హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి. ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించడం ఇందుకు కారణం. తొమ్మిది బ్యాంకు యూనియన్లకు నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఐబీఏతో చర్చలు జూలై 1 నుంచి మొదలు కానున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని ఉద్యోగ సంఘాలు బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి. పింఛన్ దారులందరికీ పెన్షన్‌ను నవీకరించడం, సవరించడంతోపాటు జాతీయ పెన్షన్ పథకాన్ని తొలగించడం, బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి డిమాండ్ల జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment