ముంబై : బ్యాంకు ఉద్యోగులు మరోసారి బంద్‌కు దిగబోతున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకర్లు ఈ నెల ఆఖరున 48 గంటల పాటు బంద్‌కు దిగనున్నట్టు పిలుపునిచ్చారు. వేతనాల సమీక్ష విషయంలో శనివారం యునిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు ఉద్యోగులు ఈ బంద్ చేపట్టబోతున్నారు. యూఎఫ్‌బీయూలో తొమ్మి బ్యాంకు యూనియన్లు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులకు అందించే వేతన పెంపు చాలా తక్కువ మొత్తంలో ఉందని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. కేవలం రెండు శాతం పెంపు చేపట్టడం చాలా దారుణమన్నారు.
బ్యాంకు ఉద్యోగుల వేతన చర్చలను, వేతన సమీక్షను 2017 నవంబర్ 1వరకు పూర్తి చేయాలని బ్యాంకు మేనేజ్‌మెంట్లను, ఐబీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు సార్లు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్, బ్యాంకు యూనియన్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై 2018 మార్చి 15న యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోసారి ఐబీఐ చర్చలకు పిలవడంతో, యూనియన్లు ఆ బంద్‌ను వాయిదా వేశాయి. శనివారం ముంబైలో బ్యాంకు యూనియన్లకు, ఐబీఏకు మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ నెల ఆఖరున రెండు రోజులు బంద్‌చేపట్టాలని యూనియన్లు నిర్ణయించాయి.
2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. కానీ ఈ పెంపును 2 శాతం మాత్రమే చేపట్టనున్నట్టు ఐబీఏ 2017 మార్చి 3న ప్రకటించింది. ప్రస్తుతం ఐబీఏ ఆఫర్‌చేసే మొత్తం చాలా తక్కువగా ఉందని, ఈ ఆఫర్‌ను యూనియన్లు తిరస్కరిస్తున్నట్టు టాప్ యూనియన్ నాయకుడు చెప్పారు. ఈ విషయంలో వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. వేతన పెంపును పెంచేలా ఐబీఏకి సూచించాలని, ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంలో విఫలమైతే ఈ నెల చివరిన 48 గంటల పాటు బంద్ చేయనున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment