విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారు. స్థానిక బందరు రోడ్డులో సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద శుక్రవారం 13 జిల్లాల విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. వందలాది మంది కాంట్రాక్టు సిబ్బంది వారి కుటుంబాలతో కలిసి వచ్చి దీక్షలలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు దీక్షలు జరిగాయి. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు కూడా జీవోఎం ద్వారా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీక్షాశిబిరాన్ని విద్యుత్ కాంట్రాక్టు జేఏసీ రాష్ట్ర చైర్మన్ పి.కాశీ మధుబాబు ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. గత 20 ఏళ్లుగా కాంట్రాక్టు కార్మికులు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే 30 ఏళ్లపాటు, సాగు, తాగునీరు, రాజధాని నిర్మాణం, విద్యుత్ పంపకాలతోనే సరిపోతుందని చెప్పారు. విద్యుత్ రంగంలో వెయిటేజీ మార్కులతో ఇచ్చిన నోటిఫికేషన్ వల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు నూటికి 10 మందికి కూడా ఉద్యోగాలు రావని పేర్కొన్నారు.
దీనివల్ల ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న వేలాదిమంది కాంట్రాక్టు సిబ్బంది ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దీక్షా శిబిరంలో రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఎన్.వి.సీతారాం, జేఏసీ కో కన్వీనర్ ఎం.సత్యానందం, విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ రాజనాల ప్రవీణ్‌కుమార్, పశ్చిమకృష్ణా ఎన్‌జీవో అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్, ఎన్జీవో నేతలు మహ్మద్ ఇక్బాల్, వి.వి.ప్రసాద్, కె.బలరాం తదితరులు పాల్గొన్నారు.
విభజన ప్రక్రియ తక్షణం నిలిపివేయాలి
Published Sat, Jan 11 2014 3:43 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement