ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు ఒక్కసారిగా మెరుపు సమ్మెకు దిగారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఆదివారం నుంచి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు మొత్తం నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఈ ప్రభావం ప్రత్యక్షంగా విద్యుత్ సరఫరాపై పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు నిరాకరిస్తుండడంతో అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆదివారం రాత్రికి ఒంగోలు నగరంలోని కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
టీ నోట్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన వెంటనే విద్యుత్ ఉద్యోగులు 48 గంటల సమ్మెలోకి వెళ్లడంతో కరెంట్ సరఫరాకి ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో జిల్లాకు సరఫరా తగ్గుతూ వచ్చింది. దాదాపు ప్రతిరోజు 350 మెగావాట్ల విద్యుత్ జిల్లాకు అవసరం కాగా శనివారానికే అదికాస్త 280 మెగావాట్లకు పడిపోయింది. దీంతో అధికారులు అక్కడక్కడా కోతలు విధిస్తూ వచ్చారు. ఆదివారం ఉద్యోగులు మొత్తం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో సాంకేతిక సమస్యలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి.
జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంతో పాటు, కందుకూరు, చీరాల, అద్దంకి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు మున్సిపల్ కేంద్రాలు, అన్ని మండల కేంద్రాలు, 1024 పంచాయతీల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే దాదాపు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆపేశారు. ఆదివారం మొత్తం పూర్తిగా విద్యుత్ సరఫరా కాలేదు. అధికారులు కూడా చేతులెత్తేశారు. అయితే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కాంట్రాక్టు సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందితో ఒంగోలు నగరంతో పాటు, కొన్ని ముఖ్య పట్టణాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నగరంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గద్దలగుంట, వీఐపీ రోడ్, లాయరుపేట, మామిడిపాలెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేశారు.
జనజీవనం అస్తవ్యస్తం
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా ఒంగోలు పట్టణంలో శనివారం అర్ధరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరిగి ఆదివారం రాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరా లేదు. దీంతో వాడుకకు కూడా నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా అపార్టుమెంట్లలో నివశించే ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి టిఫిన్ హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పనిచేయని మంచినీటి పథకాలు: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోటార్లు పనిచేయక చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి పథకాలు పూర్తిగా పనిచేయడం లేదు. దీంతో బోర్లు, బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రైతులకూ ఇబ్బందులు తప్పడం లేదు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 1.05 లక్షల ఉచిత విద్యుత్ మోటార్లు మూలనపడ్డాయి. పంటలు సాగు చేసుకునే సీజన్‌లో విద్యుత్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాత్కాలిక ఏర్పాట్లలో అధికారులు:
జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బందులేనని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే సబ్‌స్టేషన్లలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడంతో భారీగానే నష్టం వాటిల్లి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నా సిబ్బంది సహకరించడం లేదు. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపు 2700 మంది ఉద్యోగులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని పేర్కొంటున్నారు. అదే జరిగితే జిల్లా పూర్తిగా కొన్ని రోజుల పాటు అంధకారంలోకి వెళ్లినట్టే.
భవిష్యత్ అంధకారమే
ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో భవిష్యత్‌లో కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా సబ్‌స్టేషన్‌లలో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయాయని, అలాగే ఫీడర్ వారీగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్తున్నారు. వీటిని తిరిగి పునరుద్ధరించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీని వల్ల వచ్చే రెండు మూడు రోజుల్లో తీవ్ర విద్యుత్ కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగితే విద్యుత్ సరఫరా చేయడం కష్టమేనని పేర్కొంటున్నారు.