న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ బూస్ట్ అందించింది. గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన అతిపెద్ద బ్యాంకు రీక్యాపిటలైజేషన్ ప్లాన్ వివరాలను నేడు(బుధవారం) వెల్లడించింది. మొండిబకాయిలను సమస్యపై పోరాడమే లక్ష్యంగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వహణను మెరుగుపరిచేందుకు కేంద్రం ఈ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో భాగంగా తొలుత రూ.88,139 కోట్ల మూలధనాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోకి చొప్పించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
వాటిలో భాగంగా ఎస్‌బీఐకి రూ.8,800 కోట్లు, ఐడీబీఐకి రూ.10,610 కోట్లు, పీఎన్‌బీకి రూ.5,740 కోట్లు, బీవోబీకి రూ.5,375 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.4,865 కోట్లు, యూనియన్ బ్యాంకుకు రూ.4524 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.2,839 కోట్లు, ఆంధ్రాబ్యాంకుకు రూ.1,890 కోట్లు, విజయ్ బ్యాంకుకు రూ.1,277 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుకు రూ.785 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియాకు రూ.9,232 కోట్లు, యూసీఓకు రూ.6,507 కోట్లు, ఐఓబీకి రూ.4,694 కోట్లు, ఓబీసీకి రూ.3,571 కోట్లు, దేనా బ్యాంకుకు రూ.3,045 కోట్లు, బ్యాంకు ఆఫ్ మహారాష్ట్రకి రూ.3,173 కోట్లు, యునిటెడ్ బ్యాంకుకు రూ.2,634 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకుకు రూ.2,187 కోట్లు, అలహాబాద్ బ్యాంకుకు రూ.1,500 కోట్లు లభించనున్నాయి.
ఈ రూ.88,139 కోట్లలో రూ.8,139 కోట్లను బడ్జెట్ కేటాయింపుల ద్వారా అందించనుంది. ఈ రీక్యాపిటలైజేషన్‌ను బ్యాంకుల పనితీరు ఆధారంగా చేసుకుని అందించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆరోగ్యకరంగా ఉంచడమే తమ ముఖ్యమైన బాధ్యత అని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. బ్యాంకులకు ఎఫ్‌డీఐ పరిమితిని పెంచే ప్రతిపాదనేమీ లేదన్నారు. కాగ, వచ్చే రెండేళ్లలో మొండిబకాయిలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.11 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు అరుణ్‌జైట్లీ గతేడాదే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment