విలీనాలకు మూలధన మద్దతు!
♦ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాలపై ఆర్థిక శాఖ సంకేతం
♦మొండిబకాయిలకు పరిష్కారమే లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల(పీఎస్‌బీ) మధ్య విలీనాలను ప్రోత్సహించడం కోసం తగినంత మూలధనాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ప్రధానంగా కొండలా పేరుకుపోయిన మొండిబకాయిల సమస్యను పరిష్కరించాలంటే బ్యాంకుల విలీనాలే శరణ్యమని.. అందుకు మూలధన నిధుల రూపంలో తోడ్పాటునివ్వనున్నట్లు ఆర్థిక శాఖ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. పీఎస్‌బీల విలీనాన్ని వేగవంతం చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని లేదా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.
‘మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న బ్యాంకుల మధ్య విలీన ప్రతిపాదన వచ్చిన పక్షంలో... విలీనం వల్ల పటిష్టమైన బ్యాంకు ఆవిర్భవిస్తుందని మంత్రుల బృందం విశ్వసిస్తే.. వాటికి మూలధన నిధుల కొరత లేకుండా చూస్తాం. కొనుగోలు చేసే బ్యాంకుకు ఏదైనా మూలధన అవసరం ఉంటేగనుక కేంద్రం కచ్చితంగా అందిస్తుంది. అయితే, విలీన ప్రతిపాదన అనేది ఆయా బ్యాంకుల బోర్డుల నుంచే రావాల్సి ఉంటుంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆర్థిక శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.
మార్చికల్లా ఒక విలీనం ఖాయం!
ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా(2018, మార్చినాటికి) కనీసం ఒక విలీన ప్రతిపాదనను అయినా ఖాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయా వర్గాలు చెబుతున్నాయి. అయితే, విలీనాలకు నిర్దిష్టంగా ఒక లక్ష్యాన్ని ఏదీ పెట్టుకోలేదని కేబినెట్ నిర్ణయం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం దేశంలో ఎస్‌బీఐ కాకుండా మరో 20 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి మొత్తం మొండిబకాయిల పరిమాణం రూ.6 లక్షల కోట్లుగా అంచనా. బ్యాంకింగ్ వ్యవస్థలోని మొత్తం ఎన్‌పీఏల్లో ఇది 75 శాతానికి సమానం. కాగా, ప్రభుత్వ ప్రత్యేక యంత్రాంగం నుంచి విలీనానికి సూత్రప్రాయ ఆమోదం లభిస్తే... దీనికి అనుగుణంగా చట్టపరమైన, సెబీ నిబంధనల మేరకు తగిన చర్యలను ఆయా బ్యాంకులు చేపట్టాల్సి ఉంటుంది. విలీనానికి తుది ఆమోద నిర్ణయం మాత్రం కేంద్ర కేబినెట్ తీసుకుంటుంది.
2–3 బ్యాంకులూ విలీనం కావచ్చు...
పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... ఏదైనా చిన్న లేదా మధ్య స్థాయికి చెందిన ఒక పీఎస్‌బీని మాత్రమే విలీనం చేసుకోవాలనేమీ లేదని, అవసరమైతే 2–3 బ్యాంకులను కూడా విలీనపర్చి పటిష్టమైన, భారీ బ్యాంకుగా ఆవిర్భవించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల మూలధన నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గుతుందని వ్యాఖ్యానించాయి. ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకు(బీఎంబీ)ను విజయవంతంగా విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరు బ్యాంకులను విలీనం చేసుకోవడం ద్వారా ఎస్‌బీఐ ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఆవిర్భవించగలిగింది. ఎస్‌బీఐ మొత్తం కస్టమర్ల సంఖ్య దాదాపు 37 కోట్లకు చేరగా... బ్రాంచ్‌ల సంఖ్య 24 వేలకు, ఏటీఎంలు 54 వేలకు చేరాయి.
బ్యాంకింగ్ చట్ట సవరణలు నోటిఫై...
బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో తీసుకొచ్చిన సవరణలకు ఇటీవల పార్లమెంటు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఈ చట్టాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం మొండిబకాయిల రికవరీ కోసం బ్యాంకు లు దివాలా ప్రక్రియను (ఇన్‌సాల్వెన్సీ, అండ్ బ్యాంక్రప్సీ కోడ్–2016 కింద) మొదలుపెట్టేందుకు అవసరమైన ఆదేశాలను ఇచ్చేవిధంగా ఆర్‌బీఐకి అధికారాలు లభిస్తాయి. అంతక్రితం దీనిపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు పూర్తిస్థాయిలో చట్టం అమల్లోకి వచ్చినట్లయింది.
కాగా, దేశీ బ్యాంకింగ్ రంగంలో మొండిబకాయిలు రూ.8 లక్షల కోట్లకుపైగానే పేరుకుపోయాయి. ఇందులో ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకులవే రూ.6 లక్షల కోట్లు. ఆర్డినెన్స్ ఆధారంగా ఆర్‌బీఐ ఇప్పటికే దాదాపు 12 భారీ మొండిబకాయిల ఖాతాలను (రూ.5,000 కోట్లకుపైబడిన ఎన్‌పీఏలు) గుర్తించి.. దివాలా చట్టాన్ని ప్రయోగించాల్సిందిగా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది కూడా. మొత్తం ఎన్‌పీఏల్లో ఈ 12 కార్పొరేట్ ఖాతాలవే 25 శాతం కావడం గమనార్హం. ఈ జాబితాలో ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఏబీజీ షిప్‌యార్డ్, ఎలక్ట్రోస్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ వంటివి ఉన్నాయి.
కాగా, పీఎస్‌బీలు ఇప్పటివరకూ 5,954 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులపై(విల్‌ఫుల్ డిఫాల్టర్స్) సర్ఫేసీ చట్టం కింద రికవరీ చర్యలు చేపట్టాయని ఆర్థిక శాఖ గణాంకాల్లో వెల్లడైంది. ఈ విల్‌ఫుల్ డిఫాల్టర్స్ ఎగ్గొట్టిన రుణాల విలువ రూ.70,000 కోట్లుగా లెక్కతేలింది. ఇందులో ఎస్‌బీఐ 1,444 మందిపై చర్యలు తీసుకుంది. వీరి బకాయిల విలువ రూ.20,943 కోట్లు.