ఒక్క ఉద్యోగం కూడా పోదు.. | No job loss due to merger of banks | Sakshi
Sakshi News home page

ఒక్క ఉద్యోగం కూడా పోదు..

Published Mon, Sep 2 2019 5:16 AM | Last Updated on Mon, Sep 2 2019 5:16 AM

No job loss due to merger of banks - Sakshi

నిర్మలా సీతారామన్‌

న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని నేనప్పుడే స్పష్టం చేశాను‘ అని కస్టమ్స్, జీఎస్‌టీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు.

ఏ బ్యాంకు కూడా మూతబడదని, వినూత్నంగా కొత్త ప్రయోగాలేవో చేయాలంటూ బ్యాంకులనేమీ ఒత్తిడి చేయడం లేదన్నారు. ‘బ్యాంకులకు మరింత మూలధనం ఇస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న కార్యకలాపాలే ఇకపైనా చేయాల్సి ఉంటుంది. అంతే‘ అని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. పది బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనాలతో ఉద్యోగాలు పోతాయని, అలహాబాద్‌ బ్యాంకుతో విలీనం కారణంగా ఇండియన్‌ బ్యాంకు మూతబడుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మలా సీతారామన్‌ వీటిపై స్పందించారు. బ్యాంకులు మరింతగా రుణాలివ్వాలని, మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలనే వాటికి అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.  

అన్ని రంగాలూ పరిశీలిస్తున్నాం..
ఎకానమీ మందగమనంలోకి జారుకుంటోందా అన్న ప్రశ్నలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఒక్కో రంగం అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఏ రంగమైనా ప్రభుత్వం వద్దకు వస్తే.. సావధానంగా వింటాం. అవి కోరుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటాం. తగు రీతిలో స్పందిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా చేశామని, అవసరాన్ని బట్టి ఇది పునరావృతమవుతుందని మంత్రి చెప్పారు. సంక్షోభంలో కుదేలవుతున్న ఆటోమొబైల్‌ రంగాన్ని ఉదహరిస్తూ.. ఈ రంగం ప్రస్తుతం బీఎస్‌–6 ప్రమాణాలకు అనుగుణమైన ఇంజిన్లు, ఆటోపరికరాల తయారీకి సంబంధించి పరిణామక్రమంలో ఉందని తెలిపారు.

ఈ ప్రమాణాలు 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2020 మార్చి 31 తర్వాత బీఎస్‌–4 ప్రమాణాల వాహనాలేవీ ఉత్పత్తి చేయొద్దంటూ నిర్దేశించినది..సుప్రీం కోర్టని, ప్రభుత్వం కాదని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇక జీఎస్‌టీ తగ్గించాలన్న ఆటోమొబైల్‌ కంపెనీల విజ్ఞప్తిపై జీఎస్‌టీ మండలే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అన్ని రంగాల సమస్యలనూ ఒక్క దెబ్బతో పరిష్కరించేసే మంత్రదండమేదీ లేదని, రంగాలవారీగా ఆయా సంస్థల విజ్ఞప్తులను బట్టే ప్రభుత్వం స్పందిస్తోందని వివరించారు. ‘ఆటోమొబైల్‌ రంగం సమస్యలు వేరు.. వ్యవసాయ రంగం సమస్యలు వేరు. ఇలా ఒక్కో రంగం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు.  

5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి ఊతం ..
పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడమనేది.. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ చెప్పారు. ‘తదుపరి దశ వృద్ధి సాధన కోసం దేశానికి పెద్ద బ్యాంకులు కావాలి. శుక్రవారం చేసిన మెగా బ్యాంకుల ప్రకటన ఆ లక్ష్య సాధన కోసమే. భారీ స్థాయిలో మూలధనం, వ్యాపార పరిమాణం, అధిక వృద్ధి సాధనకు తోడ్పడే భారీ బ్యాంకులు ఇప్పుడు మనకు ఆరు ఉన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు.

బ్యాంకింగ్‌ రంగం ఈ బ్యాంకుల విస్తృతి మరింత పెరుగుతుందని, రుణ వితరణ సామర్ధ్యం మెరుగుపడుతుందని, వినూత్న సాధనాలు ..టెక్నాలజీతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించగలవని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. పెద్ద బ్యాంకుల అవసరాలకన్నా 0.25 శాతం అధికంగానే ప్రభుత్వం మూలధనం సమకూర్చిందని పేర్కొన్నారు. ‘ఆయా బ్యాంకుల బోర్డుల సన్నద్ధతపైనే విలీన తేదీ ఆధారపడి ఉంటుంది. అది జనవరి 1న కావచ్చు.. లేదా ఏప్రిల్‌ 1న కావొచ్చు. ఏదైనా గానీ ఏప్రిల్‌ 1 లోగానే ఇది జరుగుతుంది‘ అని రాజీవ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement