ఏపీ ఉద్యోగులు ఏపీకే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన కసరత్తు ఊపందుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ఈ నెల 6న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ విద్యుత్ సంస్థలు కసరత్తును ప్రారంభించాయి. ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో మంగళవారం విద్యుత్‌సౌధలో ఉద్యోగుల కేటాయింపుల కమిటీ సమావేశమై చర్చింది.
సమావేశంలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల యాజమాన్యాలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ స్థానికత’ గల ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపేందుకు చర్యలు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ‘ఏపీ స్థానికత’ గల ఉద్యోగుల తుది జాబితాలను విద్యుత్ సంస్థలు సిద్ధం చేశాయి. ఈ జాబితాలను మంగళవారం రాత్రి నుంచి సంబంధిత సంస్థల వెబ్‌సైట్‌లలో ఉంచనున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తుది జాబితాల ప్రకారం తెలంగాణ ట్రాన్స్‌కోలో 262 మంది, టీ జెన్‌కోలో 600 మంది, తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్‌పీడీసీఎల్)లో 539 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తెలంగాణకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.
ఉద్యోగుల తుది కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకుందాని ఏపీ విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు సమావేశానికి పిలిపించినా స్పందన రాలేదని తెలంగాణ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కనీసం తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపాలని లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.