సమ్మె చీ‘కట్’లు
హన్మకొండ, న్యూస్‌లైన్: వేతన సవరణ (పీఆర్‌సీ) కోసం విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారం రెండో రోజుకు చేరింది. ఉద్యోగుల సమ్మెతో గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. ఐదు వందల మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి 300 మెగావాట్లకు పడిపోగా... సోమవారం సాయంత్రానికి 200 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలోని ఆయా థర్మల్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో... ప్రైవేట్ సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను అత్యవసరంగా కొనుగోలు చేశారు.
ఒక్కరోజు 66.30 లక్షల యూనిట్ల విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేసి సరఫరా చేశారు. థర్మల్ ఉత్పత్తి కేంద్రాల నుంచి ఒక్క యూనిట్‌కు రూ. 3.30 చొప్పున చెల్లిస్తుండగా... సమ్మె కారణంగా అత్యవసరంగా ప్రైవేట్ సంస్థల నుంచి సగటున రూ. 6.15 చొప్పున కొన్నారు. ఈ లెక్కన ఒక్క యూనిట్‌కు అదనంగా రూ. 2.85 వెచ్చించారు. ఉద్యోగుల మెరుపు సమ్మెతో ఇప్పటివరకు రూ.1.88 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ భారమంతా వినియోగదారులపైనే పడనుంది.
నిరసన ప్రదర్శనలు
రెండు రోజుల నుంచి ఆయా యూనియన్ల నేతలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు విఫలం కావడంతో విద్యుత్ ఉద్యోగులు సోమవారం సమ్మెను యధాతథంగా కొనసాగించారు. కార్యాలయాలన్నింటికీ తాళాలు వేసి... నిరసన తెలిపారు. ఉన్నతాధికారులను కార్యాలయాల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచి పలు యూనియన్ల ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా ఎస్‌ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పలు యూనియన్లు ధర్నా చేపట్టారుు. ఉద్యోగులు సుమారు గంటపాటు అక్కడే బైఠాయించారు. పీఆర్‌సీ ఇవ్వకుంటే... తడాఖా చూపిస్తామని నినాదాలు చేశారు. ధర్నాలో పవర్ జేఏసీ నేతలు తిరుపతిరెడ్డి, నార్ల సుబ్రమణ్యేశ్వర్‌రావు, మధుసూధన్‌రెడ్డి, శ్రీకాంత్, రవీందర్, ప్రభావతి, బండారి ప్రభాకర్, రౌతు రమేష్, ప్రభాకర్, వాలూ నాయక్, శ్రీరాం నాయక్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
అంధకారంలో గ్రామాలు
అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ను కొనుగోలు చేసినా... సాయంత్రం 4 గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. సరిపడా విద్యుత్ లేకపోవడంతో ముందుగా గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ కోత పెట్టారు. పరిశ్రమలకు విద్యుత్ ఫీక్ అవర్స్ ఆదేశాలిచ్చారు. పరిశ్రమల నిర్వాహకులు ప్రస్తుతం వెలుతురు కోసమే విద్యుత్‌ను వినియోగించాలి. రూరల్ ప్రాంతాల్లోని 23 సబ్‌స్టేషన్ల పరిధిలో రాత్రి ఏడు గంటల వరకు సరఫరా ఆపేశారు. ఆదివారం నుంచి వ్యవసాయ విద్యుత్ వినియోగానికి బ్రేక్ వేశారు. సోమవారం కూడా సరఫరా చేయలేదు. ఉదయం నుంచి కోతలు విధిస్తూనే ఉన్నారు. సరఫరా తగ్గడంతో సాయంత్రం 4 గంటల నుంచి గ్రామాలకు కోత పెట్టారు.
నష్టం రూ.1.88 కోట్లు
విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కేటీపీపీ, ఎన్టీపీసీ, కేటీపీఎస్, వీటీపీఎస్, ఆర్‌టీపీఎస్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఆయా థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో సరఫరాపై ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అత్యవసరంగా ప్రైవేట్, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఈ మేరకు జిల్లాకు 66.30 లక్షల యూనిట్లు కొని సరఫరా చేశారు. దీంతో విద్యుత్ కొనుగోలుపైనే రూ. 1.88 కోట్ల అదనపు భారం పడింది.
పీఆర్‌సీ అమలు చేసే వరకూ సమ్మె...
గణపురం : వేతన సవరణ అమలు చేసే వరకూ సమ్మె కొనసాగుతుందని ఏపీ పవర్,ఎంఫ్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటి కేటీపీపీ రిజనల్ చైర్మన్ సదానందం అన్నారు. గణపురం మండ లం చెల్పూరు శివారులోని కేటీపీపీ విద్యుత్ ఉద్యోగులు రెండో రోజూ సమ్మలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సీమాం ధ్రలో ఇప్పటికే చీకట్లు అలముకున్నాయని, సమ్మె కొనసాగితే తెలంగాణలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఏక్షణ మైనా... విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవచ్చన్నారు. రెండో రోజు సమ్మెలో ఇ.రఘోత్తం, కిరణ్, బుచ్చయ్య, సంతోష్, వీరయ్య, తిరుపతిరావు, మాధవరావు, నరేష్,శ్రీలక్ష్మి ,అశోక్, రమేష్‌బాబు, రవిందర్, విశ్వనాధ్, లీలా, భానుశ్రీ,ఉమ,రాజేందర్, జమీర్‌పాషా,రంగారావు, తిరుపతి, శంకరయ్య, రాజిరెడ్డి, తదితరులు పా ల్గొన్నారు.ములుగు డీఎస్పీ మురళీధర్‌రావు. సీఐ శ్రీధర్, గణపురం ఎస్సై రవికుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారు.