Electricity Employees
-
కరెంట్ కట్ చేస్తే.. సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా విద్యుత్ కోతలు విధించే అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయన్న ప్రచారం నేపథ్యంలో సీఎం గురువారం సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ కోతలు విధించాలని ఆదేశించలేదని.. అనవసరంగా కోతలు పెట్టి రైతులను, ప్రజలను ఇబ్బందిపెడితే క్షమించేది లేదని హెచ్చ రించారు. అవసరానికి సరిపడా విద్యుత్ ఉందని, గతంతో పోలిస్తే సరఫరా పెరిగిందన్నారు. అయినా కూడా కోతలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని సీఎం పేర్కొన్నారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ సిబ్బంది అత్యుత్సాహంతో.. ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని.. మిగతాచోట్ల ఎలాంటి ఇబ్బందీ లేదని ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ ఈ సమీక్షలో వివరించారు. ఆయాచోట్ల సరఫరా లోపానికి కారణాలేమిటని సీఎం ప్రశ్నించగా.. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరిచూడాలని, అలా చేయకపోవడంతో సమస్య తలెత్తిందని సీఎండీ వివరించారు. దీంతో ఇలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, ప్రకృతిపరమైన కారణాలు మినహా విద్యుత్ సరఫరాలో కోతలు ఉండొద్దని స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు విధించే పక్షంలో ముందుగా ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో కోతలు విధిస్తున్నట్టు తన దృష్టికి వచి్చందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సరిపడా విద్యుత్ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు సగటున 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని.. గతేడాది ఇదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్ల సరఫరానే ఉందని తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యోగుల ఆందోళనకు తెరపడింది. గురువారం తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను కూడా వారు ఉపసంహరించుకున్నారు. పే రివిజన్లో భాగంగా డిమాండ్ల సాధన కోసం గత నెల 27 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఉద్యోగులు ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని వెల్లడించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యుత్ ఉద్యోగులకు తెలిపారు. విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు యాజమాన్యం, ఉద్యోగులు ఎంతో కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు, అధికారులు సూచించారు. అనామలీస్ ఉంటే సరిచేసి పేస్కేలును నిర్ధారించడానికి ఏపీజెన్కో ఎండీ నేతృత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా అంగీకారం కుదిరింది. సింగిల్ మాస్టర్ స్కేల్ పీపీతో కలిపి రూ.2.60 లక్షలు, 8 శాతం ఫిట్మెంట్, ఒక డీఏ విడుదల, 12 వాయిదాల్లో బకాయిలు, వైద్య పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు దాటిన వారికి తప్పనిసరిగా పర్సనల్ పే, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2018 స్కేల్ ప్రకారం జీతాలతో పాటు అదనంగా 2 శాతం పెంపునకు యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, జేఏసీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఒప్పందం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ చర్చల్లో సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, ఏపీజెన్కో ఎండీ చక్రధర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్దన్ రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ మల్లారెడ్డి, జేఏసీ నేతలు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికష్ణ, శేషారెడ్డి, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ఆమోదయోగ్యంగా ‘పీఆర్సీ’పై నిర్ణయం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వీరు విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. సంఘాల ప్రతినిధులు పే రివిజన్‌పై ఉద్యోగుల డిమాండ్లను మంత్రులకు వివరించారు. ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూ సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలని కోరారు. జెన్కో ఉద్యోగులకు అలవెన్స్‌లు, ఇతర అలవెన్స్‌లను యథాతథంగా కొనసాగించాలని, వెయిటేజీతో పాటు ఫిట్మెంట్లను అలానే ఉంచాలని, అలాకాని పక్షంలో అధిక ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలిస్తోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని, వారం రోజుల్లో మరోసారి ఉద్యోగసంఘాల ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వన్ మెన్ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో దానిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్, ట్రాన్స్ కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం.. పీఆర్సీ ఎంత శాతమంటే?
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఏడు శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎండీ ప్రభాకర్ రావుకు విద్యుత్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, ఏడు శాతం పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగులు సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో, రేపటి నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకున్నారు. -
ఈనెల 17 నుండి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
-
కరెంటోళ్ల సమ్మెపై జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసుపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. ఈ మేరకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు. వేతన సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ తెలంగా ణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఇటీవల యాజ మాన్యాలకు నోటిసులు అందజేసిన విషయం తెలి సిందే. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురి అవుతారని, సమ్మెకు వెళ్లకుండా వారితో రాజీ కుదర్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను తాజా లేఖలో ట్రాన్స్‌కో సీఎండీ కోరారు. మళ్లీ చర్చలకు సిద్ధం.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీలతో ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిపి 6శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలుకు హామీ ఇచ్చామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో వరుసగా 30శాతం, 35శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడం, సర్విసు వెయిటేజీ, ఇతర ప్రయోజనాలను కల్పించడంతో ఉద్యోగుల వ్యయం గణనీయంగా పెరిగిందన్న అంశాన్ని సైతం జేఏసీలకు తెలియజేశామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో పోల్చితే రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలు అధికంగా ఉన్నట్టు జేఏసీలకు వివరించినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు, పదో తరగతి వార్షిక పరీక్షలు, టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయని జేఏసీలకు వివరించామన్నారు. తదుపరి చర్చలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి లేఖ సైతం రాసినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్ల పరిష్కారానికి మళ్లీ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను కోరారు. విద్యుత్ సమ్మె తథ్యం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ స్పష్టికరణ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు సిద్ధం కా వాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, కన్వీనర్లు సాయిబాబు, రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. సమ్మెలపై నిషేధాలు, చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఎదురుదాడికి దిగాయని దుయ్యబట్టారు. సమ్మె తథ్యమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని హెచ్చరిస్తూ జేఏసీకి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాయ డాన్ని ఖండిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అత్యవసర సేవలైనందున విద్యుత్ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి సమ్మెలపై నిషేధాన్ని పొడిగించడం ఆనవాయితీ అని, ఏ రోజూ ఈ ఉత్తర్వులను ఉద్యోగులు అతిక్రమించలేదని గుర్తుచేశారు. పీఆర్సీ అమలుపై ఏడాదిగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పరీక్షా సమయం, యాసంగి కాలం అని పేర్కొనడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని యాజమాన్యాలు పేర్కొనడం అన్యాయ మన్నారు. గుజరాత్లో ఉద్యోగుల జీతాలు ఇక్కడి కంటే అధికమని పేర్కొన్నారు. 23 వేల మంది ఆర్టీజన్లు తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికికూడా న్యా యం చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, ఆ ర్టీజన్లు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ వర్తింపజేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సదుపాయం, ఆ ర్టీజన్ల సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 17 నుంచి సమ్మె తథ్యమన్నారు. సమ్మెతో వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. -
వారంలోగా విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వారంరోజుల్లో విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై ప్రకటన చేస్తామని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సోమవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీతో చర్చించి ఓ ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. అనంతరం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సమర్పించే నివేదికపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శనివారం జగదీశ్‌రెడ్డిని మింట్ కాంపౌండ్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి పీఆర్సీ ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ వేతన సవరణ సంప్రదింపుల కమిటీ విద్యుత్ ఉద్యోగులకు 5 శాతం, ఆర్టిజన్లకు 10 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సిఫారసు చేయగా, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక జాప్యం చేయకుండా వారంలో పీఆర్సీ ప్రకటిస్తామని, ఆందోళనలు విరమించుకోవాలని జగదీశ్‌రెడ్డి వారికి సూచించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కె.ప్రకాశ్, కన్వీనర్ శివాజీ, వైస్‌చైర్మన్ అంజయ్య, జేఏసీ నేతలు నాసర్ షరీఫ్ పాల్గొన్నారు. -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్‌రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌కి బదులు జీపీఎఫ్‌ను అమలు చేయాలన్నారు. -
17 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు పదిహేడేళ్ల తరువాత ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోతో పాటు ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలోని ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ అయ్యే వెసులుబాటు కల్పించింది. 2005లో ఈ తరహా బదిలీలపై బ్యాన్ విధించడంతో ఇన్నాళ్లూ ఏ సంస్థ పరిధిలోని వారు ఆ సంస్థ పరిధిలోనే బదిలీ అవుతున్నారు. అంటే ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగి ఆ సంస్థ పరిధిలోని జిల్లాల్లోనే బదిలీ అవుతారు. తాజా వెసులుబాటుతో ఆ సంస్థ ఉద్యోగి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని జిల్లాలకు బదిలీని కోరవచ్చు. ఈ బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో హెచ్ఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్‌గా ఓ కమిటీని నియమిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 12లోగా సిబ్బంది తమ బదిలీ అభ్యర్థన దరఖాస్తులను హెచ్ఆర్ కమిటీకి అందించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అనంతరం ఉద్యోగుల బదిలీలు జరుగుతాయి. చదవండి: (అది వారాహి కాదు.. నారాహి: మంత్రి రోజా సెటైర్లు) -
విద్యుత్ సంస్థల్లో 250 మందికి రివర్షన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 172 మంది ఇంజనీర్లతో పాటు మొత్తం 250 మంది ఉద్యోగులకు రివర్షన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యాలు వారం రోజులుగా చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఒకటì , రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్టు సమాచారం. నెలాఖరులో సుప్రీంకోర్టులో విచారణ.. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు విషయంలో తమ ఆదేశాలను అమలు చేయనందుకుగాను విద్యుత్ సంస్థల యాజమాన్యాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. తమ ఆదేశాలను అమలు చేసి ఆ మేరకు అఫిడవిట్‌ను సమర్పించాలని, నెలాఖరులోగా మళ్లీ విచారణ నిర్వహిస్తామని.. కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులు, వేతన బకాయిలను చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీ నుంచి దాదాపు 700 మందిని జస్టిస్ ధర్మాధికారి కమిటీ తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా కొత్తగా పదోన్నతులు కల్పించాలని ధర్మాధికారి కమిటీ సిఫారసు చేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదోన్నతులు పొందిన తెలంగాణ ఉద్యోగుల్లో 250 మంది రివర్షన్లు పొందనున్నట్టు సమాచారం. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక శాతం సీనియర్లు ఉండటంతో వారికి పదోన్నతులు లభించనున్నాయి. రివర్షన్లు ఇస్తే ఒప్పుకోం.. తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్లు ఇస్తే అంగీకరించమని ఇప్పటికే తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ సౌధలో మధ్యాహ్న భోజన విరామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలగకుండా సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించాలని వారు డిమాండ్ చేశారు. -
‘విద్యుత్’ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: పేదలకు, వృత్తిదారులకు, రైతు సంక్షేమానికి విఘాతంగా మారిన విద్యుత్ సవరణ బిల్లు–2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈ జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను అంబాని, అదానీలకు కట్టబెట్టడం దారుణమని విమర్శించింది. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంతకు ముందు మింట్ కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్మార్గ్ మీదుగా ఇంజనీర్లు ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జాతీయ చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ స్టాడింగ్ కమిటీ ఆమోదం లేకుండా విద్యుత్ సవరణ బిల్లును దొడ్డిదారిలో పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకునేందు కు పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందని, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలని సూచించారు. విద్యుత్‌ప్రైవేటీకరణతో భవిష్యత్తులో పేదల జీవితాల్లో చీకట్లు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినోద్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రతినిధులు సాగర్, మోహన్‌శర్మ, జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన సేవల కోసం.. పనివేళల్లో సెల్‌ఫోన్ కట్!
సాక్షి, అమరావతి: విద్యుత్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అదేపనిగా సెల్ఫోన్లు ఉపయోగిస్తూ పని గంటలు వృథా చేస్తున్నారని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎండీ.. కార్యాలయాల పని వేళల్లో సెల్ఫోన్లు వాడొద్దంటూ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయిలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయాల్లోనూ ఇవే నిబంధనలు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని సూపరింటెండెంట్ ఇంజినీర్లను ఆదేశించారు. ఇటీవల ఏపీసీపీడీసీఎల్ సీఎండీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడిన అంశాలను.. వాయిస్ రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీనిపై సీఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలతో పాటు కార్యాలయాల పనివేళల్లో సెల్ఫోన్లను విపరీతంగా ఉపయోగించడం వల్ల సంస్థ పనితీరుకు, అంతర్గత భద్రతకు, గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముందని సీఎండీ భావించారు. అక్టోబరు 1 నుంచి పనివేళల్లో సెల్‌ఫోన్ వాడకూడదనే నిబంధనను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు నుంచి ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తమ ఫోన్లను సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలి. భోజన విరామ సమయంలో ఫోన్లు వాడుకునే అవకాశమిచ్చారు. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే.. ఉన్నతాధికారి ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. -
విద్యుత్ సవరణ బిల్లుపై ఉద్యోగుల నిరసన
సాక్షి, అమరావతి: లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వ్యతిరేకించింది. బిల్లులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపినప్పటికీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో నిరసనలకు దిగారు. విజయవాడలోని విద్యుత్ సౌధలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు కార్యాలయం బయటకు వచ్చి ధర్నా చేపట్టారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను జేఏసీ చైర్మన్ పి.చంద్ర శేఖర్, జనరల్ సెక్రటరీ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్ బి.సాయికృష్ణ తదితరులు కలిసి బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళితే తక్షణమే ఆందోళనలకు దిగేలా కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించారు. ఆందోళనకు ఇదీ కారణం ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలకు లైసెన్స్ విధానాన్ని సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని చెబుతున్నప్పటికీ, విద్యుత్ రంగం ప్రైవేటీకరణను అనుమతించడం వల్ల వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని జేఏసీ అభిప్రాయం పడింది. బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవల కోసం వినియోగదారులు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్న విధంగా విద్యుత్ సరఫరాదారుని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్ పంపిణీ లైసెన్సులివ్వాల్సి వస్తే వాటి కోసం ’క్రాస్ సబ్సిడీ నిధి’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. డిపాజిట్ సొమ్మును ముందుగా చెల్లించకపోతే డిస్కంలు కోరినంత విద్యుత్‌ను ‘జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం’(ఎన్ఎల్డీసీ) సరఫరా చేయదు. -
TS: ఉద్యోగుల ధర్నా.. ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు నల్లరంగు చొక్కాలు ధరించి మహా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్‌శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతుందని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్తా మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు. చట్టసవరణ బిల్లు ప్రవేశ పెడితే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనతో తెలంగాణలో ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ఎవరు విధుల్లో ఉండరని ప్రకటించిన ఉద్యోగులు.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు. చదవండి: Telangana: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
దక్షిణ డిస్కంలో బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. సబ్ ఇంజనీర్లతో పాటు అకౌంట్స్ విభాగంలో జేఏఓల కేడర్ వరకు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల ఉద్యోగుల బదిలీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 30 నాటికి మూడేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఒకేచోట పనిచేసే వారిని బదిలీ చేయనున్నారు. సీని యారిటీ ప్రాతిపదికగా మొత్తం ఉద్యోగుల్లో 40% మందికి మించకుండా బదిలీలు చేపట్టనున్నారు. ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కల్పించనున్నట్లు పేర్కొంది. బదిలీకానున్న వారి జాబితాను ఈనెల 13న డివిజనల్/సర్కిల్ కార్యాలయాలకు అందజేయనున్నారు. జాబితాపై 17 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారని, విజ్ఞప్తులుంటే 21లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 28లోగా బదిలీలపై ఉత్తర్వులు జారీ కానుండగా.. బదిలీ అయిన ఉద్యోగులు 30న రిలీవ్ కావాలని సంస్థ ఆదేశించింది. -
విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత వైద్యం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో బుధవారం వారు సమావేశమయ్యారు. విద్యుత్ సంస్థల్లో కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గత నెల 28న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ 24 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అందులోని అంశాలను జేఏసీ నేతలు మరోసారి బాలినేని, సజ్జల దృష్టికి తెచ్చారు. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు నిర్వహణకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీనిపై బాలినేని, సజ్జల స్పందిస్తూ ఉద్యోగులకు నష్టం జరుగుతుందనుకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. దశలవారీగా పరిష్కారం... విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ బాధ్యతలను తమ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకే కేటాయించాలని కోరగా సమీక్షించి ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తామని బాలినేని, సజ్జల తెలిపారు. జేఏసీ విజ్ఞప్తి మేరకు సర్వీస్ రెగ్యులేషన్స్‌ను ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు కార్మికులకు నేరుగా జీతాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, జేఏసీ యూనియన్ల నాయకులు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికృష్ణ చర్చల్లో పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ నేతలు బాలినేని, సజ్జల, ఇంధన శాఖ కార్యదర్శి, డిస్కంల సీఎండీలతో ప్రత్యేకంగా సమావేశమై ఇవే అంశాలపై చర్చించారు. అన్నింటిపై ప్రభుత్వం నుంచి సానుకూల హామీ లభించిందని వెల్లడించారు. -
AP: విద్యుత్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు డీఏ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్ సంస్థల నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను విజయవాడలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. 13 జిల్లాల నుంచి ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలు, నెడ్‌క్యాప్, ఏపీఎస్ఈసీఎం, ఏపీసీడ్కో విభాగాల ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలినేని ప్రసంగిస్తూ..పే రివిజన్ కమిటీతో జీతాలు తగ్గుతా యని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఉద్యోగులెవరూ పట్టించుకోవలసిన అవసరం లే దని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇ బ్బందులను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటా మని మంత్రి భరోసా ఇచ్చారు. చదవండి: (పోలీసుల అదుపులో స్మగ్లర్ చంద్రబాబు?) బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను చవకగా కొనుగోలు చేసి రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగిన విద్యుత్ రంగాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టపర్చడంలో భా గంగా రికార్డు స్థాయిలో ఒకేసారి సుమారు 7,329 మంది లైన్ మెన్లను, 213 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించామన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రెండేళ్లలో రూ.28,166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సీఎండీ జె పద్మజనార్ధన రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బిల్లు తెస్తే.. సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు 2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తే.. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ హెచ్చరించింది. జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఈ ఈజేఏసీ) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీఎస్పీఈజేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్.శివాజీ, కో చైర్మన్ పి.అంజయ్య మాట్లాడుతూ... రైతులు, పేదలకు నష్టదాయకంగా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాదని బిల్లు తీసుకొస్తే.. ఆ తర్వాత జరుగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహా ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ లైన్లు, ఉపకేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయమన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధానమైన బొగ్గు, ఇంధనం, రవాణా తదితర రంగాలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం.. నష్టాల పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసమే డిస్కంల ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిం దని వివరించారు. -
విద్యుత్ బిల్లు తెస్తే మెరుపు సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు విధులు బహిష్కరించి మెరుపు సమ్మె నిర్వహిస్తారని విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ హెచ్చరించింది. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 8న రాష్ట్రాలు, జిల్లాల స్థాయిల్లో నిరసనలకు కమిటీ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 15న భారీ ధర్నాకు జాతీయ సమన్వయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజైన 2022 ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా విధులను బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగాలని కమిటీ పిలుపునిచ్చింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు మెరుపు సమ్మెకు దిగితే నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గ్రిడ్ కుప్పకూలి దేశమంతా అంధకారం నెలకొనే ప్రమాదం ఉంది. ప్రైవేటీకరణతో మాకు నష్టమే: ఉద్యోగులు విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు రాచమార్గం వేసేందుకు కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లుతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ చార్జీలు, సరఫరా, నాణ్యతలో ప్రైవేటు కంపెనీలతో పోటీపడలేవని, ఇదే జరిగితే ప్రభుత్వరంగ డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోయి మూతపడే ప్రమాదముందని అంటున్నారు. ఫలితంగా లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు రోడ్డునపడతారని విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ద్వారా కేంద్రం తమ హక్కుల ను హరించేందుకు ప్రయత్నిస్తోందని చాలా రాష్ట్రా లు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని చెబుతోంది. ఈ విషయమై విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశాల్లో తెలిపింది. -
విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్ సవరణ చట్టం–2021ను ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ ఉద్యోగుల జాతీయ కో–ఆర్డినేషన్ కమిటీ జాతీయ కన్వీనర్ ప్రశాంత్‌చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రశాంత్‌చౌదరి మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలను సంప్రదించలేదన్నారు. అయితే ఫైనాన్స్ అడ్వైజరీ, ఫిక్కీ తదితర సంస్థ ప్రతినిధులు వంటి పెట్టుబడిదారుల ప్రతినిధులను సంప్రదించడం దారుణమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విద్యుత్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ఇప్పుడున్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, అదే జరిగితే.. వినియోగదారులపై రూ.4 వేల అదనపు భారంతో పాటు, రీచార్జ్ చేయకుంటే వెంటనే విద్యుత్ ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలకు సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యం, విద్యుత్ రంగాలపై రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించివేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బిల్లుతో తీవ్ర నష్టం: కేంద్ర ప్రభుత్వంపై కరెంటోళ్ల కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనకకు తగ్గకపోతే ఆందోలనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆగస్టు10వ తేదీన మెరుపు సమ్మెకు విద్యుత్ సంఘాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవడంతో విద్యుత్ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న విద్యుత్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లుపై పోరాటం సాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు తెలిపారు. -
వదంతులు నమ్మవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ఉద్యోగుల వేతనాలు తగ్గించే ఆలోచన చేయడం లేదని, ఈ ప్రచారం వదంతులేనని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వదంతులతో ఉద్యోగులు అభద్రతకు లోనుకావద్దని కోరారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడం లేదన్నారు. ఖరీఫ్ నుంచి వందశాతం ఫీడర్ల ద్వారా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన సోమవారం విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణాన్నే ఆకాంక్షిస్తోందని, వారికి నష్టం చేసే ఏ ఆలోచన చేయబోదని భరోసా ఇచ్చారు. 2018లో సవరించిన వేతనాలే 2022 వరకు కొనసాగుతాయని, ఈ విషయాన్ని వారికీ స్పష్టం చేశామని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రెండు నెలల్లో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. రైతు కోసం ఎంతైనా ఖర్చు రైతు పక్షపాతి అయిన సీఎం వైఎస్ జగన్ ఉచిత విద్యుత్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక్క అనంతపురంలో మాత్రం రైతుల కోరిక మేరకు రాత్రిపూట విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 55 శాతం ఫీడర్లే 9 గంటల పగటి విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో అప్పటికప్పుడే రూ.1,700 కోట్లు మంజూరు చేసి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను బలోపేతం చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రూ.80 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రూ.18 వేల కోట్ల చేయూతతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అడుగులేశారని చెప్పారు. ప్రైవేటీకరణ యోచన లేదు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడంలేదని చెప్పారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన దాఖలాలు లేనేలేవన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పంపుసెట్లకు మీటర్లు బిగించి, కచ్చితమైన విద్యుత్ వినియోగాన్ని లెక్కగట్టామని, ఒక్క రైతుపైనా పైసా భారం మోపలేదని చెప్పారు. రైతు ఖాతాల్లోకే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని వేశామని, దీనివల్ల నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా డిస్కమ్‌ల్లో జవాబుదారీతనం పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. జగనన్న కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో కొంతకాలంగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ (జేఏసీ) ప్రకటించింది. సంఘాల నేతలతో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం చర్చలు జరిపారు. వారు లేవనెత్తిన ప్రతీ డిమాండ్‌పైనా సానుకూలంగా స్పందించారు. దీంతో సమ్మె విరమిస్తూ జేఏసీ నేతలు మంత్రి సమక్షంలో లిఖిత పూర్వకంగా తెలిపారు. జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల అంశాలను అధికారులు వెల్లడించారు. ► విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించేందుకు గల అవకాశాలను అధ్యయనం చేయనున్నారు. ఇందుకు ఈఆర్‌పీడీసీ సీఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ నేతృత్వంలో వేయనున్న కమిటీ 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ► 1999–2004 మధ్య నియమించిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్‌ను సమీక్షించి, ప్రభుత్వానికి 30 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్ డీఏలను ఫ్రీజింగ్ ఆర్డర్స్ తొలగిన తర్వాత చెల్లిస్తారు. నగదు రహిత వైద్యసేవల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తారు. ► రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఏపీ జెన్కో పీపీఏ నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ తీసుకుంటుంది. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనేదీ లేదని చర్చల సందర్భంగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: బాలినేని ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 2019–20లో రూ.17,904 కోట్లు, బిల్లుల చెల్లింపునకు రూ.20,384 కోట్లు ఇచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.30 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించకుండా ఆపిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. విద్యుత్ రంగం పటిష్టానికి 7 వేల మంది లైన్మెన్లను, 172 మంది ఏఈలను నియమించామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆలోచన లేదు కాబట్టే ఇవన్నీ చేశామని మంత్రి విద్యుత్ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్న జేఏసీ డిమాండ్‌పైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. ► చర్చల్లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీలు శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, జేఏసీ నేతలు పి.చంద్రశేఖర్, ఎం.వాసుదేవరావు, సాయికృష్ణ, ఓసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం దృష్టికి విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని, ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ నెరవేర్చేందుకు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి గత నెల 28న యాజమాన్యానికి నోటీసు ఇచ్చి.. ఈ నెల 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కచ్చితమైన హామీ ఇవ్వాలి వర్షాలు, కోవిడ్–19 కారణంగా ఆందోళన విరమించాలన్న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ విజ్ఞప్తిపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత చంద్రశేఖర్ స్పందించారు. కనీసం వారం రోజుల ముందైనా ఈ విజ్ఞప్తి చేసి ఉంటే పునరాలోచించుకునే వీలుండేదన్నారు. ఆందోళనకు వెళ్తున్న సమయంలో ఎలా ఆపగలమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కచ్చితమైన హామీ ఇస్తే ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. -
‘శ్రీశైలం’ బాధితులకు రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలోని తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దీనికి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున జెన్కో సాయం అందిస్తుందని తెలిపారు. దీంతో డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందుతుందని ప్రభాకర్‌రావు వెల్లడించారు. అలాగే మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగమివ్వాలని నిర్ణయించామని తెలిపారు. విద్యార్హతలను బట్టి డీఈ, ఏఈల కుటుంబాలకు ఏఈ/పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇతర శాఖాపరమైన సాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభాకర్‌రావు అధ్యక్షతన శనివారం విద్యుత్ సౌధలో జెన్కో బోర్డు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయం. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. వారిని మళ్లీ తీసుకురాలేం. కానీ మానవ మాత్రులుగా సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ ఘట నను ప్రత్యేక అంశంగా పరిగణించి ప్రభుత్వ సాయంతో పాటు జెన్కో తరఫున అదనపు సాయం అందించాలని భావిస్తున్నాం’అని ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించగా, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యుదుత్పత్తి పునఃప్రారంభానికి కమిటీ.. ప్రమాదానికి గురైన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభాకర్‌రావు నియమించారు. జెన్కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సీఈలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి తుది నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు, అకౌంటెంట్స్ అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు, అసోసియేషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, దుష్యంత్ దవే, రాకేశ్ ద్వివేది, రంజిత్ కుమార్, వి.గిరి వాదనలు వినిపించారు. జస్టిస్ ధర్మాధికారి గతేడాది తుది నివేదిక ఇచ్చిన తర్వాత వివాదంతో సంబంధంలేని 584 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారని వీరు న్యాయస్థానానికి వివరించారు. తుది నివేదిక ఇచ్చిన తర్వాత మూడు నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం, జనాభా, విద్యుత్ ఉత్పత్తిలో అధికమైనప్పటికీ ఉద్యోగులను తెలంగాణకు అధికంగా కేటాయించారని వివరించారు. ధర్మాధికారి తుది నివేదికను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ధర్మాధికారి నివేదిక పేరుతో తమను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అన్యాయంగా కేటాయించారని ఏపీ ఉద్యోగులు పిటిషన్ వేశారు. ఏపీ రిలీవ్ చేసిన ఉద్యోగుల పక్షాన సీనియర్ న్యాయవాదులు పి.ఎస్.నరసింహ, బాలసుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తాము ఏపీలో పుట్టి, అక్కడే చదువుకుని, అక్కడే ఉద్యోగంలో నియమితులైనా తమను అక్రమంగా తెలంగాణకు కేటాయించి జీతాలు ఇవ్వడం ఆపేశారని తెలిపారు. దీన్ని ఏపీ విద్యుత్ సంస్థల సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వ్యతిరేకించారు. ధర్మాధికారి తుది నివేదికలో జోక్యం అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ఏపీ విద్యుత్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీంకోర్టు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : ధర్మాధికారి నివేదిక పేరుతో తమను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అన్యాయంగా కేటాయించారని ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రంకోర్టు బెంచ్ బుధవారం విచారించింది. ఏపీ రిలీవ్ చేసిన ఆంధ్ర ఉద్యోగుల తరపున సీనియర్ న్యాయవాది నరసింహ వాదనలు వినిపించారు. తాము ఏపీలో జన్మించి, విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగంలో చేరినా, తమను అక్రమంగా తెలంగాణకు కేటాయించి జీతాలు ఇవ్వడం నిలిపివేశారని కోర్టుకు నివేదించారు. చదవండి : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఏపీ వైశాల్యం, జనాభా, విద్యుత్ ఉత్పత్తిలో అధికమైనా ఉద్యోగులను మాత్రం తెలంగాణకు అధికంగా కేటాయించారని, ఈ నివేదికను తోసిపుచ్చాలని కోరారు. ఈ వాదనను ఏపీ విద్యుత్ సంస్థల సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వ్యతిరేకించారు. ధర్మాధికారి తుది నివేదికలో జోక్యం అవసరం లేదని అన్నారు. ఇక జస్టిస్ ధర్మాధికారి గత ఏడాది తుది నివేదిక ఇచ్చిన అనంతరం వివాదంతో సంబంధంలేని 584 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారని తెలంగాణ తరపు న్యాయవాదులు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విన్న సర్వోన్నత న్యాయస్ధానం ఏపీ విద్యుత్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల అనంతరం విచారణను తిరిగి చేపడతామని స్పష్టం చేసింది. -
రాష్ట్రానికి మరో 71 మంది విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ నుంచి తెలంగాణకు మరో 71 మంది విద్యుత్ ఉద్యోగులను కేటాయిస్తూ జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ బుధవారం అనుబంధ నివేదికను విడుదల చేసింది. ఏపీ స్థానికత కలిగి ఉన్నారని పేర్కొంటూ ఐదేళ్ల కింద తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి ఏకపక్షంగా రిలీవ్ చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. ఈ వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు 502, ఏపీకు 655 మంది ఉద్యోగులను కేటాయిస్తూ గతేడాది డిసెంబర్ 26న తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేటాయింపులను సవాలు చేస్తూ ఏపీ విద్యుత్ సంస్థలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీం ఆదేశాల మేరకు మళ్లీ ధర్మాధికారి కమిటీ రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి తుది నివేదికకు అనుబంధంగా మరో నివేదికను బుధవారం ప్రకటించింది. జీవిత భాగస్వామి, అనారోగ్యం, శారీరక వైకల్యం తదితర కారణాలతో ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 71 మందిని తెలంగాణకు కేటాయిస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఈ నెల 30లోగా విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. -
‘విద్యుత్’ విభజన పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఐదేళ్లుగా కొరకరాని కొయ్యగా మారిన విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదానికి తెరపడింది. జస్టిస్ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల పంపకాలు జరుపుతూ సుప్రీం కోర్టుకు తుది నివేదికను సమర్పించింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడం తో ఈ వివాదం హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టుకు చేరింది. ఈ వివాద పరిష్కారానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ధర్మాధికారితో సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ 28న ఏకసభ్య కమిషన్ నియమించింది. కమిషన్ సైతం మధ్యవర్తి త్వం ద్వారా వివాదాన్ని పరిష్కరించలేకపోయింది. దీంతో స్వయంగా ఉద్యోగుల పంపకాలు జరుపుతూ తుది నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల విభజన కోసం జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా ఈ కేటాయింపులు జరిపింది. ఈమార్గదర్శకాల ప్రకారం రెండు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించారు. తెలంగాణ నుంచి రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందితోపాటు ఆప్షన్లు ఇవ్వని 42మంది కలిపి 655 మంది, 2 రాష్ట్రాలకూ ఆప్షన్లు ఇచ్చిన 502 మందిని తెలంగాణకు కేటాయించింది. ఏపీ నుంచి స్వచ్ఛందంగా రిలీవై, తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది సెల్ఫ్ రిలీవ్డ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించింది. తుది నివేదిక అమలు చేయడానికి, తుది కేటాయింపులకనుగుణంగా పోస్టింగులు పూర్తి చేసేందుకు 4 నెలల గడువు విధించింది. అయితే ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మంది ఉద్యోగుల విషయంలో ధర్మాధికారి కమిషన్ నివేదికలో ఎలాంటి నిర్ణయాన్ని తెలపలేదు. దీంతో ఈ 256 మందిని ఏపీకే కేటాయించినట్లయిందని తెలంగాణ జెన్కో డైరెక్టర్ ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
భారీ ప్రక్షాళన!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పెద్ద ఎత్తున ప్రక్షాళన మొదలైంది. అసిస్టెంట్ ఇంజనీర్ మొదలుకొని, చీఫ్ ఇంజనీర్ వరకు కొత్త విభాగాలు అప్పగించనున్నారు. రూ. 50 వేల వేతనం దాటిన ప్రతి ఒక్కరికీ స్థాన చలనం ఉంటుంది. ఏపీ ట్రాన్స్‌కో, జెన్కోతో పాటు రెండు డిస్కమ్‌లలోని దాదాపు 8 వేల మందికి శాఖాపరమైన మార్పు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంపై శుక్రవారం అన్ని స్థాయిల ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఏ క్షణంలోనైనా ఆదేశాలు... మార్పులకు సంబంధించిన ఆదేశాలు ఏ క్షణంలోనైనా రావచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఎక్కడా కూడా ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధాన కార్యాలయాల (హెడ్ క్వార్టర్స్)నుంచి బయటకు పంపడం లేదు. సెక్షన్లను మాత్రమే మారుస్తున్నారు. ముఖ్యమైన విభాగంలో కీలక వ్యక్తులకు ప్రస్తుతానికి మినహాయింపు ఉంటుందని ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు తెలిపారు. కాలక్రమేణా మార్పులు చేస్తామన్నారు. ఇవీ కారణాలు... గత ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ అవినీతికి కొమ్ముగాసే వారికే కీలక పోస్టులు దక్కాయి. ఏళ్ల తరబడి అదే విభాగాల్లో తిష్టవేశారు. విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ ప్లాంట్లలో కీలకమైన బొగ్గు రవాణా, ఉత్పత్తి రంగంలోని ముఖ్యమైన పోస్టుల్లో కొంతమంది ఉద్యోగులు దాదాపు 15 ఏళ్ల పైబడి ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వారిని ప్రాధాన్యత లేని పోస్టులకు పంపారు. అవినీతి నిరోధక శాఖకు అనేక మంది ఉద్యోగులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చినా విచారణ జరగకుండా అడ్డుకున్నారు. అవినీతి రహిత పాలన దిశగా కొత్త ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలో పాత వ్యక్తులు అప్పటి అవినీతి వెలుగులోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయి సమాచారం సేకరించిన ప్రభుత్వం పూర్తిస్థాయి ప్రక్షాళన చేపట్టింది. ఈ నిర్ణయం పట్ల మెజారిటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్పు కోసమే: శ్రీకాంత్ భారీ ప్రక్షాళన విద్యుత్ సంస్థల్లో కొత్త మార్పుకు నాంది పలుకుతుందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విభాగాల మార్పువల్ల ఉద్యోగుల్లో నూతనోత్సాహం వస్తుందని, కొత్త ఆలోచనలతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, పూర్తి పారదర్శకంగా చేపడుతున్నామని, ఇది విద్యుత్ సంస్థల చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. -
క్లైమాక్స్‌కువిద్యుత్ విభజన
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం క్లైమాక్స్‌కు చేరుకుంది. జస్టిస్ ఎం.ధర్మాధికారి ఏకసభ్య కమిటీ డిసెంబర్ 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లో సమావేశమై ఏపీ, తెలం గాణ రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులకు సంబంధించిన తుది జాబితాను ఖరారు చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. ఏపీ, తెలంగాణకు ఈ విషయాన్ని తెలుపుతూ జస్టిస్ ఎం.ధర్మాధి కారి కమిటీ తాజాగా లేఖ రాసింది. ఏపీ స్థానికత కలిగి ఉన్నారని 1,157 మంది ఉద్యో గులను తెలంగాణ విద్యుత్ సం స్థలు 2015 జూన్‌లో ఏకపక్షంగా ఏపీకి రిలీవ్ చేయ డంతో గత ఐదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం నడు స్తోంది. దీని పరిష్కారానికి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ధర్మాధికారి నేతృ త్వంలో సుప్రీం కోర్టు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యో గుల విభజనకు ధర్మాధి కారి కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు రిలీవైన 1,157 మందితో సహా తమ స్టేట్ కేడర్ ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించగా, రిలీవైన 1,157 మందిలో 613 మంది ఏపీకి, 504 మంది తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా 42 మంది ఏ రాష్ట్రానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇక ఏపీలో పనిచేస్తున్న మరో 265 మంది తెలంగాణకు ఆప్షన్ ఇవ్వగా, తెలంగాణ నుంచి ఒక్కరూ ఏపీకి ఆప్షన్ ఇవ్వలేదు. ఉద్యో గులిచ్చిన ఆప్షన్ల ప్రకారం.. రెండు రాష్ట్రాలు ప్రాథమిక కేటాయిం పుల జాబితాలను ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించాలని గత నెలలో ధర్మాధికారి కమిటీ ఆదేశించింది. ఆ మేరకు ఇప్పటికే తెలంగాణ విద్యుత్ సంస్థలు ప్రాథమిక కేటాయింపుల జాబితా లను ప్రకటించి అభ్యంతరాల స్వీకరణను ప్రారంభించాయి. అంతమందిని తీసుకోలేం.. ఇటు తమ రాష్ట్రానికి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని స్వీకరించేందుకు ఖాళీ పోస్టులు లేవని, వీరి కోసం ప్రత్యేకంగా సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించడం ఆర్థికపరంగా సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం ధర్మాధికారికి లేఖ ద్వారా తెలియజేసింది. అయితే, ఏపీ నుంచి 202 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు ఐదేళ్ల కిందే స్వచ్ఛందంగా సొంత రాష్ట్రం తెలంగాణకు వచ్చి చేరారు. వీరు తెలంగాణకు రావడంతో ఏపీలో ఖాళీ అయిన పోస్టుల్లో 613 మంది నుంచి 202 మందిని తీసుకునేందుకు ప్రాథమిక కేటాయింపుల జాబితాను ప్రకటించి ఈ నెలాఖరులోగా అభ్యంతరాల స్వీకరణను పూర్తి చేయాలని తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది. డిసెంబర్ 14, 15వ తేదీల్లో రెండు రాష్ట్రాలతో సమావేశం నిర్వహించి తుది కేటాయింపుల జాబితాలను ప్రకటిస్తామని వెల్లడించింది. 265 మందిలో 72 మంది మాత్రమే! ఇక ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 265 మందిలో కేవలం 72 మంది మాత్రమే కమిటీ మార్గదర్శకాల ప్రకారం అర్హులని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గత ఐదేళ్లలో పదవీ విరమణలతో ఏపీలో వందల పోస్టులు ఖాళీ అయ్యాయని, పోస్టులు లేవని ఏపీ చేస్తున్న వాదనలో వాస్తవాలు లేవని తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులు పేర్కొంటున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జాబితాలను ధర్మాధికారి కమిటీకి అందజేసి ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన ఉద్యోగులందరినీ ఆ రాష్ట్రానికే కేటాయించాలని కోరుతామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాలి
సాక్షి, హైదరాబాద్: స్థానికత ప్రతిపాదికన ఏ రాష్ట్ర ఉద్యోగులను ఆ రాష్ట్రంలోనే కొనసాగించాలని, ఒక వేళకాదని ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలని చూస్తే మలిదశ తెలంగాణ పోరాటానికి కూడా వెనుకాడబోమని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, తెలంగాణ విద్యుత్ ఎకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్లు కోరాయి. సమస్య జటిలం కాకముందే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విషయంపై తుది నిర్ణయానికి రావాలని అల్టిమేటం జారీ చేశాయి. ఈ మేరకు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎన్. శివాజీ, మధుసూదన్ రెడ్డి, తెలంగాణ ఎలక్ట్రికల్ ఎకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకుడు అంజయ్య సంయుక్తాధ్వర్యంలో బుధవారం ఎర్రగడ్డ జెన్కో ఆడిటోరియంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఇదే అంశంపై తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.రత్నాకర్‌రావు, కార్యదర్శి సదానందం అధ్యక్షతన ఆ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి, తీర్మా నం ప్రతిని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధు లు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులను ఆప్షన్ల పేరుతో తెలంగాణ విద్యుత్ సంస్థల్లోకి తెచ్చే కుట్ర జరుగుతోందని, ఏపీ ప్రతిపాదనను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని వారు స్పష్టం చేశారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న 229 మంది తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సంస్థల్లో చేర్చుకున్నట్లే.. ఆంధ్ర స్థానికత గల 1157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలన్నారు. తమ అభీష్టానికి విరుద్ధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే..వారికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కిరణ్‌కుమార్, వెంకటనారాయణ, జనప్రియ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యుత్’ విభజనపై మళ్లీ ‘సుప్రీం’కు!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై తాజాగా జస్టిస్ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల్లోని కొన్ని అంశాలను పునః సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరనుంది. ‘ఉమ్మడి ఏపీ విద్యుత్ సంస్థల ఉద్యోగుల్లో కేటాయింపులు చేయదగినవారందరినీ ఏపీ, తెలంగాణకు జరిపే తుది కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ నుంచి ఏకపక్షంగా రిలీవ్ అయిన 1,157 మందితోపాటు తెలంగాణలో ఏకపక్షంగా చేరిన 514 మంది ఉద్యోగులు సైతం పరిగణనలోకి వస్తారు. రాష్ట్ర విభజన జరిగిన తేదీన ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి కేటాయింపులు జరపాలి’’ అనే నిబంధనపై పునః సమీక్ష కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిబంధన అమలు చేయాల్సివస్తే రాష్ట్ర కేడర్‌తోపాటు విద్యుత్ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ మళ్లీ విభజించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఏపీకి రిలీవ్ చేసిన 1,157 మంది ఉద్యోగులతోపాటు తెలంగాణలో చేరిన 514 మంది ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విభజన ప్రక్రియను పూర్తి చేసేలా అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు శనివారం సమావేశమై ఈ మేరకు తీర్మానించాయి. తెలంగాణకు నష్టమే ! జస్టిస్ ధర్మాధికారి మార్గదర్శకాలతో తెలంగాణకు నష్టం జరగనుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన విద్యుత్ ఉద్యోగుల విభజన వివాద పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో సుప్రీంకోర్టు గతేడాది ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజనపై తాజాగా ఈ కమిటీ జారీ చేసిన మార్గదర్శకాలపట్ల తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు వారి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని, వారి సొంత జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో ఆ రాష్ట్రానికే సర్దుబాటు చేయాలని పెట్టిన నిబంధన వల్ల తెలంగాణకు నష్టం జరగనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీకి రిలీవ్ చేసిన 1,157 మంది ఉద్యోగుల్లో 621 మంది మాత్రమే సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లడానికి ఆప్షన్ ఇచ్చారు. మిగిలిన 500 మందికి పైగా ఏపీ స్థానికత గల ఉద్యోగులు తెలంగాణ వైపే మొగ్గు చూపారు. వీరందరినీ మళ్లీ తెలంగాణకే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధర్మాధికారి కమిటీ సూచించిన విధంగా, జిల్లాల స్థానికతను ప్రామాణికంగా తీసుకుని విభజన జరిపితే మరి కొంతమంది తెలంగాణకు వచ్చే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన సమయానికి మంజూరైన పోస్టులసంఖ్య విద్యుత్ ఉద్యోగుల కేటాయింపులకు సరిపోకపోతే, మిగులు ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాల్సిన పరిస్థితి రావచ్చని ఓ సీనియర్ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆప్షన్ ఇచ్చుకున్న చోటే..!
సాక్షి, హైదరాబాద్: ‘కేటాయింపులు జరపాల్సిన విద్యుత్ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు వారిచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని, వారి సొంత జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో ఆ రాష్ట్రానికే సర్దుబాటు చేయాలి. సొంత జిల్లాలను ఉద్యోగుల సర్వీసు రికార్డులు, వారి నుంచి సేకరించిన, రాతపూర్వకంగా వారు సమర్పించిన అభ్యర్థనల్లో ఉన్న సమాచారం ఆధారంగా గుర్తించాలి’అని జస్టిస్ డీఎం ధర్మాధికారి కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీ, తెలంగాణల మధ్య ఏర్పడిన విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యల పరిష్కారానికి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు ఇచ్చింది. ఈ కమిటీ జారీ చేసే ఆదేశాలే తుది నిర్ణయమని అప్పట్లో సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో సంప్రదింపులు జరిపిన ధర్మాధికారి కమిటీ, విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఉద్యోగుల ఆప్షన్లకే పెద్ద పీట వేయడంతో, కోరుకున్న రాష్ట్రానికే వారి కేటాయింపులు జరిగే అవకాశాలున్నాయి. ఏపీ స్థానికత గల 1,157 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి రిలీవ్ చేస్తూ 2015 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం ప్రారంభమైంది. కమిటీ తాజా ప్రతిపాదనలతో తెలంగాణకు ఆప్షన్ ఇచ్చుకున్న 600 మందికి పైగా ఉద్యోగులు మళ్లీ తెలంగాణకే రానున్నారు. రెండు రాష్ట్రాల అధికారులతో బుధవారం ఇక్కడ సమావేశమైన జస్టిస్ ధర్మాధికరి.. మే 25 లోగా ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు జరపాలని ఆదేశించారు. ఇంకా ఆప్షన్లు ఇవ్వని ఉద్యోగుల నుంచి మళ్లీ ఆన్లైన్లో ఆప్షన్లు స్వీకరించాలని కమిటీ సూచించింది. ఇవీ కమిటీ మార్గదర్శకాలు.. - ఉమ్మడి ఏపీ విద్యుత్ సంస్థల ఉద్యోగుల్లో కేటాయింపులు చేయదగిన ఉద్యోగులందరినీ ఏపీ, తెలంగాణకు జరిపే తుది కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ నుంచి ఏకపక్షంగా రిలీవ్ అయిన 1157 మందితో పాటు, తెలంగాణలో ఏకపక్షంగా జాయిన్ అయిన 514 మంది ఉద్యోగులు సైతం పరిగణనలోకి వస్తారు. రాష్ట్ర విభజన జరిగిన తేదీన ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి కేటాయింపులు జరపాలి. - విద్యుత్ సంస్థల వారీగా, ఒక్కో విద్యుత్ సంస్థకు మంజూరైన పోస్టుల నిష్పత్తి ప్రకారం రెండు కొత్త రాష్ట్రాలకు ఉద్యోగుల కేటాయింపులు జరపాలి. విభజన చట్టం ప్రకారం ఇంధన శాఖ డిస్కంల కోసం జారీ చేసిన జీవోలకు అనుగుణంగా కేటాయింపులుండాలి. - ఉద్యోగుల కేటాయింపు జాబితా తయారైన తర్వాత దాన్ని సదరు విద్యుత్ సంస్థ ప్రధాన కార్యాలయం నోటీసు బోర్డు మీద అతికించాలి. సంస్థ వెబ్‌సైట్‌తో పాటు ఉద్యోగుల సమాచార వెబ్సైట్లలో ఉంచాలి. ప్రతిపాదిత కేటాయింపుల నోటీసుకు మూడు వారాల్లోగా సంబంధిత ఉద్యోగులు తమ రాత పూర్వక అభ్యర్థనలను సమర్పించవచ్చు. - ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల అధికారులతో ఓ ద్విసభ్య ఉప కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతిపాదిత కేటాయింపులపై ఉద్యోగులు పెట్టుకునే అభ్యర్థులను ఈ ఉపకమిటీ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుని, జస్టిస్ ధర్మాధికారి కమిటీకి కేటాయింపుల జాబితాను ప్రతిపాదించాలి. - ఎస్సీ, ఎస్టీలుగా గుర్తింపు పొందిన రాష్ట్రంలోని సరైన విద్యుత్ సంస్థకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కేటాయించేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నించాలి. - తీవ్రమైన వ్యక్తిగత సమస్యలు గల ఉద్యోగులకు మినహాయింపులు ఉంటాయి. - వితంతువులు, చట్టపరంగా వేరుపడిన, విడాకులు పొందిన మహిళా ఉద్యోగులను వారి విజ్ఞప్తి మేరకు కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి. - రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం 60 శాతానికి పైగా వైకల్యం గల ఉద్యోగులను ఆప్షన్ ఆధారంగా కేటాయించాలి. - ఉద్యోగి జీవిత భాగస్వామి లేదా సంతానం కేన్సర్, ఓపెన్ çహార్ట్/బైపాస్ సర్జరీ, కిడ్నీ మార్పిడి/కిడ్నీ వైఫల్యంతో డయాలసిస్, మానసిక వైకల్యం వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతుంటే, సదరు ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని వారి కేటాయింపులు జరపాలి. ఎ) ఉద్యోగి జీవిత భాగస్వామి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థల్లో పనిచేస్తుంటే ఈ కింది మార్గదర్శకాలను అనుసరించాలి. బి) ఇద్దరు జీవిత భాగస్వాములను వారి సొంత రాష్ట్రాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపులు జరపొచ్చు. సి) జీవిత భాగస్వామి ఒకరు విద్యుత్ సంస్థల్లో, మరొకరు పీఎస్‌యూ/రక్షణ సంస్థలు/రైల్వేలు/బ్యాంకింగ్, బీమా రంగం/కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటే, ఇలాంటి సమయంలో ఒక్కో కేసు ఆధారంగా కేటాయింపులు జరపాలి. డి) జీవిత భాగస్వాములిద్దరూ వేర్వేరు రాష్ట్రాల(ఏపీ/టీఎస్)కు చెందిన వారైతే, వారి విజ్ఞప్తి మేరకు కోరుకున్న రాష్ట్రానికి కేటాయించాలి. - ఇప్పటికే పదవి విరమణ చేసిన/చనిపోయిన ఉద్యోగులు, పెన్షనర్లను పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపులు జరపాలి. -
‘విద్యుత్’ కార్మికుడిపై టీడీపీ నేత దాడి
సాక్షి, రాజుపాలెం/పిడుగురాళ్ళ(సత్తెనపల్లి/గురజాల): అధికార పార్టీకి చెందిన నేతల ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. తాజాగా విద్యుత్ మీటరు బయట పెట్టుకోమన్నాడన్న కోపంతో ..తెలుగు యువత నాయకుడొకరు మీటరు రీడింగ్ చేసే కాంట్రాక్టు ఉద్యోగిని నానా దుర్భాషలాడుతూ చితకబాదిన ఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం పెదనెమలిపురి గ్రామానికి చెందిన మండల టీడీపీ తెలుగు యువత అధ్యక్షుడు ముప్పాళ్ల బాలకృష్ణ ఇంటికి శుక్రవారం విద్యుత్ మీటరు రీడింగ్ తీసేందుకు మెరుగు గౌరీశంకర్ అనే కాంట్రాక్టు ఉద్యోగి వెళ్లాడు. తలుపు వేసి ఉండడంతో తలుపును కొట్టగా బాలకృష్ణ బయటకొచ్చి ప్రశ్నించాడు. మీటరు రీడింగ్ తీయడానికి వచ్చానని, మీటరును బయట బిగించాలని చెప్పాడు. దీంతో బాలకృష్ణ ఆగ్రహంతో అతడిని బయటకు నెట్టి ఇష్టమొచ్చినట్లు తిడుతూ కణతపై రివాల్వర్ గురిపెట్టి కాల్చి చంపుతా అంటూ కాళ్లతో తన్నుతూ చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. గతంలోనూ ఇదే విధంగా దాడి.. నాలుగు నెలల క్రితం ఇదేవిధంగా ముప్పాళ్ల బాలకృష్ణ ఇంట్లో మీటరు రీడింగ్ తీయడానికి వెళ్లిన వల్లెల ప్రసాదుపై రివాల్వర్‌తో దాడి చేయడంతో బాధితుడు హడలిపోయి ఉద్యోగమే మానుకున్నాడని తోటి ఉద్యోగులు తెలిపారు. మీటరు రీడింగ్ తీయడానికి వెళ్లిన మరో కార్మికుడు సానికొమ్ము చంద్రశేఖర్‌రెడ్డిపై అదేవిధంగా దాడి చేయడంతో అతడిని వేరే గ్రామాలకు మార్చి అతని స్థానంలో మెరుగు గౌరీశంకర్‌ను నియమించారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు.. వరుసగా మీటరు రీడింగ్ కార్మికులపై దాడులు చేయడంతో ముప్పాళ్ల బాలకృష్ణపై కాంట్రాక్టర్ ఆర్వీ నారాయణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు దాడి కేసు నమోదు మీటరు రీడింగ్ చూసేందుకు వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగిపై ముప్పాళ్ల బాలకృష్ణ రివాల్వర్ గురిపెట్టి చితకబాదారని, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ పిడుగురాళ్ల పట్టణ విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయంలో ఏఈ భగవాన్‌నాయక్‌కు బిల్లింగ్ కాంట్రాక్టర్ ఆర్వీ నారాయణరావు శనివారం అర్జీ ఇచ్చారు. గౌరీశంకర్ శుక్రవారం రాత్రి యూనియన్ నాయకులతో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. శనివారం పిడుగురాళ్ళ సీఐ సుబ్బారావు బాధితుడు గౌరీశంకర్‌ను జరిగిన విషయం గురించి అడిగి తెలుసుకున్నారు. తెలుగు యువత నాయకుడు బాలకృష్ణపై ఎఫ్ఐఆర్ కడితే కానీ ఇక్కడ నుంచి కదలబోమని యూనియన్ నాయకులు పట్టుబట్టడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు దాడి చేసినట్టు కేసు నమోదు చేíఠిbÜ ఎఫ్ఐఆర్ కాపీని యూనియన్ నాయకులకు అందజేశారు. మాచర్ల డివిజన్‌కు చెందిన విద్యుత్ యూనియన్ నాయకులు పి.శ్రీనివాసరావు, ఎం.బలరామకృష్ణ, గుజ్జర్లపూడి ప్రవీణ్‌కుమార్, గొల్లమండి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.ఆంజనేయులునాయక్ తదితరులు ఉన్నారు. -
ఉద్యోగుల ట్రస్టు నిధులు హాంఫట్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటికే ఒక్కో సేవను ప్రైవేట్‌పరం చేస్తూ ఉద్యోగుల పొట్టకొడుతున్న విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల ట్రస్టుకే చిల్లు పెట్టేశాయి. ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఉద్యోగుల ట్రస్టు నిధులను దీని నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జెన్కో తన సొంతానికి వాడుకుంది. 25 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ కోసం భద్రపరచిన సొమ్మును జెన్కో సొంత అవసరాలు, సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చెల్లింపులు తదితరాలకు వినియోగించడం ఆందోళనకు దారి తీస్తోంది. సిబ్బంది సంక్షేమానికి తూట్లు ఉద్యోగుల పింఛన్ల కోసం భద్రపరిచిన రూ.1,500 కోట్లను జెన్కో ఇప్పటికే వినియోగించగా నాలుగేళ్లుగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ వాటాగా విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన రూ.500 కోట్లను ఇవ్వకుండా వాడుకోవడం చర్చనీయాంశమవుతోంది. జెన్కోతోపాటు ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగులందరికీ ఈ ట్రస్టు ద్వారానే పింఛను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల స్థూల వేతనంలో 9 శాతం చొప్పున సిబ్బంది సంక్షేమం కోసం మూడు విభాగాల నుంచి ట్రస్టుకు జమ చేస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా సుమారు రూ.500 కోట్లను డిపాజిట్ చేయకుండా జెన్కో అవసరాలకు వినియోగించారు. మళ్లీ నిర్వీర్యం చేసే చర్యలు మొదలు.. ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా జెన్కోకు డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఎస్ఏ) రూపంలో అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సర్దుబాటు చార్జీల రూపంలో డిస్కంల నుంచి రావాల్సిన మొత్తాన్ని కాగితాల్లో మాత్రం ట్రస్టు నిధులుగా చూపుతున్నట్టు సమాచారం. విద్యుత్ సంస్కరణలో సమయంలో డిస్కంలను ప్రైవేట్‌పరం చేస్తారని, జెన్కోకు చెందిన ఒక్కో ప్లాంటును విక్రయిస్తారని అప్పట్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత జెన్కోకు ప్రభుత్వ గ్యారంటీతో నిధులు ఇవ్వడంతో పాటు భారీగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని జెన్కో ఆధ్వర్యంలో చేపట్టారు. అంతేకాకుండా డిస్కంల ప్రైవేటీకరణ ఆలోచనను తిరస్కరించడంతో పాటు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎంగా వచ్చిన తర్వాత తిరిగి విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలు మొదలయ్యాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై జెన్కో ఎండీ కె.విజయానంద్‌ను సంప్రదించగా.. ట్రస్ట్ నిధులను వినియోగించుకునేందుకు అవకాశం లేదన్నారు. ఏమిటీ ట్రస్టు..? గతంలో విద్యుత్ సంస్థలన్నీ కలిపి ఒకే సంస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) పేరుతో మనుగడలో ఉండేవి. 1999లో ఏపీఎస్ఈబీని చంద్రబాబు ప్రభుత్వం ముక్కలు చేసింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లుగా మూడు ముక్కలు చేసింది. విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులకు మెరుగైన జీతాలు, హోదాతోపాటు పింఛన్లు కూడా ఇస్తామని ఈ సందర్భంగా హామీలను గుప్పించింది. ఈ మేరకు ఏపీఎస్ఈబీ, ప్రభుత్వం, ఉద్యోగులకు 1999లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పెన్షన్ నిధికి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో రూ.4 వేల కోట్లతో ఈ ట్రస్టు ఏర్పాటైంది. ఏపీఎస్ఈబీ హయాంలో ఉద్యోగం పొందిన చివరి సిబ్బంది పదవీ విరమణ చేసేవరకూ ఈ ట్రస్టును మనుగడలో ఉంచాలని నిర్ణయించారు. ఇలా 2033 వరకూ ఈ ట్రస్టు మనుగడలో ఉండనుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రస్టులో రూ. 2,500 కోట్ల మేర నిధులున్నాయి. ఇందులో నుంచి ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు వినియోగించారు. -
ఎందుకింత జటిలం చేశారు?
సాక్షి,న్యూఢిల్లీ: విద్యుత్ ఉద్యోగుల విభజనను ఎందుకింత జటిలం చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, డిస్కమ్‌ల ఉద్యోగుల విభజనపై దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ అభయ్ మనోహర్‌సాప్రే, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ధర్మాసనం బుధవారం విచారించింది. ఏపీకి వెళ్తామని ఆప్షన్ ఇచ్చిన 600 మంది ఉద్యోగులను తీసుకునేందుకు ఏపీ ముందుకు రావటం లేదని తెలంగాణ ఉద్యోగుల తరఫు న్యాయవాదులు కొలిన్ గోన్సాల్వే, మహావీర్‌సింగ్‌లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘తెలంగాణ రిలీవ్ చేసిన ఉద్యోగులను హైకోర్టు ఆదేశాల మేరకు తిరిగి తీసుకున్నా వారికి వేతనాలు మాత్రమే చెల్లిస్తూ విధులు అప్పగించడం లేదని, వారిని కూడా రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణించాలని ఏపీ ఉద్యోగుల తరఫున వికాస్ సింగ్, రవిశంకర్ కోర్టుకు నివేదించారు. వాదనల అనంతరం ‘ఇదీ కేవలం ఉద్యోగుల విభజన. ఎందుకింత జటిలం చేశారు..’అని సుప్రీం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 18కి వాయిదా వేసింది. -
నెలాఖరులోగా విద్యుత్ పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెలాఖరులోగా ప్రకటన చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలో నియమించిన విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ (పీఆర్సీ) గురువారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావుకు నివేదిక సమ ర్పించింది. వేతన సవరణ ఫిట్ మెంట్ శాతం, వెయిటేజీ ఇంక్రి మెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో త్వరలో విద్యుత్ సంస్థల యాజ మాన్యాలు చర్చలు జరపను న్నాయి. అనంతరం ఈ నెల 26లోగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పీఆర్సీ నివేదికను పంపిస్తామని, సీఎం ఆమోదిస్తే ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన విడుదల చేస్తామని డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఫిట్మెంట్కన్నాఎక్కువ ఇవ్వాలంటున్న ఉద్యోగులు ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లలో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై యాజమాన్యాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా నాలుగేళ్ల కింద విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఅర్సీ ప్రకటించారు. అయితే ఇటీవల ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్మెంట్తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై విద్యుత్ సంస్థలు తీసుకునే నిర్ణయంపై విద్యుత్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ప్రకటించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్మెంట్ శాతంపై సీఎం నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడినపెట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేసేందుకు విద్యుత్ ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31తో గత పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. ప్రస్తుత వైద్య సదుపాయానికి మెరుగులు... విద్యుత్ ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రస్తుత వైద్య పథకాన్ని మెరుగుపరిచి కొనసాగించాలని పీఆర్సీ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఎన్టీపీసీ తరహాలో అపరమిత నగదురహిత వైద్య సదుపాయం అందించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాన్ని మరింత సరళీకృతం చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఈఎన్టీ, దంత, కంటి వైద్యానికి ప్రస్తుత పథకంలో ఉన్న పరిమితులను తొలగించాలని కమిటీ కోరినట్లు చర్చ జరుగుతోంది. తక్షణమే సంప్రదింపులు: ఉద్యోగుల జేఏసీ డిమాండ్ కొత్త పీఆర్సీ అమలులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల వేతన స్కేలు, అలవెన్సులు, ఈపీఎఫ్, జీపీఎఫ్, సమగ్ర వైద్య సదుపాయ పథకంపై తుది నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో యాజమాన్యాలు సంప్రదింపులు ప్రారంభించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 26లోగా పీఆర్సీపై ప్రకటన చేయాలని లేకుంటే 27న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం అందజేసింది. -
ఆర్టిజన్ల వేతనాలు పెంపు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికు (ఆర్టిజన్లు)లకు శుభవార్త. ఆర్టిజన్ల వేతనాలు పెంచుతూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పొందుతున్న వేతనాలతో పోలిస్తే.. గ్రేడ్–1 ఆర్టిజన్లకు రూ.3,477, గ్రేడ్–2 ఆర్టిజన్లకు రూ.2,865, గ్రేడ్–3 ఆర్టిజన్లకు రూ.2,181, గ్రేడ్–4 ఆర్టిజన్లకు రూ.1,900 వేతనం పెరగనుంది. ఆగస్టు 1 నుంచి పెరిగిన వేతనాలు అమల్లోకి రానున్నాయి. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ యాజమాన్య వాటాలను ఇకపై యాజమాన్యాలే చెల్లించనున్నాయి. ఇప్పటివరకు యాజమాన్య వాటాలను కూడా కార్మికుల వేతనాల నుంచే చెల్లిస్తున్నారు. తాజా నిర్ణయంతో ఆ మొత్తం కార్మికులకే మిగిలి ఆ మేరకు వారి వేతనాల్లో పెరుగుదల కనిపిస్తుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 21 నుంచి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో గత శనివారం సచివాలయంలో జరిగిన చర్చల సందర్భంగా ఆర్టిజన్ల వేతనాల పెంపుతోపాటు ఈఎస్ఐ, పీఎఫ్ వాటాల చెల్లింపు తదితర డిమాండ్ల పరిష్కారానికి విద్యుత్ సంస్థల యాజమాన్యాలు హామీ ఇవ్వడంతో అదే రోజు కార్మిక సంఘాలు సమ్మె విరమించాయి. ఈ నేపథ్యంలో ఆ హామీలను అమలుచేస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కింది హామీలను అమలు చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 20,803 మంది ఆర్టిజన్లకు ప్రయోజనం కలగనుంది. అమలు చేయనున్న హామీలివే... ♦ విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల విలీనంపై హైకోర్టులో విధించిన యథాతథ స్థితి(స్టే) తొలగింపునకు తక్షణమే విద్యుత్ సంస్థలు అదనపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తాయి. ♦ విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగుల వేతన సవరణ జరగనున్న నేపథ్యంలో ఆర్టిజన్ల ఏకమొత్తం వేతనాల పెంపునకు అంగీకరించాం. పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆర్టిజన్ల వేతనాల పెంపు ఉండదు. ♦ నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రోత్సాహకంగా ఆర్టిజన్లకు ప్రత్యేక అలవెన్స్ మంజూరు. ♦ సాధారణ మరణం/ప్రమాదాల్లో మరణించిన ఆర్టిజన్ల కుటుంబంలో అర్హులైన ఒకరికి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగావకాశం కల్పిస్తాం. ♦ ఆర్టిజన్ గ్రేడ్–3, గ్రేడ్–4గా కొనసాగుతూ పోల్ టూ పోల్, ఎఫ్ఓసీ, సబ్‌స్టేషన్ ఆపరేటర్, ఎంఆర్టీ, సీబీడీ, లైన్ బ్రేక్ డౌన్ గ్యాంగ్, డీపీఈగా నైపుణ్యం కలిగి విధులు నిర్వహిస్తున్న వారికి ఆర్టిజన్ గ్రేడ్–2 వేతనం చెల్లింపు. ♦ టీఎస్ఎస్పీడీసీఎల్లోని ఫీల్డ్ కార్యాలయాలు, సబ్స్టేషన్లలో గత రెండేళ్లుగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిశీలిస్తున్నాం. ♦ విధి నిర్వహణలో ప్రమాదాలకు లోనైతే చికిత్స కల్పించేందుకు మెడికల్ క్రెడిట్ కార్డులు జారీ. ♦ రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే ఆర్టిజన్లకు సైతం సాధారణ మరణానికి రూ.10 లక్షల జీవిత బీమా చెల్లింపు. ♦ కార్మికుల ఈఎస్ఐ, పీఎఫ్ వాటాలను ఆయా చట్టాల ప్రకారమే వారి వేతనాల్లో కోత విధింపు. -
విద్యుత్ సంస్థల్లో ‘బినామీ’ ప్రకంపనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని కొంద రు అధికారులు తమ బంధువులు, మిత్రుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి కాంట్రాక్టు వ్యాపారం చేస్తున్న వైనం రాష్ట్ర ప్రభుత్వం, అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బుధవారం ‘సాక్షి’ప్రధాన సంచికలో ‘పనీ మాదే.. పైసా మాదే’శీర్షికతో ప్రచురించిన కథనం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తక్షణమే స్పం దించిన తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు.. బినామీ పేర్లతో కాంట్రా క్టు వ్యాపారం చేస్తున్న విద్యుత్ అధికారులపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డిని ఆదేశించారు. విద్యుత్ ఉద్యోగులుగా పని చేస్తూ సంస్థతోనే కాంట్రా క్టు వ్యాపారాలు చేయడం సరికాదని ప్రభాకర్‌రావు తప్పుబట్టారు. టెండర్ నిబంధనల ప్రకారం ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కాంట్రాక్టు పనులు చేపట్టడం అక్రమమని పేర్కొన్నారు. ‘సాక్షి’ ప్రచురించిన పరిశోధన్మాతక కథనం బాగుందని, ఎంతో మంది విద్యుత్ ఉద్యోగులకు కనువిప్పు కలిగించిందని ప్రశంసించారు. బినామీల పేర్లతో కాంట్రాక్టులు నిర్వహిస్తున్నారని దర్యాప్తులో తేలితే నిబంధనల ప్రకారం సంబంధిత పనులను రద్దు చేసి బాధ్యులైన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
ట్రాన్స్‌ఫార్మర్‌పైనే మృత్యువాత
నర్సంపేట రూరల్: ఫ్యూజ్ వేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన విద్యుత్‌శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని వల్లభ్‌నగర్‌కు చెందిన మణికుమార్(22) విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి. ట్రాన్స్ఫార్మర్కు ఫ్యూజ్ పనిచేయకపోవడంతో ఓ రైతు లైన్ ఇన్స్పెక్టర్కు సమాచారమిచ్చాడు. ఆయన సూచన మేరకు మణికుమార్ 11 కేవీ పాకాల ఫీడర్‌కు ఎల్సీ (విద్యుత్ సరఫరా నిలిపివేత) తీసుకొని ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడు. అప్పటికే రాజుపేట ఫీడర్ ఛానల్ ఎల్టీ లైన్ సర్వాపురం శ్మశాన వాటిక వద్ద పాకాల ఫీడర్ విద్యుత్ వైర్లకు తాకడంతో విద్యుత్ ప్రసారం అవుతోంది. ఈ క్రమంలో ఫ్యూజ్ సరిచేస్తుండగా అతడు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. -
మీది కోర్టు ధిక్కారమే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాల రూపకల్పనకు 2 నెలల్లో కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనని తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థలకు హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కారానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చిచెప్పింది. వాదనలు విన్న తర్వాత ఎవరిది కోర్టు ధిక్కారమో తేలుస్తామని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు విద్యుత్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అమలు కాలేదు.. తెలంగాణ విద్యుత్ సంస్థలు తమను స్థానికత ఆధారంగా విభజించడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యల్లో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం, స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తీర్పునిచ్చింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్ కమిటీని కొనసాగించాలని, లేదా కొత్త కమిటీని రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను, విద్యుత్ సంస్థలను ఆదేశించింది. విభజన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇప్పటికే రిలీవ్ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలు అమలు చేయడం లేదంటూ పలువురు ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. వీటి విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీనివాస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదని తెలిపారు. వివక్ష చూపొద్దని చెప్పాం తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, ఆగస్టు 27న సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, తమ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందా అని ప్రశ్నించింది. లేదని ఉభయ పక్షాల న్యాయవాదులు చెప్పడంతో.. స్టే లేనప్పుడు సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లతో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘ ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మీరు (ఉభయ రాష్ట్రాలు, విద్యుత్ సంస్థలు) మా ఆదేశాలను అమలు చేయలేదని అర్థమవుతోంది. ఎలాంటి వివక్షకు తావు లేకుండా వ్యవహరించాలని మేం స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ధిక్కార పిటిషన్లను పరిశీలిస్తే మీరు (తెలంగాణ విద్యుత్ సంస్థలు) వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కోర్టు ధిక్కారమే’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 39 నుంచి 60% వరకు ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని వివిధ విద్యుత్ ఉద్యోగుల సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వేతన సవరణ సంప్రదింపుల సంఘం చైర్మన్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలోని కమిటీ బుధవారం విద్యుత్ సౌధలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగ సంఘాలతో సమావే శమై సంప్రదింపులు జరిపింది. 19 విద్యుత్ ఉద్యోగుల సంఘాలతోపాటు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జేఏసీ ప్రతినిధులతో ఈ కమిటీ వేర్వేరుగా సమావేశమై వారి వాదనలు విన్నది. అధికార టీఆర్ఎస్ పార్టీ అనుబంధ ఉద్యోగ సంఘం టీఆర్వీకేఎస్ 39% ఫిట్మెంట్తో పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్ చేయగా, మిగిలిన సంఘాలన్నీ 50 శాతానికి పైనే ఫిట్మెంట్ కోరాయి. 1104, 327 యూనియన్లు 60% ఫిట్‌మెంట్‌ను డిమాండ్ చేయగా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ 51% ఫిట్‌మెంట్‌ను అడిగింది. ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు 25% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ సైతం సత్వరంగా పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆయా యూని యన్లు విజ్ఞప్తి చేశాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు జీత, భత్యాలు, సదుపాయాలు వర్తింపజేయాలని, అపరిమిత వైద్య చికిత్సల సదుపాయం కల్పించాలని కోరాయి. ఈ డిమాండ్లు ఎలా న్యాయబద్ధమో వివరించాలని యూనియన్లను పీఆర్సీ కమిటీ అడిగి తెలుసు కుంది. ఈ సమావేశంలో పీఆర్సీ కమిటీ ఎలాంటి అభిప్రాయాలుకానీ, హామీలుకానీ వ్యక్తం చేయ లేదని యూనియన్ల నేతలు తెలిపారు. యూనియన్లతో తదుపరి సంప్రదింపుల తేదీని త్వరలో తెలియజేస్తామని కమిటీ తెలిపింది. ఈ చర్చల్లో పీఆర్సీ కమిటీ సభ్యులు లీత్ కుమార్, అశోక్ కుమార్, టి.శ్రీనివాస్, బీవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు
-
విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి ఆంధ్రాకు రిలీవ్ అయిన ఉద్యోగులను తిరిగి వెనక్కి తీసుకోరాదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు గురువారం విద్యుత్ సౌధలో మహాధర్నా చేశారు. స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ట్రాన్స్‌కో, జెన్కో, డిస్ట్రిబ్యూషన్ సంస్థల ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఆంధ్రా ప్రభుత్వం, ఆంధ్రా విద్యుత్ యాజమాన్యం మొండివైఖరికి నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. జేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, బీసీ రెడ్డి, రాజేంద్రప్రసాద్ తదితరుల నాయకత్వంలో నిర్వహించిన ఈ ధర్నాకు తెలంగాణ విద్యుత్ సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. ఆంధ్రా ఉద్యోగుల విషయంలో అడ్వొకేట్ జనరల్ సలహా తీసుకుని ముం దుకు పోతామన్నారు. సీఎం ఢిల్లీ నుంచి రాగానే విష యం ఆయన దృష్టికి తీసుకువెళతానని, రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అన్యాయం జరగకుండా చూడాలి విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంపై సీఎం స్పందించి రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని జేఏసీ నాయకులు కోరారు. దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేయడం, లేదా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం చేయాలని కోరారు. -
విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు తోడుగా ఉంటా
-
ఆ రెండు రాష్ట్రాలను చూసి బుద్ధి తెచ్చుకోండి
విజయనగరం మున్సిపాలిటీ: సుప్రీంకోర్టు ఆదేశానుసారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయటంలో పక్కనే ఉన్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను చూసి ఏపీ సర్కారు బుద్ధి తెచ్చుకోవాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టి.వి.రమణ హితవు పలికారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలని కోరుతూ ఈ నెల 20నుంచి విజయవాడలో చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షలను భగ్నం చేయటాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రంలో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తీరుపై యూనియన్ నాయకులు మండిపడ్డారు. కేం ద్రంలో, రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల కు జీతాలు పెంచుకునేందుకు ప్రభుత్వాల వద్ద డబ్బు ఉంటుందికానీ... కష్టపడి పని చేసే కార్మికులు చేసిన పనికి జీతం చెల్లించేందుకు డబ్బులు లేకపోవటం దౌర్భాగ్యమన్నారు. 13 జిల్లాలో గల కాంట్రాక్ట్ కార్మికులంతా తమ హక్కుల కోసం ఐకమత్యంగా పోరాటం చేస్తే వాటిని భగ్నం చేయటం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వ నిర్బంధ చర్యలను ప్రజాతంత్ర వాదులంతా ఖండించాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎ.వెంకటఅప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రవిచంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు జి.అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ‘విద్యుత్’ పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కొత్త వేతన సవరణ కమిటీ (పీఆర్సీ) ఏర్పాటు కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కోరాయి. సర్కారు అనుమతి లభిస్తే త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించాయి. విద్యుత్ ఉద్యోగుల ప్రస్తుత పీఆర్సీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో ముగియనుండటంతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని విద్యుత్ సంస్థల యాజమా న్యాలకు విద్యుత్ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఇటీవల విన్నవించాయి. ఈ నేప థ్యంలోనే కమిటీ ఏర్పాటుకు అనుమతివ్వాలని ప్రభుత్వా నికి యాజమాన్యాలు విన్నవించాయి. చివరి సారిగా 2014 మే నెలలో విద్యుత్ ఉద్యోగులకు 28 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేశారు. దీంతో విద్యుత్ సంస్థలపై నెలకు రూ.45 కోట్ల చొప్పున ఏడాదికి రూ.540 కోట్ల వరకు భారం పడింది. 2000 నుంచి ప్రతీ పీఆర్సీలో 20 శాతా నికి మించి ఫిట్మెంట్ వర్తింపజేశారని, ఈసారీ అదే ట్రెండ్ కొనసాగే అవకాశముందని అధికా రులు చెప్పారు. ఉద్యోగ, కార్మిక సంఘాలతో కొత్త వేతన సవరణ కమిటీ సమావేశమై ఫిట్‌మెంట్‌పై నిర్ణయం తీసుకుంటుందన్నారు. మూడేళ్లకోసారి సవరణ.. జెన్కో, ట్రాన్స్‌కో, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్)లలో సుమారు 20 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి మూడేళ్లకో సారి కొత్త ఆర్సీని ప్రభుత్వం అమలు చేస్తోంది. వేతన సవరణకు ఉమ్మడి వేతన సవరణ కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేస్తాయి. ఒక్కో విద్యుత్ సంస్థ నుంచి ఇద్దరు చొప్పున అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఖరారు చేసే సమయంలో విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితి, ఆర్థిక వనరులు, అదనపు భారం దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోనున్నారు. అలవెన్సులపైనా కమిటీలు విద్యుత్ సంస్థల ఉద్యోగులకు అలవెన్సుల చెల్లింపులపైనా ఆ సంస్థల యాజమాన్యాలు త్వరలో కమిటీలు ఏర్పాటు చేయనున్నాయి. విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ కమిటీ తర్వాత వీటిని ఏర్పాటు చేయనున్నారు. జెన్కోలో పనిచేస్తున్న కోల్ ప్లాంట్, యాష్ ప్లాంట్, హాట్‌లైన్ వర్కర్లకు చెల్లించే ప్రత్యేక అలవెన్సులు, విద్యుత్ ఉద్యోగుల ట్రాన్స్‌పోర్టు, కన్వీనియన్స్ తదితర అలవెన్సులపై కమిటీలు నిర్ణయం తీసుకోనున్నాయి. -
వేతనాల వ్యయం తగ్గించుకోండి
- డిస్కంలకు ఈఆర్సీ ఆదేశం - విద్యుత్ సిబ్బంది పీఆర్సీని సవరించండి - మూడు నెలల్లో కార్యాచరణ నివేదిక ఇవ్వండి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ విధానాన్ని సవరించాలని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) ఆదేశాలు జారీ చేసింది. ఇతర రాష్ట్రాల డిస్కంలను ప్రమాణంగా తీసు కుని రాష్ట్ర డిస్కంల ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. విద్యుత్ సంస్థల్లో పనిచేసే సీనియర్ ఇంజనీర్ల వేతనాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీతం కన్నా అధికంగా ఉందని, అయినా విద్యుత్ అధికారులు వినియోగ దారులకు సరైన సేవ లందించడం లేదని ఈఆర్సీ నిర్వహించిన బహిరంగ విచారణల్లో రైతు, వినియోగదారుల సంఘాలు ఇటీవల ఆరోపణలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే విద్యుత్ ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్న నేపథ్యంలో.. ప్రభుత్వ పీఆర్సీ విధానానికి అనుగుణంగా విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీని సవరించాలని, ఇతర రాష్ట్రాల డిస్కంల తరహాలో ఉద్యోగుల వేతనాల వ్యయం తగ్గించుకోవాలని ఈఆర్సీ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే భవిష్యత్తులో డిస్కంలు ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్ల బకాయిలను నిపుణులతో గణించాలని సూచించింది. లోపాలపై మూడు నెలల్లో నివేదిక కిందకు వేలాడే విద్యుత్ తీగలు, రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లతో ప్రమాదాలు జరుగుతున్నా యని చాలామంది వినియోగదారులు తెలిపా రని ఈఆర్సీ పేర్కొంది. ఈ లోపాలు సరిదిద్దేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో కార్యాచరణ నివేదిక సమర్పించాలని డిస్కం లను ఆదేశించింది. కార్యాచరణపై ప్రతి 6 నెలలకోసారి పురోగతి నివేదిక సమర్పిం చాలని కోరింది. 2016–17లో రాష్ట్రంలో జరిగిన విద్యుత్ ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి నివేదిక సమర్పించాలని తెలిపింది. డిస్కంలకు ఈఆర్సీ జారీ చేసిన ముఖ్య ఆదేశాలివీ.. ► విద్యుత్ ప్రమాదాల బాధితులకు పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవా లి. పరిహారం దరఖాస్తుదారులకు విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించాలి. ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగా దరఖాస్తుదా రులు పురోగతిని తెలుసుకునేలా సమాచా రాన్ని డిస్కంల వెబ్సైట్లో పొందుపర్చాలి ► క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది కొరతపై తగిన చర్యలు తీసుకోవాలి ► పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా డిస్కంలు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు జరపాలి ► ఐటీ కంపెనీల సముదాయాల్లో ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యాపార సముదాయాలకు ప్రత్యేక విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలి. నవంబర్ 30లోగా దీనిపై నివేదికను సమర్పించాలి. -
క్రమబద్ధీకరణకు 22 వేల దరఖాస్తులు
- 10 వేల దరఖాస్తులు సబ్‌స్టేషన్ ఆపరేటర్లవే - బిల్ కలెక్టర్ల నుంచీ దరఖాస్తుల స్వీకరణపై త్వరలో నిర్ణయం - ఆ తర్వాతే మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్వహించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల మందికి పైగా తాత్కాలిక ఉద్యోగులు, కార్మికుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అందులో దాదాపు 10 వేలు సబ్‌స్టేషన్ ఆపరేటర్లవే ఉన్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో అత్యధికంగా 10 వేల దరఖాస్తులు రాగా, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) పరిధిలో మరో 5 వేలు, తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) పరిధిలో 4,200, రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) పరిధిలో 4,100 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఇంధన శాఖ అధికార వర్గాలు తెలిపాయి. దరఖాస్తుల్లోని సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 17 తర్వాతే దరఖాస్తుల సంఖ్య పట్ల స్పష్టత రానుందని అధికారవర్గాలు తెలిపాయి. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ అమలు కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు దరఖాస్తుల స్వీకరణ నిర్వహించాయి. బిల్ కలెక్టర్లపై త్వరలో నిర్ణయం ప్రైవేటు కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న బిల్ కలెక్టర్లు, అకౌంటింగ్ అసిస్టెం ట్లు, హమాలీల క్రమబద్ధీకరణ కోసం కూడా దరఖాస్తులు స్వీకరించే అంశంపై త్వరలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నాయి. పార్ట్‌టైం ఉద్యోగుల నుంచీ దరఖాస్తులు స్వీకరించాలని విద్యుత్ ట్రేడ్ యూనియన్లు చేసిన డిమాండ్‌పై యాజమా న్యాలు పరిశీలన జరుపుతున్నాయి. పార్ట్‌టైం ఉద్యోగులకు భవిష్య నిధి (పీఎఫ్) సదుపాయం లేకపోవడం, నిబంధనల మేరకు 8 గంటలు పనిచేసే కార్మికుల పరిధిలోకి వీరు రాకపోవడంతో పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి తొలుత దరఖాస్తులు స్వీకరించలేదు. ట్రేడ్ యూనియన్ల విజ్ఞప్తుల నేపథ్యంలో సాధ్యాసా ధ్యాలను పరిశీలించి ఆ తర్వాత ఓ నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యాలు భావిస్తున్నా యి. దీంతో పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి భవిష్యత్తులో న్యాయపర చిక్కులు ఎదురుకా వన్న అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవు తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిస్కంల పరిధిలో దాదాపు 5 వేల మందికి పైగా బిల్ కలెక్టర్లు పార్ట్‌టైమ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. -
కటాఫ్ డేట్ 2016 డిసెంబర్ 4
⇒ విద్యుత్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు.. ⇒ టీఎస్పీసీసీలో నిర్ణయించిన విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ⇒ 28లోగా ఔట్ సోర్సింగ్ వివరాల సమర్పణకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు 2016 డిసెంబర్ 4ను కటాఫ్ డేట్‌గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో జరిగిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ (టీఎస్పీసీసీ) సమావేశంలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఈ మేరకు తీర్మానం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కటాఫ్ తేదీలోగా విద్యుత్ సంస్థల్లో నియామకం పొందిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరణకు అర్హులుగా పరిగణించనున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న విద్యుత్ ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులను దశల వారీగా క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ కటాఫ్ తేదీని విద్యుత్ సంస్థలు ఖరారు చేశాయి. త్వరలో జారీ చేయనున్న క్రమబద్ధీకరణ మార్గదర్శకాల్లో కటాఫ్ తేదీగా చేర్చనున్నారు. 28లోగా ‘ఔట్ సోర్సింగ్’ వివరాలు విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు ప్రారంభించాయి. క్షేత్రస్థాయిలో జోన్లు, డివిజన్లు, పవర్ స్టేషన్ల వారీగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నిర్దేశించిన ఫార్మాట్లలో ఈనెల 28 లోగా సమర్పించాలని ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు ఉత్తర్వులు జారీ చేశాయి. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల్లో సుమారు 16,900 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగాల్లో పని చేస్తున్నారని ట్రాన్స్‌కో ఇప్పటికే ప్రాథమికంగా నిర్థారించింది. టైపిస్టులు, కంప్యూటర్ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర కేటగిరీల్లో మరికొంత మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ సంబంధించిన బయోడేటా, నివాస ధ్రువీకరణ, స్వీయ ధ్రువీకరణ పత్రాలు, ఔట్ సోర్సింగ్ ఒప్పందం, అనుభవం తదితర వివరాలతో నిర్దేశించిన ఫార్మాట్లలో సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సీనియారిటీ జాబితాలను రూపొందించనున్నారు. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్యపై ఈనెల 28 తర్వాత స్పష్టత రానుంది. మార్గదర్శకాలను ప్రతిపాదించిన యూనియన్లు ట్రాన్స్‌కో యాజమాన్యం సూచన మేరకు ఇప్పటికే కొన్ని ట్రేడ్ యూనియన్లు స్వయంగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదిం చాయి. విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిబంధనలతో సంబంధం లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద రిని క్రమబద్ధీకరించాలని దాదాపు అన్ని యూనియన్లు కోరుకున్నాయి. మరోవైపు క్రమబద్ధీకరణ మార్గదర్శకాలను మార్చి 31లోగా జారీ చేస్తామని, మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు కమిటీ ఏర్పాటు చేయలేదు. దీంతో గడువులోగా మార్గదర్శకాలు సిద్ధం అవుతాయా, లేదా అనే అంశంపై ట్రేడ్ యూనియన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల రిలే దీక్షలు
ఆదిలాబాద్ టౌన్ : విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కా ర్యాయలం ఎదుట ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ట్రెడ్ యూ నియన్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం చైర్మన్ వెంకటేశ్వర్లు మా ట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న జెఎల్ఎం, జెపీఏ, జూని యర్ అసిస్టెంట్, సబ్ ఇంజినీర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయాలని తెలిపారు. ఈపీఎఫ్ పొందుతున్న ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలుగా మార్చాలని అన్నారు. గతంలో కాంట్రాక్టు కార్మికులతో విద్యుత్ శాఖ మంత్రి చర్చలు జరిపిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలని అన్నారు. సంఘం కన్వీనర్ గోపాల్‌రావు, డివిజన్ చైర్మన్ రాజేశ్వర్, డివిజన్ కన్వీనర్ రమేష్ పాల్గొన్నారు. దీక్షలు చేపట్టిన వారిలో నర్సింగరావు, చంద్రశేఖర్, ప్రేమ్‌కుమార్, ప్రసాద్, బాపురావు, సుభాష్, అజయ్, రామకృష్ణ, రవి, నిశ్కాంత్ ఉన్నారు. వీరికి పలువురు సంఘీభావం ప్రకటించారు. -
ఖాళీగా కూర్చోబెట్టి రూ.200 కోట్ల జీతాలు!
► విచిత్ర పరిస్థితిలో రిలీవైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ► రెండేళ్లుగా 1,252 మందికి ప్రతి నెలా రూ.12 కోట్ల జీతాలు ► కేసు సత్వర పరిష్కారానికి ఏజీతో సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: ఏ పనీ చేయించుకోకుండా వందలాది మంది ఉద్యోగులకు ప్రతినెలా లక్షల రూపాయల జీతభత్యాలను చెల్లించడాన్ని ఎక్కడైనా చూశారా... ఎక్కడో కాదు మన తెలంగాణలోనే దాదాపు ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 1,252 మంది ఏపీ ఉద్యోగులను ఖాళీగా కూర్చోబెట్టి ప్రతి నెలా రూ.12 కోట్ల జీతభత్యాలు చెల్లిస్తున్నా యి. వీళ్లందరికీ ఇప్పటివరకు ఇలా చెల్లించిన జీతభత్యాల మొత్తం రూ.200 కోట్లకు చేరిపోయింది. రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు అవుతున్నా తెలంగాణ, ఏపీల మధ్య విద్యుత్ ఉద్యోగుల కేటాయింపు వివాదం పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివాదం పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఉద్యోగులను విధుల్లో చేర్చుకోవడానికి ఇరు రాష్ట్రాలు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఏపీ స్థానికత గల 1,252 మంది విద్యుత్ ఉద్యోగులను 2015 జూన్ 10న తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు మూకుమ్మడిగా వారి సొంత రాష్ట్రానికి రిలీవ్ చేశాయి. వీరిని ఉద్యోగాల్లో చేర్చుకోవడానికి ఏపీ ప్రభుత్వం, ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు నిరాకరించాయి. రిలీవైన ఏపీ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం పరిష్కారమయ్యే వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 52:48 నిష్పత్తిలో రిలీవైన ఉద్యోగుల జీతభత్యాలను చెల్లించాలని గతేడాది సెప్టెంబర్ 22న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఏపీ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. హైకోర్టులో కేసు పరిష్కారమయ్యే వరకు రిలీవైన ఏపీ ఉద్యోగులకు తెలంగాణ యాజమాన్యాలే పూర్తి జీతాలు చెల్లించాలని గత ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై రోజువారీగా విచారణ నిర్వహించి 8 వారాల్లో తీర్పు జారీ చేయాలని ఉమ్మడి రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు విధించిన 8 వారాల గడువు పూరై్త నా ఈ కేసుపై రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభం కాలేదు. మరోవైపు ఈ వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులతో హైకోర్టు నియమించిన కమిటీ సైతం ఇప్పటికే నివేదికను సమర్పించి చాలా కాలమైంది. ఈ పరిస్థితులను నివేదిస్తూ తెలంగాణ విద్యుత్‌సంస్థ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కోర్టులో కేసు ఎంతకీ తేలకపోవడంతో రిలీవ్ చేసిన ఉద్యోగులకు ప్రతినెలా రూ.12 కోట్ల జీతాలు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలిపాయి. తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో మాట్లాడి హైకోర్టులో కేసు విచారణకు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. -
విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్: విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్స్ ఫ్రంట్(టీ టఫ్) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. సోమవారం ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు విద్యుత్‌శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం విద్యుత్‌శాఖ ఎస్ఈ ప్రభాకర్‌కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా చైర్మన్, కన్వీనర్లు లక్ష్మారెడ్డి, పూదరి గంగాధర్‌లు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా కాంట్రాక్టు కార్మికులు అరకొర వేతనాలతో జీవనం సాగిస్తున్నారన్నారు. తమను సీఎం కేసీఆర్ రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యోగులకు, కాంట్రాక్టు కార్మికులకు పరిమితి లేని వైద్యసదుపాయం అందించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రఘునందన్, జక్రియా, నరేందర్‌నాయక్, నవీన్, రమేశ్, తిరుపతి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ సుముఖత.. తెలంగాణ విముఖత
► విద్యుత్ ఉద్యోగుల విభజన పై మళ్లీ ప్రతిష్టంభన సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఆదివారం భేటీ అయిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ మధ్యేమార్గంగా కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. దీనికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, తెలంగాణ అధికారులు ససేమిరా అన్నట్టు సమాచారం. దీంతో విభజన వ్యవహారంలో మళ్లీ పీఠముడి పడింది. సోమవారం కూడా మరోదఫా చర్చల అనంతరం ఎంతోకొంత పురోగతి ఉంటుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. హైకోర్టు ఆదేశంతో ఏర్పడిన జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలోని కమిటీ గత రెండు రోజులుగా విస్తృత చర్చలు జరిపింది. ఇరుపక్షాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నమూనా మార్గదర్శకాలను (డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్) రెండు రాష్ట్రాల మధ్య ఉంచినట్టు తెలిసింది. ఇప్పటివరకూ విభజన జరిగిన రాష్ట్రాల్లోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కమిటీ.. ఏ రాష్ట్రంలో పనిచేయాలనే ఆప్షన్‌ను ఉద్యోగులకే ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. అనారోగ్య కారణాలు, భార్యాభర్త హైదరాబాద్‌లో పనిచేస్తుంటే న్యాయబద్ధంగా వారు కోరుకున్న చోటే కొనసాగించడం మంచిదని సూచించినట్టు తెలిసింది. ట్రాన్స్‌కో, జెన్కో విషయాలను పక్కనబెడితే డిస్కమ్‌ల ఉద్యోగల విభజనపై ఏపీ వాదనతో ఏకీభవించినట్టు సమాచారం. వివాదం లేని ఇలాంటి విభాగాల్లో తక్షణ విభజనకు ఉపక్రమించాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అయితే, ధర్మాధికారి కమిటీ డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్‌తో తెలంగాణ విద్యుత్ అధికారులు విభేదించినట్లు సమాచారం. తాము రిలీవ్ చేసిన 1,252 మందిని ఆంధ్ర విద్యుత్ సంస్థలే తీసుకోవాలని, ఇది సున్నితమైన, భావోద్వేగమైన అంశమని కమిటీ ముందు పేర్కొన్నట్టు తెలిసింది. అవసరమైతే ఏపీ సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించుకోవచ్చని మొదటి నుంచి చేస్తున్న వాదననే కమిటీకి తెలిపింది. తెలంగాణ అధికారులు సహకరించకపోవడంతో విభజనలో ఎలాంటి పురోగతి కన్పించలేదని తెలుస్తోంది. -
ఎవరి వాదనలు వారివే !
* ‘విద్యుత్’ విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ భేటీ * మునుపటి వైఖరికే కట్టుబడినట్లు ఇరు రాష్ట్రాల వాదనలు * నేడు మరోసారి సమావేశం కానున్న కమిటీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజనపై మునుపటి వాదనలకే కట్టుబడి ఉన్నామని, తమ వైఖరిలో మార్పు లేదని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు పునరుద్ఘాటించాయి. విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం మార్గదర్శకాల రూపకల్పన, వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ డీఎం ధర్మాధికారి నేతృత్వంలో హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమైంది. కమిటీలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల అధికారులు తమ వాదనలను జస్టిస్ ధర్మాధికారికి వినిపించారు. స్థానికత ఆధారంగా జరిపిన ఉద్యోగుల విభజనకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ పేర్కొంది. విద్యుత్ ఉద్యోగుల విభజనలో ఏపీ ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని, అందుకే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారమే ఏపీ స్థానికత గల 1,253 మంది ఉద్యోగులను ఏపీకు రిలీవ్ చేశామని తెలంగాణ అధికారులు వివరించారు. విద్యుత్ సంస్థలన్నింటికీ వర్తించే కామన్ కమిటీకి బదులు ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజన కోసం మాత్రమే ఏపీ ట్రాన్స్‌కో కమిటీ వేసిందని పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ట్రాన్స్‌కో నేతృత్వంలో కామన్ కమిటీ ఏర్పాటు చేసి పోలీసు నివేదిక, నియామక ఉత్తర్వుల ఆధారంగా స్థానికతను నిర్ధారించి ఉద్యోగుల విభజన జరిపామని తెలిపారు. కోర్టు వెలుపల ఈ వివాద పరిష్కారం కోసం మూడు సార్లు సమావేశమైనా ఏపీ సహకరించలేదన్నారు. 2009 నుంచి మాత్రమే విద్యుత్ సంస్థల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి ఆధారంగా జోనల్ విధానం అమలవుతోందని తెలిపారు. అంతకుముందు గత పాలకులు ముల్కీ నిబంధనలు, గిర్గ్లానీ సిఫారసులు, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించి అడ్డగోలు నియామకాలు జరపడంతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని గుర్తు చేశారు. ఏ ప్రాంతంలోని ఉద్యోగాలు ఆ ప్రాంతం వారికే దక్కాలని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలు పుట్టుకొచ్చాయన్నారు. ఈ విషయాన్నే శ్రీకృష్ణ కమిటీ సైతం ధ్రువీకరించిందన్నారు. కమల్‌నాథన్ కమిటీ కేవలం ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు మాత్రమే వర్తిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల విభజనతో ఈ కమిటీకి సంబంధం లేదని వాదించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఏపీ విద్యుత్ సంస్థలు వాదించాయి. కమల్‌నాథన్ కమిటీకి విద్యుత్ ఉద్యోగుల విభజన బాధ్యతలు అప్పగించాలని కోరింది. ఇదిలా ఉండగా.. విద్యుత్ ఉద్యోగుల విభజనపై సమగ్ర నివేదికను ఆదివారం రెండో రోజు జరగనున్న సమావేశంలో సమర్పించాలని జస్టిస్ ధర్మాధికారి ఏపీ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. సీఎండీలు ఔట్ హైకోర్టు నియమించిన కమిటీలో సభ్యులుగా ఉన్న ఇరు రాష్ట్రాల అధికారులను జస్టిస్ ధర్మాధికారి సమావేశంలో పాల్గొనేందుకు అనుమతించారు. సమావేశం లో పాల్గొనేందుకు వచ్చిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులను ప్రారంభంలోనే బయటకు పంపించి వేశారు. దీంతో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, జెన్కో ఎండీ కె.విజయానంద్, తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు తదితరులు బయటకు వెళ్లిపోయారు. -
‘విద్యుత్ విభజన’ పరిష్కారానికి కమిటీ
♦ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వం ♦ ఇరు రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున సభ్యులు ♦ పేర్లను కోర్టుకు సమర్పించిన ఇరువురు ఏజీలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని ఉమ్మడి హైకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి నలుగురు చొప్పున, ప్రభుత్వ ప్రతినిధులుగా ఒక్కొక్కరు ఉంటా రు. ఈ కమిటీ గరిష్టంగా ఈ నెలాఖరులోపు విభజన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. మార్గదర్శకాలను తాము పరిశీలించి ఉత్తర్వులు జారీ చేస్తామంది. తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావుల తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీ స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను, వాటికి అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితాను సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఉభయ రాష్ట్రాల సమ్మతి.. గురువారం విచారణ సమయంలో ధర్మాసనం ప్రతిపాదించిన కమిటీ ఏర్పాటుకు శుక్రవారం ఉభయ రాష్ట్రాలు తమ సమ్మతిని తెలియచేశాయి. దీనికి ముందు ఏపీ అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ స్పందిస్తూ.. ఇప్పటి వరకు జీతభత్యాల కింద రూ.100 కోట్లు చెల్లించామని, ఇప్పుడు కమిటీ ఏర్పాటు వల్ల ఈ వ్యవహారంలో జాప్యం జరిగే అవకాశం ఉందనే ఆందోళన తమకుందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలను చూస్తామని, అప్పటి వరకు పిటిషన్లను పెండింగ్‌లోనే ఉంచుతామని తెలిపింది. మా విధానాలు మేం రూపొందించుకున్నామని ఉభయ ప్రభుత్వాలు చెబుతుంటే సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. కమిటీ ఏర్పాటు వల్లే పరిష్కారం లభించగలదని పేర్కొంది. కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు.. గతంలోనే నాలుగు పేర్లను సిఫార్సు చేశామని, ఐదో వ్యక్తి పేరును కూడా ఇప్పుడు సూచిస్తున్నామంటూ ఏపీ ఏజీ ఓ కాగితాన్ని ధర్మాసనం ముందుంచారు. అంతకు ముందే తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి ఐదుగురు పేర్లను ధర్మాసనం ముందుంచారు. ఇరు ప్రభుత్వాలు సమర్పించిన పేర్లను పరిశీలించిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ, కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. మార్చి నెలాఖరుకల్లా మార్గదర్శకాలను రూపొందించాలని కమిటీని ఆదేశించింది. ఇరు రాష్ట్రాల ఏజీలు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీ సమావేశంలో పాల్గొనవచ్చునని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. జనాభా ప్రతిపాదికన కమిటీ చైర్మన్‌కు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంటుందని ఉభయ రాష్ట్రాలను ఆదేశించింది. ఇందుకు ఇరు ఏజీలు అంగీకరించారు. కమిటీలో సభ్యులు వీరే.. ఏపీ నుంచి రాహుల్ పాండే (స్పెషల్ సెక్రటరీ, ఇంధనశాఖ), ఉషా, జాయింట్ సెక్రటరీ (ట్రాన్స్‌కో), హెచ్.వై.దొర (సీఎండీ, ఎస్పీడీసీఎల్), ముత్యాలరాజు (సీఎండీ, ఈపీడీసీఎల్), దినేష్ పరుచూరి (ట్రాన్స్‌కో డెరైక్టర్, ఫైనాన్స్), తెలంగాణ నుంచి అరవిందకుమార్ (ముఖ్య కార్యదర్శి, ఇంధనశాఖ), రఘుమారెడ్డి (సీఎండీ, టీఎస్ఎస్పీడీసీఎల్), వెంకట నారాయణ (సీఎండీ, టీఎస్ఎన్పీడీసీఎల్), అశోక్‌కుమార్ (డెరైక్టర్, టీఎస్జెన్కో), నర్సింగరావు (జేఎండీ, టీఎస్ ట్రాన్స్‌కో). -
విద్యుత్ ఉద్యోగులపై నియంత్రణ ఎత్తేయాలి
ఈఆర్సీని కోరిన టీజేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ముందు విద్యుత్ ఉద్యోగులు హాజరుకాకుండా నియంత్రించాలని కోరుతూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు జారీ చేసిన అడ్వయిజరీని ఉపసంహరించుకోవాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. టీజేఏసీ ప్రతినిధి బృందంతో కలసి శుక్రవారం ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వేదికగా పనిచేయాల్సిన ఈఆర్సీ వివాదాలకు వేదికగా మారకూడదన్నారు. విద్యుత్ ఉద్యోగులను నియంత్రించాలని గత నెల 9న ఈఆర్సీ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ట్రాన్స్‌కో యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసిందన్నారు. చట్టబద్ధమైన ఈఆర్సీ ముందు విద్యుత్ ఉద్యోగులు హాజరై తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు అందించడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై విసృ్తత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. సర్వీసు రూల్స్ పేరుతో ఉద్యోగులను చర్చల్లో అనుమతించకపోవడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారిని ఉద్యోగులుగా కాకపోయినా వినియోగదారుల హోదాలోనైనా చర్చలో పాల్గొనేందుకు అనుమతించాలని కోరారు. లేదంటే బహిరంగ విచారణ హేతుబద్ధత కోల్పోతుందన్నారు. చైర్మన్‌ను కలసిన వారిలో తెలంగాణ విద్యుత్ జేఏసీ కన్వీనర్ కె.రఘు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ, టీజేఏసీ సీనియర్ నేత వెంకట్‌రెడ్డి ఉన్నారు. -
విద్యుత్ ఉద్యోగులపై ‘ఈఆర్సీ’ నియంత్రణ!
ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లవద్దని ఆదేశాలిచ్చిన ట్రాన్స్‌కో సీఎండీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలను ప్రశ్నిస్తూ విద్యుత్ ఉద్యోగులెవరూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)ని ఆశ్రయించవద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా ఈఆర్సీకి వెళితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. యాజమాన్యం నుంచి అనుమతి లేకుండా విద్యుత్ సంస్థల వ్యాపార లావాదేవీలపై ఈఆర్సీను సంప్రదించకుండా, ఈఆర్సీ ముందు హాజరుకాకుండా, ఈఆర్సీని ఆశ్రయించకుండా ఉండేలా తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు తమ ఉద్యోగులను ఆదేశించాలని కోరుతూ ఈ నెల 9న ఈఆర్సీ కార్యదర్శి లేఖ రాశారు. విద్యుత్ ఉద్యోగులు ఈఆర్సీని ఆశ్రయిస్తే ‘ఏపీ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్-1964’ను ఉల్లంఘించినట్లేనని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రామాణికంగా చూపుతూ ట్రాన్స్‌కో ఉద్యోగులెవరూ ఈఆర్సీతో సంప్రదింపులు జరపరాదని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లంతా తమ పరిధిలోని అధికారులు, ఉద్యోగులు ఈఆర్సీకి వెళ్లకుండా సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వు ప్రతులను శుక్రవారం విద్యుత్ సౌధలో ఇంజనీర్లందరికీ అందజేశారు. -
విద్యుత్ ఉద్యోగుల విభజన మళ్లీ మొదటికి!
♦ ఎవరి వాదన వారిదే ♦ రిలీవ్ ఉద్యోగులపై దిగిరాని తెలంగాణ ♦ చర్చలపై ఉద్యోగుల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య బుధవారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కన్పించలేదు. ఇరు పక్షాలూ వారి వాదనలకే కట్టుబడ్డారు. దీంతో ఏ విధమైన పరిష్కారం లేకుండా ఈ నెల 30వ తేదీకి వాయిదా పడ్డాయి. జనాభా ప్రాతిపదికన విద్యుత్ ఉద్యోగుల విభజన జరగాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు పట్టుపట్టారు. స్థానికతే కొలమానంగా తాము పొందుపర్చిన మార్గదర్శకాల ఆధారంగానే ముందుకెళ్లాలని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. అలాంటప్పుడు చర్చల ప్రక్రియ ఎందుకని ఏపీ అధికారులు కొంత అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎనిమిది నెలల క్రితం 1252 మందిని రిలీవ్ చేశారు. ఈ అంశంపై అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగినట్టు తెలిసింది. విభజన చట్టంలో జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 42 శాతం, ఆంధ్రకు 58 శాతం ఉద్యోగులను కేటాయించాల్సి ఉందని ఏపీ అధికారులు గుర్తుచేశారు. దీనికి విరుద్ధంగా రిలీవ్ చేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అధికారుల విముఖత.. ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల దాదాపు 400 మంది ఉద్యోగులను తిరిగి ఇచ్చేస్తామని, అంత మొత్తాన్ని తెలంగాణలో ఉన్న ఏపీ స్థానికత ఉద్యోగులను తీసుకుంటామని, మిగతా ఉద్యోగుల విషయంలో జనాభా ప్రాతిపదికన వెళ్దామని ఏపీ అధికారులు సూచించారు. దీనికి తెలంగాణ అధికారులు ఎంతమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. భార్య లేదా భర్త తెలంగాణ ప్రాంతానికి చెంది ఉంటే వారికి మాత్రమే తమ సంస్థల్లో చోటు కల్పిస్తామని, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా లివర్, కిడ్నీ, మానసిక వికలాంగత్వం ఉంటే సానుభూతి కోణంలో వారికి ఆప్షన్ ఇస్తామని తెలంగాణ అధికారులు తెలిపారు. ఇలాంటి కేసులు 50 లోపే ఉంటాయని, దీనివల్ల సమస్య పరిష్కారం కాదని ఏపీ అధికారులు తెలిపారు. తెలంగాణ అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని, పరిష్కారం దిశగా చర్చల్లో పాల్గొనడం లేదని వారు ఆరోపించారు. చర్చలు జరుగుతున్న తీరుపై రిలీవ్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా తెలంగాణ చర్చలకు పిలవడం, స్పష్టమైన విధానాలు లేకుండానే ఏపీ అధికారులు వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. -
‘విద్యుత్ ఉద్యోగుల’పై చర్చా మార్గం
► ఏపీకి పంపినవారిపై కోర్టు బయట పరిష్కారానికి తెలంగాణ, ఏపీ సిద్ధం ► వివాద పరిష్కారంపై చొరవ చూపిన టీ ట్రాన్స్‌కో సీఎండీ ► అవసరమైతే కొంత మందిని వెనక్కి తీసుకునే యోచన? సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కొంత మెత్తబడింది. ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేసిన 1,252 మంది ఉద్యోగుల్లో అవసరమైతే కొంత మందిని శాశ్వత ప్రాతిపదికన వెనక్కి తీసుకుని... ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. చర్చల ద్వారా న్యాయస్థానం వెలుపలే ఈ వివాదానికి ముగింపు పలికి, ఏపీతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. దీనిపై ఏపీ సర్కారు కూడా సానుకూలంగా స్పందించింది. ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు సమావేశమై చర్చల ద్వారా ఉద్యోగుల విభజన వివాదాన్ని పరిష్కరించుకుందామని తాజాగా టీ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు ప్రతిపాదించగా... దానికి ఏపీ ట్రాన్స్‌కో ఎండీ కె.విజయానంద్ సమ్మతించారు. ఈ నెల 22న హైదరాబాద్‌లోని ‘విద్యుత్ సౌధ’లో ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల సీఎండీలు, హెచ్ఆర్ విభాగం డెరైక్టర్లు సమావేశమై చర్చలు జరపాలని ఇరుపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయి. శాశ్వత పరిష్కారం కోసం.. పుట్టినచోటు ఆధారంగా స్థానికతను పరిగణనలోకి తీసుకుని విద్యుత్ ఉద్యోగుల విభజన జరిపేందుకు గతేడాది జూన్ 6న తెలంగాణ ఇంధన శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ తర్వాత రెండు మూడు రోజుల వ్యవధిలోనే 1,252 మంది ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి పంపుతూ రిలీవ్ చేశాయి. ఆ ఉద్యోగులను తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ఆధారంగానే విద్యుత్ ఉద్యోగుల విభజన జరపాలని వాదించింది. ఇక తెలంగాణ సర్కారు నిర్ణయంపై రిలీవైన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రిలీవైన ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు మూడు నెలల కింద తాత్కాలికంగా విధుల్లో తీసుకున్నాయి. కోర్టు సూచనల మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 52:48 నిష్పత్తిలో ఈ ఉద్యోగులకు జీతభత్యాలను చెల్లిస్తున్నాయి. తాజాగా ఈ వివాదాన్ని వేగంగా పరిష్కరించేందుకు ఈ నెల 20 నుంచి రోజువారీగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఇటీవలే హైకోర్టును ఆదేశించింది. దీంతో బుధవారం నుంచి హైకోర్టులో రోజువారీగా విచారణ జరగనున్న నేపథ్యంలో... చర్చల ద్వారా కోర్టు వెలుపలే వివాదానికి ముగింపు పలుకుదామని ఇరు రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి వచ్చాయి. పెద్దగా తేడా ఉండదంటున్న టీ-సంస్థలు ఏపీ డిమాండ్‌కు అనుగుణంగా కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగుల తుది విభజన జరిపినా... ఇప్పటికే ఏపీకి పంపిన ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం ఉండదని తెలంగాణ విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయి. కమల్‌నాథన్ మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల విభజనపై లెక్కలు సైతం వేసి చూశాయి. ఆ ప్రకారం చూసినా రిలీవైన 1,252 మంది ఉద్యోగుల్లో 100-200 మంది మాత్రమే తిరిగి తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. వారిని వెనక్కి తీసుకోడానికి ఒప్పుకున్నా పెద్దగా నష్టం లేదని... ఏపీలో పనిచేస్తున్న 450 మంది తెలంగాణ ఉద్యోగులు సైతం రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నాయి. -
విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడిగా కారుమూరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
కోతల్లేని కరెంటుకు ఏడాది
సాక్షి, హైదరాబాద్: ‘‘చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో 2014 నవంబర్ 20 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నాం. రాష్ట్రంలో కోతల్లేని విద్యుత్ సరఫరాకు గురువారంతో ఏడాది పూర్తయింది. రాష్ట్రం ఏర్పాటై 5 నెలల 18 రోజులకే కోతలను అధిగమించాం. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశకం, విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవ, ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో విద్యుత్ ఉద్యోగుల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఈ శుభ సందర్భంగా విద్యుత్ సంస్థలు సంబరాలు చేసుకోనున్నాయి..’’ అని దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి చెప్పారు. సంస్థ కార్యాలయంలో ఎస్పీడీసీఎల్ డెరైక్టర్లు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్‌రెడ్డి, కమాలుద్దీన్ అలీఖాన్‌లతో కలసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. డిమాండ్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేసి సరిపడా విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా నిరంతర విద్యుత్ సాధ్యమైందని చెప్పారు. రాష్ట్రంలో 1.23 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. రోజూ సగటున 160 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉందన్నారు. ఏపీ నుంచి రాష్ట్ర వాటాలు, సొంత ఉత్పత్తి కలిపి 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ లభ్యత ఉండగా... మిగతా దాదాపు 100 మిలియన్ యూనిట్లను వివిధ మార్గాల్లో కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ కేంద్రాలు నిర్మించి, విద్యుదుత్పత్తిని 24,075 మెగావాట్లకు పెంచుతున్నామని చెప్పారు. 2018-19 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. కారిడార్ కోసమే ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చే ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి పగలే 9 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నామని రఘుమారెడ్డి చెప్పారు. 2018-19 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చుతామని సర్కారే చెబుతోందని, మరి ఛత్తీస్‌గఢ్ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఎందుకని ప్రశ్నించగా... విద్యుత్ కారిడార్ కోసమే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఆ విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 6 వరకు ఉండే అవకాశముందన్న కథనాలు సరికాదని, చవకగా యూనిట్ రూ. 5కే లభిస్తుందని పేర్కొన్నారు. -
కొలిక్కి వస్తున్న విద్యుత్ రిలీవ్ ఉద్యోగుల వివాదం
సాక్షి, హైదరాబాద్: ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగుల వివాదం కొలిక్కి వస్తోంది. వేతనాలు, వేతన బకాయిలు ఇస్తామన్న ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ హామీపై తెలంగాణ సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ఆ రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రభుత్వంతో చర్చలు జరిపి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ పరిణామాలు తమకు అనుకూలంగా ఉన్నాయని రిలీవ్ ఉద్యోగులు తెలిపారు. ఈ నెల 19 వరకూ వేతన బకాయిలు చెల్లిస్తామని టీఎస్ ట్రాన్స్‌కో సీఎండీ భరోసా ఇచ్చారని, హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని చెప్పినట్టు తెలిపారు. దీన్నిబట్టి త్వరలోనే తమను విధుల్లోకి తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగా 1,252 మంది ఉద్యోగులను జూన్‌లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేశాయి. దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వారిని తిరిగి తీసుకోవాలని, వేతన, బకాయిలను రెండు రాష్ట్రాలూ దామాషా పద్ధతిలో చెల్లించాలని కోర్టు సూచించిన విషయం తెలిసిందే. -
తెలంగాణ సరే అంటోంది.. మీ సంగతేంటి?
- ఏపీ సర్కార్‌ను ప్రశ్నిస్తున్న విద్యుత్తు ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఏపీ స్థానికత గల విద్యుత్ ఉద్యోగుల వ్యవహారం ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కోర్టులోకి మళ్లింది. ఉద్యోగుల బృందం తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జీతాల చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే, తాము స్పందిస్తామని ఆయన చెప్పినట్టు ఉద్యోగులు తెలిపారు. న్యాయస్థానం ఉత్తర్వుల్లో 58 శాతం వేతనాలు ఆంధ్రప్రదేశ్, 42 శాతం తెలంగాణ చెల్లించాలన్న అంశాన్ని ఆయన గుర్తుచేశారని, ఏపీ సర్కారు నుంచి ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే, తమకు అభ్యంతరం ఉండబోదని చెప్పినట్టు సమాచారం.దీంతో ‘తెలంగాణ ఒప్పుకుంది కదా? మీరు కూడా సరే అనండి’ అని ఉద్యోగులు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్‌ను నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే తాను నిర్ణయం తీసుకోలేనని, ప్రభుత్వమే ఇందుకు మొగ్గు చూపడం లేదని ఆయన సూచన ప్రాయంగా చెప్పినట్టు తెలిసింది. తెలంగాణలో పనిచేస్తున్న వారికి తామెలా వేతనాలు ఇస్తామని, అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్దామని సీఎం వ్యాఖ్యానించినట్లుగా సీఎండీ వివరించారని తెలిసింది. -
ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది.1200మంది ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగించాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బకాయిలు 58 శాతం ఏపీ, 42 శాతం తెలంగాణ ప్రభుత్వాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లోగా బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. -
'విద్యుత్ ఉద్యోగులకు బాబు అన్యాయం చేస్తున్నారు'
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ విద్యుత్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని భూమన మాటిచ్చారు. రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 13 జిల్లాల ప్రతినిధులు, వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, తదదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల రిలీవ్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ అంశంపై హైకోర్టులో చేపట్టనున్న విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఆ రాష్ట్రాలకు హైకోర్టు సూచించింది. 3 నెలల నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఉద్యోగుల రిలీవ్ విషయంపై సమగ్ర విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీలో 3,100 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, 1242 మందిని నియమించుకోవడానికి ఇబ్బంది ఏంటని తెలంగాణ ఏజీ అన్నారు. కావాలనే ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. స్థానికత మీదనే ఒత్తిడి తీసుకొస్తున్నారని ఏపీ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగులను చేర్చుకోండని టి.సర్కారును ఆదేశించండి
కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌కు ఏపీ సీఎస్ ఐవైఆర్ లేఖ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా స్థానికత పేరుతో రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌ను కోరారు. శనివారం గోయల్‌కు కృష్ణారావు నాలుగు పేజీల లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం ఏడాదిలోగా ప్రభుత్వ రంగ సంస్థలే ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేసుకోవాలని, సంప్రదింపుల ద్వారా ఇరు రాష్ట్రాలు పంపిణీ చేసుకోని పక్షంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలనే నిబంధన ఉందనే విషయాన్ని లేఖలో సీఎస్ గుర్తు చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విద్యుత్ సంస్థల నుంచి స్థానికత ఆధారంగా ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేసిందని వివరించారు. దీన్ని హైకోర్టు కూడా తప్పుబట్టిందని, అయినా తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ న్యాయస్థానం సూచనలను కూడా పాటించడం లేదని సీఎస్ పేర్కొన్నారు. 40, 50 ఏళ్లుగా తెలంగాణలో స్థిరనివాసం ఏర్పరుచుకుని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిని స్థానికేతరులుగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొనడం సమజసం కాదన్నారు. ఆంధ్రా ఉద్యోగులను తొలగించి ఆ స్థానంలో తెలంగాణ వారికి పదోన్నతులు కల్పించడం, కొత్త వారిని నియమించుకోవడానికే తెలంగాణ సర్కారు స్థానికత తెరపైకి తెచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. ఇదే అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు నష్టపోతారని, ఇందులో సమన్యాయం లేదని సీఎస్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం తొలగించిన ఆంధ్రా ఉద్యోగులను విధుల్లోకి తీసుకునేలాగ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జనాభా ప్రాతిపదికనే ఉద్యోగుల పంపిణీ జరగాలని, కానీ తెలంగాణ ప్రభుత్వం స్థానికత అంటూ కొత్తగా తెరపైకి తేవడం అన్యాయమన్నారు. -
కేంద్రమే పరిష్కరించాలి
విద్యుత్ ధర్నాలో ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: స్థానికత పేరుతో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు బాధ్యతతో వీలైనంత త్వరగా రిలీవ్ అయిన 1,253 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలన్నారు.హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాకు టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ ఎంపీలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి మాట్లాడారు. ఏపీ విభజన సమయంలో రాష్ట్రాలనే భేదం లేకుండా అందరికి న్యాయం చేస్తానని చెప్పిన తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు విద్యుత్ ఉద్యోగుల విషయంలో ఆ మాట నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు చిత్తశుద్ధి చూపకుండా పరస్పరం నిందారోపణలు చేసుకోడం దురదృష్టకరమన్నారు. కార్యక్రమంలో ఎంపీలు కేవీపీ, జేడీ శీలం, తోట నర్సింహం, రవీంద్రబాబు, కొత్తపల్లి గీత, రామ్మోహన్నాయుడు, మాగంటి బాబు, మాల్యాద్రి పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడంతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు మోదీ పీఎస్‌తో సమావేశమయ్యారు. త్వరలోనే ప్రధానితో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని, ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు తెలిపారు. -
డిల్లీలో రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల ధర్నా!
-
తెలంగాణకు మళ్లీ చుక్కెదురు
విద్యుత్ ఉద్యోగుల విభజన సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మళ్లీ చుక్కెదురైంది. విద్యుత్ ఉద్యోగుల విభజన విభజన చట్టంలోని సెక్షన్ 82 ప్రకారం జరగలేదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో కేంద్ర హోం శాఖ ఏకీభవించింది. ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ)ల ఉద్యోగుల విషయంలో విభజనకు పూర్వం, అంటే 2014 జూన్ 1 నాటికి ఉన్న స్థితిని కొనసాగించాల్సిందిగా తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను తాజాగా ఆదేశించింది. కేంద్ర హోం శాఖ డెరైక్టర్ అశుతోష్ జైన్ తాజాగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు లేఖ రాశారు. ఏపీ స్థానికత ఉన్న 1250 మంది ఉద్యోగులను తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలు జూన్ 9న మూకుమ్మడిగా ఏపీకి రిలీవ్ చేయడంతో వివాదం రేకెత్తిన విషయం తెలిసిందే. పుట్టిన ప్రాంతం ఆధారంగా ఉద్యోగులను విభజిస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో ఏకపక్షంగా మార్గదర్శకాలు రూపొందించిందని, ఇది విభజన చట్టానికి విరుద్ధమని ఏపీ వాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ కూడా రాశారు. దానికి స్పందనగానే కేంద్ర హోంశాఖ తాజాగా రెండు రాష్ట్రాలకు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, స్వయంప్రతిపత్తి సంస్థల్లోని ఉద్యోగులను విభజన తర్వాత ఏడాది దాకా ఆయా సంస్థల్లోనే కొనసాగించాలని, వారి కేటాయింపుకు సంబంధించి సదరు సంస్థల పాలకవర్గాలు ఈ లోపు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని విభజన చట్టంలోని సెక్షన్ 82 స్పష్టం చేస్తోందని కేంద్ర హోంశాఖ గుర్తు చేసింది. విద్యుత్ సంస్థల పాలక మండళ్లు ఈ నిబంధనను పాటించలేదంది. అవసరమైతే కేంద్రమే జోక్యం చేసుకుని పీఎస్‌యూల ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొదించవచ్చని సెక్షన్ 80 పేర్కొంటోందని ప్రస్తావించింది. పీఎస్‌యూల ఉద్యోగుల కేటాయింపుల్లో మూడు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించింది. వాటిపై శనివారంలోగా అభిప్రాయాలు తెలపాల్సిందిగా ఇరు రాష్ట్రాలకు సూచించింది. పీఎస్‌యూ ఉద్యోగుల విభజనపై కేంద్రం సూచించిన మూడు ప్రత్యామ్నాయాలు 1) విభజన చట్టంలోని సెక్షన్ 108 ప్రకారం పీఎస్ యూ ఉద్యోగుల విభజన బాధ్యతలను కమల్‌నాథన్ కమిటీకిగానీ, షీలా భిడే కమిటీకి గానీ కేంద్రం అప్పగిస్తుంది 2) మూడు నెలల్లోగా సమస్య పరిష్కారమయ్యేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలి 3) కమల్‌నాథన్ కమిటీ మార్గదర్శకాల ఆధారం గా పీఎస్‌యూల ఉద్యోగులవిభజన మార్గదర్శకాలు రూపొందించాలి. వివాదాలపై నిర్ణయాధికారం ఆ కమిటీకే అప్పగించాలి. ఉద్యోగసంఘాల పిటిషన్లు కొట్టివేత సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాలకు తెలంగాణ విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదముద్ర వేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను, వాటికి అనుగుణంగా టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితా అమలును సవాల్ చేస్తూ వ్యాజ్యాలు దాఖలైన విషయం విదితమే. అయితే, వీటిలో తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలంటూ టీవిద్యుత్ ఉద్యోగుల సంఘం, టీవిద్యుత్ అకౌంట్స్ అధికారుల సం ఘం వేర్వేరుగా దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. వీరి వాదనలు వినాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
తెలంగాణ సర్కారుకు చుక్కెదురు
-
తెలంగాణ సర్కారుకు చుక్కెదురు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. విద్యుత్ ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఉన్నత న్యాయస్థానం నిలిపివేసింది. గతంలో స్థానికత ఆధారంగా 1100 మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు పంపింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కమలనాథన్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని న్యాయస్థానానికి విన్నవించారు. దీంతో ఉద్యోగుల రిలీవ్ ప్రక్రియను హైకోర్టు నిలిపివేసింది. -
సాగనంపారు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్థానికత (పుట్టిన ప్రాంతం) కలిగిన ‘స్టేట్ కేడర్’ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టుల నుంచి తక్షణమే రిలీవై ఏపీ ప్రభుత్వంలోని సంబంధిత విద్యుత్ సంస్థకు రిపోర్టు చేయాలని సూచిస్తూ ఆఘమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ట్రాన్స్‌కోలో 262 మంది, జెన్కోలో 522 మంది, ఎస్పీడీసీఎల్లో 393 మంది, ఎన్పీడీసీఎల్లో 168 మంది కలిపి మొత్తం 1,345 మంది ఏపీ ‘స్థానికత’గల స్టేట్ కేడర్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఆయా సంస్థల సీఎండీలు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం నుంచి ఈ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు అనుమతించబోరని తెలుస్తోం ది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుది కేటాయింపులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో విభజన ప్రక్రియకు న్యాయపరమైన చిక్కులు అడ్డుకాక ముందే టీ.సర్కార్ యుద్ధప్రాతిపదికన ఉత్తర్వులు ఇచ్చింది. ఆలస్యం చేస్తే హైకోర్టు స్టే ఆర్డర్ వచ్చే అవకా శం ఉండటంతో ఈ ప్రక్రియను ముగించింది. ఆర్డర్ టు సర్వ్‌కు మంగళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల విభజన జరిగి ఏడాదైనా ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులందరూ ‘ఆర్డర్ టు సర్వ్’ ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. టి.ట్రాన్స్‌కో, టి.జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో రాష్ర్ట, జోనల్, జిల్లా కేడర్ స్థాయిల్లో వేల మంది ఏపీ స్థానికతగల ఉద్యోగులున్నారు. ప్రభుత్వోద్యోగుల విభజన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కమల్‌నాథన్ కమిటీ ప్రభుత్వ సంస్థ (కార్పొరేషన్)ల ఉద్యోగుల విభజన తమ పరిధిలోకి రాదని గతంలోనే తేల్చేసింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 88 కేవలం ఏడాది వరకే ‘ఆర్డర్ టు సర్వ్’లో పనిచేసేందుకు అనుమతిస్తోంది. విభజన జరిగి ఏడాది పూర్తై నేపథ్యంలో ‘రాష్ట్ర స్థాయి’ విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయిం పులు జరపాలని ఈ నెల 6న తెలంగాణ ఇంధనశాఖ మార్గదర్శకాలు ఇచ్చింది. తక్షణమే తుది కేటాయింపులు జరపాలని ఈ నెల 9న విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. ఏపీ స్థానికతగల ఉద్యోగుల తుది జాబితాలను అదే రోజు ఆన్లైన్లో ప్రదర్శించాయి. మార్గదర్శకాలపై ఏపీ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేయగా కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై బుధ, గురువారాలు విచారణ జరగగా తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులను ఈ నెల 10న జారీ చేసినట్లు గురువారం బయటపడింది. తప్పు డు స్థానికత సమాచారమిచ్చిన విద్యుత్ ఉద్యోగులపై క్రిమినల్‌చర్యలు తీసుకునేలా మార్గదర్శకాల్లో నియమాలను చేర్చాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత జె.రఘు ఇంధనశాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. విద్యుత్ సౌధకు పోలీసు భద్రత! విద్యుత్ ఉద్యోగుల విభజన నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని ‘విద్యుత్ సౌధ’ కార్యాలయానికి భద్రత కల్పించాలని టి.విద్యుత్ సంస్థలు పోలీసులను కోరాయి. ఏపీ ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సదరు ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తమయ్యే అవకాశాలుండటంతో ముందుజాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. -
ఏపీ ‘స్థానికత’ విద్యుత్ ఉద్యోగుల విభజన
తుది జాబితాలను వెల్లడించిన తెలంగాణ విద్యుత్ సంస్థలు ♦ ఆన్లైన్లో తెలంగాణేతర విద్యుత్ ఉద్యోగుల వివరాలు ♦సర్వీసు రికార్డు, నియామక ఉత్తర్వులు, పోలీసు నివేదికలే ప్రామాణికం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన చివరి అంకానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ ‘స్థానికత’ కలిగిన ఉద్యోగుల తుది జాబితాలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు బుధవారం ప్రకటించాయి. సర్వీసు రికార్డు, నియామక ఉత్తర్వులు, పోలీసు విచారణ (యాంటిసిడెంట్)లను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ ‘స్థానికత’ను తేల్చారు. కొందరు ఉద్యోగుల రికార్డుల్లో స్థానికతపై భిన్న సమాచారం ఉన్నవారిని సైతం ఏపీ స్థానికులుగానే పరిగణనలోకి తీసుకున్నారు. పై మూడింటిలో ఏ ఒక్క రికార్డులోనైనా ఏపీకి సంబంధించి ఉంటే సదరు ఉద్యోగిని ఆ రాష్ర్ట ఉద్యోగిగానే తేల్చేశారు. ఈ జాబితాల ప్రకారం తెలంగాణ జెన్కోలో 522 మంది, టీ ట్రాన్స్‌కోలో 270 మంది, ఎస్పీడీసీఎల్లో 398 మంది, ఎన్పీడీసీఎల్లో 168 మంది కలిపి మొత్తం 1,358 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ జాబితాలను ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్లో బుధవారం నుంచి అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలపై ఇంకా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని అధికారవర్గాలు పేర్కొన్నాయి. త్వరలో రిలీవ్ ! ‘ఆర్డర్ టూ సర్వ్’ పద్ధతిలో ఉద్యోగులు ఏడాది కాలం వరకు ఏ రాష్ట్రంలోనైనా సేవలందించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 అనుమతిస్తోంది. ఇప్పటికే ఈ గడువు ముగిసిన నేపథ్యంలో తుది విభజన కోసం ఓ ‘ఉన్నత స్థాయి కమిటీ’ని దాదాపు 2 నెలల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టి.ట్రాన్స్‌కో జేఎండీ నర్సింగ్‌రావు నేతృత్వంలోని ఈ కమిటీ పలుమార్లు సమావేశమై ‘స్థానికత’ ఆధారంగానే ఉద్యోగుల తుది విభజన జరపాలని మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలను ఆమోదిస్తూ తెలంగాణ ఇంధన శాఖ ఈ నెల 6న ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణేతర ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మార్గదర్శకాల ప్రతిని ఏపీ విద్యుత్ సంస్థలకు సైతం పంపించారు. దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఏపీ నుంచి స్పందన రాలేదు. అయితే, కొంతమంది ఉద్యోగులు ఈ మార్గదర్శకాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్రానికి చేరిన ‘విద్యుత్’ జగడం విద్యుత్ ఉద్యోగుల విభజన జగడం కేంద్రానికి చేరింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏకపక్షమని, దీనిపై స్పందించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. తమతో ఏమాత్రం చర్చించకుండానే వివాదాస్పదంగా విభజన, స్థానికతపై నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. విధివిధానాలను మా ముందుంచండి విద్యుత్ ఉద్యోగుల విభజనపై తెలంగాణ ఏజీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో టీఎస్ ట్రాన్స్‌కో రూపొందించిన విధివిధానాలను తమ ముందుంచాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని బుధవారం ఆదేశించింది. వీటిని పరిశీలించాకనే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితాను రద్దు చేసి, తమను ఇప్పుడున్నచోటనే యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. -
ఏపీ ఉద్యోగులు ఏపీకే!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన కసరత్తు ఊపందుకుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల్లో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ ఈ నెల 6న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి తెలంగాణ విద్యుత్ సంస్థలు కసరత్తును ప్రారంభించాయి. ట్రాన్స్‌కో, జెన్కోల సీఎండీ డి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో మంగళవారం విద్యుత్‌సౌధలో ఉద్యోగుల కేటాయింపుల కమిటీ సమావేశమై చర్చింది. సమావేశంలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల యాజమాన్యాలు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్ స్థానికత’ గల ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపేందుకు చర్యలు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ‘ఏపీ స్థానికత’ గల ఉద్యోగుల తుది జాబితాలను విద్యుత్ సంస్థలు సిద్ధం చేశాయి. ఈ జాబితాలను మంగళవారం రాత్రి నుంచి సంబంధిత సంస్థల వెబ్సైట్లలో ఉంచనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. తుది జాబితాల ప్రకారం తెలంగాణ ట్రాన్స్‌కోలో 262 మంది, టీ జెన్కోలో 600 మంది, తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్)లో 539 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులు పనిచేస్తున్నారు. తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం తెలంగాణకు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ఉద్యోగుల తుది కేటాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకుందాని ఏపీ విద్యుత్ శాఖ అధికారులను పలుమార్లు సమావేశానికి పిలిపించినా స్పందన రాలేదని తెలంగాణ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. కనీసం తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు పంపాలని లేఖ రాసినా ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
త్వరలో విద్యుత్‌శాఖ ఉద్యోగాల భర్తీ: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖ ఇంజనీర్లు ముఖ్యమంత్రి కే చంద్రశేకర్ రావును శనివారం కలిశారు. కోతలు లేని విద్యుత్‌ను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నందుకు ఉద్యోగులను, కేసీఆర్ అభినందించారు. విద్యుత్ శాఖలో లాభాలు రాగానే ఉద్యోగుల జీతాల పెంపు అంశంపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీలను త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామన్నారు. -
సీఎం ఆఫీసు ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం
విధుల నుంచి తొలగించారని విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగి మనస్తాపం సాక్షి, హైదరాబాద్: సచివాలయంలోని సీఎం కార్యాలయం (సమతాబ్లాక్) ఎదుట శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో చండూరి చంద్రశేఖర్ అనే విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని సమీపంలోని మెడిసిటీ ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర్ వెంట వచ్చిన అతని మిత్రుడు సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలోని సబ్‌స్టేషన్‌లో చంద్రశేఖర్, సతీష్‌లు 2012 నుంచి 2014 డిసెంబర్ వరకు ఔట్సోర్సింగ్ కింద షిప్ట్ ఆపరేటర్లుగా పనిచేశారు. తర్వాత ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ స్థానంలో కొత్త కాంట్రాక్టర్ ను నియమించగా అతను వీళ్ల స్థానంలోకి వేరే వారిని నియమించాడు. ఈ విషయమై స్థానిక డీఈని కలవగా తనకు సంబంధం లేదని, కాంట్రాక్టర్‌ను కలవాలని సూచించాడు. ఇదే విషయాన్ని సీఎంకు చెప్పుకోవడానికి సచివాలయానికి వచ్చామని, చంద్రశేఖర్ పురుగుల మందు తెచ్చుకున్న సంగతి తనకు తెలియదని సతీష్ చెప్పాడు. కాగా, ఇది పెద్ద డ్రామా అని, చంద్రశేఖర్ ముందుగానే బాటిల్లో మందుకు బదులు నీళ్లు కలుపుకొని వచ్చాడని, అది తాగకుండా మీద పోసుకున్నాడని పోలీసులు చెప్పారు. -
కార్మికులకు సేవచేస్తూ చనిపోతా
హన్మకొండ : కార్మికులకు సేవ చేస్తూనే చనిపోవాలని ఉందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. భగవంతుడు ప్రత్యక్షమైతే జీవించే వరకూ కార్మికులకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటానని చెప్పారు. హన్మకొండ సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం-327 అనుబంధ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం బహిరంగ సభ జరిగింది. సభలో జి.సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మికులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అంటూ విభజించడంలో తేడా ఏమిటో అర్థం కావడంలేదన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో మాట్లాడానని చెప్పారు. రెగ్యులరైజేషన్‌లో కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. గతంలో ఏడు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయగా విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లగా వెనక్కి వచ్చారని వివరించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడానికి హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారిందన్నారు. కార్మిక చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. కోర్టు తీర్పులను పూర్తి స్థాయిలో పరిశీలించి విద్యుత్ అధికారులతో చర్చించి రెగ్యులరైజేషన్ కోసం కృషి చేస్తామన్నారు. ఈ లోగా నేరుగా జీతాలు తీసుకోవడాన్ని సాధించుకుందామన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీఎండీ వెంకటనారాయణను ఘనంగా సన్మానించారు. అంతకుముందు హన్మకొండ వడ్డెపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌రెడ్డి భవన్లో ఐఎన్టీయూసీ జిల్లా అఫీస్బేరర్ల సమావేశం జరిగింది. ఈ సభలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బోంపెల్లి పురుషోత్తంరావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం ఏపీ సెక్రటరీ జనరల్ సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్‌రెడ్డి, నాయకులు ముత్తయ్య, మహేందర్‌రెడ్డి, హన్మంతరావు, అంజయ్యగౌడ్, రాజిరెడ్డి, సదయ్య, మహేందర్‌రెడ్డి, దారవత్ సికిందర్, దేవేందర్, నీలం ఐలేష్, ఎం.ప్రభాకర్, పుల్లా రమేశ్, ఎ.సుధాకర్, రాజేందర్, లింగమూర్తి, ప్రసాద్, సమ్మిరెడ్డి, శంకర్, ప్రభాకర్‌రెడ్డి, అశోక్, శ్రీనివాస్, రాజమౌళి పాల్గొన్నారు. త్వరలో అనుకూలంగా నిర్ణయం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై వేసిన కమిటీ సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కార్మికులకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కష్టించి పనిచేస్తున్నారు. వీరి కృషి వల్లే వినియోగదారులకు మెరుగైన సేవలందుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగాలన్నదే నా అభిమతం. - కొంటే వెంకటనారాయణ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తివేయాలి రాష్ర్టంలో కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా ఎత్తి వేయాలి. ఎన్నికలముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాంట్రాక్ట్ విధానం బానిస విధానమని, ఈ విధానం లేకుండా చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం-327 కృషి చేస్తుంది. - శ్రీధర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీఎస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం పర్మనెంట్ చేయాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిలకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగిగా వయస్సు మీరుతోంది. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే బాధ్యతను జి.సంజీవరెడ్డి తీసుకుంటారు. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వారు పర్మనెంట్ అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు యాజమాన్యం నేరుగా జీతాలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. -జి.మోహన్‌రెడ్డి, విద్యుత్ఉద్యోగుల సంఘంతెలంగాణ, ఏపీ కోఆర్డినేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్మిక సంఘాలు ఏకం కావాలి విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ సాధనకు విద్యుత్ సంస్థల్లోని అన్ని సంఘాలు ఏకమయ్యాయని, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మూడు సంఘాలు ఏకం కాలేకపోతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నట్లుగా ఉంది. విద్యుత్ సంస్థల్లోని అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు ఏకమై కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి చేయాలి. వయస్సు మీరుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. - యుగందర్, టీఎస్ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి