psu banks
-
తుక్కు విక్రయంతో రూ.4.5 కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), ఆర్థిక సంస్థలు తుక్కు విక్రయం ద్వారా రూ.4.5 కోట్లు సమకూర్చుకున్నాయి. అక్టోబర్ 2–31 తేదీల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ స్వచ్ఛత కార్యక్రమాన్ని (ప్రత్యేక ప్రచారం 4.0) చేపట్టింది.కస్టమర్ అనుకూల చర్యలు, వసతిని మెరుగ్గా వినియోగించుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, తుక్కును వదిలించుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలతోపాటు, నాబార్డ్, సిడ్బీ, ఎగ్జి మ్ బ్యాంక్, ఎన్‌హెచ్‌బీ, ఐఐఎఫ్‌సీఎల్ ఇందులో పాల్గొన్నాయి.వ్యర్థాలను వదిలించుకోవడం ద్వారా 11.79 లక్షల చదరపు అడుగుల వసతి అదనంగా వినియోగంలోకి వచ్చిందని, రూ.4.50 కోట్లు సమకూరాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. ప్రజల ఫిర్యాదులు, అప్పీళ్లు పరిష్కరించినట్టు, ప్రధానమంత్రి కార్యాలయం, ఎంపీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది. -
లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకుల జోరు
న్యూఢిల్లీ: కొంతకాలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభదాయకత భారీగా మెరుగుపడింది. దీంతో గత ఆర్థిక సంవత్సరం(2022–23)లో మొత్తం పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభాలు రూ. లక్ష కోట్ల మార్క్‌ను తాకాయి. దీనిలో ఒక్క ఎస్బీఐ వాటానే రూ. 50,000 కోట్లు కావడం గమనార్హం! 2017–18లో పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నికర నష్టాలు ప్రకటించాక టర్న్అరౌండ్ బాట పట్టాయి. దీనిలో భాగంగా గతేడాదికల్లా రూ. 1,04,649 కోట్ల లాభాలు సాధించాయి. 2021–22తో పోలిస్తే మొత్తం 12 పీఎస్‌బీల నికర లాభం 57 శాతం వృద్ధి చూపింది. రూ. 66,540 కోట్లకు చేరింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 126 శాతం పురోగతి సాధించి రూ. 2,602 కోట్లు ఆర్జించింది. ఈ బాటలో యుకో బ్యాంక్ లాభం రెట్టింపై రూ. 1,862 కోట్లను తాకింది. బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) 94 శాతం వృద్ధితో రూ. 14,110 కోట్లు సాధించగా.. నంబర్ వన్ దిగ్గజం ఎస్బీఐ 59 శాతం అధికంగా రూ. 50,232 కోట్లు ఆర్జించింది. కెనరా బ్యాంకు రూ. 10,604 కోట్లు అందుకుంది. కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మినహా ఇతర పీఎస్‌బీలు ఆకర్షణీయ స్థాయిలో లాభాలు ప్రకటించాయి. పీఎన్బీ నికర లాభం 27 శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది. -
మాఫీ చేసిన రుణ వసూళ్లు పెంచుకోవాలి: బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచన
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు మాఫీ చేసిన (ఖాతాల్లో రద్దు) మొండి రుణాల (ఎన్పీఏలు)ల వసూళ్ల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచన చేసింది. వీటి వసూళ్ల రేటు తక్కువగా ఉండడంతో కనీసం 40 శాతానికి అయినా పెంచుకోవాలని కోరింది. 2022 మార్చి నాటికి ఐదేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) రూ.7.34 లక్షల కోట్లను ఖాతాల్లో మాఫీ చేశాయి. ఇందులో 14 శాతాన్నే అవి వసూలు చేసుకోగలిగాయి. మాఫీ చేసినప్పటికీ వాటిని వసూలు చేసుకునే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. 2022 మార్చి నాటికి మాఫీ చేసిన రూ.7.34 లక్షల కోట్లలో రూ.1.03 లక్షల కోట్లనే వసూలు చేశాయి. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు దీంతో 2022 మార్చి నాటికి నికరంగా మాఫీ చేసిన ఎన్పీఏల మొత్తం రూ.6.31 లక్షల కోట్లుగా ఉంది. ఈ విధమైన వసూళ్లు ఆమోదయోగ్యం కాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇలా వసూలయ్యే మొత్తం బ్యాంకుల నికర లాభాలను పెంచుతుందని పేర్కొన్నాయి. ఈ పరిస్థితిపై సమీక్ష చేయడానికి వీలుగా కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ త్వరలోనే పీఎస్బీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పాయి. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మాఫీ చేసిన రుణాల మొత్తం రూ.11.17 లక్షల కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: బ్యాంకింగ్‌లోకి బడా కార్పొరేట్లను అనుమతించొద్దు -
మనకన్ని ప్రభుత్వ బ్యాంకులు ఎందుకండి: ఎస్బీఐ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశీయంగా పటిష్టమైన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొన్ని ఉన్నా సరిపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య అభిప్రాయపడ్డారు. చిన్నా చితకా పీఎస్‌బీలను విలీనమో లేదా ప్రైవేటీకరించడమో చేయొచ్చని తెలిపారు. అయితే, అలాగని వాటి సమస్యలకు ప్రైవేటీకరణ ఒక్కటే మందు కాదని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రైవేటీకరణ ద్వారా ఏ లక్ష్యాలను ఆశిస్తున్నారో వాటిని సాధించగలిగేలా పీఎస్బీలకు సాధికారత ఇవ్వాలని, సమాన స్థాయిలో అవకాశాలు కల్పించాలని భట్టాచార్య చెప్పారు. అన్ని పీఎస్‌బీల ప్రైవేటీకరణకు ప్రభుత్వం 10 ఏళ్ల మార్గదర్శ ప్రణాళిక రూపొందించుకోవాలంటూ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఇటీవల సూచించిన నేపథ్యంలో భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఇన్ని పీఎస్‌బీల అవసరం ఉందని నేను కూడా అనుకోను. వాటి సంఖ్యను తగ్గించుకోవచ్చు. కొన్నింటిని ప్రైవేటీకరించవచ్చు. పటిష్టమైన వాటిని అలాగే కొనసాగించవచ్చు. కానీ అన్ని సమస్యలకూ ప్రైవేటీకరణ ఒక్కటే మాత్రం పరిష్కారమార్గం కాబోదు‘ అని ప్రస్తుతం సేల్స్‌ఫోర్స్ ఇండియా సంస్థ చైర్‌పర్సన్‌గా ఉన్న భట్టాచార్య చెప్పారు. 2020లో 10 పీఎస్‌బీలను విలీనం చేయడంతో నాలుగు పెద్ద బ్యాంకులు ఏర్పడ్డాయి. దీనితో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కి తగ్గింది. డిజిటల్ బ్యాంకులు అనివార్యం.. మరోవైపు, కొత్తగా వస్తున్న డిజిటల్ బ్యాంకులపై స్పందిస్తూ కస్టమర్లు కోరుకుంటున్న పక్షంలో వాటిని ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదని ఆమె అభిప్రాయపడ్డారు. డిజిటల్ బ్యాంకులతో రిస్కులు ఉన్నప్పటికీ .. మార్పు అనివార్యమని, వాటిని కొన్నాళ్ల పాటు ఆపగలిగినా పూర్తిగా ఆపలేమని చెప్పారు. ఈ తరహా బ్యాంకు లైసెన్సు కోసం 2010లోనే తాను ఆర్బీఐని సంప్రదించానని, కానీ అలాంటి ప్రతిపాదనేదీ లేదంటూ అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ చెప్పిందని గుర్తు చేసుకున్నారు. ఆర్బీఐ ప్రతిపాదిత డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడుతూ ఇది చాలా కీలకమైన ముందడుగు కాగలదని భట్టాచార్య చెప్పారు. వినియోగించే వారిలో భరోసా కలిగించగలిగేలా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ఉండగలదని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
మార్కెట్లు ఫ్లాట్- ప్రభుత్వ బ్యాంక్స్ స్పీడ్
ముంబై, సాక్షి: స్వల్ప ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్)గా ముగిశాయి. సెన్సెక్స్ స్వల్పంగా 15 పాయింట్లు బలపడి 44,633 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 20 పాయింట్లు పుంజుకుని 13,134 వద్ద స్థిరపడింది. యూకే ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్‌ను అనుమతించడం, క్యూ3(అక్టోబర్- డిసెంబర్)లో జీడీపీ పుంజుకోనుందన్న అంచనాలతో మార్కెట్లు తొలుత దూకుడు చూపాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 44,953 వద్ద గరిష్టాన్ని తాకింది. వెరసి 45,000 పాయింట్ల మైలురాయికి చేరువైంది. ఈ బాటలో నిఫ్టీ సైతం 13,217 పాయింట్ల వరకూ ఎగసింది. ఇవి సరికొత్త గరిష్టాలుకావడం విశేషం! ఎస్బీఐ కార్డ్స్ జోరు ఆన్లైన్ సేవలలో అంతరాయం కారణంగా డిజిటల్, క్రెడిట్ కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేయమని ఆర్బీఐ ఆదేశించడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2 శాతం నీరసించింది. అయితే ఎస్బీఐ కార్డ్స్ షేరు 5.5 శాతం జంప్‌చేసింది. కాగా.. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ రంగ బ్యాంక్స్ దాదాపు 5 శాతం జంప్‌చేశాయి. మెటల్, మీడియా, ఆటో సైతం 3-1.7 శాతం మధ్య ఎగశాయి. మరోవైపు ఐటీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో మారుతీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, హిందాల్కో, ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ 7.3-2.6 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ, ఎయిర్టెల్, యాక్సిస్, అల్ట్రాటెక్ 2-0.8 శాతం మధ్య డీలా పడ్డాయి. చదవండి: (టాటా కెమికల్స్- ఆర్‌క్యాపిటల్ జోరు) బీవోబీ జూమ్ డెరివేటివ్ కౌంటర్లలో బీవోబీ, టాటా కెమ్, ఇన్ఫ్రాటెల్, పీఎన్బీ, సెయిల్, పిరమల్, భారత్ ఫోర్జ్, పీఎఫ్సీ, ఎల్అండ్టీ ఫైనాన్స్ 8-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క ఐసీఐసీఐ లంబార్డ్, బాష్, అదానీ ఎంటర్, బాలకృష్ణ, ఎంఆర్ఎఫ్ 3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.8-0.7 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,987 లాభపడగా.. 929 మాత్రమే నష్టాలతో ముగిశాయి. చదవండి: (పసిడి, వెండి ధరల మెరుపులు) ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్మెంట్స్ నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 3,242 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. అయితే డీఐఐలు రూ. 1,043 కోట్లకుపైగా విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. -
ప్రభుత్వ బ్యాంకుల జోష్- మార్కెట్లు వీక్
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష, విదేశీ మార్కెట్ల బలహీన సంకేతాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు కన్సాలిడేషన్ బాట పట్టాయి. హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 156 పాయింట్లు క్షీణించి 38,337ను తాకగా.. నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 11,273 వద్ద ట్రేడవుతోంది. ముందురోజు భారీగా ఎగసిన మార్కెట్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గురువారం ఎఫ్‌అండ్‌వో ముగింపు సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. కాగా.. నేడు ప్రధాన బ్యాంకర్లతో ప్రధాని మోడీ సమావేశంకానున్నారు. దీంతో పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లకు డిమాండ్ కనిపిస్తోంది. వెరసి ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3 శాతం ఎగసింది. ఫార్మా, మెటల్ సైతం ఎన్ఎస్ఈలో ఇతర రంగాలలో ఫార్మా, మెటల్, రియల్టీ, మీడియా 2-1 శాతం మధ్య పుంజుకోగా.. ఐటీ 1 శాతం, ఆటో 0.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ కౌంటర్లలో యుకో, సెంట్రల్, జేఅండ్‌కే, మహారాష్ట్ర బ్యాంక్ 7-5 శాతం మధ్య జంప్‌చేశాయి. ఈ బాటలో బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, యూనియన్, ఇండియన్ బ్యాంకులతోపాటు బీవోబీ, ఎస్బీఐ, ఐవోబీ, కెనరా బ్యాంక్ 4-2 శాతం మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ ఇలా నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్ఇండ్, టాటా స్టీల్, ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్, ఎల్అండ్టీ, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, గెయిల్ 5-2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే నెస్లే, హెచ్‌సీఎల్ టెక్, ఆర్ఐఎల్, టీసీఎస్, మారుతీ, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హీరో మోటో 2.5-0.6 శాతం మధ్య నష్టపోయాయి. -
ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో కంపెనీలు ఉద్యోగులపై వేటు, జీతాల కోతలతో చుక్కలు చూపుతుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే 9 లక్షల మంది ఉద్యోగులకు తీపికబురు అందింది. పీఎస్‌యూ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనపెంపుతో పాటు పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను నాలుగు శాతం పెంచేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), ఉద్యోగ సంఘాల మధ్య అంగీకారం కుదిరింది. వేతనాలు, పెన్షన్ కంట్రిబ్యూషన్ పెంపుతో ఈ ఉద్యోగుల వార్షిక వేతన బిల్లు రూ 7900 కోట్ల మేర పెరగనుంది. వేతన పెంపు నవంబర్ 2017 నుంచి వర్తించనుంది. కాగా, గతంలో ఈ ఉద్యోగుల బేసిక్ వేతనంలో 10 శాతం, డీఏ రిటైర్మెంట్ ప్రయోజనాల్లో కలుస్తుండగా, తాజా వేతన సవరణతో 14 శాతం బేసిక్, డీఏలు పెన్షన్ మొత్తానికి జమవుతాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఉద్యోగులకు వేతన పెంపుతో పాటు 5 శాతం అంతకుమించి నిర్వహణా లాభాలు ఆర్జించిన బ్యాంకుల ఉద్యోగులకు ఇన్సెంటివ్‌లు అందుకోనున్నారు. చదవండి : ఉద్యోగుల పదవీ విరమణ @ 60 -
ఆదిత్యకు రూ.19 కోట్లు- రజనీష్‌కు రూ.0.3 కోట్లు
మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో ప్రయివేట్, పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజాల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు అందుకున్న వేతనాలలో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎండీ ఆదిత్య పురీ గతేడాది రూ. 18.9 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. అయితే మరోపక్క ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల వేతనాన్ని పొందారు. ఈ వివరాలను ఓవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మరోపక్క ఎస్బీఐ విడుదల చేసిన వార్షిక నివేదికలు పేర్కొన్నాయి. వివరాలు చూద్దాం.. 38 శాతం ప్లస్ గతేడాది ఆదిత్య పురీ రూ. 18.9 కోట్ల జీతాన్ని అందుకున్నారు. ఇది అంతక్రితం ఏడాది(2018-19) అందుకున్న రూ. 13.7 కోట్ల రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇది 38 శాతం అధికం. వీటిలో రూ. 2.1 కోట్లమేర బోనస్‌లు తదితరాలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి. ఇవి కాకుండా కొన్నేళ్లుగా పొందుతూ వచ్చిన స్టాక్ ఆప్షన్లను విక్రయించడం ద్వారా గతేడాది రూ. 161 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.బారుచా 2020లో రూ. 8.6 కోట్ల వేతనాన్ని పొందారు. బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం ఇది 2019తో పోలిస్తే 48 శాతం వృద్ధి. వేతనంలో రూ. 80 లక్షల పెర్క్‌లు కలసి ఉన్నట్లు తెలుస్తోంది. బారుచా సైతం కొన్నేళ్లుగా అందుకున్న స్టాక్ ఆప్షన్లను వినియోగించుకోవడం ద్వారా రూ. 31.6 కోట్లు సముపార్జించినట్లు తెలుస్తోంది. వెరసి గతేడాదిలో ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు వేతన రూపంలో బ్యాంక్ రూ. 27.5 కోట్లు చెల్లించింది. కాగా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్వతంత్ర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ శ్యామలా గోపీనాథ్ రూ. 64 లక్షలు అందుకున్నారు. సిటింగ్ ఫీజు కింద లభించిన రూ. 29 లక్షలు దీనిలో కలసి ఉంది. ఎస్బీఐ ఇలా పీఎస్‌యూ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ గతేడాది రూ. 31.2 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నారు. బేసిక్ శాలరీ రూ. 27 లక్షలతోపాటు.. డీఏగా రూ. 4.2 లక్షలు జమ అయినట్లు బ్యాంక్ వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ గుప్తా రూ. 41.3 లక్షలు సంపాదించారు. దీనిలో లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద పొందిన రూ. 11 లక్షలు కలసి ఉన్నాయి. మరో ఇద్దరు ఎస్బీఐ ఎండీలలో దినేష్ కుమార్ ఖారా రూ. 29.4 లక్షలు, ఆర్జిత్ బసు రూ. 28.5 లక్షలు చొప్పున జీతాలు అందుకున్నారు. అయితే పలు కారణాలరీత్యా ప్రయివేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల వేతనాలను పోల్చతగదని బ్యాంకింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇది బ్యాంకింగ్ రంగంలోనేకాకుండా పలు ఇతర పరిశ్రమలలోనూ సాధారణంగా కనిపిస్తుందని తెలియజేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఇంతక్రితం 2016 ఆగస్ట్‌లో ఆర్బీఐసహా ప్రభుత్వ రంగంలోని సంస్థలలో జీతాలు అంతర్జాతీయ ప్రమాణాలకంటే తక్కువగా ఉన్నట్లు అభిప్రాయపడిన విషయాన్ని ఈ సందర్భంగా విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు -
నష్టాల మార్కెట్లోనూ రాణిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు
నష్టాల మార్కెట్ ట్రేడింగ్‌లోనూ గురువారం ఉదయం ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ దాదాపు 2.50శాతం వరకు లాభపడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్లో ప్రకటించిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) ప్రైవేటీకరణకు కేంద్రం పనులు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా నీతి ఆయోగ్ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఎంపిక చేసిన బృందం విలీన ప్రతిపాదనపై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బ్యాంకుల విలీన వార్తలు తెరపైకి రావడంతో మార్కెట్ ప్రారంభం నుంచే ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఒక దశలో 2.50శాతం లాభపడి 1316.05 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు ఇండెక్స్ మునుపటి ముగింపుతో పోలిస్తే 1శాతం లాభంతో 1316.05 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ పీఎస్‌యూ రంగానికి చెందిన పంజాజ్‌సింధ్ బ్యాంక్ షేరు 9.50శాతల లాభపడింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 8.50శాతం పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియా బ్యాంక్ , సెంట్రల్‌బ్యాంక్, యూనియన్ బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 1శాతం నుంచి అరశాతం లాభపడ్డాయి. జమ్మూ&కాశ్మీర్, ఎస్బీఐ షేర్లు అరశాతం నష్టపోయాయి. -
అన్ని ప్రభుత్వ బ్యాంకుల కంటే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెట్టింపు
స్టాక్ ఎక్చ్సేంజీల్లో లిస్టైన మొత్తం 13 ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రెండింతలుగా ఉంది. శుక్రవారం మార్కెట్ ముగింపు ఆధారంగా మార్కెట్ క్యాప్ విలువను పరిశీలిస్తే... హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.4.6లక్షల కోట్లుగా ఉంది. మరోవైపు 13 ప్రభుత్వరంగ బ్యాంకుల మొత్తం మార్కెట్ క్యాప్‌ను లెక్కిస్తే రూ.2.55లక్షల కోట్లుగా ఉంది. రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు... వాటి ప్రత్యర్థి ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్ వాటాను ఆక్రమిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, లాక్డౌన్ తరువాత ప్రైవేటు రంగ బ్యాంకులతో పోలిస్తే పీఎస్‌యూ బ్యాంకుల లోన్ బుక్స్ మరింత వేగంగా క్షీణించే అవకాశం ఉందని వారు అంటున్నారు. ‘‘ప్రభుత్వ రంగ బ్యాంకులు నిరర్ధక ఆస్తుల పెరుగుదల భారాన్ని భరిస్తున్నాయి. ఈ రంగ బ్యాంకులు మొత్తం ఎన్‌పీఏల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా విభాగానికి ఎక్కువ ఎక్స్పోజర్ కలిగి ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే వివిధ క్రెడిట్ గ్యారెంటీ పథకాలలో పీఎస్‌యూ బ్యాంకుల భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకుడు కాజల్ గాంధీ పేర్కోన్నారు. అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కె్ట్ క్యాప్ భారీగా క్షీణించగా.., శుక్రవారం మార్కెట్ ముగింపు సమయానికి ఎస్బీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.1.35లక్షల కోట్లుగా ఉంది. ఇక ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరువాత రెండో స్థానంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.2.2లక్షల కోట్లుగా ఉంది. ‘‘రుణగ్రహీతలకు రుణాలు ఇచ్చే రిస్క్‌ను పరిగణనలోకి తీసుకుని పీఎస్‌యూ బ్యాంకులపై మేము ప్రతికూలంగా ఉన్నాము. కోవిడ్ -19 కారణంగా ప్రభుత్వం నుంచి ఉద్దీపన ప్రకటనలు, మారిటోరియం విధింపు తదితర అంశాలతో ప్రభుత్వరంగాల పరపతి విలువ క్షీణించింది. మరోవైపు, ఆర్బీఐ రివర్స్ రెపో తగ్గింపు... బ్యాంకులకు ఆదాయాన్ని పెంచే అవకాశాలను మరింత తగ్గిస్తుంది.’’ అని ఐఐఎఫ్ఎల్ రీసెర్చ్ విశ్లేషకుడు అభిమన్యు సోఫత్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు క్షీణిస్తాయని ఎలారా సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రవి సుందర్ అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్ల తగ్గింపుతో క్రమంగా బ్యాంకుల్లో డిపాజిట్లు క్షీణిస్తాయని, ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు రానున్న రోజుల్లో మరింత అధ్వాన పరిస్థితులను ఎదుర్కోంటాయని రవి సుందర్ అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.., ఎస్బీఐ బ్యాంకు ఉత్తమ ఎంపిక సుందర్ సలహానిస్తున్నారు. అలాగే ప్రైవేట్ రంగ బ్యాంకుల విభాగంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు రానున్న రోజుల్లో రాణిస్తాయని రవి సుందర్ అంచనా వేస్తున్నారు. -
నేడే మెగా విలీనం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఆంధ్రా బ్యాంకు సహా ఆరు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ అమలవుతున్నప్పటికీ విలీన ప్రక్రియను ప్రణాళిక ప్రకారంగానే అమలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత తరుణంలో విలీన ప్రక్రియ అంత సజావుగా జరగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, యాంకర్ బ్యాంకుల చీఫ్‌లు మాత్రం ఎలాంటి సమస్యలూ ఉండబోవని ధీమా వ్యక్తం చేశారు. ‘అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతోంది. సమస్యలేమీ తలెత్తే అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితులను కూడా సమీక్షించే నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగులు, ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం‘ అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ జి తెలిపారు. పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే దాకా రుణ మంజూరు తదితర ప్రక్రియల్లో ఎలాంటి మార్పులు లేకుండా యథాప్రకారమే కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాల అనుసంధానికి తమ బ్యాంకు కూడా సర్వ సన్నద్ధంగా ఉందని ఇండియన్ బ్యంక్ ఎండీ పద్మజా చుండూరు తెలిపారు. విలీనం కాబోయే అలహాబాద్ బ్యాంక్ కస్టమర్లకు కూడా తమ ఎమర్జెన్సీ రుణ పథకాలు అందుబాటులో ఉంచుతున్నట్లు ఆమె వివరించారు. 2020 డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం ఐటీ వ్యవస్థ అనుసంధానం పూర్తి కాగలదని చెప్పారు. విలీన ప్రక్రియతో తమ బ్యాంకు మరింత శక్తిమంతంగా మారగలదని కెనరా బ్యాంకు ఎండీ ఎల్వీ ప్రభాకర్ తెలిపారు. మరోవైపు, లాక్డౌన్ కారణంగా కొన్ని ప్రక్రియల అమలు మాత్రం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు యాంకర్ బ్యాంకుల వర్గాలు తెలిపాయి. ప్రణాళిక ఇదీ.. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం.. ప్రభుత్వ రంగంలో బ్యాంకుల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమవుతాయి. అలాగే కెనరా బ్యాంకులో సిండికేట్ బ్యాంకు .. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు .. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు విలీనమవుతాయి. పీఎన్బీ, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు .. యాంకర్ బ్యాంకులుగా ఉంటాయి. ఈ కన్సాలిడేషన్‌తో ప్రభుత్వ రంగంలో 7 భారీ బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు ఉంటాయి. ఒక్కో భారీ బ్యాంకు పరిమాణం రూ. 8 లక్షల కోట్ల పైగా ఉండనుంది. ప్రభుత్వ రంగంలో ఎస్బీఐ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంకుగా పీఎన్బీ ఆవిర్భవిస్తుంది. కెనరా బ్యాంక్ నాలుగో స్థానంలో, యూనియన్ బ్యాంక్ (5), ఇండియన్ బ్యాంక్ ఏడో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉంటాయి. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఉండగా ఎస్బీఐలో అనుబంధ బ్యాంకులను, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మరికొన్ని బ్యాంకులను విలీనం చేయగా 18కి తగ్గాయి. ఇకపై 12 మాత్రమే ఉండనున్నాయి. -
మార్చి 27న బ్యాంకుల సమ్మె
చెన్నై: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మె చేపట్టనున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మెగా బ్యాంక్ విలీనాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్) మార్చి 27 న సమ్మెకు దిగనున్నాయి. బ్యాడ్ లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. చెడు రుణాల మొత్తం రూ. 216,000 కోట్లుగా వుండటంతో, 2019 మార్చి 31 తో ముగిసిన సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ .150,000 కోట్ల స్థూల లాభాలకు పరిమితమైనాయని తెలిపారు. దీంతో రూ .66,000 కోట్ల నికర నష్టం వాటిల్లిందని విమర్శించారు. తాజా బ్యాంకుల విలీనం వల్ల భారీ ఎత్తున పేరుకు పోయిన కార్పొరేట్ బ్యాడ్ లోన్లు తిరిగి వస్తాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. దీనికి ఉదాహరణగా ఎస్బీఐ విలీనం విలీనం తరువాత ఈ బెడదమరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. కేవలం 323 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో బ్యాంకుల సంఖ్య భారతదేశంలోని బ్యాంకుల కంటే ఎక్కువ ఉందని, అలాంటిది 1.35 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఏకీకరణ అవసరం లేదని వెంకటాచలం అభిప్రాయం వ్యక్తం చేశారు. -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బ్యాంక్‌ల విలీనంపై కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా పది ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఎప్రిల్ 1,2020 నుంచి నాలుగు మెగా బ్యాంక్‌లు తమ కార్యకలాపాలు నిర్వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకులను బలోపేతం చేయడంతో పాటు, నష్టాల నుంచి బయటపడేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బ్యాంక్‌ల విలీనానికి సంబంధించి చట్టపరమైన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, అంతర్జాతీయ బ్యాంక్‌లతో పోటీని తట్టుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేవలం విలీన నిర్ణయంతోనే బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ట పరచడం సాధ్యం కాదని, ప్రభుత్వం తీసుకున్న విలీన నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు బ్యాంక్ యూనియన్లు ప్రకటించాయి -
3400 ప్రభుత్వ బ్యాంకు శాఖలు మాయం
న్యూఢిల్లీ: గడిచిన ఐదేళ్ల కాలంలో (2014-15 నుంచి 2018-19 వరకు) ప్రభుత్వరంగ బ్యాంకుల పరిధిలో 3,400 బ్యాంకు శాఖలు కనుమరుగయ్యాయి. అంటే వీటిని మూసేయడం లేదా విలీనం చేయడం జరిగింది. 5 ఆర్థిక సంవత్సరాల్లో 26 ప్రభుత్వ రంగ బ్యాంకుల 3,400 కి పైగా శాఖలు మూసివేత లేదా విలీనం అయ్యాయని ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా వెల్లడైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నీముచ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ దాఖలు చేసిన సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద అడిగిన ప్రశ్నకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా కనుమరుగైన వాటిల్లో 75 శాతం బ్యాంకు శాఖలు ఎస్బీఐకి చెందినవే ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనం ఎస్బీఐతోనే ఆరంభమైన విషయం తెలిసిందే. అనుబంధ బ్యాంకులతోపాటు భారత్ మహిళా బ్యాంకు ఎస్బీఐలో విలీనం అయ్యాయి. ఎస్బీఐకి సంబంధించి మొత్తం 2,568 శాఖలను గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో విలీనం లేదా మూసివేతకు గురైనాయి. కాగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రధాన కార్యదర్శి సి హెచ్ వెంకటాచలం దీనిపై మాట్లాడుతూ ఇటీవల ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన దేశంలోని పది ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల విలీనంతో నాలుగు పెద్ద బ్యాంకులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కనీసం 7,000 శాఖలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
మెగా మెర్జర్ : ప్రభుత్వ బ్యాంకుల షేర్లు భారీ పతనం
సాక్షి, ముంబై : దలాల్ స్ట్రీట్‌మంగళవారం భారీ నష్టాలనుమూట గట్టుకుంది. ముఖ్యంగా జీడీపీ 5 శాతం ఆరేళ్ల కనిష్టానికి చేరడంతో పాటు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీనం భారీగా దెబ్బ తీసింది. శని, ఆది, సోమ (వినాయక చవితి) సెలవుల అనంతరం మంగళవారం ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లలో బ్యాంకుల షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాలు భారీ పతనానికి దారి తీసాయి. జీడీపీ ఆరేళ్ల కనిష్టం 5 శాతానికి నీరసించడం, అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు ముదరడం వంటి ప్రతికూల అంశాలు మార్కెట్లను కుప్పకూల్చగా, బ్యాంకింగ్ షేర్లను బాగా ప్రభావితం చేసాయి. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్, ఓరియంటల్ బ్యాంకు, కెనరా బ్యాంకు 5 నుంచి 12 శాతం కుప్పకూలాయి. పీఎన్బీ9 శాతం, ఇండియన్ బ్యాంకు 8 శాతం, కెనరా బ్యాంకు 8 శాతం నష్టపోయాయి. 10 ప్రభుత్వ బ్యాంకుల ఏకీకరణ ద్వారా నాలుగు బలమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏర్పాటు ప్రకటన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. విలీన నిష్పత్తిపై స్పష్టత లేకపోవడం ఇన్వెస్టర్ల అమ్మకాలకు దారి తీసిందని నిపుణులు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్, 12.5 శాతం కుప్పకూలింది. కెనరా బ్యాంక్ 11 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టాన్నితాకింది. యూనియన్ బ్యాంక్ కూడా 9 శాతం కుప్పకూలి 52 వారాల కనిష్టానికి చేరింది. అలాగే ఓరియంటల్ బ్యాంకు 7 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 9 శాతం పతనమైంది. నిఫ్టీ బ్యాంకు 600 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 120 పాయింట్లు (5 శాతం) కుప్పకూలింది. విలీనంలో కీలకమైన నిష్పత్తి ప్రకటించకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలత కారణమని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ఎనలిస్ట్ వికాస్ జైన్ వ్యాఖ్యానించారు. జియోజిత్ పరిశోధన విభాగాధిపతి వినోద్ నాయర్ మాట్లాడుతూ, ఈ చర్య దీర్ఘకాలికంగా సానుకూలంగా ఉన్నప్పటికీ, స్వల్ప కాలిక ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు. విలీన ప్రక్రియ పూర్తయ్యి, తిరిగి సాధారణ పరిస్థతి రావడానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు. మరోవైపు కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్)మెరుగుపడేందుకు వీలుగా కేంద్ర కేబినెట్ తాజాగా రూ.9వేల కోట్లను అందించనుందనే వార్తలతో ఐడీబీఐ బ్యాంకు కౌంటర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఐడీబీఐ బ్యాంక్ షేరు 8.2 శాతం దూసుకెళ్లి చివరికి 6శాతం లాభాలతో ముగిసింది. -
ఒక్క ఉద్యోగినీ తొలగించం..
చెన్నై : ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయనే భయం అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. పీఎస్‌యూ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించబోరని చెప్పారు. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12 పటిష్ట బ్యాంకులుగా మారుస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లడంతో పాటు బ్యాంకుల మూసివేతకు ఇది దారితీస్తుందని బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు ఎసరు వస్తుందన్న వాదన అర్ధరహితమని నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. బ్యాంకుల విలీనంపై తాను శుక్రవారం ప్రకటన చేసిన సందర్భంగా ఏ ఒక్క బ్యాంకు ఉద్యోగినీ విధుల నుంచి తొలగించబోమని విస్పష్టంగా పేర్కొన్న విషయం గమనించాలని ఆమె పేర్కొన్నారు. పలు పాలనా సంస్కరణల ఊతంతో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మలిచేందుకు పీఎస్‌యూ బ్యాంకుల విలీనం ద్వారా మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. -
బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కీలక బ్యాంకింగ్ రంగ సంస్కరణలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకుల ఏకీకరణను వెల్లడించారు. బ్యాంకుల రీకాపిటలైజేషన్ (నిధులతో ఉద్దీపన) ద్వారా పలు బ్యాంకులు ఇప్పటికే రెపోరేట్ల ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు పలు ప్రభుత్వ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. మొత్తం 10 బ్యాంకులను కలిపి 4 కొత్త అతిపెద్ద బ్యాంకులుగా రూపొందనున్నాయన్నారు. దీంతో మొత్తం పీఎస్‌యూల సంఖ్య 27 నుంచి 12కి తగ్గనుంది. అయితే ఈ విలీనం ప్రభావంతో ఎలాంటి తొలగింపులు వుండవని స్పష్టం చేశారు. నియామకాలు: నియమాక ప్రమాణాలను, పద్ధతులల్లో కూడా సంస్కరణ తీసుకొస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు బ్యాంకుల బోర్డులను బలోపేతం చేస్తామని, అలాగే బోర్డు సైజ్‌ను నిర్ణయించే అధికారం బ్యాంకులకే ఉంటుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రతీ బ్యాంకులో స్పెషల్ రిస్క్ ఆఫసర్లను నియమిస్తామనీ, అయితే వీరికి జీతాలు ప్రభుత్వం చెల్లించదని చెప్పారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీని వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. బ్యాంకుల విలీనం: పంజాబ్ నేషనల్ బ్యాంకు, (పీఎన్బీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా 11437 బ్రాంచిలతో రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా విలీన బ్యాంకు అవతరించనుంది. ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ విలీనం ద్వారా నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరించనుంది. కాగా మీడియా సమావేశానికి ముందే నిర్మలా సీతారామన్ పది ప్రభుత్వ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో మంత్రి భేటీ అయ్యారు ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఒకే ఖాతాతో అన్ని పీఎస్‌యూ బ్యాంకుల్లో సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పీఎస్‌యూ బ్యాంకులకు రూ 70,000 కోట్ల అదనపు మూలధనం కేటాయిస్తామని తెలిపారు. ఓ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఖాతా కలిగిన ఖాతాదారు అన్ని పీఎస్‌యూ బ్యాంకు సేవలను అందుకునేలా చర్యలు చేపడతామని చెప్పారు. పార్లమెంట్లో శుక్రవారం ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకుల స్ధితిగతులు మెరుగవుతున్నాయని అన్నారు. ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించామని, వాణిజ్య బ్యాంకుల్లో రూ.లక్ష కోట్ల మేర నిరర్థక ఆస్తులు తగ్గాయని చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకుల మొండిబకాయిలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ నియంత్రణను ఆర్బీఐ కిందకు తీసుకువస్తామని అన్నారు. ఎన్బీఎఫ్సీలను పటిష్ట పరుస్తామని, మెరుగైన పనితీరు కనబరిచే ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకింగ్, మ్యూచ్‌వల్ ఫండ్స్ నుంచి సహకారం అందేలా చూస్తామని చెప్పారు. -
మరో బ్యాంకింగ్ మెర్జర్‌కు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకింగ్ రంగంలో మరికొన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధమవుతోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనం తరువాత మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. మూడు ప్రభుత్వరంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ ఇండియా విలీనం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం బ్యాంకులతో రెండవ దఫా విలీన చర్చలు జరుపుతోందని ఆర్థిక శాఖ అధికారి ఒకరు తెలిపారు. తుది చర్చల అనంతరం విలీనానికి ఆయా బ్యాంకులకు ఆహ్వానం పంపించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ విలీన ప్రక్రియకోసం ఎంతో కాలం వేచి వుండాలని తాము భావించడం లేదనీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు లేదా, మూడవ త్రైమాసికంలో విలీనం ఉండవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. అలాగే బ్యాంకులు తగిన ప్రతిపాదనలు ఇవ్వడంలో విఫలమైతే, ప్రత్యామ్నాయ విధానం (ఏఎం) గ్రూప్ తగిన సలహాలను ఇస్తుందని ఆయన మీడియాకు చెప్పారు. కాగా విజయ, దెనా, బీవోబీ విలీన ప్రక్రియ గత ఏడాది అక్టోబరులో మొదలై , ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విలీనం తరువాత బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా దేశంలో మూడవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు మాల్యా బంపర్ ఆఫర్
ఫ్యుజిటివ్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా జెట్ ఎయిర్వేస్ వివాదంపై స్పందించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను, ఉద్యోగులను కాపాడేందుకు తన డబ్బులను తీసుకోవాలంటూ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇప్పటికైనా దీనిపై బ్యాంకులు పునరాలోచించాలని కోరాడు. దీంతోపాటు సంక్షోభంలో ఉన్న తన పట్ల డబుల్ స్టాండర్డ్స్‌ని అవలంబిస్తోందంటూ మంగళవారం ట్విటర్లో వరుస ట్వీట్లతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డాడు. అలాగే సంస్థను ఆర్థిక సంక్షోభంలో ఉన్న జెట్ ఎయిర్వేస్ను రక్షించేందుకు ప్రభుత్వం రంగ బ్యాంకులు బెయిల్ అవుట్ ప్యాకేజీ ప్రకటించడంపై మాల్యా సంతోషం వ్యక్తం చేశాడు. కానీ ఇదే తన విషయంలో కూడా జరిగి వుంటే బావుండేదంటూ వాపోయాడు. బీజేపీ ప్రభుత్వం లోని ప్రభుత్వ బ్యాంకులు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని ఆరోపిస్తూ మాల్యా వరుస ట్వీట్లు చేశాడు. దేశ అత్యుత్తమ వైమానిక సంస్థ కింగ్ ఫిషర్, దాని ఉద్యోగులు, వ్యాపారం నిర్దాక్షిణ్యంగా కూలిపోతోంటే ఎన్డీఏ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎందుకు స్పందించలేదని ట్వీట్ చేశాడు. సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ సంస్థను, సంస్థ ఉద్యోగులను కాపాడేందుకు 4వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టానని మాల్యా చెప్పుకొచ్చాడు. దీన్ని గుర్తించకుండా తనను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నాడు. అలాగే తన లిక్విడ్ ఆస్తులను తీసుకోవాలని గౌరవనీయమైన కర్నాటక హైకోర్టు ముందు ఇప్పటికే తన ప్రతిపాదనను ఉంచానని కానీ ప్రభుత్వ బ్యాంకులు, ఇతర రుణ దాతలు ఎందుకు సమ్మతించడం లేదని ఆయన ప్రశ్నించారు. తన సొమ్మును తీసుకోవడం ద్వారా జెట్ ఎయిర్‌వేస్‌ని కాపాడాలని మాల్యా బ్యాంకులను కోరాడు. జెట్ ఎయిర్వేస్ లాంటి సంక్షోభ పరిస్థితినే మాల్యా సొంతమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎదుర్కొంది. దివాలా కారణంగా కింగ్ ఫిషర్ 2012లో కుప్పకూలింది. దీంతో బ్యాంకులకు 9వేల కోట్ల మేర రుణాలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ప్రస్తుతం లండన్‌లో కేసు విచారణను ఎదుర్కొంటుండగా గతవారం ఫెరా (విదేశీఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్) ఉల్లంఘన కేసులో బెంగళూరులోని మాల్యా ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి వాదనలు జులై 10న జరగనున్నాయి. కాగా జెట్ ఎయిర్వేస్ను గట్టెక్కించేందుకు ఛైర్మన్ నరేష్ గోయల్ ఎట్టకేలకు సోమవారం (మార్చి 25) న దిగి వచ్చారు. ఆయన భార్య అనితాతోపాటు సంస్థ బోర్డును వీడుతున్నట్టు ప్రకటించారు. దీంతో రుణదాతలు 1500 కోట్ల రూపాయల బెయిల్ అవుట్ ప్యాకేజీకి అంగీకరించిన సంగతి తెలిసిందే. (చదవండి : గోయల్.. ‘జెట్’ దిగెన్!) Happy to see that PSU Banks have bailed out Jet Airways saving jobs, connectivity and enterprise. Only wish the same was done for Kingfisher. — Vijay Mallya (@TheVijayMallya) March 25, 2019 And I repeat once again that I have placed liquid assets before the Hon’ble Karnataka High Court to pay off the PSU Banks and all other creditors. Why do the Banks not take my money. It will help them to save Jet Airways if nothing else. — Vijay Mallya (@TheVijayMallya) March 26, 2019 -
ప్రభుత్వ బ్యాంకులకు రీ క్యాపిటలైజేషన్ బూస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ బ్యాంకులకు తాజాగా పెట్టుబడులను సమకూర్చనుంది. దీంతో గురువారం నాటి మార్కెట్లో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ కౌంటర్లు భారీగా లాభపడుతున్నాయి. దీంతో ఊగిసలాట మార్కెట్‌కు ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల లాభాలు భారీ మద్దతునిస్తున్నాయి. మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకులకు ప్రభుత్వం రూ. 48,239 కోట్ల పెట్టుబడులను సమకూర్చేందుకు తాజాగా నిర్ణయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంకులు - పెట్టుబడుల వివరాలు ప్రభుత్వం పెట్టుబడులు సమకూరుస్తున్న బ్యాంకులలో అలహాబాద్ బ్యాంక్‌కు రూ. 6896 కోట్లు కార్పొరేషన్ బ్యాంకుకు రూ. 9086 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 4638 కోట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు రూ. 205 కోట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ. 5098 కోట్లు యూనియన్ బ్యాంక్‌కు రూ. 4112 కోట్లు ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 3256 కోట్లు సిండికేట్ బ్యాంకుకు రూ. 1603 కోట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 2560 కోట్లు యునైటెడ్ బ్యాంక్‌కు రూ. 2839 కోట్లు యుకో బ్యాంక్‌కు రూ. 3330 కోట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 3806 కోట్లు సమకూర్చనుంది. అలహాబాద్ బ్యాంక్ షేరు 6 శాతం జంప్ చేయగా కార్పొరేషన్ బ్యాంక్ 16 శాతం లాభపడుతోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 5 శాతం, ఆంధ్రా బ్యాంక్ 5.5 శాతం, పీఎన్బీ 3.2 శాతం, యూనియన్ బ్యాంక్ 3శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.3 శాతం పుంజకున్నాయి. ఇంకా సెంట్రల్ బ్యాంక్ 5.6 , యునైటెడ్ బ్యాంక్ 7 శాతం, యుకో బ్యాంక్ 7శాతం , ఐవోబీ 7.3 శాతం, సిండికేట్ బ్యాంక్ దాదాపు 3 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. -
దలాల్ స్ట్రీట్ రికార్డుల హోరు, నిఫ్టీ 11700 టచ్
సాక్షి, ముంబై: ప్రపంచ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయంగానూ ర్యాలీ సాగింది. ఆరంభంనుంచీ భారీ లాభాలతో కొనసాగిన కీలక సూచీలు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తొలినుంచీ నెలకొన్న కొనుగోళ్లజోరు సెన్సెక్స్ 442 పాయింట్ల జంప్ చేసి 38,694 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు ఎగిసి 11691 వద్ద స్థిరపడింది. అంతేకాదు తొలిసారి 11700స్థాయిని కూడా టచ్ చేసింది. స్వల్పంగా వెనక్కి తగ్గినా గరిష్టం వద్ద ముగియడం విశేషం. మొత్తంగా దలాల్ స్ట్రీట్ ఆల్ టైం గరిష్టాలతో హోరెత్తింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వ, ప్రయివేట్ సెక్టార్ బ్యాంక్‌ల లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. వీటికితోడు ఎఫ్ఎంసీజీ,ఐటీ, ఆటో, రియల్టీ రంగాలు బాగా లాభపడ్డాయి. మీడియా మాత్రం స్వల్పంగా నష్టపోయింది. పవర్‌గ్రిడ్, యస్‌బ్యాంక్, హిందాల్కో, గ్రాసిమ్, కొటక్ బ్యాంక్, ఎయిర్టెల్, ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాభపడగా, ఇన్ఫ్రాటెల్, జీ, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఐషర్నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. -
బ్యాంకుల్లో పర్యవేక్షక కమిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు, రుణ బకాయిలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్పీఏలను సమర్థంగా ఎదుర్కోవడంపై బ్యాంకులు దృష్టిసారించాయి. ఒత్తిడికి లోనయ్యే రుణాలు, ఆస్తుల విషయంలో సత్వర నిర్ణాయక వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకుల్లో సత్వర నిర్ణయాల కోసం రిటైర్డ్ జడ్జీలు, విజిలెన్స్ అధికారులు, ఇతర నిపుణులతో కూడిన పర్యవేక్షక కమిటీల నియామకాన్ని పలు బ్యాంకులు పరిశీలిస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఎస్బీఐ ప్రతిపాదనను పలు బ్యాంకులు పరిశీలిస్తున్నాయని, బ్యాంకుల వద్ద పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు, ఖాతాలను సమర్ధవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో పర్యవేక్షక కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని గోయల్ చెప్పారు. ఎస్బీఐ దశాబ్ధాల అనుభవంతో పరపతి నిర్ణయాలను అత్యంత పారదర్శకంగా, సత్వరం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒత్తిడికి గురయ్యే ఆస్తుల నిర్వహణలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
షాకింగ్: లక్షల కోట్ల రూపాయల రుణాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు వేలకోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు చెక్కేస్తున్న బడాబాబుల బండారం సామాన్య ప్రజానీకం గుండెల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంటే.. ప్రభుత్వ బ్యాంకులు రద్దు చేసిన మొండి బకాయిల వివరాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. ఒకటి.. రెండూ లేదంటే వంద కోట్లు కాదు.. ఏకంగా లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయి. స్వయంగా ఆర్థికశాఖ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన చేదు వాస్తవాలివి. గత మూడేళ్ల కాలంలో 2.41లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేసినట్టు ఆర్థిక శాఖ సహాయమంత్రి శివప్రతాప్ శుక్లా మంగళవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. 2014, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్, 2017 మధ్య ఈ రుణాలను రద్దు చేశాయని మంత్రి తెలిపారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ (నిరర్ధక ఆస్తులు) లేదా వసూలు కాని రుణాలను ప్రతి ఏటా బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్‌ను తొలగించడం సాధారణ ప్రక్రియే అని శుక్లా రాజ్యసభలో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఈ మూడేళ్లలో 2,41,911కోట్ల రూపాయల రుణాలను రద్దు చేశాయని వెల్లడించారు. అయితే లోన్లను బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగించినంత మాత్రాన రుణాలు తీసుకున్నవారిని వదిలేది లేదని.. ఈ నిర్ణయం రుణ గ్రహీతలకు లాభించదంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అంతేకాదు నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్నవారి వివరాలను ప్రకటించలేమని చేతులు దులుపుకున్నారు. ఇప్పటికే రుణాలు వసూలు చేయడానికి బ్యాంకులు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయని శుక్లా తెలిపారు. మండిపడిన మమతా బెనర్జీ మూడేళ్లలో ఇంత పెద్ద మొత్తంలో రుణాలు రద్దు చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ లెక్కలు తనను షాక్‌కు గురిచేశాయంటూ దుయ్యబట్టారు. ఓవైపు రుణాలు అందక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతు రుణాలను రద్దు చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోగా బడాబాబులు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారా అంటూ విమర్శించారు. పైగా ఈ రుణాలు ఎవరు తీసుకున్నారన్న విషయాన్ని కూడా మంత్రి చెప్పకపోవడంపై మండిపడిన మమతా అసలు ఇదే అతి పెద్ద కుంభకోణం కాదా అని ప్రశ్నించారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇవ్వడం కుదరదని పార్లమెంట్‌లోనే ప్రభుత్వం చెప్పడం దారుణమని...కచ్చితంగా ఆ వివరాలు వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా గత ఐదేళ్లలో బ్యాంకుల నిరర్ధక ఆస్తులు రెట్టింపు కావడం గమనార్హం. దీనిపై ఆర్బీఐ స్వయంగా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. I have just seen the reply to the Parliament Question of today as given below. My FB post: https://t.co/u5rKQhMWGG pic.twitter.com/L72tfImeeG — Mamata Banerjee (@MamataOfficial) April 3, 2018 -
బ్యాంకులు వీక్ : నష్టాల్లో మార్కెట్లు
ముంబై : అమెరికా ఫెడరల్ రిజర్వు.. వడ్డీరేట్లను పావు శాతం పెంచడం, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు బలహీనంగా ట్రేడవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు పాలయ్యాయి. అసలకే అస్థిరంగా ట్రేడవుతున్న మార్కెట్లకు, యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడం తోడవడంతో మార్కెట్ల నష్టాలను మరింత పెంచేలా చేసింది. చివరికి సెన్సెక్స్ 130 పాయింట్లు పడిపోయి 33,006 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల నష్టంలో 10,108 వద్ద ముగిశాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు, రియల్టీ రంగాలు ఎక్కువగా నష్టపోయాయి. నేటి ట్రేడింగ్‌లో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, మారుతీ సుజుకీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లు 4 శాతం పడిపోగా.. ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ 2 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.84 శాతం డౌన్ అయింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ 10 పైసలు లాభపడి 65.11గా నమోదైంది. -
‘ఆ బ్యాంకులను ప్రయివేటీకరించం’
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ 11,400 కోట్ల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజకీయంగా ఈ చర్య ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ పీఎన్బీ స్కాం అనంతరం బ్యాంకుల ప్రైవేటీకరణపై ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పుకొచ్చారు. బ్యాంకుల ప్రైవేటీకరణపై విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని, చట్ట సవరణలు ( బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్) చేపట్టాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. దీనికి రాజకీయ పార్టీలపై ఒకే వైఖరి అవసరమని, పీఎస్‌యూ బ్యాంకుల ప్రైవేటకీరణకు రాజకీయంగా ఏకాభిప్రాయం కుదిరేపని కాదని అన్నారు. ఇది సవాల్‌తో కూడిన సంక్లిష్ట నిర్ణయమని జైట్లీ అన్నారు. -
బ్యాంకులకు కేంద్రం బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ బూస్ట్ అందించింది. గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన అతిపెద్ద బ్యాంకు రీక్యాపిటలైజేషన్ ప్లాన్ వివరాలను నేడు(బుధవారం) వెల్లడించింది. మొండిబకాయిలను సమస్యపై పోరాడమే లక్ష్యంగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణను మెరుగుపరిచేందుకు కేంద్రం ఈ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో భాగంగా తొలుత రూ.88,139 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి చొప్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో భాగంగా ఎస్బీఐకి రూ.8,800 కోట్లు, ఐడీబీఐకి రూ.10,610 కోట్లు, పీఎన్బీకి రూ.5,740 కోట్లు, బీవోబీకి రూ.5,375 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.4,865 కోట్లు, యూనియన్ బ్యాంకుకు రూ.4524 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.2,839 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,890 కోట్లు, విజయ్ బ్యాంకుకు రూ.1,277 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ.785 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.9,232 కోట్లు, యూసీఓకు రూ.6,507 కోట్లు, ఐఓబీకి రూ.4,694 కోట్లు, ఓబీసీకి రూ.3,571 కోట్లు, దేనా బ్యాంకుకు రూ.3,045 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకి రూ.3,173 కోట్లు, యునిటెడ్ బ్యాంకుకు రూ.2,634 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.2,187 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1,500 కోట్లు లభించనున్నాయి. ఈ రూ.88,139 కోట్లలో రూ.8,139 కోట్లను బడ్జెట్ కేటాయింపుల ద్వారా అందించనుంది. ఈ రీక్యాపిటలైజేషన్‌ను బ్యాంకుల పనితీరు ఆధారంగా చేసుకుని అందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆరోగ్యకరంగా ఉంచడమే తమ ముఖ్యమైన బాధ్యత అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. బ్యాంకులకు ఎఫ్‌డీఐ పరిమితిని పెంచే ప్రతిపాదనేమీ లేదన్నారు. కాగ, వచ్చే రెండేళ్లలో మొండిబకాయిలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు అరుణ్‌జైట్లీ గతేడాదే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్యాంకులకు రూ .80,000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం కింద రూ 80,000 కోట్ల నిధులను అందించాలన్న ప్రతిపాదనకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. మొండి బాకీలు, రుణ డిమాండ్ తగ్గుదలతో సతమతమవుతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ప్రభుత్వం భారీగా నిధుల సాయం అందించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. బాండ్ల ద్వారా పీఎస్‌యూ బ్యాంకులకు రూ 80,000 కోట్లు అదనందగా వెచ్చించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి పార్లమెంట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండేళ్ల వ్యవధిలో బ్యాంకులకు రూ 1.35 లక్షల కోట్ల మూలధనం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు జూన్ 2017 నాటికి విపరీతంగా పెరిగి రూ 7.33 లక్షల కోట్లకు ఎగబాకాయి. -
‘ఆర్బీఐకి మరిన్ని అధికారాలు’
వాషింగ్టన్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్వతంత్రంగా వ్యవహరించేలా భారత్ పటిష్ట చర్యలు చేపట్టాలని ఐఎంఎఫ్ కోరింది. బ్యాంకుల పనితీరును చురుకుగా పర్యవేక్షించేందుకు, ప్రభుత్వం నియమించిన బ్యాంకు డైరెక్టర్ల తొలగింపు వంటి అంశాల్లో ఆర్బీఐకి పూర్తి అధికారాలుండాలని ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసింది. రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తుల నుంచి ఎదురయ్యే రిస్క్‌ల పరిష్కారం, కమాడిటీ మార్కెట్ల ఏకీకృత పర్యవేక్షణ అవసరమని అభిప్రాయపడింది. ఐఎంఎఫ్ తన ఫైనాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అసెస్మెంట్లో ఈ అంశాలు పొందుపరిచింది. ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించాలని పేర్కొనడంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆర్బీఐకి విస్తృతాధికారాలు ఉండాలని పేర్కొంది. ఆర్బీఐ నిర్ణయాలను ప్రభుత్వం అధిగమించడాన్ని చట్టంలో సవరణల ద్వారా అడ్డుకట్ట వేయాలని సూచించింది. ఇక కీలక వ్యవస్ధాగత సంస్కరణల ఊతంతో భారత్ ఆర్థిక, ఫైనాన్షియల్ ఆస్తుల పరంగా మంచి వృద్ధి కనబరుస్తోందని పేర్కొంది. -
విలీనాలకు మూలధన మద్దతు!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలపై ఆర్థిక శాఖ సంకేతం ♦మొండిబకాయిలకు పరిష్కారమే లక్ష్యం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్బీ) మధ్య విలీనాలను ప్రోత్సహించడం కోసం తగినంత మూలధనాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ప్రధానంగా కొండలా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించాలంటే బ్యాంకుల విలీనాలే శరణ్యమని.. అందుకు మూలధన నిధుల రూపంలో తోడ్పాటునివ్వనున్నట్లు ఆర్థిక శాఖ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌బీల విలీనాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని లేదా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ‘మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న బ్యాంకుల మధ్య విలీన ప్రతిపాదన వచ్చిన పక్షంలో... విలీనం వల్ల పటిష్టమైన బ్యాంకు ఆవిర్భవిస్తుందని మంత్రుల బృందం విశ్వసిస్తే.. వాటికి మూలధన నిధుల కొరత లేకుండా చూస్తాం. కొనుగోలు చేసే బ్యాంకుకు ఏదైనా మూలధన అవసరం ఉంటేగనుక కేంద్రం కచ్చితంగా అందిస్తుంది. అయితే, విలీన ప్రతిపాదన అనేది ఆయా బ్యాంకుల బోర్డుల నుంచే రావాల్సి ఉంటుంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. మార్చికల్లా ఒక విలీనం ఖాయం! ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా(2018, మార్చినాటికి) కనీసం ఒక విలీన ప్రతిపాదనను అయినా ఖాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. అయితే, విలీనాలకు నిర్దిష్టంగా ఒక లక్ష్యాన్ని ఏదీ పెట్టుకోలేదని కేబినెట్ నిర్ణయం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ఎస్బీఐ కాకుండా మరో 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి మొత్తం మొండిబకాయిల పరిమాణం రూ.6 లక్షల కోట్లుగా అంచనా. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం ఎన్‌పీఏల్లో ఇది 75 శాతానికి సమానం. కాగా, ప్రభుత్వ ప్రత్యేక యంత్రాంగం నుంచి విలీనానికి సూత్రప్రాయ ఆమోదం లభిస్తే... దీనికి అనుగుణంగా చట్టపరమైన, సెబీ నిబంధనల మేరకు తగిన చర్యలను ఆయా బ్యాంకులు చేపట్టాల్సి ఉంటుంది. విలీనానికి తుది ఆమోద నిర్ణయం మాత్రం కేంద్ర కేబినెట్ తీసుకుంటుంది. 2–3 బ్యాంకులూ విలీనం కావచ్చు... పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... ఏదైనా చిన్న లేదా మధ్య స్థాయికి చెందిన ఒక పీఎస్బీని మాత్రమే విలీనం చేసుకోవాలనేమీ లేదని, అవసరమైతే 2–3 బ్యాంకులను కూడా విలీనపర్చి పటిష్టమైన, భారీ బ్యాంకుగా ఆవిర్భవించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల మూలధన నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గుతుందని వ్యాఖ్యానించాయి. ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ)ను విజయవంతంగా విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరు బ్యాంకులను విలీనం చేసుకోవడం ద్వారా ఎస్బీఐ ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఆవిర్భవించగలిగింది. ఎస్బీఐ మొత్తం కస్టమర్ల సంఖ్య దాదాపు 37 కోట్లకు చేరగా... బ్రాంచ్‌ల సంఖ్య 24 వేలకు, ఏటీఎంలు 54 వేలకు చేరాయి. బ్యాంకింగ్ చట్ట సవరణలు నోటిఫై... బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో తీసుకొచ్చిన సవరణలకు ఇటీవల పార్లమెంటు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఈ చట్టాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం మొండిబకాయిల రికవరీ కోసం బ్యాంకు లు దివాలా ప్రక్రియను (ఇన్సాల్వెన్సీ, అండ్ బ్యాంక్రప్సీ కోడ్–2016 కింద) మొదలుపెట్టేందుకు అవసరమైన ఆదేశాలను ఇచ్చేవిధంగా ఆర్బీఐకి అధికారాలు లభిస్తాయి. అంతక్రితం దీనిపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో చట్టం అమల్లోకి వచ్చినట్లయింది. కాగా, దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు రూ.8 లక్షల కోట్లకుపైగానే పేరుకుపోయాయి. ఇందులో ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకులవే రూ.6 లక్షల కోట్లు. ఆర్డినెన్స్ ఆధారంగా ఆర్బీఐ ఇప్పటికే దాదాపు 12 భారీ మొండిబకాయిల ఖాతాలను (రూ.5,000 కోట్లకుపైబడిన ఎన్పీఏలు) గుర్తించి.. దివాలా చట్టాన్ని ప్రయోగించాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది కూడా. మొత్తం ఎన్‌పీఏల్లో ఈ 12 కార్పొరేట్ ఖాతాలవే 25 శాతం కావడం గమనార్హం. ఈ జాబితాలో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి. కాగా, పీఎస్‌బీలు ఇప్పటివరకూ 5,954 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై(విల్‌ఫుల్ డిఫాల్టర్స్) సర్ఫేసీ చట్టం కింద రికవరీ చర్యలు చేపట్టాయని ఆర్థిక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. ఈ విల్‌ఫుల్ డిఫాల్టర్స్ ఎగ్గొట్టిన రుణాల విలువ రూ.70,000 కోట్లుగా లెక్కతేలింది. ఇందులో ఎస్బీఐ 1,444 మందిపై చర్యలు తీసుకుంది. వీరి బకాయిల విలువ రూ.20,943 కోట్లు. -
ఎగవేతదారులకు పీఎస్‌యూ బ్యాంకుల షాక్
న్యూఢిల్లీః కొండల్లా పేరుకుపోయిన రుణ బకాయిల వసూళ్లకు పీఎస్‌యూ బ్యాంకుల్లో కదలిక వచ్చింది. రూ 70,000 కోట్ల రుణాలు చెల్లించాల్సిన 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై ప్రభుత్వ రంగ బ్యాంకులు లోన్ రికవరీ యాక్షన్ చేపట్టాయి.ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలోని 21 బ్యాంకులు 5954 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై సర్ఫేసి చట్టం కింద చర్యలు తీసుకున్నాయి.రూ 20943 కోట్ల రుణాల వసూలు కోసం 1,444 మంది డిఫాల్టర్లపై దేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ చర్యలు చేపట్టగా, మిగిలిన 20 బ్యాంకులు రూ 48,496 కోట్ల రుణ బకాయిల వసూలు నిమిత్తం 4510 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాయి. పీఎస్‌యూ బ్యాంకులకు మొత్తం రూ 92,376 కోట్లు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల బకాయిలున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య పది శాతం పెరగడం ఆందోళనకరమని తెలిపాయి. 2016-17లో ఎస్బీఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ 81,683 కోట్ల రుణాలను రద్దు చేశాయి. -
రూ.2.49 లక్షల కోట్ల రుణాల రద్దు
♦ ఇదీ... ఐదేళ్లలో పీఎస్‌యూ బ్యాంకులు చేసిన పని ♦ అగ్ర స్థానంలో ఎస్బీఐ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన రుణాలను ఖాతాల్లోంచి రద్దు చేసి పడేశాయి. ఆర్బీఐ గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు సహా మొత్తం 27 ప్రభుత్వరంగ బ్యాంకులు కలిపి రూ.81,683 కోట్ల విలువైన మొండి బకాయిలను రద్దు చేశాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యధికం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 41 శాతం ఎక్కువ. 2016–17లో ఒక్క ఎస్బీఐ, దానిలో విలీనమైన అనుబంధ బ్యాంకులు రద్దు చేసినవి రూ.రూ.27,574 కోట్లుగా ఉన్నట్టు ఆర్బీఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంకులు ఇలా రద్దు చేసిన రుణాలు 2012–13లో రూ.27,231 కోట్లు కాగా, అవి 2015–16లో రూ.57,586 కోట్లకు, 2016–17లో రూ.81,683 కోట్లకు పెరిగిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రద్దు చేసిన రుణాల్లో పీఎన్బీ రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7,346 కోట్లు, కెనరా బ్యాంకు రూ.5,545 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.4,348 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు రూ.3,574 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రూ.3,066 కోట్లు, ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.2,868 కోట్లు ఉన్నాయి. వసూలు కాని మొండి బకాయిలకు ఏటా ఇంత చొప్పున నిధులు కేటాయిస్తూ చివరికి బ్యాంకులు వాటిని రద్దు చేస్తుంటాయి. ఈ ఏడాది మార్చి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల మొత్తం జారీ రుణాల్లో స్థూల నిరర్థక ఆస్తులు 12.47 శాతానికి చేరాయి. డర్టీ డజన్‌పై చర్యలను సమీక్షించిన బ్యాంకర్లు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలకు ఆర్బీఐ నిర్ధారించిన 12 డర్టీ కంపెనీ అకౌంట్లపై చర్యలు ఎంతవరకూ వచ్చాయన్న అం శాన్ని ప్రముఖ బ్యాంకర్లు సోమవారం సమీక్షిం చారు. తగిన లిక్విడేషన్ ప్రక్రియకు ఉద్దేశించి ఈ 12 మొండిబకాయి అకౌంట్లను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని ఆయా బ్యాంకర్లకు జూన్ 13వ తేదీన ఆర్బీఐ అంతర్గత సలహా కమిటీ సూచించిన సంగతి తెలిసిందే. ‘‘పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలన్న నిర్ణయంలో భాగంగానే నేటి సమావేశం జరిగింది. అన్ని బ్యాంకుల మధ్య సన్నిహిత సహకారానికి దీనిని ఉద్దేశించడం జరిగింది’’ అని ఒక బ్యాంకర్ తెలిపారు. 12 అకౌంట్లూ ఇవీ... ఎస్సార్ స్టీల్, భూషన్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, ఆమ్టెక్ ఆటో, భూషన్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్, మన్నెత్ ఇస్పాత్, ల్యాంకో ఇన్ఫ్రా, ఎరా ఇన్ఫ్రా, జేపీ ఇన్ఫ్రాటెక్, ఏబీజీ షిప్‌యార్డ్, జ్యోతి స్ట్రక్చర్స్ ఇందులో ఉన్నాయి. మొత్తం రూ. 8 లక్షల కోట్ల మొండిబకాయిల్లో ఈ 12 కంపెనీల వాటా దాదాపు పావుశాతం ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ 12 సంస్థల్లో తొమ్మిదింటిని ఇప్పటికే ఎన్సీఎల్టీకి రిఫర్ చేయడం జరిగింది. ల్యాంక్ ఇన్ఫ్రా, జేపీ ఇన్ఫాటెక్, ఎరా ఇన్ఫ్రా అకౌంటు మాత్రం ఇంకా పెండింగులో ఉన్నాయి. 22న బ్యాంకింగ్ సమ్మె! ప్రైవేటీకరణ, విలీనాలపై నిరసన ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ, విలీనా లకు నిరసనగా ఈ నెల 22వ తేదీన సమ్మె నిర్వహించాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సిబ్బం దికి పిలుపు నిచ్చాయి. విలీనాలు, ప్రైవేటీకరణ సహా బ్యాంక్ ఉద్యోగులు పలు బ్యాంకింగ్ వ్యతి రేక విధానాలపై పోరాడుతున్నట్లు ఆల్ ఇండి యా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) ఒక ప్రకటనలో పేర్కొంది. 9 బ్యాంక్ యూనియన్లకు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులకు ఏఐబీఈఏ నేతృత్వం వహిస్తోంది. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. మొండిబకాయిలు రద్దు చేయకుండా ఈ బకాయిదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నది తమ డిమాండ్లలో ఒకటని తెలిపారు. -
నిధుల సేకరణలో పీఎస్‌యూ బ్యాంకులు
12 బ్యాంకుల ప్రణాళిక ∙వీటికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంద్రధనుష్ రోడ్‌మ్యాప్ ప్రకారం బాసెల్–3 నిబంధనల మేరకు 2019 మార్చి నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్ల నుంచి వివిధ రూపాల్లో రూ.1.10 లక్షల కోట్లను సమీకరించాల్సి ఉంటుంది. అదే సమయంలో పీఎస్‌యూ బ్యాంకులకు ప్రభుత్వం నుంచి రూ.70,000 కోట్ల సాయం అందనుంది. ఇందులో రూ.50,000 కోట్లను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం గమనార్హం. న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులు నిధుల వేటలో పడ్డాయి. 12 బ్యాంకులు మార్కెట్ల నుంచి నిధులు సమీకరించనున్నాయి. వీటిలో పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు కూడా ఉన్నాయి. బాసెల్–3 మూలధన అవసరాలను చేరుకునేందుకు బ్యాంకులకు నిధుల అవసరం ఉంది. ఆంధ్రా బ్యాంకు సహా మొత్తం మీద ఆరు నుంచి ఏడు పీఎస్‌యూ బ్యాంకులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే నిధుల సమీకరణను పూర్తి చేయనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మిగిలిన బ్యాంకులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో), అర్హత గల సంస్థాగత మదుపరులకు షేర్ల కేటాయింపు (క్యూఐపీ) ద్వారా నిధులు సమీకరించనున్నట్టు వెల్లడించాయి. పలు అవకాశాలు... అలహాబాద్ బ్యాంకు,ఆంధ్రా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, దేనా బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకులు క్యూఐపీ లేదా ఎఫ్‌పీవో లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ విధానంలో నిధులు సేకరించేందుకు ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం కూడా పొందాయి. సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, విజయా బ్యాంకులకు సైతం ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అలçహాబాద్ బ్యాంకు రూ.2,000 కోట్ల నిధుల సమీకరణకు వాటాదారులు కూడా ఆమోదం తెలిపారు. పీఎన్బీ బోర్డు రూ.3,000 కోట్ల నిధుల సమీకరణకు అంగీకారం తెలిపింది. దేనా బ్యాంకు రూ.1,800 కోట్ల సమీకరణకూ వాటాదారులు ఆమోదం తెలియజేశారు. ఎస్బీఐ క్యూఐపీ ద్వారా రూ.15,000 కోట్ల సమీకరణను ఇటీవలే పూర్తి చేసిన విషయం తెలిసిందే. -
మార్కెట్లకు బ్యాంకుల దెబ్బ
ముంబై : ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న ఒత్తిడి నేడు కూడా మార్కెట్లను దెబ్బకొడుతోంది. బ్యాంకు షేర్లలో నెలకొన్న ఒత్తిడితో దేశీయ ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు నేటి(బుధవారం) ట్రేడింగ్ లో నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ప్రారంభంలో 19.27 పాయింట్లు పడిపోయి 31వేల కింద ట్రేడైంది. నిఫ్టీ సైతం 27.70 పాయింట్ల నష్టంలో 9,483.70గా నమోదైంది. జూన్ నెల డెరివేటివ్స్ సిరీస్ కూడా రేపటితో ముగియనుంది. అటు ఆసియన్ మార్కెట్లు నెగిటివ్ గా కొనసాగుతున్నాయి. హెల్త్ కేర్ లో ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జాప్యమవుతుండటంతో ఆసియన్ మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో ఐటీసీ, ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఎక్కువగా నష్టపోగా, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ కు మద్దతుగా నిలిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 0.5 శాతం పడిపోయింది. విజయ్ బ్యాంకు, ఓబీసీ, ఆంధ్రాబ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఎస్కార్ట్స్, బజాజ్ ఫైనాన్స్, డీహెచ్ఎఫ్ఎల్, ఎల్ఐసీ హౌజింగ్ లు 1-2 శాతం నష్టాల్లో నడిచాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ స్వల్పంగా బలహీనపడి 64.55 వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 58 రూపాయల లాభంలో 28,568 వద్ద కొనసాగుతున్నాయి. -
27మంది బ్యాంకు అధికారులు సస్పెండ్
పెద్ద నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ ఆదేశాలు పాటించకుండా అక్రమ లావాదేవీలు చేపడుతున్న 27 మంది బ్యాంకు అధికారులపై కేంద్రం చర్యలు తీసుకుంది. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 27 మంది బ్యాంకు అధికారులపై సస్పెన్షన్ వేటుతో పాటు, మరో ఆరుగురు అధికారులను ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేస్తున్నట్టు ఆర్థికమంత్రిత్వశాఖ ప్రకటించింది. నల్లకుబేరులపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకోవడానికి, డిపాజిట్ చేయడానికి నిర్ణీత గడువును ప్రభుత్వం విధించింది. అయితే ఈ ప్రక్రియలో బ్యాంకు అధికారులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఈ బ్యాంకు అధికారులు మాత్రం ఏ మాత్రం ఆర్బీఐ ఆదేశాలు పాటించకుండా నల్లకుబేరులకు సాయపడుతూ అక్రమ లావాదేవీలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఇంతకమున్నుపై బ్యాంకు అధికారులు అక్రమ లావాదేవీలు చేపడుతున్నారని తెలిసి పలుమార్లు ఆర్బీఐ హెచ్చరించింది. తమ సూచనలు మేరకు నడుచుకోవాలని పేర్కొంది. బెంగళూరులో 5.7 కోట్ల కొత్త కరెన్సీ నోట్లను ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బ్యాంకు అధికారులపై ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. కొన్ని కేసుల్లో అధికారులు ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ లావాదేవీలకు తెరతీశారని తెలిసి వారిని సస్పెండ్ చేశామని ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అక్రమ పద్ధతులను అసలు సహించేది లేదని, ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకునేవారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే 27 మంది బ్యాంకు అధికారులను సస్పెండ్ చేసి, ఆరుగురిని ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేసినట్టు తెలిపింది. -
బ్యాంకింగ్‌లో మరిన్ని సంస్కరణలు
త్వరలోనే తగిన చర్యలు ప్రకటిస్తాం... * ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హమీ * పీఎస్‌యూ బ్యాంకుల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలిగే పరిస్థితి లేదు ముంబై: బ్యాంకింగ్ రంగంలో మరిన్ని సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడిఉందని.. త్వరలోనే ఈ దిశగా చర్యలు వెలువడతాయంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో బడ్జెట్‌ను(ఫిబ్రవరి 29న) ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు వాటాలను పూర్తిగా విక్రయించే పరిస్థితులు ప్రస్తుతం భారత్‌లో లేవని ఆయన స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియా వీక్‌లో భాగంగా ఆదివారమిక్కడ ‘సీఎన్ఎన్ ఆసియా బిజినెస్ ఫోరం-2016’ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించే స్థాయికి భారత్ ఇంకా చేరుకోలేదు. దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలను(సమ్మిళిత ఆర్థికాభివృద్ధి) అందుబాటులోకి తీసుకురావాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే, వీటి కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా(ప్రొఫెషనల్) మార్చే ఉద్దేశంతోనే ప్రభుత్వ వాటాలను 51 శాతానికి తగ్గించుకోవాలని నిర్ణయించాం. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యాన్ని పూర్తిగా లేకుండా చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని జైట్లీ చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడీబీఐ బ్యాంక్‌లు దేశీ బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక నష్టాలను(క్యూ3లో) ప్రకటించడం... ఐఓబీ, దేనా తదితర బ్యాంకులు తీవ్ర నష్టాల్లోకి జారిపోయిన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారీ మొండిబకాయిలే పీఎస్‌యూ బ్యాంకుల లాభాలు హరించుకుపోయేందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. జీఎస్టీపై త్వరలో సంప్రదింపులు... కీలకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును రాజ్య సభలో ఆమోదింపజేసేందుకు త్వరలోనే ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతామని జైట్లీ చెప్పారు. దేశంలో స్థిరమైన పన్నుల వ్యవస్థను తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన మరోమారు స్పష్టం చేశారు. పన్నులకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా దేశ ప్రతిష్టకు కొంత నష్టం వాటిల్లిందని కూడా ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ ఓకే కానీ.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పనితీరుపై జైట్లీ మరోసారి విమర్శలు గుప్పించారు. సంస్కరణలకు సంబంధించి నిర్ణయాల్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ చాలా బాగా పనిచేశారని.. అయితే, ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మాత్రం సంస్కరణలు ఆగిపోయాయన్నారు. కాగా, ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడంలో మోదీ సర్కారు విఫలమైందని, కీలకమైన నిర్ణయాలకు సంబంధించి ప్రతిపక్షాన్ని పూర్తిగా విస్మరిస్తోందంటూ మన్మోహన్ సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా స్పందించారు. ఇన్వెస్టర్ల గమ్యంగా భారత్.. ముంబై: భారత్ పెట్టుబడులకు అనుకూలమైన దేశమని, ఇక్కడ అపార వృద్ధి అవకాశాలు ఉన్నాయని దేశీ, అంతర్జాతీయ కంపెనీ ప్రతినిధలు తెలిపారు. వీరు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మేక్ ఇన్ ఇండియా వీక్’లో జరిగిన సీఎన్ఎన్ ఆసియా బిజినెస్ ఫోరమ్‌లో మాట్లాడారు. భారత్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని మహీంద్రా గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రా తెలిపారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విజయవంతమవ్వాలంటే యువకులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాల్సి ఉందని ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా అభిప్రాయపడ్డారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇండియా వేగవంతమైన ఆవిష్కరణలతో ముందుకెళ్తోందని సిస్కో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ చాంబర్స్ తెలిపారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇదే అనువైన సమయమని, మంచి అవకాశాన్ని కోల్పోవద్దని చెప్పారు. సిస్కో తన తొలి తయారీ ప్లాంటును పుణేలో ఏర్పాటుచేసే అవకాశముందన్నారు. ఆవిష్కరణలకు అనువైన దేశమని జీఈ ప్రెసిడెంట్, సీఈవో (దక్షిణాసియా) బన్మాలి అగర్వాల్ తెలిపారు. మేకిన్ ఇండియా వీక్ విశేషాలు * డైవర్సిఫైడ్ గ్రూప్ ఐటీసీ కంపెనీ.. ఒడిశాలోని రూ.800 కోట్లమేర పెట్టుబడులు పెట్టనున్నది. * పునరుత్పాదక ఇంధనం, రిటైల్, లాజిస్టిక్స్ వంటి తదితర రంగాలకు సంబంధించి దాదాపు రూ.20,000 కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని హర్యానా ప్రభుత్వం పేర్కొంది. చైనాకు చెందిన వాండా గ్రూప్‌తో దాదాపు రూ.65,000 కోట్ల విలువైన ఎంఓయూ కుదిర్చుకున్నట్లు తెలిపింది. * బౌద్ద పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయటానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటామని మహరాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) పేర్కొంది. * టాటా స్టీల్ అనుబంధ కంపెనీ ‘టాటా స్టీల్ సెజ్’ తాజాగా ఒడిశాలోని గోపాల్‌పూర్‌లోని ఇండస్ట్రీయల్ పార్క్ సంబంధిత సెజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం రూ.2,000-రూ.2,500 కోట్లు వరకు ఇన్వెస్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొంది. * ఒడిశాలో 3 ఎంటీపీఏ అల్యూమినియం ప్లాంటు ఏర్పాటుకు సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే 2-3 నెలల్లో తుది క్లియరెన్స్ పొందే అవకాశముందని ఎల్అండ్టీ పేర్కొంది. ఈ ప్లాంటు ఏర్పాటుకు రూ.12,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. -
కాలం కలిసొస్తే...వేలంలో కొనొచ్చు
బ్యాంకుల ‘ఈ ఆక్షన్’కు పెరుగుతున్న ఆదరణ మార్కెట్ రేటు కంటే 20-25 శాతం తక్కువకే దొరికే చాన్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కంటే పీఎస్‌యూ బ్యాంకుల్లో కాస్త చౌక డాక్యుమెంట్ల పరంగా లోటుపాట్లు తక్కువే ముందే ఇంటిని పరిశీలించడం మర్చిపోవద్దు బకాయిపడ్డ బిల్లులు ఎంతున్నాయో తెలుసుకోవాల్సిందే సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఇల్లు కొనటానికి ఎన్నో మార్గాలు. కడుతుండగా బిల్డర్‌ను సంప్రదించి కొనటం ఒక పద్ధతి. స్నేహితులో, మరొకరో విక్రయిస్తున్న సెకండ్ హ్యాండ్ ఇంటిని కొనుగోలు చేయటం మరో పద్ధతి. ఇవన్నీ కాకుండా... మార్కెట్ రేటు కంటే కనీసం 20-25 శాతం తక్కువ ధరకే వేలంలో పాల్గొనటం ద్వారా కొనుగోలు చేయటం మరో పద్ధతి. వేలమంటే ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజమే. ఎందుకంటే బ్యాంకులు తమ దగ్గర రుణం తీసుకుని, దాన్ని సకాలంలో తిరిగి చెల్లించని వారి నుంచి సదరు ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని వేలం వేస్తుంటాయి. కొంత ఓపిక, సహనం ఉంటే ఈ వేలంలో పాల్గొనడం ద్వారా మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇంటిని సొంతం చేసుకోవచ్చు. బ్యాంకులు వేలం వేసే ఇంటిని కొనుగోలు చేయడం వల్ల కలిగే లాభాలు, ఇలాంటి ఆస్తుల్ని కొనుగోలు చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేదే... ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం. రుణాలు తీసుకొని చెల్లించనివారి ఇళ్ళను వేలం వేయటమనేది ఇప్పటి మాట కాదు. ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఈ వేలం పాటలు కనీసం పక్కింటి వారికి కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా బ్యాంకుల కార్యాలయాల్లోనే జరిగిపోయేవి. పలు సందర్భాల్లో బ్యాంకు సిబ్బందితో కొందరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కుమ్మక్కై వ్యవహారాన్ని అంతా తామే అయి నడిపించేవారు. ముందుగా అనుకున్న ప్రకారం వారే వేలానికి హాజరు కావటం... వారు అనుకున్న ధరకే దాన్ని చేజిక్కించుకోవటం జరిగేది. పలు సందర్భాల్లో ఇలా జరగటంతో సామాన్య జనానికి వీటిపై పెద్దగా ఆసక్తి కూడా ఉండేది కాదు. కాకపోతే ఇపుడు ‘ఆన్లైన్’ విప్లవం ఈ వేలం పాటలకూ పాకింది. దాదాపు అన్ని బ్యాంకులూ ‘ఈ ఆక్షన్’ విధానాన్నే అనుసరిస్తున్నాయి. దీంతో వేలంలో పారదర్శకత సాధ్యమైంది. పెపైచ్చు ఇంటిని కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్న బిడ్డర్లు ఇంట్లోంచి కదలకుండానే కనీస డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. ఈ మధ్యనే ఎస్బీఐ సుమారు రూ. 1,200 కోట్ల విలువైన 300కిపైగా ఆస్తులను ఆన్లైన్ వేలంలో విక్రయించింది కూడా. వేలం ఎందుకు వేస్తారు? రుణం తీసుకొని ఇంటిని కొనుగోలు చేసి, వరుసగా మూడు నెలలు ఈఎంఐ చెల్లించకపోతే అటువంటి రుణ గ్రహీతలకు బ్యాంకులు నోటీసులిస్తున్నాయి. దానికి కొనసాగింపు ప్రక్రియగా తొలుత ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవటం, ఆ తరవాత వేలంలో విక్రయించటం వంటివి చేస్తున్నాయి. తీసుకున్న రుణానికి సంబంధించి వరుసగా 90 రోజుల పాటు ఎలాంటి చెల్లింపులూ జరగకపోతే ఆ ఆస్తుల్ని బ్యాంకులు మొండి బకాయిలుగా(ఎన్పీఏ) పరిగణిస్తున్నాయి. ఇలా ఎన్పీఏగా ప్రకటించిన తర్వాత బ్యాంకులు రుణగ్రహీతకు నోటీసులు జారీ చేస్తాయి. రుణం చెల్లించడం లేదు కాబట్టి మీ ఆస్తిని ఎందుకు వేలం వేయకూడదో 60 రోజుల్లోగా చెప్పాలని ఆ నోటీసులో కోరతాయి. ఈ సమయంలో బకాయిలు చెల్లించినా, రుణం కట్టకపోవడానికి సరైన కారణాలు చూపినా బ్యాంకులు నోటీసులను వెనక్కి తీసుకుంటాయి. రుణ గ్రహీత నుంచి సమాధానం రాకపోయినా, లేక రుణగ్రహీత ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా 30 రోజుల తర్వాత బ్యాంకులు ఆ ఇంటిని వేలం వేస్తాయి. కాగితాలన్నీ సక్రమమేనా.. ఒకసారి వేలంలో పాల్గొనే ఇంటిని గుర్తించిన తర్వాత ఆ ఆస్తి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం తప్పనిసరి. నిజానికి బ్యాంకులు వేలం వేసే ఇళ్లు చాలావరకూ డాక్యుమెంట్ల పరంగా పక్కాగా ఉంటాయి. ఎందుకంటే డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే బ్యాంకులు రుణమిస్తాయి. ఇచ్చిన రుణం కట్టలేనపుడు వేలానికి పెడతాయి. అంటే డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నట్లేగా!!. ఒకవేళ సదరు ఆస్తులపై న్యాయ వివాదాలుంటే ఈ విషయం కూడా ముందే అడిగి తెలుసుకోవాలి. చాలావరకూ అలాంటి విషయాల్ని బ్యాంకులే తెలియజేస్తుంటాయి. అలాగే అక్కడి మార్కెట్ రేటు ఎంతుందో కూడా ముందు తెలుసుకోవాలి. ఆ ఇంటి ఓనర్ ఎంత రుణం తీసుకున్నాడు, ఇంకా ఎంత చెల్లించాల్సి ఉంది? బ్యాంకు రిజర్వ్ ధర ఎంత? అన్న విషయాలను కూడా చూడాలి. కొన్ని బ్యాంకులు ఇలా వేలంలో ఉన్న ఇంటికి సంబంధించిన ఇంటి వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించటం లేదు. కాబట్టి సాధ్యమైనంత వరకు వేలంలో పాల్గొనే ముందు ఆ ఇంటికి సంబంధించి న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకోవడం ఉత్తమం. బిడ్ దాఖలు చేయండి వేలంలో పాల్గొనటానికి ప్రధాన నిబంధన ఏమిటంటే రిజర్వు ధరలో 10 శాతాన్ని ముందుగా ఎర్నెస్ట్ మనీ డిపాజిట్(ఈఎండీ) గా చెల్లించాలి. టెండర్ ఫారంతో పాటు బ్యాంకర్స్ చెక్ లేదా డీడీ రూపంలో ఈ మొత్తం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఆన్లైన్ చెల్లింపును కూడా అనుమతిస్తున్నాయి. ఒకవేళ వేలంలో మీరు గనక విజయం సాధించని పక్షంలో ఆ డిపాజిట్‌ను వెనక్కి ఇచ్చేస్తారు. పెపైచ్చు వేలంలో విజయం సాధించిన వెంటనే రిజర్వు ధరలో 25 శాతాన్ని చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి సాధారణంగా 45 రోజుల వ్యవధినిస్తారు. సాధారణంగా ఒక బ్యాంకు వేలం వేసిన ఆస్తికి మరో బ్యాంకు రుణం ఇవ్వటానికి అంత సుముఖత వ్యక్తం చేయటం లేదు. అందుకని రుణం కోసం కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అది కూడా 45 రోజుల్లో చెల్లించాలి కనక ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ టెండర్ ఫారంతో పాటు కేవైసీ వివరాలన్నీ ఇవ్వాలి. ఒకవేళ గడువులోపల మొత్తం సొమ్ము చెల్లించని పక్షంలో వేలం పాట రర్దవుతుంది. రద్దయిన పక్షంలో అప్పటిదాకా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోవచ్చు కూడా. అదీ... వేలం కథ. ఎలా తెలుస్తుంది... బ్యాంకులు వేలం వేస్తున్న ఇంటి వివరాలను స్థానిక పత్రికల్లో తప్పకుండా ప్రకటన రూపంలో ఇవ్వాలి. ఇస్తున్నాయి కూడా. అలాకాకపోతే వేలం వేస్తున్న ఇంటి వివరాలను తెలుసుకోవడానికి ఇప్పుడు అనేక వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఫోర్క్లోజర్ ఇండియా డాట్ కామ్, బ్యాంక్స్ ఈ ఆక్షన్ డాట్ కామ్, ఎన్పీఏ ఆక్షన్ డాట్‌కామ్, క్వికర్, ఈ ఆక్షన్ డాట్ కామ్ వంటి వెబ్సైట్లు ఈ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాయి. ఫోర్క్లోజర్ ఇండియా వెబ్సైట్లో గనక మీ పేరు ఒకసారి నమోదు చేసుకుని, ఏ ప్రాంతంలో ఇళ్లపై మీకు ఆసక్తి ఉందో తెలియజేస్తే... ఆ ప్రాంతంలో ఏ బ్యాంకు ఏ ఆస్తిని వేలం వేస్తున్నా ఆ వివరాలు మీకు ఎప్పటికప్పుడు ఈమెయిల్ ద్వారా తెలియజేస్తున్నారు కూడా. ఇవన్నీ కాకుండా ఇప్పుడు బ్యాంకులు సొంతంగా ఆక్షన్స్‌ను కూడా నిర్వహిస్తున్నాయి. ఈ పోర్టల్స్ ద్వారా మీకు కావల్సిన చోట ఇంటిని వేలం వేస్తుంటే దానిలో పాల్గొని చేజిక్కించుకోవచ్చు. ఇంటికి వెళ్ళండి వేలంలో పాల్గొనే ఇంటికి స్వయంగా వెళ్ళి పరిశీలించాలి. ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలి. కట్టాల్సిన విద్యుత్, ఆస్తి, మంచినీటి బిల్లులు వంటి వివరాలు కూడా తెలుసుకోండి. ఇప్పుడు బ్యాంకులే ఒక రోజున వేలంలో పాల్గొనే వారందరినీ ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తున్నాయి. ఎప్పుడు చూపించేది, ఆ ఇంటి వివరాలకు సంబంధించిన కాగితాల కోసం ఎవరిని సంప్రదించాలన్నవి వేలం ప్రకటనల్లోనే చెబుతున్నాయి. ఇలా బ్యాంకులే ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తున్నాయంటే.. ఆ ఇంటిని బ్యాంకు పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లే లెక్క. ఇలాంటి సందర్భాల్లో వేలం తర్వాత ఆ ఇంటికి సంబంధించి న్యాయపరమైన వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండవు. కాకపోతే వేలం వేసేటపుడు బ్యాంకులు ‘ఎక్కడ ఎలా ఉన్నది అలానే’ అన్న నియమం పెడతాయి. అందుకే ఆ ఆస్తికి సంబంధించిన పెండింగ్ బిల్లుల గురించి ముందే తెలుసుకోవాలి. -
నిష్పక్షపాతంతో పనిచేయండి
న్యూఢిల్లీ: మొండి బకాయిలు పెరిగిపోతుండడంపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి భయమూ, పక్షపాతమూ లేకుండా వృత్తి ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకుల చీఫ్‌లకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన ఇక్కడ పీఎస్‌యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల నియామకాల ప్రక్రియలో ఎటువంటి లోపాలూ లేకుండా చూడ్డానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందని అన్నారు. అత్యుత్తమ బాధ్యతతో కూడిన వృత్తి సంబంధమైన అంశాలు బ్యాంకర్ల నిర్ణయాలను ప్రభావితం చేయాలితప్ప, స్వార్థపూరితమైన ఇతర అంశాలు కాకూడదని పేర్కొన్నారు. నిర్ణయాలను ప్రభావితం చేసే వెలుపలి అనైతిక అంశాలు ఏవైనా అవి అనర్హతకు దారితీస్తుందని అన్నారు. అనంతరం జైట్లీ విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక రంగం వృద్ధే లక్ష్యంగా వివిధ రంగాలకు రుణం అందేలా, అవసరమైన రంగంలో రుణ వృద్ధి పెరిగేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. తగిన రుణ లభ్యత కోసం పలు రంగాలు ఎదురుచూస్తున్నాయన్నారు. హైదరాబాద్‌లో కొత్త డీఆర్టీ! డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్స్ (డీఆర్టీ),హైకోర్టుల ద్వారా మొండి బకాయిల విషయంలో తమ ప్రయోజనాల పరిరక్షణకు బ్యాంకులు కృషి చేయాలని సమావేశంలో జైట్లీ సూచించినట్లు ఒక ప్రకటన తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చండీగఢ్సహా ఆరు ప్రాంతాల్లో 2015-16లో కొత్త డీఆర్టీలను ఏర్పాటు చేయనున్న విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు పేర్కొంది. పరిశోధనా సంస్థ- ఐసీఆర్ఏ నివేదిక ప్రకారం 2015 మార్చి 31వ తేదీనాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు మొత్తం రుణ పరిమాణంలో 4.4 శాతం నుంచి 4.7 శాతంగా ఉండవచ్చని అంచనా. 2014 జూన్ నెల ముగిసే నాటికి ఈ రేటు 4.6 శాతంగా ఉంది. -
ఆరు బ్యాంకుల సీఎండీలపై మోడీ సర్కారు వేటు
ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకుల సీఎండీలపై నరేంద్ర మోడీ సర్కారు వేటు వేసింది. ఆగస్టులో లంచం తీసుకున్న ఆరోపణలతో సిండికేట్ బ్యాంకు ఛైర్మన్‌ను అరెస్టు చేసిన తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బ్యాంకుల సీఎండీల ఎంపిక విధానంలోనే అక్రమాలున్నాయంటూ ఓ ఉన్నతస్థాయి కమిటీ సర్కారుకు నివేదిక సమర్పించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్, విజయా బ్యాంకుల సీఎండీలను ఇప్పుడు తొలగించారు. వీరంతా యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైనవాళ్లే. ఇప్పుడు తీసేసిన వాళ్లతో పాటు ఇప్పటికే ఖాళీగా ఉన్న మరో 8 సీఎండీ పోస్టులను, 14 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. సిండికేట్ బ్యాంకు ఛైర్మన్ ఎస్కే జైన్ అరెస్టు తర్వాత ఈ బ్యాంకు సీఎండీల నియామకాలపై దృష్టిపెట్టారు. కొత్త విధానంలోనే భవిష్యత్తులో మొత్తం బ్యాంకుల సీఎండీల నియామకాలు జరుగుతాయని ఆర్థికమంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో జరిగిన బ్యాంకు అధినేతల నియామకాలపై కూడా పరిశీలన మొదలుపెట్టినట్లు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొత్తం ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. -
బ్యాంకు ఖాతాల్లేకపోవడం సిగ్గుచేటు
పుణే: భారతీయుల్లో చాలా మందికి బ్యాంకులు అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కేవైసీ ప్రమాణాల్లో అధికారుల జోక్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం పుణెలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సదస్సులో రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతాపరమైన అంశాల్లో రాజీపడకుండానే బ్యాంకులను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చేవిధంగా కేవైసీ ప్రమాణాలను మెరుగుపర్చవచ్చా అని ఆయన ప్రశ్నించారు. ‘పదవీ విరమణ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు బ్యాంకు అకౌంటు ప్రారంభించడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేకపోవడంతో ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. బ్యాంకు ఖాతా ప్రారంభించడంలోనూ, ఇతర ద్రవ్య లావాదేవీల్లోనూ కేవైసీ (మీ ఖాతాదారును తెలుసుకోండి) ప్రమాణాలను కఠినతరం చేసిన దువ్వూరికే ఇలాంటి అనుభవం ఎదురవడం ఆశ్చర్యకరం. ఆర్బీఐ మాజీ ఉన్నతాధికారే బ్యాంకు అకౌంటును ప్రారంభించలేకపోయారంటే వ్యవస్థలోనే లోపం ఉందని భావించాలి...’ అని రాజన్ వ్యాఖ్యానించారు. దేశ జనాభా 123 కోట్లుండగా కేవలం 35 కోట్ల మందికే బ్యాంకు ఖాతాలున్నాయని ఈ సదస్సులో ప్రసంగించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు. మొండిబకాయిలపై...: అంతకంతకూ పెరిగిపోతున్న మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను పరిష్కరించేందుకు సరైన మార్గాలు వెతకాలే తప్ప పైపై మెరుగులు దిద్దేందుకు ప్రయత్నించరాదని బ్యాంకులకు రాజన్ సూచించారు. వరుసగా మూడేళ్లు కట్టకపోయినంత మాత్రాన సదరు రుణాలను మొండిబకాయిలుగా లెక్కించకుండా, మరికొంత సమయం ఇవ్వాలంటూ బ్యాంకులు, కార్పొరేట్ల నుంచి తమకు అభ్యర్థనలు వచ్చినట్లు ఆయన చెప్పారు. ‘రుణం తీసుకున్న వారు నేడు కట్టకపోతే.. రేపు కూడా కట్టలేకపోవచ్చు. ఈ సమస్యను పరిష్కరించాలంటే.. సదరు రుణాన్ని ఏ విధంగా మళ్లీ రాబట్టుకోవచ్చన్న దానిపై దృష్టి పెట్టాలి’ అని చెప్పారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) డిసెంబర్ క్వార్టర్లో ఆల్‌టైమ్ గరిష్టమైన 5 శాతం పైకి పెరిగిన సంగతి తెలిసిందే. వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు బ్యాంకింగ్ లెసైన్సులు రాని సంస్థలపై రాజన్ వ్యాఖ్య పుణే: బ్యాంకింగ్ లెసైన్సుల కోసం 25 దరఖాస్తులు రాగా రెండు సంస్థలకు మాత్రమే వాటిని జారీచేయడాన్ని రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సమర్థించుకున్నారు. దరఖాస్తు చేసిన సంస్థల్లో కొన్ని ప్రత్యేక సేవల (డిఫరెన్షియేటెడ్) బ్యాంకులుగా మెరుగ్గా పనిచేస్తాయని ఎంపిక కమిటీ భావించిందని చెప్పారు. ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ (ఎన్ఐబీఎం) వార్షిక సదస్సు సందర్భంగా శుక్రవారం పుణెలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘దరఖాస్తుల జాబితాను మేం సమగ్రంగా పరిశీలించాం. బిమల్ జలాన్ కమిటీ, ఆర్బీఐ సంతృప్తి వ్యక్తం చేసిన జాబితా ఇది. ప్రస్తుతం లెసైన్సులు లభించని వారు మేం మళ్లీ లెసైన్సుల జారీని ప్రారంభించినపుడు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం. అంతేకాదు, ప్రత్యేక సేవల బ్యాంకింగ్ లెసైన్సులను కూడా సృష్టిస్తాం. పూర్తి లెసైన్సు కంటే ప్రత్యేక సేవల లెసైన్సును అభ్యర్థించడం కొందరు దరఖాస్తుదారులకు మంచిది కావచ్చు..’ అని ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. మౌలిక సౌకర్యాల ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసే ఐడీఎఫ్సీ, కోల్‌కతాకు చెందిన బంధన్ సంస్థలకు రిజర్వు బ్యాంకు ఇటీవల బ్యాంకింగ్ లెసైన్సులు మంజూరు చేసిన సంగతి విదితమే. ఇండియా పోస్ట్‌కు లెసైన్సు ఇవ్వదలచుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సంప్రదించడం మంచిదని బిమల్ జలాన్ కమిటీ పేర్కొందని రాజన్ చెప్పారు. -
ఆ బాధ్యతంతా పీఎస్యూలదే
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్పీఏ) బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంకులదేనని ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పష్టంచేశారు. ఇందుకు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించటం సమంజసం కాదన్నారు. శనివారమిక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) 20వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్పీఏల బాధ్యత ఆయా బ్యాంకుల బోర్డులదే. రికవరీ విధానాలు ప్రస్తుతం కొంత సరళంగా ఉన్న మాట నిజం. అవి మారాల్సి ఉంది. అయితే బ్యాంకుల రుణ రేటు పెరుగుతోంది కనక ఎన్పీఏలు పెరిగినా సరే ప్రభుత్వం వాటికి తాజా మూలధనాన్ని అందిస్తోంది’’ అని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... మార్కెట్ అక్రమాలను నిరోధించడానికి వీలుగా రెగ్యులేటర్ సెబీకి మరిన్ని అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి సభా సంఘం తన నివేదికను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు సమర్పించకపోతే మూడో సారి సైతం ఆర్డినెన్స్‌ను పొడిగించాల్సి ఉంటుంది. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫారసుల ప్రకారం ద్రవ్య పరపతి విధానం రూపకల్పన, బ్యాంకింగ్ రెగ్యులేషన్ మినహా ఆర్బీఐ నిర్వహిస్తున్న ఇతర కార్యకలాపాలు కొన్నింటిని సమీక్షించాల్సి ఉంది. వీలైతే ఆయా అధికారాలను ప్రభుత్వం లేదా ఇతర నియంత్రణ సంస్థలకు అప్పగించాలి. -
ఎస్బీఐకి 2 వేల కోట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులకు ఈ ఏడాది(2013-14)లో రూ.14,000 కోట్ల మూలధన పెట్టుబడులను సమకూర్చాలన్న బడ్జెట్ ప్రతిపాదనల్లో భాగంగా బుధవారం ఆర్థికశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు రూ.2,000 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అలాగే ఐడీబీఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు సైతం రూ.1,800 కోట్ల చొప్పున పెట్టుబడులను సమకూర్చాలని నిర్ణయించింది. చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇండియన్ బ్యాంక్ మినహా మొత్తం 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.100 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల శ్రేణిలో పెట్టుబడులను కేంద్రం నుంచి పొందనున్నాయి. తనకు తాజా క్యాపిటల్ అక్కర్లేదని ఇండియన్ బ్యాంక్ ఆర్థికశాఖకు తెలియజేసింది. ఈ వివరాలను ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ బుధవారమిక్కడ తెలిపారు. ప్రభుత్వం నుంచి అందుతున్న మూలధన పెట్టుబడుల మద్దతుతోపాటు ప్రభుత్వ ప్రస్తుత వాటాలను విక్రయించాల్సిన అవసరం లేకుండా రైట్స్ ఇష్యూ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్), ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా మార్కెట్ నుంచి రూ.10,000 కోట్లు సమీకరించుకోడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. పీఎస్‌యూ బ్యాంక్‌ల చీఫ్‌లతో మంగళవారం ఆర్థికమంత్రి చిదంబరం భేటీ అయిన మర్నాడే ఆర్థికశాఖ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. క్యూ4లో మరో విడత! బ్యాంక్ అవసరాలు, రుణాలకు సంబంధించి వాటి పనితీరు ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో(జనవరి-మార్చి, క్యూ4) రెండో దఫా మూలధన పెట్టుబడుల కేటాయింపులు ఉంటాయని రాజీవ్ టక్రూ పేర్కొన్నారు. ఎస్బీఐ క్యూఐపీ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, దామాషా ప్రాతిపదికన బ్యాంక్ నిధులు సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఎస్బీఐలో ప్రభుత్వానికి ప్రస్తుతం 62% వాటా ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న జరగనున్న ఎస్బీఐ బోర్డ్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 2012-13లో 13 పీఎస్‌యూ బ్యాంకులకు రూ.12,517 కోట్ల నిధులను కేంద్రం సమకూర్చింది. -
మొండి బకాయిల కట్టడే లక్ష్యం
న్యూఢిల్లీ: బడా రుణగ్రహీతల రుణ ఎగవేతలపై ఆర్థిక మంత్రి పి. చిదంబరం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకుల్లో మొండిబకాయిల(ఎన్పీఏ)ల కట్టడికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టికేంద్రీకరిస్తోందన్నారు. మంగళవారం ఇక్కడ పీఎస్‌యూ బ్యాంక్‌ల చీఫ్‌లతో పనితీరు సమీక్ష సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రతి బ్యాంకులో టాప్-30 ఎన్పీఏ ఖాతాలను ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తొలగించిన ఖాతాల నుంచి బకాయి సొమ్మును సాధ్యమైనంత మేర రికవరీ చేసుకోవడానికి ఎస్బీఐ మాదిరిగా ఇతర పీఎస్‌యూ బ్యాంకులన్నీ కూడా ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనం ఆందోళనకరస్థాయిలో ఏమీలేదన్నారు. ‘2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం ఈ ఎన్పీఏల పరిస్థితి మరీ అంత ఘోరంగా ఏమీ లేదు. అప్పట్లో స్థూల ఎన్పీఏలు 14 శాతం గరిష్టాన్ని కూడా తాకింది. కాగా, గత కొద్ది సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంతోపాటే మళ్లీ మొండిబకాయిలు కూడా పేరుకుపోతూ వస్తున్నాయి’ అని వివరించారు. రుణ వృద్ధిపై సంతృప్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి, రెండో(క్యూ1,క్యూ2) త్రైమాసికాల్లో పీఎస్‌యూ బ్యాంకుల రుణ వృద్ధి పట్ల చిదంబరం సంతృప్తిని వ్యక్తం చేశారు. ద్వితీయార్ధంలో కూడా ఇదేవిధమైన పనితీరును ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రధానంగా క్యూ1, క్యూ2లలో గృహ రుణాల్లో 42 శాతం, 61 శాతం చొప్పున వృద్ధి నమోదైందని, విద్యా రుణాల్లో కూడా సానుకూల వృద్ధే కనబడినట్లు ఆయన పేర్కొన్నారు. మైనారిటీలకు రుణ లక్ష్యాలను అందుకోవడంపై దృష్టిపెట్టాలని బ్యాంకులకు సూచించారు. కాగా, పీఎస్‌యూ బ్యాంకులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,000 కోట్ల మూలధనం అందించే ప్రతిపాదనను ఆర్థిక శాఖ ఖరారు చేసింది. ఈ నిధులను ఏవిధంగా ఇవ్వాలనేదానిపై ఆర్బీఐ, సెబీలతో సంప్రతింపుల అనంతరం త్వరలోనే నిర్ణయిస్తామని చిదంబరం వెల్లడించారు. బంగారు నాణేలపై నిషేధం ఎత్తివేయం... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు అడ్డుకట్టవేయడం కోసం బంగారు నాణేలు, పెద్దపెద్ద పసిడి పతకాల దిగుమతిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాల్లేవని చిదంబరం స్పష్టం చేశారు. బంగారం దిగుమతులపై ఆర్బీఐ, ప్రభుత్వం విధించిన నియంత్రణలు, నిబంధనలను బ్యాంకులు కచ్చితంగా పాటించాల్సిందేనని కూడా ఆయన తేల్చిచెప్పారు. శుభకార్యాలకు బహుమతులకోసం పసిడి నాణేల దిగుమతికి అనుమతించాలన్న సూచనలపై స్పందిస్తూ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ట్రేడర్లు దేశీ మార్కెట్ నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి నాణేలను తయారుచేసుకోవచ్చని, అంతేకానీ ప్రభుత్వం మాత్రం దిగుమతులను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోదని పేర్కొన్నారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడిపీతో పోలిస్తే 4.8 శాతం; 88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధానంగా భారీస్థాయిలో బంగారం దిగుమతులే(845 టన్నులు) ఆజ్యం పోశాయి. ఈ ఏడాది క్యాడ్‌ను 3.7 శాతానికి కట్టడి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం అటు ఆర్బీఐ, ఇటు కేంద్రం బంగారం దిగుమతులపై భారీ నియంత్రణలు విధించాయి. దీంతో పుత్తడి దిగుమతులు భారీగా దిగొస్తున్నాయి కూడా. ఈ ఏడాది మే నెలలో 162.4 టన్నుల గరిష్టస్థాయి దిగుమతులు జరగగా... సెప్టెంబర్‌లో ఇవి 7.2 టన్నులకు పడిపోవడగం గమనార్హం. -
ప్రభుత్వరంగ బ్యాంకుల సమ్మె యోచన విరమణ
ఖాతాదారులకు శుభవార్త.. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ బుధవారం సాధారణంగానే పనిచేస్తాయి. ఈ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు తాము తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. బ్యాంకులను విలీనం చేయాలన్న ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో వారు సమ్మె విరమించుకున్నారు. ప్రధాన లేబర్ కమిషనర్ వద్ద ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, భారతీయ బ్యాంకుల ఉద్యోగుల సంఘం నాయకుల మధ్య జరిగిన సమావేశంలో.. సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయాలన్న యోచన ఏదీ ప్రస్తుతానికి లేదన్న హామీని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు ఇచ్చారని, రెండు యూనియన్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. దాంతో సమ్మె యోచనను విరమించుకున్నామన్నారు.