సీఎంతో చర్చలు విఫలం.. విద్యుత్ సమ్మె యథాతథం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మెను యథాతథంగా కొనసాగించాలని ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. కనీసం అత్యవసర సేవలకైనా మినహాయింపు ఇవ్వాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి కిరణ్ కోరినా.. ససేమిరా అన్నారు. అసలు తాము ముఖ్యమంత్రి నుంచి ఏమీ ఆశించట్లేదని, అందువల్ల ఆయన కోరినా సమ్మెను విరమించేది లేదని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇప్పటికిప్పుడు సమ్మె విరమించే సమస్య ఏమాత్రం లేదని సాయిబాబా స్పష్టం చేశారు. రాష్ట్రం యథాతథంగానే ఉంటుందని, దీన్ని విభజించే సమస్య లేదని ఆయన అన్నారు.
అయితే, అంతకుముందు కొంతమంది మంత్రులు మాత్రం మీడియాను ఈ విషయంలో తప్పుదోవ పట్టించారు. విద్యుత్ ఉద్యోగులు బయటకు రావడానికి కొద్ది నిమిషాల ముందు మంత్రులు స్వయంగా విలేకరులకు ఫోన్లు చేసి, బ్రేకింగ్ పెట్టుకోండి.. చర్చలు సఫలమయ్యాయి, సమ్మె విరమిస్తున్నారు అని చెప్పారు. దీంతో దాదాపు చాలావరకు టీవీ చానళ్లలో సమ్మెను విరమిస్తున్నట్లు కొద్దిపేసటి పాటు ప్రచారం జరిగింది.
తొలుత ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఒక విడత సీనియర్ ఐఏఎస్ అధికారులతో జరిపిన చర్చలు పూర్తి ఫలితం ఇవ్వలేదు. మరోసారి రాత్రి ఏడు గంటల నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన క్యాంపు కార్యాలయంలోనే సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు రెండు గంటల పాటు చర్చించారు. వాటి వల్ల కూడా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో రాష్ట్రంలో మరికొన్నాళ్లు చీకట్లు తప్పవని స్పష్టమైపోయింది.