merger of banks
-
అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం
న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద సంఖ్యలతో ప్రజలకు ఆర్థిక సేవలు, మెరుగైన పథకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. కేంద్రం గతేడాది ఏకంగా 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేసే ప్రతిపాదన ప్రకటించిన సంగతి తెలిసిందే. విలీనాల కారణంగా 2017లో 27గా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గనుంది. 2017 ఏప్రిల్‌లో అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2019లో విజయా బ్యాంకు, దేనా బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ)లో విలీనం చేశారు. ఎల్ఐసీ లిస్టింగ్‌తో పారదర్శకత .. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ లిస్టింగ్ చేయడం ద్వారా సంస్థలో మరింత పారదర్శకత పెరగగలదని ఠాకూర్ చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రతిపాదన చేశారు. ఎల్ఐసీలో కొన్ని వాటాలతో పాటు ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 90,000 కోట్ల దాకా సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. ప్రభుత్వానికి ప్రస్తుతం ఎల్ఐసీలో 100 శాతం, ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాలు ఉన్నాయి. అటు రుణ పునర్వ్యవస్థీకరణ వెసులుబాటుతో గతేడాది దాదాపు అయిదు లక్షల లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ప్రయోజనం చేకూరిందని ఠాకూర్ చెప్పారు. తాజాగా రుణ పునర్వ్యవస్థీకరణ వ్యవధిని వచ్చే ఏడాది మార్చి 31 దాకా పొడిగిస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. -
నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
న్యూఢిల్లీ/కోల్‌కతా: బ్యాంక్‌ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్‌ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ)లు బ్యాంక్ యూనియన్లు జాతీయ స్థాయిలో 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే బ్యాంక్ ఆఫీసర్లు, ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు, ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు, సహకార బ్యాంక్‌లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. బ్యాంక్‌ల విలీనం వీటిపై ఎలాంటి ప్రభావం చూపనందున ఇవి ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మె కొనసాగుతుంది.... ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీ.హెచ్. వెంకటాచలమ్ పేర్కొన్నారు. అందుకని సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మె పరిధిలోనే ఉన్నందున ఏటీఎమ్‌లను కూడా మూసేస్తామని బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కొన్ని బ్యాంక్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్‌కు ఇవ్వడం, బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని ఈ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తగిన స్థాయిల్లో బ్యాంక్ క్లర్క్‌లను నియమించాలని, భారీగా పేరుకుపోతున్న మొండి బకాయిల రికవరీకి గట్టి చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభావం స్వల్పమే !.. పలు బ్యాంక్‌లు ఇప్పటికే సమ్మె విషయమై తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ సంఘాల్లో తమ ఉద్యోగుల సభ్యత్వం తక్కువగా ఉందని, ఈ సమ్మె ప్రభావం బ్యాంక్ కార్యకలాపాలపై స్వల్పంగానే ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. సమ్మె కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ పేర్కొంది. అయితే సమ్మె జరిగితే, కార్యకలాపాలపై ప్రభావం ఉండగలదని వివరించింది. గత నెలలో 26, 27 తేదీల్లో బ్యాంక్‌ల సమ్మెకు ఆఫీసర్ల యూనియన్లు పిలుపునిచ్చాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ యూనియన్లు సమ్మెను విరమించాయి. -
ఒక్క ఉద్యోగం కూడా పోదు..
న్యూఢిల్లీ: బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయన్న ఉద్యోగ సంఘాల వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. విలీనాలతో ఏ ఒక్క ఉద్యోగం కూడా పోదని స్పష్టం చేశారు. ‘ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమే. గత శుక్రవారం ఏం చెప్పానో బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండబోదని నేనప్పుడే స్పష్టం చేశాను‘ అని కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖ అధికారుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ఏ బ్యాంకు కూడా మూతబడదని, వినూత్నంగా కొత్త ప్రయోగాలేవో చేయాలంటూ బ్యాంకులనేమీ ఒత్తిడి చేయడం లేదన్నారు. ‘బ్యాంకులకు మరింత మూలధనం ఇస్తున్నాం. ఇప్పటిదాకా చేస్తున్న కార్యకలాపాలే ఇకపైనా చేయాల్సి ఉంటుంది. అంతే‘ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పది బ్యాంకులను నాలుగింటిగా విలీనం చేస్తూ కేంద్రం శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విలీనాలతో ఉద్యోగాలు పోతాయని, అలహాబాద్ బ్యాంకుతో విలీనం కారణంగా ఇండియన్ బ్యాంకు మూతబడుతుందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మలా సీతారామన్ వీటిపై స్పందించారు. బ్యాంకులు మరింతగా రుణాలివ్వాలని, మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలనే వాటికి అదనపు మూలధనాన్ని సమకూరుస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని రంగాలూ పరిశీలిస్తున్నాం.. ఎకానమీ మందగమనంలోకి జారుకుంటోందా అన్న ప్రశ్నలపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఒక్కో రంగం అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఏ రంగమైనా ప్రభుత్వం వద్దకు వస్తే.. సావధానంగా వింటాం. అవి కోరుకునే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుంటాం. తగు రీతిలో స్పందిస్తాం‘ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే రెండు సార్లు ఇలా చేశామని, అవసరాన్ని బట్టి ఇది పునరావృతమవుతుందని మంత్రి చెప్పారు. సంక్షోభంలో కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగాన్ని ఉదహరిస్తూ.. ఈ రంగం ప్రస్తుతం బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణమైన ఇంజిన్లు, ఆటోపరికరాల తయారీకి సంబంధించి పరిణామక్రమంలో ఉందని తెలిపారు. ఈ ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 2020 మార్చి 31 తర్వాత బీఎస్–4 ప్రమాణాల వాహనాలేవీ ఉత్పత్తి చేయొద్దంటూ నిర్దేశించినది..సుప్రీం కోర్టని, ప్రభుత్వం కాదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక జీఎస్టీ తగ్గించాలన్న ఆటోమొబైల్ కంపెనీల విజ్ఞప్తిపై జీఎస్టీ మండలే నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అన్ని రంగాల సమస్యలనూ ఒక్క దెబ్బతో పరిష్కరించేసే మంత్రదండమేదీ లేదని, రంగాలవారీగా ఆయా సంస్థల విజ్ఞప్తులను బట్టే ప్రభుత్వం స్పందిస్తోందని వివరించారు. ‘ఆటోమొబైల్ రంగం సమస్యలు వేరు.. వ్యవసాయ రంగం సమస్యలు వేరు. ఇలా ఒక్కో రంగం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి. దానికి తగ్గట్లే స్పందన ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఊతం .. పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు మెగా బ్యాంకులుగా విలీనం చేయడమనేది.. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ‘తదుపరి దశ వృద్ధి సాధన కోసం దేశానికి పెద్ద బ్యాంకులు కావాలి. శుక్రవారం చేసిన మెగా బ్యాంకుల ప్రకటన ఆ లక్ష్య సాధన కోసమే. భారీ స్థాయిలో మూలధనం, వ్యాపార పరిమాణం, అధిక వృద్ధి సాధనకు తోడ్పడే భారీ బ్యాంకులు ఇప్పుడు మనకు ఆరు ఉన్నాయి‘ అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ బ్యాంకుల విస్తృతి మరింత పెరుగుతుందని, రుణ వితరణ సామర్ధ్యం మెరుగుపడుతుందని, వినూత్న సాధనాలు ..టెక్నాలజీతో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించగలవని రాజీవ్ కుమార్ తెలిపారు. పెద్ద బ్యాంకుల అవసరాలకన్నా 0.25 శాతం అధికంగానే ప్రభుత్వం మూలధనం సమకూర్చిందని పేర్కొన్నారు. ‘ఆయా బ్యాంకుల బోర్డుల సన్నద్ధతపైనే విలీన తేదీ ఆధారపడి ఉంటుంది. అది జనవరి 1న కావచ్చు.. లేదా ఏప్రిల్ 1న కావొచ్చు. ఏదైనా గానీ ఏప్రిల్ 1 లోగానే ఇది జరుగుతుంది‘ అని రాజీవ్ తెలిపారు. -
ఒక్క ఉద్యోగినీ తొలగించం..
చెన్నై : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయనే భయం అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోరని చెప్పారు. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12 పటిష్ట బ్యాంకులుగా మారుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లడంతో పాటు బ్యాంకుల మూసివేతకు ఇది దారితీస్తుందని బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు ఎసరు వస్తుందన్న వాదన అర్ధరహితమని నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. బ్యాంకుల విలీనంపై తాను శుక్రవారం ప్రకటన చేసిన సందర్భంగా ఏ ఒక్క బ్యాంకు ఉద్యోగినీ విధుల నుంచి తొలగించబోమని విస్పష్టంగా పేర్కొన్న విషయం గమనించాలని ఆమె పేర్కొన్నారు. పలు పాలనా సంస్కరణల ఊతంతో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మలిచేందుకు పీఎస్‌యూ బ్యాంకుల విలీనం ద్వారా మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. -
ఆ బ్యాంక్‌ల గవర్నెన్స్ మెరుగుపడుతుంది..
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదన ఆయా బ్యాంకులకు సానుకూల అంశమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. దీనితో వాటి గవర్నెన్స్, సమర్ధత మెరుగుపడగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గ్రూప్) అల్కా అన్బరసు తెలిపారు. విలీన బ్యాంక్‌కు రుణాల పరంగా 6.8 శాతం మార్కెట్ వాటా ఉంటుందని, తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో మూడో అతి పెద్ద బ్యాంక్‌గా మారగలదని వివరించారు. కొత్త సంస్థకు ప్రభుత్వం నుంచి మూలధనపరమైన తోడ్పాటు తప్పనిసరిగా అవసరమవుతుందని అమె తెలిపారు. అసెట్ క్వాలిటీ, మూలధనం, లాభదాయకత తదితర విషయాల్లో దేనా బ్యాంక్‌తో పోలిస్తే బీవోబీ, విజయా బ్యాంక్‌లు మెరుగ్గా ఉన్నాయని వివరించారు. రుణ వృద్ధికి, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే దిశగా ప్రభుత్వ రంగంలోని ఈ మూడు బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తర్వాత దాదాపు రూ. 14.82 లక్షల కోట్ల వ్యాపారంతో .. ఈ విలీన సంస్థ దేశీయంగా మూడో అతి పెద్ద బ్యాంక్‌గా నిలవనుంది. ఏప్రిల్ 1 నుంచి ఏర్పాటు.. విలీనానంతరం ఏర్పాటయ్యే కొత్త సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిర్దేశిత గడువులోగా విలీనంపై మూడు బ్యాంకులు కసరత్తు చేయాల్సి ఉంటుందని, 2018–19 ఆఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తికావొచ్చని వివరించాయి. మొత్తం మీద 2019 ఏప్రిల్ 1 నుంచి విలీన సంస్థ కార్యకలాపాలు ప్రారంభించవచ్చని పేర్కొన్నాయి. మూడు బ్యాంకుల బోర్డులు ఈ నెలలోనే సమావేశం కానున్నాయని, ఆ తర్వాత విలీన సీక్మ్ రూపకల్పన జరుగుతుందని సంబంధిత వర్గాలు వివరించాయి. షేర్ల మార్పిడి నిష్పత్తి, ప్రమోటర్ నుంచి అవసరమయ్యే మూలధనం తదితర వివరాలన్నీ ఇందులో ఉండనున్నాయి. యూనియన్ల వ్యతిరేకత..: కాగా, మూడు బ్యాంకుల విలీన ప్రతిపాదనను బ్యాంక్ ఉద్యోగుల యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకించాయి. బడా కార్పొరేట్ల మొండిబాకీలు, వాటి రికవరీ పైనుంచి దృష్టి మళ్లించేందుకే దీన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించాయి. విలీనాలతోనే బ్యాంకులు పటిష్టంగా, సమర్ధంగా మారతాయనడానికి నిదర్శనాలేమీ లేవని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వ్యాఖ్యానించారు. ఎస్బీఐలో మిగతా అనుబంధ బ్యాంకులను విలీనం చేయడం వల్ల అద్భుతాలేమీ జరిగిపోలేదని పేర్కొన్నారు. పైపెచ్చు ప్రతికూలతలూ ఏర్పడ్డాయన్నారు. ఎస్బీఐ 200 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా నష్టాలు ప్రకటించిందన్నారు. మరోవైపు బ్యాంకుల విలీనంతో ప్రయోజనం, వాటి ఉద్యోగుల భవిష్యత్ ఏమిటన్న దానిపై స్పష్టత లేదని నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ వైస్ ప్రెసిడెంట్ అశ్విని రాణా వ్యాఖ్యానించారు. -
ప్రభుత్వ బ్యాంకుల్లో మరో విలీనం?
♦ బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి దక్షిణాది బ్యాంకులు ♦ దేనా బ్యాంకు మాత్రం వేరొక బ్యాంకులోకి ♦ ఆర్థిక శాఖ అధ్యయనం; మార్చిలోగా నిర్ణయం! న్యూఢిల్లీ: ఎస్బీఐలో ఐదు బ్యాంకుల విలీనం సంపూర్ణం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మరో విడత ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో బలమైన, అతిపెద్ద బ్యాంకులుండాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో విలీన ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. 3–4 బ్యాంకుల్ని స్థిరకరించే ప్రతిపాదనలపై అధ్యయనం చేస్తోంది. జూన్ 12న ఇందుకు సంబంధించి ఓ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది. స్థిరీకరణకు సంబంధించిన ప్రతిపాదనలను సెప్టెంబర్ నాటికి ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పిస్తామని, వచ్చే జనవరి–మార్చి నాటికి ఇది పూర్తి కావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. నీతిఅయోగ్ రోడ్‌మ్యాప్..: భారీ స్థాయి బ్యాంకుల ఏర్పాటు దిశగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో రెండో దశ స్థిరీకరణకున్న అవకాశాలను పరిశీలించి అభిప్రాయాలు చెప్పాలని నీతి ఆయోగ్, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థలను కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే కోరింది. భవిష్యత్తులో ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి సంబంధించి నీతి ఆయోగ్ ఓ రోడ్‌మ్యాప్‌ను తీసుకురానుంది. పెద్ద బ్యాంకుల్లో విలీనానికి అనువైన చిన్న బ్యాంకులను గుర్తించే పనిని కూడా ఆర్థికశాఖ ప్రారంభించింది. అయితే బలహీన బ్యాంకుల్ని, బలమైన బ్యాంకుల్లో విలీనం చేయడం జరగదని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దక్షిణాదిన టర్న్ అరౌండ్ అయిన బ్యాంకులను బ్యాంకు ఆఫ్ బరోడాలో... దేనా బ్యాంకును దక్షిణాదికే చెందిన మరో బ్యాంకులో విలీనం చేయడానికి అవకాశాలున్నాయని తెలిపారు. అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకులు ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐలో కలిసిపోయిన విషయం తెలిసిందే.