All India Bank Employees Association
-
ఎగవేతదారులతో బ్యాంకుల రాజీకి వ్యతిరేకత
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులతో బ్యాంకులు రాజీ పరిష్కారానికి ఆర్బీఐ అనుమతించడాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. రాజీ పరిష్కారం, సాంకేతికంగా రుణాల మాఫీ పేరుతో ఆర్బీఐ ఇటీవలే ఓ కార్యాచరణను ప్రకటించింది. ఇది బ్యాంకుల సమగ్రత విషయంలో రాజీపడడమేనని, ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడమేనని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్దేశపూర్వక ఎగవతేదారుల సమస్య పరిష్కారానికి కఠిన చర్యలనే తాము సమర్థిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ప్రకటించాయి. మోసం లేదా ఉద్దేశపూర్వక ఎగవేతదారులంటూ వర్గీకరించిన ఖాతాల విషయంలో రాజీ పరిష్కారానికి అనుమతించడం అన్నది న్యాయ సూత్రాలకు, జవాబుదారీకి అవమానకరమని వ్యాఖ్యానించాయి. నిజాయితీ పరులైన రుణ గ్రహీతలను నిరుత్సాహపరచడమేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలు షాక్‌కు గురి చేశాయని పేర్కొన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగం పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని నీరు గారుస్తుందని, డిపాజిట్ల నమ్మకాన్ని కూడా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆర్బీఐ తన నిర్ణయాన్ని ఉపంసహరించుకోవాలని డిమాండ్ చేశాయి. -
All India bank strike: 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్‌ను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏఐబీఈఏ ఈ నెల 19న (రేపు) సమ్మెకు పిలుపునిచ్చింది. అధికారులు ఇందులో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. నగదు డిపాజిట్, విత్‌డ్రాయల్, చెక్కుల క్లియరింగ్ వంటి లావాదేవీలపై కొంత ప్రభావం ఉండవచ్చని అంచనా. సమ్మె జరిగితే పరిస్థితుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైన పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించాయి. కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయడం వల్ల కస్టమర్ల ప్రైవసీకి, వారి సొమ్ముకు రిస్కులు పొంచి ఉండటంతో పాటు కింది స్థాయిలో రిక్రూట్మెంట్ తగ్గిపోతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, సమ్మెలు జరపడం మినహా తమ ఆందోళనను వ్యక్తపర్చేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. -
కస్టమర్లకు అలర్ట్ : ఉద్యోగుల స్ట్రైక్..ఆ రోజు పని చేయని బ్యాంకులు
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై పెరిగిపోతున్న దాడుల్ని నిరసిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. వచ్చే నెల 19న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో స్ట్రైక్ జరగనుంది. ఆ రోజు బ్యాంకుల్లో కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్.వెంకటాచలం తెలిపిన వివరాల మేరకు..ఏఐబీఈఏ యూనియన్‌లో యాక్టీవ్‌గా ఉన్నారనే కారణంగా బ్యాంకు ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ఊతం ఇచ్చేలా ఏఐబీఏ యూనియన్ నాయకులను సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వీస్ నుండి తొలగించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ బ్యాంకులు ట్రేడ్ యూనియన్ హక్కులను నిరాకరిస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంకులు అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఉద్యోగుల్ని విచక్షణారహితంగా బదిలీ చేస్తుందన్నారు. ద్వైపాక్షిక సెటిల్మెంట్, బ్యాంక్ లెవల్ సెటిల్మెంట్ను ఉల్లంఘిస్తూ 3,300 మందికి పైగా క్లరికల్ సిబ్బందిని ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్‌కు బదిలీ చేశారన్నారని అన్నారు. పై వాటన్నింటిని తిప్పికొట్టడం లేదా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. చదవండి👉 హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త -
బ్యాంకుల పనివేళలు మారనున్నాయా? బ్యాంకు అసోసియేషన్ ప్రతిపాదనలు ఇవే!
దేశంలో అన్నీ ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల పనిదినాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. వారానికి 6 రోజులు పని చేసే ఉద్యోగులు ఇకపై 5 రోజులు మాత్రమే పనిచేయనున్నారా? అంటే అవుననే అంటోంది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ). అంతే కాదు బ్యాంకు యూనియన్ సభ్యులు కొన్ని డిమాండ్లను ఆర్బీఐ, కేంద్రం ఎదుట ఉంచారు. పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఏఐబీఈఏ సంఘం కొన్ని ప్రతిపాదనలు చేసింది. అందులో.. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు వారానికి 6 రోజులు పని చేస్తుండగా.. ఆ పనివేళల్ని 5 రోజులకు కుదించాలని ప్రతిపాదించింది. అదే సమయంలో బ్యాంకు పనిదినాల్ని 5 రోజులకు కుదించడంతో పాటు..రోజుకు మరో అరగంట అదనంగా పనిచేస్తామని పేర్కొంది. బ్యాంకుల పనిదినాలు ఇలా ఉండాలి బ్యాంకు ఉద్యోగుల సంఘం లేఖ ప్రకారం..ప్రతిపాదిత పని గంటలు ఉదయం 9:15 గంటల నుండి సాయంత్రం 4.45 గంటల వరకు కాకుండా..ఉదయం 9:45 నుండి సాయంత్రం 4.45 గంటల వరకు మార్చాలి. బ్యాంకు ట్రాన్సాక్షన్ సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సవరించాలి. సవరించిన నగదు రహిత లావాదేవీల వేళలు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉండాలని యూనియన్ ప్రతిపాదించిందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని కల్పించాలని యూనియన్ డిమాండ్ చేస్తోందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ వర్కింగ్ ప్రతిపాదనలు గతేడాది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఆర్బీఐ అంగీకరిస్తుంది రెండు శనివారాల నష్టాన్ని భర్తీ చేయడంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తన అభిప్రాయాలను కోరినట్లు ఆయన చెప్పారు. పనిగంటలను ముప్పై నిమిషాలు పెంచవచ్చని ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ (ఐబీఏ), కేంద్రం, ఆర్బీఐ తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ప్రతిపాదనల తిరస్కరణ కరోనా మహమ్మారి సమయంలో, కోవిడ్ -19 వైరస్ నుండి ఉద్యోగులను రక్షించడానికి బ్యాంకు ఉద్యోగుల సంఘాలు వారానికి ఐదు రోజుల పని చేయాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రతిపాదనను ఐబీఏ తిరస్కరించింది. కాని ఉద్యోగులకు 19 శాతం వేతన పెంపును ప్రతిపాదించింది. ప్రస్తుతం, బ్యాంకులకు ప్రతి నెలా రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం సెలవులు ఉన్న విషయం తెలిసిందే. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన సమ్మెను వాయిదా వేశాయి. ఉద్యోగుల డిమాండ్లపై చర్చలు ప్రారంభించేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అంగీకరించడం ఇందుకు కారణం. తొమ్మిది బ్యాంకు యూనియన్లకు నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ఐబీఏతో చర్చలు జూలై 1 నుంచి మొదలు కానున్నాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం తెలిపారు. వారంలో అయిదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని ఉద్యోగ సంఘాలు బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నాయి. పింఛన్ దారులందరికీ పెన్షన్‌ను నవీకరించడం, సవరించడంతోపాటు జాతీయ పెన్షన్ పథకాన్ని తొలగించడం, బ్యాంకు ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం వంటివి డిమాండ్ల జాబితాలో ఉన్నాయి. -
యథాప్రకారంగానే బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన సమస్యలు ఉన్నప్పటికీ .. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల ప్రక్రియ యథాప్రకారంగానే కొనసాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి విలీనాలు అమల్లోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. కరోనా వైరస్ దృష్ట్యా బ్యాంకుల విలీనానికి డెడ్‌లైన్ పొడిగించే అవకాశముందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ .. ‘ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదు‘ అని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో డెడ్‌లైన్‌ను కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలంటూ అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిర్మలా సీతారామన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కోవిడ్–19 కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతుండటంతో బ్యాంకింగ్ సేవలపైనా ప్రతికూల ప్రభావం ఉంటోంది. 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు భారీ బ్యాంకర్లుగా విలీనం చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. విలీన ప్రక్రియ పూర్తయితే ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న బ్యాంకులు ఉంటాయి. ప్రణాళిక ప్రకారం.. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమవుతున్నాయి. కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకును, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంక్.. కార్పొరేషన్ బ్యాంకును విలీనం చేస్తున్నారు. -
నేడు బ్యాంకుల సమ్మె
-
నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
న్యూఢిల్లీ/కోల్‌కతా: బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ)లు బ్యాంక్ యూనియన్లు జాతీయ స్థాయిలో 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే బ్యాంక్ ఆఫీసర్లు, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు, ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. బ్యాంక్‌ల విలీనం వీటిపై ఎలాంటి ప్రభావం చూపనందున ఇవి ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మె కొనసాగుతుంది.... ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీ.హెచ్. వెంకటాచలమ్ పేర్కొన్నారు. అందుకని సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మె పరిధిలోనే ఉన్నందున ఏటీఎమ్‌లను కూడా మూసేస్తామని బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కొన్ని బ్యాంక్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం, బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని ఈ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తగిన స్థాయిల్లో బ్యాంక్ క్లర్క్‌లను నియమించాలని, భారీగా పేరుకుపోతున్న మొండి బకాయిల రికవరీకి గట్టి చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభావం స్వల్పమే !.. పలు బ్యాంక్‌లు ఇప్పటికే సమ్మె విషయమై తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ సంఘాల్లో తమ ఉద్యోగుల సభ్యత్వం తక్కువగా ఉందని, ఈ సమ్మె ప్రభావం బ్యాంక్ కార్యకలాపాలపై స్వల్పంగానే ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. సమ్మె కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ పేర్కొంది. అయితే సమ్మె జరిగితే, కార్యకలాపాలపై ప్రభావం ఉండగలదని వివరించింది. గత నెలలో 26, 27 తేదీల్లో బ్యాంక్‌ల సమ్మెకు ఆఫీసర్ల యూనియన్లు పిలుపునిచ్చాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ యూనియన్లు సమ్మెను విరమించాయి. -
ఒక్క ఉద్యోగం కూడా పోదు..
న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని నేనప్పుడే స్పష్టం చేశాను‘ అని కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ఏ బ్యాంకు కూడా మూతబడదని, వినూత్నంగా కొత్త ప్రయోగాలేవో చేయాలంటూ బ్యాంకులనేమీ ఒత్తిడి చేయడం లేదన్నారు. ‘బ్యాంకులకు మరింత మూలధనం ఇస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న కార్యకలాపాలే ఇకపైనా చేయాల్సి ఉంటుంది. అంతే‘ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పది బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనాలతో ఉద్యోగాలు పోతాయని, అలహాబాద్ బ్యాంకుతో విలీనం కారణంగా ఇండియన్ బ్యాంకు మూతబడుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మలా సీతారామన్ వీటిపై స్పందించారు. బ్యాంకులు మరింతగా రుణాలివ్వాలని, మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలనే వాటికి అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాలూ పరిశీలిస్తున్నాం.. ఎకానమీ మందగమనంలోకి జారుకుంటోందా అన్న ప్రశ్నలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఒక్కో రంగం అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఏ రంగమైనా ప్రభుత్వం వద్దకు వస్తే.. సావధానంగా వింటాం. అవి కోరుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటాం. తగు రీతిలో స్పందిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా చేశామని, అవసరాన్ని బట్టి ఇది పునరావృతమవుతుందని మంత్రి చెప్పారు. సంక్షోభంలో కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఉదహరిస్తూ.. ఈ రంగం ప్రస్తుతం బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైన ఇంజిన్లు, ఆటోపరికరాల తయారీకి సంబంధించి పరిణామక్రమంలో ఉందని తెలిపారు. ఈ ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2020 మార్చి 31 తర్వాత బీఎస్–4 ప్రమాణాల వాహనాలేవీ ఉత్పత్తి చేయొద్దంటూ నిర్దేశించినది..సుప్రీం కోర్టని, ప్రభుత్వం కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ కంపెనీల విజ్ఞప్తిపై జీఎస్టీ మండలే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అన్ని రంగాల సమస్యలనూ ఒక్క దెబ్బతో పరిష్కరించేసే మంత్రదండమేదీ లేదని, రంగాలవారీగా ఆయా సంస్థల విజ్ఞప్తులను బట్టే ప్రభుత్వం స్పందిస్తోందని వివరించారు. ‘ఆటోమొబైల్ రంగం సమస్యలు వేరు.. వ్యవసాయ రంగం సమస్యలు వేరు. ఇలా ఒక్కో రంగం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఊతం .. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడమనేది.. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ‘తదుపరి దశ వృద్ధి సాధన కోసం దేశానికి పెద్ద బ్యాంకులు కావాలి. శుక్రవారం చేసిన మెగా బ్యాంకుల ప్రకటన ఆ లక్ష్య సాధన కోసమే. భారీ స్థాయిలో మూలధనం, వ్యాపార పరిమాణం, అధిక వృద్ధి సాధనకు తోడ్పడే భారీ బ్యాంకులు ఇప్పుడు మనకు ఆరు ఉన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ బ్యాంకుల విస్తృతి మరింత పెరుగుతుందని, రుణ వితరణ సామర్ధ్యం మెరుగుపడుతుందని, వినూత్న సాధనాలు ..టెక్నాలజీతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించగలవని రాజీవ్ కుమార్ తెలిపారు. పెద్ద బ్యాంకుల అవసరాలకన్నా 0.25 శాతం అధికంగానే ప్రభుత్వం మూలధనం సమకూర్చిందని పేర్కొన్నారు. ‘ఆయా బ్యాంకుల బోర్డుల సన్నద్ధతపైనే విలీన తేదీ ఆధారపడి ఉంటుంది. అది జనవరి 1న కావచ్చు.. లేదా ఏప్రిల్ 1న కావొచ్చు. ఏదైనా గానీ ఏప్రిల్ 1 లోగానే ఇది జరుగుతుంది‘ అని రాజీవ్ తెలిపారు. -
మరోసారి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపునకు మద్దతుగా... ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో సమ్మె నిర్వహిస్తున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లా యీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు తెలిపాయి. ఈ వివరాలను ఐడీబీఐ బ్యాంకు బీఎస్ఈకి తెలియజేసింది. సమ్మె జరిగితే బ్యాంకు కార్యకలాపాలకు అవరోధం ఏర్పడుతుందని అలహాబాద్ బ్యాంకు ప్రకటించింది. అయితే కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. బీవోబీ కూడా ఇదే విధమైన సమాచారం ఇచ్చింది. ప్రైవేటు రంగ కరూర్ వైశ్యా బ్యాంకు సైతం ఉద్యోగుల సమ్మె కారణంగా తమ కార్యకలాపాలకు విఘాతం కలగొచ్చని పేర్కొంది. బ్యాంకు ఉద్యోగులు గత నెల రోజుల వ్యవధిలో రెండు సార్లు సమ్మె చేపట్టారు. -
నేడు బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
న్యూఢిల్లీ: విజయ, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు బుధవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాయి. గత శుక్రవారం కూడా ఇదే అంశంతోపాటు వేతన డిమాండ్లపై ఒక రోజు సమ్మె చేసిన బ్యాంకు ఉద్యోగులు వారం తిరగక ముందే మరోసారి సమ్మెకు దిగుతున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకు సేవలపై ప్రభావం పడనుంది. ప్రైవేటు బ్యాంకులు మాత్రం యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. చాలా వరకు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమ్మె విషయమై సమాచారాన్ని కూడా తెలియజేశాయి. తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యునైటెడ్ బ్యాంక్ యూనియన్స్ ఈ సమ్మెను నిర్వహిస్తోంది. విలీనం విషయంలో ముందుకు వెళ్లబోమంటూ ప్రభుత్వం నుంచి తమకు హామీ రాలేదని, దాంతో సమ్మె నిర్ణయం తీసుకున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలియజేశారు. ప్రభుత్వం బ్యాంకుల సైజు పెరగాలని కోరుకుంటోందని, ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నింటినీ కలిపి ఒక్కటి చేసినా గానీ, ప్రపంచంలోని టాప్ 10లో చోటు దక్కదని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. -
ఉర్జిత్‌పై బ్యాంక్ ఉద్యోగుల ఫైర్
-
నోట్ల రద్దు ఎఫెక్ట్: ఉర్జిత్‌పై బ్యాంక్ ఉద్యోగుల ఫైర్
ముంబై: నోట్ల రద్దుపై రాజకీయ పక్షాల్లోనేకాక బ్యాంకింగ్ రంగంలోనూ పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుపడుతుండగా.. బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు ఒక అడుగుముందుకేసి ఏకంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న గందరగోళానికి బాధ్యుడు ముమ్మాటికి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేలేనని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు విశ్వాస్ ఉటాగి అన్నారు. బుధవారం ముంబైలో మీడియాతో మాట్లాడుతూ ‘బ్యాంకు ముందు భారీ క్యూలైన్లలో నిల్చోలేక ఇప్పటి వరకు 50 మంది చనిపోయారు. ఒక్కసారిగా విపరీతమైన తాకిడి పెరగడంతో బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా 11 మంది బ్యాంక్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చావులన్నింటికీ ఆర్బీఐ గవర్నరే బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి తెలియదా?’అని విశ్వాస్ మండిపడ్డారు. (నోట్ల రద్దు ఎఫెక్ట్: ఉర్జిత్ ఔట్?) మరోవైపు ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంకో కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో ఆర్బీఐ గవర్నర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బ్యాంక్ ఉద్యోగుల మరణాలకు ఉర్జిత్ పటేలే బాధ్యుడని, వెంటనే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేశారు. ‘పాత నోట్లు రద్దై రోజులు గడుస్తున్నా దేశంలోని చాలా ప్రాంతాలకు కొత్త కరెన్సీ అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రజలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు, నిజానికి మొత్తం కరెన్సీలో నగదు రూపంలో ఉండే బ్లాక్ మనీ 6 శాతానికి మించి ఉండదు. దానిని నిర్మూలించడానికి ఏకంగా 14 లక్షల కోట్ల విలువైన కరెన్సీని రద్దుచేయడం తెలివైనపని కాదు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిస్థితికి బాధ్యుడిగా ఆర్బీఐ గవర్నర్ రాజీనామాను కోరడంలో తప్పులేదు’ అని ఫ్రాంకో అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్బీఐ గవర్నర్ పై అసహనం వ్యక్తం చేసినట్లు ఇటీవల కొన్న వార్తా సంస్థలు పేర్కొనడం గమనార్హం. -
బ్యాంకు ఉద్యోగుల సమ్మె పిలుపు
వడోదర: యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ఆగ స్టు 29న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ప్రభుత్వపు బ్యాంకింగ్ సంస్కరణలకు నిరసనగా ఆగస్ట్‌లో సమ్మె నిర్వహిస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన యూఎఫ్‌బీయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపర్చడం, బ్యాంకుల విలీనం, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఎక్కువగా బ్యాంకు లెసైన్స్‌ల జారీ, ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోకి అధిక ప్రైవేట్ మూలధనాన్ని అనుమతిం చడం వంటి ప్రభుత్వ సంస్కరణలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తామని వివరించారు. ప్రభుత్వ సంస్కరణలు కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయన్నారు. బ్యాంకుల మొండిబకాయిల్లో అధిక వాటా కార్పొరేట్ సంస్థలదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఎందుకని 7,000 మంది డిఫాల్టర్ల పేర్లను వెల్లడించడం లేదని ప్రశ్నించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
14న బ్యాంకు ఉద్యోగుల చలో పార్లమెంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బ్యాంకు ఉద్యోగులు మార్చి 14న ‘పార్లమెంట్ మార్చ్’కి పిలుపునిచ్చారు. సుమారు 40,000 మంది ఉద్యోగులతో పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీ ఈఏ) ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. రుణ ఎగవేతదారుల నుంచి బకాయిలను వసూలు చేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత పటిష్టపర్చాలన్నది తమ ప్రధాన డిమాండని ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. -
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల సమ్మె
ముంబై : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధంగా ఉన్న ఐదు బ్యాంకుల ఉద్యోగులు గురువారం సమ్మె చేశారు. ఎస్బీఐ విలీన ప్రతిపాదనకు నిరసనగా వారు ఈ సమ్మెను నిర్వహించారు. ఐదు బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనూర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా ఉన్నాయి. ఎస్బీఐ యాక్ట్ పరిధికి వెలుపల ఉండాలని అసోసియేట్స్ బ్యాంకుల ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) పేర్కొంది. మరోవైపు, ఉద్యోగుల సమ్మె.. అనుబంధ బ్యాంకుల విలీనానికి వ్యతిరేకమైనది కాదని ఎస్బీఐ స్పష్టం చేసింది. అనుబంధ బ్యాంకులను ఎస్బీఐ నుంచి డీలింక్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారని పేర్కొంది. 24న దేశవ్యాప్త సమ్మె..: అనుబంధ బ్యాంకు ఉద్యోగుల డిమాండ్‌పై ఎస్బీఐ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకోకపోతే, జూన్ 24వ తేదీన వారికి మద్దతుగా దేశ వ్యాప్త బ్యాంకింగ్ సమ్మెకు పిలుపునిస్తున్నట్లు సైతం ఏఐబీఈఏ పేర్కొంది. -
స్తంభించిన బ్యాంకింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతన సవరణలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ అన్ని బ్యాంకుల ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం జరిగిన ఒక రోజు సమ్మె కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు స్తంభించాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం అయినట్లు బ్యాంకు యూనియన్లు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకింగ్ కార్యకలపాలు పూర్తిగా నిలిచిపోయినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి 80,000 మందికిపైగా ఉద్యోగులు, అధికారులు ఈ ఒక్కరోజు సమ్మెలో పాల్గొన్నారని, దీనివల్ల సుమారు రూ.12,000 కోట్ల లావాదేవీలు నిలిచిపోయినట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని విధంగా ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు తెలిపారు. వేతనాలను 25% పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తుండగా 11%కి మించి పెంచేది లేదని యాజమాన్యాలు అంటున్నాయి. దీంతో ఉద్యోగస్తులు ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఉద్యోగులు 25 నుంచి 2% దిగొచ్చినా, యాజమాన్యం 1% కూడా పెంచడానికి ముందుకు రాకపోవడం... సిబ్బందిలో ఆగ్రహాన్ని పెంచిందని, అందుకే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నట్లు రాంబాబు తెలిపారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచడానికి జోన్ వారీగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చామని, అందులో భాగంగా డిసెంబర్2న దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగస్తులు ఒక రోజు సమ్మెలో పొల్గొన్నట్లు ఆయన తెలిపారు. ముందు జాగ్రత్తగా బ్యాంకులు ఏటీఎంల్లో పూర్తిస్థాయిలో నగదును నింపడంతో వీటి కార్యకలపాలకు పెద్దగా ఆటంకాలు ఎదురుకాలేదు. అలాగే ఈ సమ్మె నుంచి కో-ఆపరేటివ్ బ్యాంకులను మినహాయించడంతో, వాటి కార్యకలపాలు యధావిధిగా కొనసాగాయి. కొన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగస్తులకు ప్రైవేటు బ్యాంకులు మద్దతు ప్రకటించడమే కాకుండా లావాదేవీలకు దూరంగా ఉన్నట్లు యూనియన్ వర్గాలు చెప్పాయి. ఆగిన 10 కోట్ల చెక్ క్లియరెన్స్‌లు దేశవ్యాప్తంగా 8 లక్ష మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ప్రకటించింది. 27 ప్రభుత్వరంగ బ్యాంకులకు చెందిన 75,000 శాఖల్లో బ్యాంకింగ్ సేవలు ఆగిపోయినట్లు ఏఐబీఈఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశ్వాస్ తెలిపారు. ఈ సమ్మె కారణంగా 10 కోట్లకుపైగా చెక్కులు క్లియరెన్స్ ఆగిపోయాయని, సుమారుగా రూ. 15.5 కోట్ల లావాదేవీలకు ఆటంకం కలిగినట్లు యూనియన్లు పేర్కొన్నాయి. మోడీ సర్కారు వచ్చాక బ్యాంకు యూనియన్ల తొలి సమ్మె ఇది. -
ఇక బ్యాంకుల నిరవధిక సమ్మె !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో నిరవధిక సమ్మె చేయడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వటం... సోమవారం నుంచి రెండురోజుల సమ్మె మొదలు కావటం తెలిసిందే. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలూ రాలేదు సరికదా... బ్యాంకుల లాభాలు ఉద్యోగుల జీతాలు పెంచడానికి కాదని, వీటిని వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుంటామని ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు యూనియన్లను మరింత ఎగదోశాయి. దీంతో వచ్చే నెలలో నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) పేర్కొంది. ‘చివరిసారిగా మరోసారి ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలుస్తాం. అప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతాం’ అని ఏఐబీఈఏ సంయుక్త కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ‘సాక్షి’తో చెప్పారు. తదుపరి కార్యాచరణ కోసం ఈనెల 13న సమావేశమవుతామని, ఆ తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఐదేళ్లకోసారి చేసే జీతాల సవరణకు రూ.3,000 కోట్లు అవుతుందని, దానికి ఒప్పుకోకుండా కార్పొరేట్ సంస్థలు చెల్లించకుండా ఎగ్గొట్టిన రుణాలకు లక్షల కోట్లు కేటాయించడం దారుణమన్నారు. గత ఐదేళ్ళలో కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసిన రుణాల విలువ 5 లక్షల కోట్లపైనే ఉందని.. న్యాయ సమ్మతంగా పెంచాల్సిన జీతాలకు మాత్రం డబ్బులు లేవనడం సమంజసం కాదంటూ ఆంధ్రాబ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి ఐ.హరినాథ్ వాపోయారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రభుత్వ బ్యాంకులు కలిసి రూ.1.25 లక్షల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జిస్తే, నికరలాభం రూ.42,000 కోట్లు మాత్రమేనని, మిగిలిన లాభాలన్నీ మొండి బకాయిల ప్రొవిజనింగ్‌కు కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సం వత్సరం 9 నెలల్లో ఆంధ్రాబ్యాంక్‌కు రూ.1,911 కోట్ల స్థూల లాభం వస్తే.. డెక్కన్‌క్రానికల్, ఎంబీఎస్ జ్యూవెలర్స్ వంటి సంస్థల మొండి బకాయిలకు ప్రొవిజనింగ్ కేటాయింపుల వల్ల నికరలాభం రూ.348 కోట్లకు పడిపోయిందని వివరించారు. ఆగిపోయిన లావాదేవీలు రూ.1.68 లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన రెండు రోజుల సమ్మె కారణంగా సోమవారం దేశవ్యాప్తంగా రూ.1.68 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించిపోయాయి. రాష్ట్రంలో కూడా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. సుమారు 4,500 శాఖల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. పలు గ్రామాల్లో నగదు లేక ఏటీఎంలు పనిచేయలేదు. దేశవ్యాప్తంగా 8 లక్షలమంది, రాష్ర్టంలో 75,000 మంది ఆఫీసర్లు సమ్మెలో పాల్గొన్నట్లు రాంబాబు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొన్నట్లు హరినాథ్ చెప్పారు. మంగళవారం కూడా సమ్మె యథాతథంగా కొనసాగుతుందని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. లాభాలన్నీజీతాల పెంపునకే కాదు: చిదంబరం జీతాల సవరణ కోసం బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె చేస్తున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు ఆర్జిస్తున్న లాభాలను పూర్తిగా జీతాల పెంపునకే కేటాయించలేమని, వాటికి ఇతర అవసరాలు కూడా ఉంటాయని చెప్పారు. బ్యాంకుల ఆదాయం, లాభాలను జీతాల పెంపునకు కేటాయించాలేమన్న విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారాయన. బ్యాంకుల లాభాలను వాటాదారులకు డివిడెండ్లు, వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధన అవసరాలను సమకూర్చుకోవడం వంటి అంశాలకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 78వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
మొండి బకాయిల బండ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో పెరుగుతున్న మొండి బకాయిలు బ్యాంకుల మనుగడనే ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. ఆర్థిక మందగమన ప్రభావంతో గత ఐదేళ్ళల్లో బ్యాంకుల్లో మొండి బకాయిలు 400 శాతం పెరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2008 మార్చి నాటికి ప్రభుత్వరంగ, ప్రైవేటు బ్యాంకుల మొండి బకాయిల విలువ రూ.39,030 కోట్లుగా ఉంటే 2013, మార్చినాటికి 397 శాతం పెరిగి రూ.1.94 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈ మొత్తంలో రూ.1.64 లక్షల కోట్లు కేవలం ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచే ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అంతేకాకుండా ఈ మొండి బకాయిల్లో అత్యధిక భాగం కేవలం కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తుల నుంచే ఏర్పడటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల బకాయిల్లో కేవలం 172 కార్పొరేట్ సంస్థలే రూ.68,000 కోట్లు ఎగ్గొట్టగా, అందులో నాలుగు కంపెనీల వాటా రూ.23,000 కోట్లుగా ఉందన్నారు. అదే కోటికిపైగా రుణం ఎగ్గొట్టిన వారి సంఖ్య 7,295కి చేరింది. మొండి బకాయిల బారిన పడిన విషయంలో మన రాష్ట్రానికి చెందిన ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లు కూడా ఏమాత్రం తీసిపోలేదు. 2008లో ఆంధ్రాబ్యాంక్ మొండి బకాయిల విలువ రూ.1,798 కోట్ల నుంచి 2013 మార్చి నాటికి రూ.3,714 కోట్లకు చేరితే, ఎస్బీహెచ్ బకాయిల విలువ రూ.2,007 కోట్ల నుంచి రూ.3,186 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలపై ఆందోళన వాస్తవమే అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటే కానీ ఇవి తగ్గే అవకాశం లేదని పలు దిగ్గజ బ్యాంకుల సీఎండీలే వ్యాఖ్యానిస్తున్నారు. సీడీఆర్ మేడిపండే... ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కార్పొరేట్ మొండి బకాయిలను పునర్ వ్యవస్థీకరించి(సీడీఆర్) పుస్తకాల నుంచి ఎన్పీఏలను తగ్గిస్తున్నా అది ఆశించినంత ఫలితం ఇవ్వడం లేదు. ప్రతి ఐదు సీడీఆర్ ఖాతాల్లో ఒకటి ఎన్పీఏగా మారుతుండటమే దీనికి నిదర్శనం. క్రితం ఏడాది ప్రతి 15 సీడీఆర్ ఖాతాల్లో ఒకటి మాత్రమే మొండి బకాయిగా మారింది. ఈ ఏడాది సీడీఆర్ విలువ రూ. లక్ష కోట్లు దాటుతుందని అంచనా. ప్రజల కళ్ళకు గంతలు కట్టి మాయచేయడానికే ఈ సీడీఆర్ కాని నిజానికి దీంతో ఎలాంటి ప్రయోజనం లేదని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంకోపక్క వసూళ్లు కాని మొండి బకాయిలను పుస్తకాల నుంచే తొలగిస్తున్నాయి. పదమూడేళ్లలో భారత్‌లో బ్యాంకులు రూ. లక్ష కోట్ల విలువైన రుణాలను మాఫీ(ఖాతాల నుంచి తొలగింపు) చేసినట్లు ఇటీవల రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి వెల్లడించారు. ఇందులో బడా కార్పొరేట్ కంపెనీలు తీసుకున్న రుణాల మొత్తమే 95 శాతంగా ఉందని కూడా స్పష్టం చేశారు. లాభాలు హరీ... మొండి బకాయిల కేటాయింపుల(ప్రొవిజనింగ్)తో బ్యాంకుల లాభదాయకతపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. గడచిన ఐదేళ్ళలో బ్యాంకులు ఈ విధంగా రూ.1.40 లక్షల కోట్ల లాభాలను పోగొట్టుకున్నాయి. మొండి బకాయిల వసూళ్ళపై బ్యాంకుల యాజమాన్యాలు అధికంగా దృష్టిసారించడం లేదని, దీనికి రాజకీయ ఒత్తిళ్లు కూడా ఒక కారణంగా మారాయని బ్యాంకు అధికారులే పేర్కొంటున్నారు. డెక్కన్ క్రానికల్ రూ.వేల కోట్లు రుణాలు చెల్లించాల్సి ఉండగా, దీనిపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి పైనుంచి వస్తున్న రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఒక బ్యాంకు అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే బ్యాంకుల యాజమాన్యాలు రికవరీపై దృష్టిపెట్టడమే కాకుండా ఎగ్గొట్టిన వారిపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. -
కార్పొరేట్లకు బ్యాంక్ లెసైన్స్‌లు వద్దు
వడోదర: ప్రైవేట్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వడాన్ని ది ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) వ్యతిరేకిస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వడం దేశ ప్రయోజనాలకు హానికరమని, వాళ్ల స్వప్రయోజనాలకే వీటిని వాడుకుంటారని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సి.హెచ్.వెంకటాచలం పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంకింగ్ సేవలు కూడా ఖరీదవుతాయన్నారు. ప్రభుత్వం కొత్తగా బ్యాంకింగ్ లెసైన్స్‌లు ఇవ్వాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ జరిగిన ఫెడరేషన్ ఆప్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్స్ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1969కు ముందు బ్యాంకులను ప్రైవేట్ వ్యాపార సంస్థలే నిర్వహించేవని, వాటి అస్తవ్యస్త విధానాల కారణంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టపరచాల్సిన అవసరముందని వెంకటాచలం స్పష్టంచేశారు.