చెన్నై : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయనే భయం అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోరని చెప్పారు. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12 పటిష్ట బ్యాంకులుగా మారుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లడంతో పాటు బ్యాంకుల మూసివేతకు ఇది దారితీస్తుందని బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు ఎసరు వస్తుందన్న వాదన అర్ధరహితమని నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. బ్యాంకుల విలీనంపై తాను శుక్రవారం ప్రకటన చేసిన సందర్భంగా ఏ ఒక్క బ్యాంకు ఉద్యోగినీ విధుల నుంచి తొలగించబోమని విస్పష్టంగా పేర్కొన్న విషయం గమనించాలని ఆమె పేర్కొన్నారు. పలు పాలనా సంస్కరణల ఊతంతో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మలిచేందుకు పీఎస్‌యూ బ్యాంకుల విలీనం ద్వారా మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment