుందని వివరించింది. కానీ బాకీలపై భారీగా వడ్డీ ఉంటుందని హెచ్చరించింది. వడ్డీల వాయింపు... ఆర్బీఐ ప్రకటించిన మూడు నెలల మారటోరియం స్కీము.. పైకి కనిపించినంత ప్రయోజనకరమేమీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. తాత్కాలికంగా చెల్లింపుల నుంచి ఉపశమనం లభించినా.. ఆ తర్వాత అంతకు మించి చెల్లించుకోవాల్సి వస్తుందని, మరింత భారం తప్పదని పేర్కొన్నారు. దీంతో కరోనా దెబ్బకు ఆదాయాలు కోల్పోయిన వారు .. మారటోరియం ఎంచుకుంటే మరింత కాలం రుణాల భారం మోయాల్సి రానుంది. మారటోరియం వ్యవధిలో మిగతా బాకీపై వడ్డీల వడ్డన కొనసాగుతుందని ఖాతాదారులకు ప్రభుత్వ రంగ ఎస్బీఐ తెలియజేసింది. సోదాహరణంగా వివరించింది. ఉదాహరణకు రూ. 30 లక్షల గృహ రుణం చెల్లించడానికి మరో 15 ఏళ్ల వ్యవధి ఉందనుకుందాం. మూడు నెలల మారటోరియం తీసుకుంటే.. నికరంగా అదనంగా మరో రూ. 2.34 లక్షలు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇది సుమారు 8 నెలల ఈఎంఐలకు సమానం. అలాగే, రూ. 6 లక్షల వాహనం రుణం రీపేమెంట్‌కు 54 నెలలు మిగిలి ఉందనుకుందాం. దీనిపై అదనంగా రూ.19,000 అదనపు వడ్డీ భారం పడుతుంది. ఇది అదనంగా 1.5 ఈఎంఐకు సమానం. -
బ్యాంకుల సమ్మె వాయిదా
సాక్షి, అమరావతి: మార్చి 11 నుంచి తలపెట్టిన మూడు రోజుల బ్యాంకుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు యూనియన్లు ప్రకటించాయి. ఉద్యోగుల జీతాలు 15 శాతానికి పెంచడంతో పాటు ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించడంతో యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. జీతాలు పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) అంగీకరించిందని, పనితీరు బాగున్న బ్యాంకుల్లో నిర్వహణ లాభాల్లో నాలుగు శాతాన్ని ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు ‘సాక్షి’తో చెప్పారు. ఐదు రోజుల పనిదినాలు తప్ప ఫ్యామిలీ పెన్షన్ దగ్గర్నుంచి అన్ని ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించడంతో సమ్మె వాయిదా వేసి చర్చలు కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. వేతన సవరణ కోసం జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దిగిరాకుంటే మార్చి 11 నుంచి మూడు రోజులు, ఆ తర్వాత నిరవధిక సమ్మె చేసేందుకు యూనియన్లు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. శనివారం యూనియన్లతో ఐబీఏ జరిపిన చర్చలు సానుకూలంగా ముగిసాయి. ఈ 15 శాతం వేతన పెంపుతో బ్యాంకులపై ఏడాదికి సుమారు రూ.8,000 కోట్ల భారం పడనుంది. అలాగే రూ.80,000 జీతం ఉన్న బ్యాంకు ఉద్యోగికి ఏడాదికి రూ.40 నుంచి రూ.50 వేల లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఐబీఏ ప్రతిపాదనలను పరిశీలించి వారం తర్వాత సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని యూనియన్ నేతలు వివరించారు. -
నిజాయతీగా ఉంటే... భయపడాల్సిన పనిలేదు!
న్యూఢిల్లీ: బ్యాంకులు దేశ ప్రయోజనాల కోణంలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని, భవిష్యత్తులో దర్యాప్తు సంస్థలు వేధింపులకు గురి చేస్తాయన్న భయం వద్దని కేంద్ర ఆరి్థక శాఖా సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. ముంబైలో బుధవారం జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ప్రభుత్వం బ్యాంకింగ్ రంగానికి మద్దతుగా నిలబడుతుంది. మంచి విశ్వాసంతో, నిజాయతీగా బ్యాంకులు తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా భవిష్యత్తులో ఏ దర్యాప్తు సంస్థ సైతం తీవ్రంగా పరిగణించడం జరగదు. ఈ విషయంలో నాది హామీ. బ్యాంకులు, దేశ ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని ఠాకూర్ పేర్కొన్నారు. ఇటీవల చోటుచేసుకున్న భారీ మోసాలు, రుణ అవకతవకలు, ఎన్పీఏ కేసుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల ఉన్నతోద్యోగులు సమన్లు అందుకుని విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకులు రుణాల మంజూరి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. కార్పొరేట్లకు అంతగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితుల్లో మంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. -
జెట్ సిబ్బందికి ప్రత్యేక రుణాలివ్వండి
ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో 22,000 మంది పైగా ఉద్యోగుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో జీతాలు అందక ఇక్కట్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులకు కష్టకాలంలో కొంత తోడ్పాటునిచ్చేలా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను (ఐబీఏ) బ్యాంకు యూనియన్లు కోరాయి. జెట్ సిబ్బందికి స్పెషల్ లోన్ స్కీముల్లాంటివి రూపొందించేలా బ్యాంకులకు సూచించాలని అభ్యర్థించాయి. అలాగే, ఉద్యోగులకు జీతాల బకాయిలను చెల్లించడంలో జెట్‌కు తోడ్పడేలా తగు విలువ గల ఆస్తులను తనఖాగా ఉంచుకుని కంపెనీకి కూడా ప్రత్యేక రుణాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. ఉద్యోగులకు ఒక్క నెల జీతాలైనా చెల్లించాలంటే కనీసం రూ.170 కోట్లు అవసరమవుతాయంటూ జెట్ ఎయిర్వేస్ సీఈవో వినయ్ దూబే వెల్లడించిన నేపథ్యంలో బ్యాంకు యూనియన్ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. జెట్ ఉద్యోగుల భవిష్యత్‌ను కాపాడేలా కంపెనీని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవాలంటూ గత వారం ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బ్యాంకు యూనియన్లు లేఖ రాశాయి. బ్యాంకులకు రూ. 8,500 కోట్లు, విమానాలు లీజుకిచ్చిన సంస్థలకు, ఉద్యోగులకు జెట్ రూ. 4,000 కోట్ల బాకీపడింది. ఫ్లయిట్స్ రద్దుతో ప్రయాణికులకు వేల కోట్ల రూపాయలు రిఫండ్ చేయాల్సి ఉంది. -
పీఎన్బీ.. సంస్కరణల అమల్లో టాప్
న్యూఢిల్లీ: నీరవ్ మోదీ కుంభకోణంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్, చాలా వేగంగా కోలుకుని సంస్కరణల అజెండా అమల్లో అగ్రస్థానంలో నిల్చింది. ఈ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రెండో స్థానం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానాన్ని దక్కించుకున్నాయి. సేవల నాణ్యతను మెరుగుపర్చుకునే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణలపై బీసీజీ–ఐబీఏ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డిజిటలైజేషన్, రుణ వితరణ తదితర 140 అంశాల ప్రాతిపదికగా రూపొందించిన ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం విడుదల చేశారు. ఇందులో 100 మార్కులకు గాను పీఎన్బీకి 78.4 స్కోరు దక్కించుకుంది. మిగతా బ్యాంకుల స్కోర్లు చూస్తే.. బీవోబీ 77.8, ఎస్బీఐ (74.6), ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (69), కెనరా బ్యాంక్ (67.5), సిండికేట్ బ్యాంక్ 67.1గా ఉన్నాయి. బాధ్యతాయుతమైన బ్యాంకింగ్, రుణ వితరణ, ఆర్థిక సేవల విస్తరణ, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సత్వరం స్పందించడం తదితర అంశాల్లో పీఎన్బీ ’మెరుగైన పనితీరు’ కనపర్చినట్లు బీసీజీ–ఐబీఏ నివేదిక పేర్కొంది. ‘భారీ కుంభకోణం కారణంగా ఇటు ఆర్థికంగాను, అటు ప్రతిష్టపరంగానూ దెబ్బతిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొండిబాకీలకు రూ. 14,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. అయితే, 9 నెలల్లోనే బ్యాంక్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది. తొమ్మిది నెలల తర్వాత గత క్వార్టర్లో లాభాలు కూడా ప్రకటించింది. అలాగే, సంస్కరణల అమల్లో అగ్రస్థానాన్నీ దక్కించుకోవడం అభినందనీయం‘ అని జైట్లీ ప్రశంసించారు. ఇలాంటి ర్యాంకింగ్‌ల విధానంతో బ్యాంకుల మధ్య పోటీతత్వం పెరుగుతుందని, మరింత మెరుగ్గా పనిచేసేలా ప్రోత్సాహం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆయా బ్యాంకులు అమలు చేస్తున్న సంస్కరణల ఊతంతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో ఒత్తిడి తగ్గిందని, మొండిబాకీలను గుర్తించడంతో పాటు వాటికి పూర్తి స్థాయిలో ప్రొవిజనింగ్ చేయడం కూడా ఇందుకు కారణమని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. పీసీఏలోని బ్యాంకులకూ ర్యాంకింగ్.. భారీ మొండిబాకీల కారణంగా ఆర్బీఐ ఆంక్షలు ఎదుర్కొంటున్న ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా ఈ నివేదికలో ర్యాంకింగ్ లభించింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కి 66.7, యూకో బ్యాంక్ (64.1), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (60.8), ఐడీబీఐ బ్యాంక్ (60.2), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (55.7), దేనా బ్యాంక్‌కు 53.8 ర్యాంక్ లభించింది. ప్రభుత్వ రంగంలో మొత్తం 21 బ్యాంకులు ఉండగా, 11 బ్యాంకులను ఆర్బీఐ గతేడాది పీసీఏ పరిధిలోకి చేర్చి కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. 5 బ్యాంకులు ఇటీవలే దీన్నుంచి బైటికి వచ్చాయి. దివాలా చట్టంతో ప్రయోజనాలు.. దివాలా చట్టం, మొండిబాకీల రికవరీపరమైన సంస్కరణల పక్కా అమలు.. బ్యాంకులు కోలుకునేందుకు తోడ్పడుతున్నాయని నివేదిక పేర్కొంది. 2015 ఏప్రిల్ నుంచి 2018 డిసెంబర్ దాకా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2.87 లక్షల కోట్లు రికవర్ చేసుకున్నాయని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ దాకా రికార్డు స్థాయిలో ఏకంగా రూ. 98,498 కోట్లు రాబట్టుకోగలిగాయని తెలిపింది. 2014–15 నుంచి 2019 ఫిబ్రవరి దాకా ప్రభుత్వ బ్యాంకులకు కేంద్రం రూ. 2.5 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చింది. కొనసాగనున్న బ్యాంకుల విలీనం.. అంతర్జాతీయ స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ చెప్పారు. ఇందులో భాగంగా బ్యాంకుల విలీన విధానాన్ని క్రమంగా అమలు చేస్తోందని ఆయన వివరించారు. మొండిబాకీలను బ్యాంకులు పూర్తిగా బైటపెట్టేలా చర్యలు తీసుకోవడంతో.. ప్రారంభంలో వీటి పరిమాణం భారీ స్థాయికెళ్లిందని, అయితే కేటాయింపులు, రికవరీలతో ఇవి తగ్గుముఖం పడుతున్నాయని పేర్కొన్నారు. గడిచిన 2–3 త్రైమాసికాల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో మొండిబాకీల సమస్య క్రమంగా తగ్గుతోందన్నారు. ‘అదనపు మూలధనం సమకూర్చడంపై ప్రభుత్వం తన మాట నిలబెట్టుకుంటోంది. పలు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి రావడం హర్షణీయం. త్వరలో మిగతావి కూడా తమ కార్యకలాపాలు మెరుగుపర్చుకుని, బైటికి రాగలవని ఆశిస్తున్నాను‘ అని చెప్పారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక.. బ్యాం కుల వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యానికి ఫుల్స్టాప్ పడిందని జైట్లీ తెలిపారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిభ, ప్రొఫెషనలిజంకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. ప్రైవేట్ బ్యాంకులతో పోలిస్తే మరిన్ని నియంత్రణలకు లోబడి పనిచేయాల్సి ఉంటున్నా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండటం అభినందించతగ్గ విషయమని జైట్లీ పేర్కొన్నారు. -
మరోసారి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా... ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు తెలిపాయి. ఈ వివరాలను ఐడీబీఐ బ్యాంకు బీఎస్ఈకి తెలియజేసింది. సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు అవరోధం ఏర్పడుతుందని అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. అయితే కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. బీవోబీ కూడా ఇదే విధమైన సమాచారం ఇచ్చింది. ప్రైవేటు రంగ కరూర్ వైశ్యా బ్యాంకు సైతం ఉద్యోగుల సమ్మె కారణంగా తమ కార్యకలాపాలకు విఘాతం కలగొచ్చని పేర్కొంది. బ్యాంకు ఉద్యోగులు గత నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు సమ్మె చేపట్టారు. -
ఐబీఏ చైర్మన్‌గా సునీల్ మెహతా
ముంబై: ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్‌గా పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ మెహతా ఎంపికయ్యారు. 2018–19 కాలానికి ఈయనను చైర్మన్‌గా ఎంపిక చేసినట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. ఐబీఏ డిప్యూటీ చైర్మన్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ దీనబంధు మొహపాత్రను ఎన్నుకున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్లుగా ఉన్న ఎస్బీఐ కొత్త చైర్మన్ రజనీష్ కుమార్, ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ యథావిధిగా కొనసాగుతారని వెల్లడించింది. -
నేడు, రేపు.. బ్యాంకులు బంద్!!
న్యూఢిల్లీ: మెరుగైన వేతనాల పెంపు డిమాండ్‌తో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో బుధ, గురువారాలు రెండు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు విఘాతం కలగనుంది. వేతన సవరణపై చీఫ్ లేబర్ కమిషనర్ (సీఎల్సీ) ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో సమ్మె అనివార్యమైనట్లు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలియజేసింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్‌లోని (యూఎఫ్‌బీయూ) 9 అసోసియేషన్స్‌కి చెందిన 10 లక్షల మంది పైచిలుకు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మే 5న జరిగిన సమావేశంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) రెండు శాతం వేతనాల పెంపును ప్రతిపాదించగా.. యూనియన్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ‘మేము లేవనెత్తిన అంశాలన్నీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని చీఫ్ లేబర్ కమిషనర్ అభిప్రాయపడ్డారు. సానుకూలంగా స్పందించాలని ఐబీఏకి సూచించారు. నిర్వహణ లాభాలు మెరుగుపడటం, సిబ్బంది వ్యయాలు తగ్గడం, పెరుగుతున్న వ్యాపార పరిమాణం తదితర గణాంకాలన్నీ కూడా యూఎఫ్‌బీయూ లీడర్లు వివరించారు. ఇవన్నీ పరిగణించిన మీదట కష్టించి పనిచేసే అధికారులు, సిబ్బందికి లాభాల ఆధారంగా కాకుండా తగిన వేతనాల పెంపు ఉండాలని సీఎల్సీ సూచించారు. అయితే, ఐబీఏ మరో కొత్త ఆఫర్ ఏదీ చేయలేదు. చర్చలు కొనసాగిస్తామని మాత్రం పేర్కొంది‘ ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (ఎన్వోబీడబ్ల్యూ) వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా తెలిపారు. స్తంభించనున్న బ్యాంకింగ్ లావాదేవీలు.. ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖల్లో విత్‌డ్రాయల్, డిపాజిట్ లావాదేవీలు స్తంభించనున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైన బ్యాంకులు.. సమ్మె గురించి ఖాతాదారులకు సమాచారమిచ్చాయి. వీలైనంత వరకూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని కోరాయి. అయితే, చెక్కుల క్లియరెన్స్‌లో కొంత జాప్యం మినహా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగనున్నాయి. దేశీయంగా ప్రభుత్వ రంగంలో 21 బ్యాంకులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మొత్తం బ్యాంకింగ్ వ్యాపార పరిమాణంలో వీటి వాటా 75 శాతం మేర ఉంటుంది. -
30, 31 తేదీల్లో బ్యాంకింగ్ సమ్మె హెచ్చరిక
న్యూఢిల్లీ: అతి తక్కువగా కేవలం 2 శాతం వేతన బిల్లు వ్యయాన్ని పెంచుతామంటూ మేనేజ్మెంట్ – ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చేసిన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి. ఇందుకు నిరసనగా మే 30, 31 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె జరుపుతారని హెచ్చరించాయి. ధరల పెరుగుదల తీవ్రంగా ఉంటున్నప్పుడు స్వల్పపాటి వేతన పెంపులో హేతుబద్ధత ఏమిటని ఏఐబీఓసీ జాయింట్ సెక్రటరీ రవీంద్ర గుప్తా ప్రశ్నించారు. గత రెండు వేతన సవరణల సందర్భంగా 15 శాతం ఇంక్రిమెంట్‌ను ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తాజా పరిస్థితి చూస్తుంటే, వేతన సవరణ సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వం కూడా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందన్న విషయం స్పష్టమవుతోందని యూనియన్లు పేర్కొన్నాయి. -
బ్యాంకుల్లో మోసాలపై ఐబీఏ దృష్టి
ఫోరెన్సిక్ ఆడిట్‌కు సీఏల నియామకంపై కసరత్తు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మోసాల ఉదంతాలు పెరుగుతుండటంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దృష్టి సారించింది. మోసాలను అరికట్టేందుకు, పోయిన నిధులను రాబట్టేందుకు బ్యాంకుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలను నియమించుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఎంపికైన సీఏ సంస్థలు.. రుణాల విశ్లేషణ, విదేశీ వాణిజ్య పత్రాల పరిశీలన, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన వ్యవస్థ పనితీరు పరిశీలన, రుణాల మదింపు మొదలైనవి చేయాల్సి ఉంటుంది. అలాగే లై డిటెక్టింగ్ మెషిన్, మొబైల్ కాల్ ఇంటర్ప్రిటర్, బిగ్ డేటా విశ్లేషణ సాధనాల్లాంటివి కూడా వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ, సెబీ, ఎస్ఎఫ్ఐవో, ఐబీఏ తదితర ఏజెన్సీల్లో సభ్యత్వం కలిగి ఉన్న వాటికి ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుందని ఐబీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ పరిశ్రమలో రూ.50 కోట్ల దాకా, అంతకు పైగా మొత్తాలకు సంబంధించి జరిగే మోసాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం సీఏ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేసింది. ఐబీఏకి దరఖాస్తులు చేరడానికి ఏప్రిల్ 25 ఆఖరు తేది. నిబంధనల ప్రకారం రూ. 50 కోట్ల పైబడిన మోసాలపై ఆడిట్ నిర్వహించే సంస్థలకు ఆ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మొండిబాకీలు రాబట్టేందుకు తోడ్పాటు: పేరుకుపోతున్న మొండిబాకీలను రాబట్టే దిశగా బ్యాంకులు తగు సలహాలు పొందేందుకు... కొత్తగా ఏర్పాటయ్యే ఆడిటర్ల ప్యానెల్ ఉపకరించగలదని బ్యాంకింగ్ రంగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మోసాల ఉదంతాలు అన్ని బ్యాంకుల్లోనూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు అవసరమన్నారు. కొన్నాళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 6,000 కోట్లపైగా విదేశాలకు రెమిటెన్సులకు సంబంధించిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిన సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు వరుస సెలవులు
ముంబై: వరుస సెలవులు వస్తున్నందున బ్యాంకు వినియోగదారులు తమ పనులను సత్వరమే పూర్తి చేసుకోవాలని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరింది. శని, ఆది, సోమ వారాల్లో బ్యాంకులు పనిచేయవు కాబట్టి శుక్రవారమే ముఖ్యమైన బ్యాంకు పనులేవైనా ఉంటే పూర్తి చేసుకోవాలని సూచించింది. 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13వ తేదీ హోలీ పండుగ సెలవులు ఉన్నందున ఈ జాగ్రత్త తీసుకోవాలని కోరింది. మరోవైపు ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంలకు వెళితే నో క్యాష్ అని బోర్డు దర్శనం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా బ్యాంకులకు వరుస సెలవులు రానుండటంతో మళ్లీ కరెన్సీ కోసం జనాలు ముందునుంచే ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు. -
రేపే బ్యాంకుల సమ్మె
చెన్నై : ప్రభుత్వం, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రవేశపెడుతున్న పాలసీలను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు రేపు సమ్మెకు దిగనున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), మంగళవారం ప్రభుత్వ అధికారులతో జరిపిన చర్చలు విఫలమవ్వడంతో, గతంలో సమ్మెకు పిలుపునిచ్చిన మాదిరిగానే శుక్రవారం ఒక్కరోజు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు బంద్ కానున్నట్టు బ్యాంకు యూనియన్ల ఫోరం ప్రకటించింది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్(ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీ.హెచ్ వెంకటచలం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు, ఆఫీసర్లు ఈ బంద్ పాల్గొనబోతున్నారని తెలిపారు. 80 వేలకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ బ్యాంకులు శుక్రవారం క్లోజ్ కానున్నాయి. అసమంజసమైన బ్యాంకింగ్ సంస్కరణ నేపథ్యంలో బ్యాంకులు వన్ డే బంద్‌ను చేపడుతున్నాయి. -
మళ్లీ బ్యాంకు ఉద్యోగుల సమ్మె సైరన్!
25 నుంచి 28 వరకూ... న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు మళ్లీ సమ్మె సైరన్ మోగించారు. వేతనాల పెంపు విషయంలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) తాజా ప్రతిపాదనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఈ నెలాఖరులో నాలుగు రోజుల పాటు సమ్మెకు దిగనున్నట్లు బ్యాంక్ యూనియన్లు మంగళవారం ప్రకటించాయి. వేతనాలను 19 శాతం పెంచాలంటూ యూనియన్లు డిమాండ్ చేస్తుండగా.. ఐబీఏ దీన్ని మంగళవారం 13 శాతానికి పెంచింది. ఇది తమకు ఆమోదయోగ్యం కాదని.. యునెటైడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఎంవీ మురళి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25-28 వరకూ సమ్మె చేయాలని నిర్ణయించినట్లు నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ జనరల్ సెక్రటరీ అశ్విని రాణా చెప్పారు. కాగా, సంప్రదింపుల్లో తగిన పరిష్కారం లభించకుంటే... మార్చి 16 నుంచి నిరవధిక సమ్మెకూ వెనుకాడబోమని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. -
ఏటీఎం పరిమితులపై ఆర్బీఐకి కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఏటీఎంలలో ఉచిత లావాదేవీలపై పరిమితుల విషయంలో రిజర్వ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఎస్బీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులు తమ సొంత ఖాతాదారులపై అనవసర పన్నులు మోపుతున్నాయని వ్యాఖ్యానించింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం హైదరాబాద్ సహా ఆరు మెట్రో నగరాల్లో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్ ఉచిత లావాదేవీలను బ్యాంకులు అయిదింటికి పరిమితం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్వాతి అగర్వాల్ అనే అడ్వకేట్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కొన్ని బ్యాంకులు, ఐబీఏ విజ్ఞప్తి మేరకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం పూర్తిగా ఏకపక్షమైనదని, సంస్కరణల స్ఫూర్తికి వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా మటుకు దేశాల్లో ఖాతాదారుల సొంత బ్యాంకు ఏటీఎంలలో జరిపే లావాదేవీల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవని వివరించారు. దీంతో హైకోర్టు తాజా నోటీసులు ఇచ్చింది. ‘సొంత ఖాతాదారులపై అనవసర భారం ఎందుకు మోపుతున్నారు? తదుపరి విచారణ తేదీలోగా మీ వివరణ ఇవ్వండి’ అంటూ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసింది.