ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు వినతి పత్రం అందజేస్తున్న విద్యుత్ జేఏసీ నేతలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్‌రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌కి బదులు జీపీఎఫ్‌ను అమలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment