ఖాతాదారులకు శుభవార్త.. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ బుధవారం సాధారణంగానే పనిచేస్తాయి. ఈ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు తాము తలపెట్టిన సమ్మెను విరమించుకున్నారు. బ్యాంకులను విలీనం చేయాలన్న ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో వారు సమ్మె విరమించుకున్నారు.
ప్రధాన లేబర్ కమిషనర్ వద్ద ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు, భారతీయ బ్యాంకుల ఉద్యోగుల సంఘం నాయకుల మధ్య జరిగిన సమావేశంలో.. సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేయాలన్న యోచన ఏదీ ప్రస్తుతానికి లేదన్న హామీని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు ఇచ్చారని, రెండు యూనియన్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని ఆయన చెప్పారు. దాంతో సమ్మె యోచనను విరమించుకున్నామన్నారు.