wage revision
-
కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగుల జేఏసీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యాలు ప్రతిపాదించిన 7 శాతం ఫిట్మెంట్తోపాటు ఇంక్రిమెంట్ల మంజూరు, పలు ఇతర ప్రతిపాదనలకు జేఏసీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీనితో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్టు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించగా, అన్నిరకాల ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. పలు విడతల్లో జరిగిన చర్చలతో.. విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై వేసిన పీఆర్సీ కమిటీ తొలుత 5శాతం ఫిట్‌మెంట్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీనితో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలోని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ర్టీసిటీ ఎంప్లాయిస్ జేఏసీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. తొలుత 6 శాతం, తర్వాత 7 శాతానికి ఫిట్‌మెంట్‌ను పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా జేఏసీలు తిరస్కరించాయి. అయితే శనివారం మరోసారి జరిగిన చర్చల్లో అనూహ్యంగా 7శాతం ఫిట్మెంటే ఫైనల్ కావడం గమనార్హం. చర్చల్లో అంగీకారం కుదిరిన అంశాలపై యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. చర్చల్లో ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్‌రావు, జి.రఘుమారెడ్డి, పవర్ జేఏసీ నేతలు జి.సాయిబాబు, రత్నాకర్‌రావు, ఎలక్ట్రిసిటీ జేఏసీ నేత ఎన్.శివాజీ పాల్గొన్నారు. ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ♦ 7 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న 24.992 శాతం డీఏ (కరువు భత్యం) వేతనంలో విలీనం. ♦ 2022 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ వర్తింపు. బకాయిలను జీతం/పెన్షన్‌తో పాటు 12 నెలల సమ వాయిదాల్లో చెల్లిస్తారు. ♦ ఈపీఎఫ్‌కు బదులు జీపీఎఫ్ సదుపాయం కల్పనపై విద్యుత్ సంస్థల బోర్డుల్లో సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ♦ వర్క్‌మెన్, ఇతరులకు సింగిల్ మాస్టర్ స్కేలువర్తింపు. ♦ ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పేలో విలీనం చేస్తారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ, సీసీఏ సదుపాయం. ఈ విషయంలో పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ జీవోల అమలు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.16 లక్షల గ్రాట్యూటీ, అదనపు పెన్షన్ సదుపాయం. ♦ జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.10లక్షలు, ఆర్టీజన్లకు రూ.2లక్షల పరిమితితో వైద్య సదుపాయం. ♦ పెద్ద జబ్బులకు జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.15లక్షల వరకు వైద్య సదుపాయం (ఒక విడతలో రూ.5లక్షల గరిష్ట పరిమితి). ♦ సెల్ఫ్ ఫండింగ్ వైద్య పథకం కింద నెలకు రూ.1,000 చెల్లిస్తే.. ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు రూ.12లక్షల వరకు వైద్య సదుపాయం. ♦ ఈఎన్టీ/డెంటల్/కంటి వైద్యానికి పరిమితి రూ.15వేల నుంచి రూ.50వేలకు పెంపు. ఆపై ఖర్చులను సెల్ఫ్ ఫండింగ్ పథకం నుంచి చెల్లిస్తారు. ♦ 5 ఏళ్లలోపు సర్విసు ఉంటే ఒక ఇంక్రిమెంట్, ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య సర్విసుంటే రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లకుపైగా సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ఆర్టిజన్లకు రెండు ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ప్రస్తుత అలవెన్సులను ప్రస్తుత రేట్లతో యథాతథంగా కొనసాగిస్తారు. ♦ జెన్కో ఉద్యోగుల ప్రత్యేక అలవెన్సు కొనసాగింపు 25 నుంచి ఆర్టీజన్ల సమ్మె యథాతథం ఆర్టిజన్లకు 7శాతం ఫిట్‌మెంట్‌ను తిరస్కరిస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లుగా విలీనమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు. తమను చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు ఇప్పటికే హెచ్ఆర్ఏ తగ్గించారన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగినట్టుగా పీఆర్సీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
విద్యుత్‌సౌధ అష్టదిగ్బంధనం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్‌సౌధను ఉద్యోగులు అష్టదిగ్బంధనం చేశారు. వేతన సవరణ, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం చలో విద్యుత్‌సౌధ కార్యక్రమానికి 24 సంఘాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్(టీఎస్పీఈ జేఏసీ) కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జేఏసీ పిలుపు మేరకు గ్రేటర్ హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, ఆర్టీజన్ కార్మి కులు ఉదయం పదిగంటలకే పెద్దసంఖ్యలో సోమాజిగూడలోని విద్యుత్‌సౌధకు చేరుకున్నారు. అనుకున్న దానికంటే అధిక సంఖ్యలో తరలిరావడంతో విద్యుత్‌సౌధ ప్రాంగణమంతా నిండిపోయింది. మిగిలినవాళ్లంతా ప్రధాన కార్యాలయం ముందున్న రహదారిపైనే నిలబడాల్సి వచ్చింది. దీంతో ఇటు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి అటు పంజగుట్ట వరకు రోడ్డంతా విద్యుత్ కార్మి కులతో నిండిపోయింది. ట్రాఫిక్ మళ్లింపు.. ఎక్కడి వాహనాలు అక్కడే.. విద్యుత్ ఉద్యోగుల ధర్నాతో లక్డీకాపూల్, పంజగుట్ట, ఎన్టీఆర్ మార్గ్, సోమాజిగూడ, ఎర్రమంజిల్ పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజగుట్ట వైపు వెళ్లే రోడ్డుమార్గాన్ని బారికేడ్లతో మూసివేశారు. అసెంబ్లీ మీదుగా వచ్చి న వాహనాలను రాజ్‌భవన్ మీదుగా బేగంపేట వైపు మళ్లించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు రోడ్లన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఆందోళనకారులు ఒక్కసారిగా పెద్దసంఖ్యలో రోడ్డుపైకి రావడం, సీఎం కేసీఆర్, సీఎండీ ప్రభాకర్‌రావుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ముందే పసిగట్టిన జేఏసీ నేతలు ధర్నా విజయవంతమైందని చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని ముగించారు. ధర్నా కారణంగా రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనచోదకులు, ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మొండివైఖరిపై మండిపడిన జేఏసీ ఉద్యోగుల వేతనాలను వెంటనే సవరించాలని, 1999 నుంచి 2004 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ నుంచి జీïపీఎస్ సదుపాయాన్ని కల్పించాలని, ఆర్టీజన్ కార్మి కుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, చైర్మన్ సాయిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నావేదికపై నుంచి వీరు కార్మి కులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా వారి నుంచి కనీసస్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని, రూ.కోటి లైఫ్‌టైమ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని, రిటైర్మెంట్ గ్యారంటీని జీపీఎఫ్ ఉద్యోగులకు రూ.16 లక్షలు, ఈపీఎఫ్ ఉద్యోగులకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా విద్యుత్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
వారంలోగా విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వారంరోజుల్లో విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై ప్రకటన చేస్తామని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సోమవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీతో చర్చించి ఓ ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. అనంతరం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సమర్పించే నివేదికపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శనివారం జగదీశ్‌రెడ్డిని మింట్ కాంపౌండ్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి పీఆర్సీ ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ వేతన సవరణ సంప్రదింపుల కమిటీ విద్యుత్ ఉద్యోగులకు 5 శాతం, ఆర్టిజన్లకు 10 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సిఫారసు చేయగా, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక జాప్యం చేయకుండా వారంలో పీఆర్సీ ప్రకటిస్తామని, ఆందోళనలు విరమించుకోవాలని జగదీశ్‌రెడ్డి వారికి సూచించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కె.ప్రకాశ్, కన్వీనర్ శివాజీ, వైస్‌చైర్మన్ అంజయ్య, జేఏసీ నేతలు నాసర్ షరీఫ్ పాల్గొన్నారు. -
పీఆర్సీ కోసం ఉద్యమాలు ఉధృతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సాధన కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. 1004 యూనియన్ కార్యాలయంలో సోమవారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నోటీసులను యాజమాన్యానికి అందజేసినట్లు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ విషయంలో యాజమాన్యం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యాచరణలో భాగంగా ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్ స్థాయిల్లో సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 1, 2న డివిజన్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 3, 4న సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 8 నుంచి 23 వరకు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు, మార్చి 14న కేటీపీఎస్ ప్లాంట్ వద్ద, 17న వరంగల్‌లో, 21న శంషాబాద్‌లో నిరసన సభలు, 24న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయినా, యాజమాన్యం స్పందించని పక్షంలో 24న అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ పాల్గొన్నారు. -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్‌రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌కి బదులు జీపీఎఫ్‌ను అమలు చేయాలన్నారు. -
స్టీల్‌ప్లాంట్ వేతన చర్చల్లో ప్రతిష్టంభన
ఉక్కు నగరం (విశాఖ): స్టీల్‌ప్లాంట్ కార్మికుల వేతన చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆరు రోజులుగా జరుగుతున్న చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లపై యాజమాన్యం మొండి వైఖరి అవలంబించడంతో చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. చర్చల్లో కార్మిక సంఘాల్లో విభేదాలు వచ్చాయని, వాటిని యాజమాన్యం ఉపయోగించుకుని డిమాండ్లు నెరవేర్చడంలో అలసత్వం వహిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016 డిసెంబర్ 31తో ఉక్కు కార్మికులకు గత వేతన ఒప్పందం గడువు ముగిసింది. 2017 జనవరి 1 నుంచి జరగాల్సిన వేతన సవరణ నాలుగున్నరేళ్లు కావస్తున్నా జరగకపోవడంతో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. కార్మిక సంఘాలు తొలుత ఈ ఏడాది మే 6న సమ్మె చేయాలని సంకల్పించగా సెయిల్ చైర్మన్ వేతన సవరణకు హామీ ఇవ్వడంతో దాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా యాజమాన్యం కార్మిక సంఘాల డిమాండ్లకు పొంతన లేని ప్రతిపాదనలు చేసింది. దీంతో ఆగ్రహించిన కార్మిక సంఘాలు ఈ నెల 29న సమ్మె చేస్తామని యాజమాన్యానికి నోటీసిచ్చాయి. సమ్మె నివారణా చర్యల్లో భాగంగా నేషనల్ జాయింట్ కమిటీ ఫర్ స్టీల్ (ఎన్‌జేసీఎస్) ఆధ్వర్యంలో ఆరు రోజులుగా వేతన చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కార్మిక సంఘాలు 15% ఎంజీబీ డిమాండ్ చేయగా యాజమాన్యం 13% ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ప్రధానంగా పెర్క్స్ అంశంపై ఇరువర్గాల మధ్య పీటముడి బిగిసింది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వలే రివైజ్డ్ బేసిక్‌పై 35% పెర్క్స్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేయగా యాజమాన్యం 15% ఇస్తామని ప్రతిపాదించింది. 15% అంగీకరిస్తే జూనియర్ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కార్మిక సంఘాలు చెప్పినప్పటికీ యాజమాన్యం వైఖరిలో మార్పు రాలేదు. -
మళ్లీ సమ్మె బాటలో బ్యాంక్ సిబ్బంది
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల బ్యాంక్ యూనియన్ల సమ్మెకు తోడు వరుస సెలవలతో ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమ్మె కష్టాలు మరువక ముందే వచ్చే ఏడాది జనవరి 8, 9 తేదీల్లో మరోసారి బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ రంగ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వ్యతిరేకంగా అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్ ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్ఐ)లు బ్యాంకింగ్ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై రెండు రోజుల సమ్మెకు పిలుపు ఇచ్చాయని యునైటెడ్ బ్యాంక్ నోటిఫికేషన్లో పేర్కొంది. సమ్మె నేపథ్యంలో బ్యాంకు సేవలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు చేపడతామని తెలిపింది. సమ్మె యునైటెడ్ బ్యాంక్ వరకే పరిమితమా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు వర్తిస్తుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదని అధికారులు వెల్లడించారు. ఇటీవల బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం విత్డ్రాయల్స్పై ప్రభావం చూపడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్న క్రమంలో జనవరి 8, 9 తేదీల్లో సమ్మె పిలుపుతో బ్యాంకింగ్ పనులను ఈలోగా పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. -
సైనికుల డిమాండ్‌కు మొండిచేయి
సాక్షి,న్యూఢిల్లీ : సాయుధ దళాలు దీర్ఘకాలంగా కోరుతున్న సైనిక సేవల వేతనం (ఎంఎస్పీ)పెంపు డిమాండ్‌ను కేంద్రంతోసిపుచ్చింది. సైన్యంలో జూనియర్ కమిషన్డ్ అధికారులు (జేసీఓ) సహా 1.12 లక్షల సైనిక సిబ్బందికి ఎంఎస్పీ పెంచాలని సైనికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. కాగా తమ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించడంపై ఆర్మీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయని, ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరతాయని అధికారులు చెబుతున్నారు. అయితే సైనిక సేవల వేతనం నెలకు రూ 5,500 నుంచి రూ 10,000కు పెంచితే ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ 610 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జేసీఓలు, జవాన్లకు నెలకు రూ 5,200ను ఎంఎస్పీగా ఏడవ వేతన సంఘం ఖరారు చేయగా, లెఫ్టినెంట్ , బ్రిగేడియర్ ర్యాంకుల మధ్య అధికారులకు రూ 15,500 ఎంఎస్పీని నిర్ణయించింది. జేసీఓలు తాము గెజిటెడ్ అధికారులమని (గ్రూప్ బీ), సైనిక దళాల్లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్న దృష్ట్యా అధిక ఎంఎస్పీ నిర్ణయించాలని ఎంతోకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై ఆర్మీ ఉన్నతాధికారులు రక్షణ మంత్రిత్వ శాఖ, త్రివిద దళాధిపతుల దృష్టికి తీసుకువెళ్లారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. -
11 నుంచి బస్సులు తిప్పబోము
-
సమ్మెకే సై!
సాక్షి, హైదరాబాద్: తమ వేతనాల సవరణపై స్పష్టమైన హామీ వచ్చేదాకా వెనక్కి తగ్గబోమని ఆర్టీసీ కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. ముందుగా ప్రకటించినట్టుగా 11వ తేదీ నుంచి సమ్మె చేపడతామని మరోసారి తేల్చిచెప్పాయి. ప్రభుత్వం అణచివేసే ధోరణితో వ్యవహరిస్తే బెదిరిపోయేది లేదని పేర్కొన్నాయి. శుక్రవారం మంత్రి మహేందర్‌రెడ్డి, కార్మిక శాఖ అధికారులతో వేర్వేరుగా జరిగిన భేటీల్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈ అంశాలను స్పష్టం చేశారు. అయితే శనివారం ఉదయం తమ సంఘం అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నామని, అందులో చర్చించాక తుది నిర్ణయం వెల్లడిస్తామని గుర్తింపు కార్మిక సంఘం తెలంగాణ మజ్దూర్ యూనియన్ మంత్రికి చెప్పిన నేపథ్యంలో సమ్మెను కొంతకాలం వాయిదా వేసుకునే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మొదలుపెట్టారు. అద్దె బస్సులు, అవసరమయ్యే డ్రైవర్లను సమకూర్చుకోవటం తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు. మంత్రితో భేటీలోనూ.. ఆర్టీసీ సమ్మె అంశంపై సీఎం కేసీఆర్ హెచ్చరికల నేపథ్యంలో శుక్రవారం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో మంత్రి మహేందర్‌రెడ్డి సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వెల్లడించిన అంశాలను వారి దృష్టికి తెచ్చా రు. సంస్థ శ్రేయస్సు దృష్ట్యా సమ్మె యోచనను విరమించుకోవాలని కోరారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, వివిధ రాష్ట్రాల్లో ఆర్టీసీల పరిస్థితిపై అధ్యయనం చేసి చర్యలు తీసుకుం టామని వివరించారు. దీంతో శనివారం తమ సం ఘం సమావేశం ఏర్పాటు చేసుకుని, ప్రభుత్వానికి తుది నిర్ణయం చెబుతామని గుర్తింపు కార్మిక సంఘం నేతలు మంత్రికి చెప్పారు. అయితే ఇతర సంఘాల నేతలు మాత్రం భేటీ అనంతరం విడిగా విలేకరులతో మాట్లాడుతూ.. సమ్మె విషయంలో పునరాలోచన లేదని ప్రకటించారు. రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్న కార్మిక శాఖ కార్మికశాఖ ఉప కమిషనర్ గంగాధర్ సమ్మె అంశంపై శుక్రవారం సాయంత్రం కార్మిక సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కార్మిక శాఖతో చర్చలు జరిగి విఫలమైతే.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఏడు రోజుల తర్వాతే సమ్మె చేయాల్సి ఉంటుందన్నారు. ఈలోపే సమ్మె చేపడితే ఆయా సంఘాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించారు. దీనిపై కార్మిక సంఘాల నేతలు కూడా తీవ్రంగానే ప్రతిస్పందించారు. సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చిన 14 రోజుల్లోపు కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించాల్సి ఉంటుందని, కానీ ఇప్పుడు 20 రోజులు దాటాక చర్చలకు పిలిచినందున ఆ నిబంధనను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఎలాంటి పరిష్కారం లేకుండానే భేటీ ముగిసింది. ఈ నెల 14న మరోసారి చర్చలకు రావాలని ఉప కమిషనర్ సూచించగా తాము 11న సమ్మె ప్రారంభిస్తున్నందున వచ్చేది లేదని నేతలు స్పష్టం చేశారు. టీఎంయూ నేతల మాటలపై సీఎం ఆగ్రహం ఆర్టీసీ గుర్తింపు సంఘం టీఎంయూ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్ పార్టీకి అనధికార అనుబంధ సంస్థగా కొనసాగుతోంది. అనూహ్యంగా రెండు మూడు నెలల నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. ఆ సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్న మంత్రి హరీశ్‌రావుపై టీఎంయూ నేతలు అంతర్గత సమావేశాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేయటం మొదలుపెట్టారు. వేతన సవరణ సమావేశాల్లో కూడా హరీశ్ టీఎంయూకు మద్దతుగా ముందుకు రాలేదు. తెలంగాణ ఉద్యమా న్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపారని, తమ సహకారంతోనే పలువురు నేతలు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని, తెలంగాణనే రాకుంటే టీఆర్ఎస్ అధికారంలోకి ఎలా వచ్చేదని వారు పేర్కొన్నట్టు సమాచారం. ఇవన్నీ సీఎం కేసీఆర్‌కు చేరడంతో ఆయన తీవ్రంగా స్పందించారని, గత వేతన సవరణ సమయంలో ఉదారంగా వ్యవహరించిన సీఎం ఇప్పు డు కఠినంగా ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. సీఎం తీరుపై బీజేపీ ఫైర్.. ఆర్టీసీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి హెచ్చరికలు సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. టీఎంయూ నేతలు బీజేపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని, అందుకే బీజేపీ వారికి అనుకూలంగా మాట్లాడుతోందంటూ టీఆర్ఎస్ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి ‘‘ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైతే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాం. అద్దె బస్సులతోపాటు ప్రైవేటు డ్రైవర్లను తాత్కాలిక పద్ధతిపై తీసుకుని బస్సులు నడుపుతాం. ప్రయాణికుల ఇబ్బంది, ఆర్టీసీ నష్టాల నేపథ్యంలో సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కార్మికులు మొండిగా ముందుకెళితే ఏం చేయాలనే విషయాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది..’’ – రమణారావు, ఆర్టీసీ ఎండీ సమ్మె తప్పదు ‘‘కార్మికులను రక్షించాలని చట్టాలు చెబుతున్నా.. కార్మిక శాఖ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోంది. మా డిమాండ్లపై సానుకూల స్పందన రాకుంటే సమ్మె కొనసాగించి తీరుతాం. సమ్మెలపై నిషేధం ఉందని కార్మిక శాఖ అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉంది. నిషేధం ఉన్నప్పటికీ సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికులు వెనకడుగు వేయలేదని గుర్తుంచుకోవాలి. అదే విధంగా ఇప్పుడు కూడా సమ్మె నిర్వహించి తీరుతాం..’’ – అశ్వత్థామరెడ్డి,టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ వైఫల్యాలతో నష్టాలు ‘‘ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి. మూడేళ్లుగా డీజిల్ ధరలు 50 శాతం పెరిగాయి. కానీ ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచడం లేదు. అడ్డగోలుగా ప్రైవేటు వాహనాలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదు. దాంతో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోంది. మా సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా సమ్మె నిర్వహిస్తామంటుంటే.. ఉద్యోగాలు పీకేస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించడం దారుణం. ఈ బెదిరింపులకు భయపడేది లేదు..’’ – కె.రాజిరెడ్డి, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ -
ఆర్టీసీ వేతన సవరణపై నేడే చర్చలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల వేతన సవరణపై మంత్రుల కమిటీ ఆదివారం సంస్థ యాజమాన్యం, కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. ప్రస్తుత వేతన సవరణ గడువు 14 నెలల క్రితమే ముగిసిపోయినందున కొత్త వేతన సవరణను ప్రకటించాలని కొద్దిరోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. వేతన సవరణలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటే 25% మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ప్రధాన సంఘాలన్నీ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు కూడా అందజేశాయి. దీంతో ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతున్న నేపథ్యంలో.. ఆర్టీసీలో వేతన సవరణ అంశాన్ని కూడా దానికి అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోని మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలతో కూడిన కమిటీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో ఆర్టీసీ ఎండీ రమణారావు, ఇతర అధికారులు, గుర్తింపు కార్మిక సంఘం నేతలతో చర్చించనుంది. పరిస్థితి సమ్మె వరకు వెళ్లకుండా చూడాలన్న అభిప్రాయం ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తోంది. మొత్తంగా 15 శాతం నుంచి 18 శాతం మధ్య ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. -
ఈ నెల ఆఖరున బ్యాంకు ఉద్యోగుల సమ్మె
-
రెండు రోజులు బ్యాంకు ఉద్యోగుల బంద్
ముంబై : బ్యాంకు ఉద్యోగులు మరోసారి బంద్‌కు దిగబోతున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది బ్యాంకర్లు ఈ నెల ఆఖరున 48 గంటల పాటు బంద్‌కు దిగనున్నట్టు పిలుపునిచ్చారు. వేతనాల సమీక్ష విషయంలో శనివారం యునిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్‌బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో బ్యాంకు ఉద్యోగులు ఈ బంద్ చేపట్టబోతున్నారు. యూఎఫ్‌బీయూలో తొమ్మి బ్యాంకు యూనియన్లు ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులకు అందించే వేతన పెంపు చాలా తక్కువ మొత్తంలో ఉందని బ్యాంకర్లు ఆరోపిస్తున్నారు. కేవలం రెండు శాతం పెంపు చేపట్టడం చాలా దారుణమన్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతన చర్చలను, వేతన సమీక్షను 2017 నవంబర్ 1వరకు పూర్తి చేయాలని బ్యాంకు మేనేజ్మెంట్లను, ఐబీఏను ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పలు సార్లు ఇండియన్ బ్యాంకు అసోసియేషన్, బ్యాంకు యూనియన్లకు మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై 2018 మార్చి 15న యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. మరోసారి ఐబీఐ చర్చలకు పిలవడంతో, యూనియన్లు ఆ బంద్‌ను వాయిదా వేశాయి. శనివారం ముంబైలో బ్యాంకు యూనియన్లకు, ఐబీఏకు మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఈ నెల ఆఖరున రెండు రోజులు బంద్‌చేపట్టాలని యూనియన్లు నిర్ణయించాయి. 2012 నవంబర్ 1న 10వ బిపర్‌టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపుదలను ఐబీఏ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. కానీ ఈ పెంపును 2 శాతం మాత్రమే చేపట్టనున్నట్టు ఐబీఏ 2017 మార్చి 3న ప్రకటించింది. ప్రస్తుతం ఐబీఏ ఆఫర్‌చేసే మొత్తం చాలా తక్కువగా ఉందని, ఈ ఆఫర్‌ను యూనియన్లు తిరస్కరిస్తున్నట్టు టాప్ యూనియన్ నాయకుడు చెప్పారు. ఈ విషయంలో వెంటనే ఆర్థిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని యూనియన్లు కోరుతున్నాయి. వేతన పెంపును పెంచేలా ఐబీఏకి సూచించాలని, ఒకవేళ ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయంలో విఫలమైతే ఈ నెల చివరిన 48 గంటల పాటు బంద్ చేయనున్నామని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం తెలిపారు. -
‘దక్షిణ సమర్పయామి’పై సర్కారు సీరియస్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ పేరుతో దేవాలయ ఉద్యోగులు, పూజారుల నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసిన విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించింది. దేవాదాయ శాఖలో అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వేతన సవరణ తామే చేయించామని, అందుకు ప్రతీ ఒక్క లబ్ధిదారుడు నిర్ధారిత మొత్తం ఇవ్వాలని కొందరు నమ్మబలికారు. లేకపోతే జాబితా నుంచి పేరు గల్లంతు చేస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల చొప్పున వసూలు చేశారు. ఈ ఉదంతంపై ‘దక్షిణ సమర్పయామి’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం దేవాదాయ శాఖలో అలజడి సృష్టించింది. విషయం ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వసూళ్లకు పాల్పడుతున్న వారిని ఎందుకు గుర్తించలేదని ఆ శాఖ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లాల వారీగా విచారణ జరిపి బాధ్యులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన ఉద్యోగులు, అర్చకుల జాబితా ఆధారంగా వేతన సవరణ చేస్తున్నందున మధ్యవర్తుల ప్రమేయం ఉండబోదని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎవరు కూడా ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించాలని పేర్కొన్నారు. కాగా, వేతన సవరణ లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఉదంతంపై ప్రభుత్వం విచారణ జరపాలని దేవాదాయ శాఖ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, వెంకటేశ్వరరావు ఓ ప్రకటన విడుదల చేశారు. -
'సీఎం లేరు, సమయం కావాలి'
హైదరాబాద్: వేతన సవరణపై కార్మికశాఖతో ఆర్టీసీ యూనియన్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతన సవరణపై మరికొంత సమయం కావాలని ఆర్టీసీ యాజమాన్యం కోరింది. సీఏం చంద్రబాబు అందుబాటులో లేనందున వెంటనే నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ఈ నెల 18లోపు వేతన సవరణపై ప్రకటన చేయాలని ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ), టీఎమ్ యూ డిమాండ్ చేశాయి. ఈనెల 22 తర్వాత సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఆర్టీసీ కార్మికులకు యూనియన్ నేతలు పద్మాకర్, అశ్వద్థామరెడ్డి పిలుపునిచ్చారు. -
10, 11 తేదీల్లో బ్యాంక్ ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు ఈ నెల 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మె బాట పడుతున్నారు. వేతన సవరణపై బ్యాంక్ యూనియన్లు, యాజమాన్యం ఏకాభిప్రాయానికి రాలేకపోవడమే దీనికి కారణం. యూనియన్లు- ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఏ) మధ్య చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో సమస్యపై తగిన పరిష్కారం కనుగొనలేకపోవడంతో సమ్మె అనివార్యం అయినట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక (యూఎఫ్‌బీయూ) కన్వీనర్ ఎంవీ మురళీ పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజ్మెంట్ ఆఫర్, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా లేదని బ్యాంక్ ఉద్యోగుల జాతీయ సంఘం(ఎన్‌ఓబీడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అశ్వనీ రాణా అన్నారు. డిసెంబర్ 14న వేతన సవరణపై జరిగిన చర్చలు విఫలం కావడంతో అదేనెల 18వ తేదీన ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారు. 2012 నవంబర్ నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉంది. తొమ్మిది బ్యాంక్ ఉద్యోగ, అధికారుల యూనియన్లకు యూఎఫ్‌బీయూ నేతృత్వం వహిస్తోంది. దేశంలోని 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
నేడు బ్యాంకు యూనియన్ల సమ్మె
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగంలో చేపడుతున్న సంస్కరణలను తక్షణం నిలిపివేయడంతో పాటు, వేతన సవరణను చేపట్టాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు బుధవారం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో దేశంలోని 47 బ్యాంకులకు చెందిన పది లక్షల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) సీహెచ్ వెంకటాచలం తెలిపారు. ఈ సమ్మెకు ఆంధ్రాబ్యాంకుకు చెందిన 20,000 మంది ఆఫీసర్లు, ఇతర ఉద్యోగులు మద్దతు తెలుపుతున్నట్లు ఆల్ ఇండియా ఆంధ్రాబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూని యన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ టి.రవీంద్రనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమ్మెతో బుధవారం దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడనుంది.