t note
-
సమైక్య బంద్
ఢిల్లీ పెద్దల విభజన తంత్రం మరోమారు అగ్గి రాజేసింది. జిల్లా మొత్తం సమైక్య కాంక్షతో రగిలిపోయింది. టీ నోట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందుకు నిరసనగా జిల్లాలో పూర్తి బంద్ పాటించిన ప్రజలు ధర్నాలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో తీవ్ర నిరసన ప్రకటించారు. ఉదయం నుంచీ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, ఏపీఎన్జీవో, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా బంద్‌లో పాల్గొనడంతో జిల్లాలో 480 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఫ్లెక్సీని ఉద్యమకారులు చించేసి నిరసన ప్రకటించగా.. రాజాం, పలాస, పాతపట్నం, పాలకొండ తదితర ప్రాంతాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. - ఫొటో ఫీచర్ సెంటర్‌స్ప్రెడ్‌లో సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, ఇతర ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం బంద్ విజయవంతమైంది. జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఉదయం ఆర్టీసీ సిబ్బంది బస్సులను డిపోల్లోనే ఆపివేసి నిరసన తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. కొన్నిచోట్ల దుకాణాలు, కార్యాలయాలను తెరవగా ఉద్యమకారులు మూసివేయించారు. శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం, కన్వీనర్లు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు డే అండ్ నైట్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తీరిగ్గా ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఆందోళన చేపట్టారు. వీరు జెండాలు పట్టుకుని పాలకొండ రోడ్ మీదుగా అంబేద్కర్ కూడలి వద్దకు వస్తుండగా.. మీ నేత చంద్రబాబు తెలంగాణ కు సై అంటే మీరిక్కడ జెండాలు పట్టుకుని తిరుతున్నారేంటని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నించారు. భారీ బందోబస్తు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక పోలీసులు, కేంద్రబలగాలను మోహరించారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ స్వగృహ వద్దనున్న ఇందిరా గాంధీ బొమ్మ వద్ద, ఇంకా విగ్రహాలు ఉన్నచోట్ల, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పాలకొండ ఆంజనేయ సెంటర్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతృత్వంలో ఏలాం జంక్షన్ వద్ద రాస్తారోకో, ధర్నా చేపట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. టీడీపీ నేతలు, ఎన్జీఓలు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టి బస్సులు తిరగకుండా నిలువరించారు. సీతంపేటలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బంద్ చేపట్టి రోడ్డుపై నినాదాలు చేశారు. బస్సులను నిలిపివేశారు ఆమదాలవలసలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహన్రావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు విద్యార్ధులతో కలిసి ర్యాలీగా వెళ్లి రైల్వేస్టేషన్ ఎదురుగా మానవహారం నిర్వహించారు. పొందూరులో బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యురాలు కూన మంగమ్మ, పార్టీ పట్టణ, మండల యూత్ కన్వీనర్లు దవళ అప్పలనాయుడు, సింగూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యా ల యాలను మూయించారు. అనంతరం జాతీ య రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ నాయకత్వం వహించారు. ఎచ్చెర్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి కళావెంకటరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి పాల్గొన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి వద్ద జాతీయ రహదారిని వైఎస్ఆర్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్, మండల కన్వీనర్ బాడాన మురళీ తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు దిగ్బంధిం చారు. దాదాపు 3 గంటల సేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కృపారాణి ఫ్లెక్సీలను ఉద్యమకారులు చించివేశారు. ఇచ్ఛాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పార్టీ నేతలు దుకాణాలను మూసివేయించారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టి రోడ్డుపై బైఠాయిం చా రు. పాఠశాలలు, కళాశాలలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్ఆర్సీపీ మునిసిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, మునిసపల్ యువజన విభాగం కన్వీనర్ పి.కోటి, జిల్లా ఎస్సీ విభాగం కన్వీనర్ సల్ల దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలో పార్టీ నాయకులు బంద్‌ను విజయవంతం చేశారు. పలాసలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వేకువజామున 4 గంటలకే రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూసివేయించారు. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గరుడుఖండి గ్రామం వద్ద రోడ్డును దిగ్బంధించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ బీఈటీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. పరీక్షను బహిష్కరించిన చిన్నారులు మందస, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు నిరసనగా జి.ఆర్.పురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్వార్టర్లీ పరీక్షను బహిష్కరించారు. గ్రామ సర్పంచ్ కర్రి గోపాలకృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి పాఠశాలకు వెళ్లి బంద్ పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు పరీక్ష రాయకుండా బయటకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. -
ముసిరిన చీకట్లు
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు ఒక్కసారిగా మెరుపు సమ్మెకు దిగారు. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపుతో ఆదివారం నుంచి జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు మొత్తం నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ఈ ప్రభావం ప్రత్యక్షంగా విద్యుత్ సరఫరాపై పడింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ ఉద్యోగులు విధులకు హాజరయ్యేందుకు నిరాకరిస్తుండడంతో అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. ఆదివారం రాత్రికి ఒంగోలు నగరంలోని కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. టీ నోట్‌కు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలిపిన వెంటనే విద్యుత్ ఉద్యోగులు 48 గంటల సమ్మెలోకి వెళ్లడంతో కరెంట్ సరఫరాకి ఇబ్బందులు తలెత్తాయి. విద్యుత్ ఉత్పత్తి పడిపోవడంతో జిల్లాకు సరఫరా తగ్గుతూ వచ్చింది. దాదాపు ప్రతిరోజు 350 మెగావాట్ల విద్యుత్ జిల్లాకు అవసరం కాగా శనివారానికే అదికాస్త 280 మెగావాట్లకు పడిపోయింది. దీంతో అధికారులు అక్కడక్కడా కోతలు విధిస్తూ వచ్చారు. ఆదివారం ఉద్యోగులు మొత్తం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో సాంకేతిక సమస్యలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంతో పాటు, కందుకూరు, చీరాల, అద్దంకి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు మున్సిపల్ కేంద్రాలు, అన్ని మండల కేంద్రాలు, 1024 పంచాయతీల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శనివారం అర్ధరాత్రి నుంచే దాదాపు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆపేశారు. ఆదివారం మొత్తం పూర్తిగా విద్యుత్ సరఫరా కాలేదు. అధికారులు కూడా చేతులెత్తేశారు. అయితే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కాంట్రాక్టు సిబ్బంది, ప్రైవేట్ సిబ్బందితో ఒంగోలు నగరంతో పాటు, కొన్ని ముఖ్య పట్టణాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం నగరంలోని కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. గద్దలగుంట, వీఐపీ రోడ్, లాయరుపేట, మామిడిపాలెం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేశారు. జనజీవనం అస్తవ్యస్తం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా ఒంగోలు పట్టణంలో శనివారం అర్ధరాత్రి నుంచే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తిరిగి ఆదివారం రాత్రి వరకు కూడా విద్యుత్ సరఫరా లేదు. దీంతో వాడుకకు కూడా నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా అపార్టుమెంట్లలో నివశించే ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక చిన్న చిన్న దుకాణాల దగ్గర నుంచి టిఫిన్ హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనిచేయని మంచినీటి పథకాలు: విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పట్టణాల్లో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోటార్లు పనిచేయక చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి పథకాలు పూర్తిగా పనిచేయడం లేదు. దీంతో బోర్లు, బావులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక రైతులకూ ఇబ్బందులు తప్పడం లేదు. దాదాపు జిల్లా వ్యాప్తంగా 1.05 లక్షల ఉచిత విద్యుత్ మోటార్లు మూలనపడ్డాయి. పంటలు సాగు చేసుకునే సీజన్లో విద్యుత్ లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక ఏర్పాట్లలో అధికారులు: జిల్లాలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ సాంకేతిక సమస్యలు తలెత్తితే ఇబ్బందులేనని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే సబ్స్టేషన్లలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడంతో భారీగానే నష్టం వాటిల్లి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలన్నా సిబ్బంది సహకరించడం లేదు. ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపు 2700 మంది ఉద్యోగులు ప్రస్తుతం సమ్మెలో ఉన్నారు. రాష్ట్ర నాయకత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని పేర్కొంటున్నారు. అదే జరిగితే జిల్లా పూర్తిగా కొన్ని రోజుల పాటు అంధకారంలోకి వెళ్లినట్టే. భవిష్యత్ అంధకారమే ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో భవిష్యత్‌లో కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా ఉండకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా సబ్స్టేషన్లలో ట్రాన్స్ఫార్మర్ పేలిపోయాయని, అలాగే ఫీడర్ వారీగా సాంకేతిక సమస్యలు తలెత్తాయని చెప్తున్నారు. వీటిని తిరిగి పునరుద్ధరించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీని వల్ల వచ్చే రెండు మూడు రోజుల్లో తీవ్ర విద్యుత్ కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగితే విద్యుత్ సరఫరా చేయడం కష్టమేనని పేర్కొంటున్నారు. -
బొత్స వల్లే టీ నోట్ : ఉమా
కంచికచర్ల, న్యూస్‌లైన్ : పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ నిర్వాకం వల్లే కేంద్రం టీ నోట్‌ను ఆమోదించిందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. స్థానిక ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న అబ్బూరి రామారావు, దుడ్డు మురళివాసు, యనమదల రమేష్‌బాబును శనివారం సాయంత్రం ఎమ్మెల్యే ఉమ పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఉమ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేల మద్దతును తెలంగాణ తీర్మానానికి అనుకూలంగా తాను కూడగట్టానని చెప్పడంతోనే కేంద్రం టీ నోట్‌ను ఆమోదించిందన్నారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం జిల్లా ప్రజలు బొత్స ఆస్తులపై దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఇలాంటి వ్యక్తుల కుయుక్తులను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. కేంద్రం కళ్లు తెరిపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం నుంచి ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నారన్నారు. జేఏసీ కన్వీనర్ గంగిరెడ్డి రంగారావు, కందుల వెంకట్రావు, కాసరగడ్డ రామారావు, కోగంటి బాబు, నన్నపనేని లక్ష్మీనారాయణ, బుడ్డి సూర్యప్రకాష్, నాగవరపు రాజు పాల్గొన్నారు. -
స్తంభించిన పాలన
ఏలూరు , న్యూస్‌లైన్ :టీ నోట్ ప్రకంపనలపై జిల్లా వ్యాప్తంగా రెండో రోజున చేపట్టిన ఎన్జీవోల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ కార్యాలయాలన్నింటినీ ఎన్జీవోలు మూ యించి వేయడంతో పాలన స్తంభించింది. సిని మా థియేటర్లు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలను సమైక్యవాదులు మూయించి వేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులను, గ్రామాల్లోని రహదారులను దిగ్బంధించారు. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈసందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎన్జీవోలు నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. దీంతో ఉద్యోగులు, ఎమ్మెల్యే మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఉద్యోగులను ఎమ్మెల్యే దుర్భాషలాడారు. ఏలూరు ఆశ్రం వద్ద జాతీయర హదారిని, కలపర్రు టోల్గేట్ వద్ద రహదారిని ఎన్జీవోలు దిగ్బంధించారు. ఆచంట సెంటరులో మర్చంట్స్ చాంబర్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కొవ్వూరులో ఎన్జీవోలు రోడ్డు కం రైలు వంతెన దిగ్బం ధించారు. ఎన్జీవోలపై అక్రమంగా చేయి చేసుకున్న కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ కుమారులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. నిడదవోలు-పంగిడి రహదారిపై బ్రాహ్మణగూడెం, ఎస్.ముప్పవరం గ్రామా ల్లో సమైక్యవాదులు రోడ్లను చుట్టుముట్టారు. రోడ్డుపై టెంట్లు వేసి నిరసన తెలిపారు. చింతలపూడిలో ఉద్యోగులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం కొత్తబస్టాండ్ సెంటర్లో ఆందోళన చేశారు. కోయగూడెం యువకులు యువగర్జన నిర్వహించారు. తాడేపల్లిగూడెం లో ఎన్జీవోలు ఎరువుల, ఉల్లిపాయల ఎగుమతి, దిగుమతులను అడ్డుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. ఉండిలో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఆధ్వర్యం లో వంటావార్పు నిర్వహించారు. నిడదవోలులో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు మోటార్ సైకిళ్ల ర్యాలీ చేశారు. ఉపాధ్యాయులు టీ నోట్ పత్రాలను దహనం చేశారు. ఇరగవరం మం డలం రేలంగిలో గ్రామ పంచాయతీ ఉప సర్పం చ్ వడ్డి మార్కండేయులు, న్యాయవాది గాజుల అప్పాజీ ఆమరణ నిరాహారదీక్షలను ప్రారంభిం చారు. తాడేపల్లిగూడెంలో ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్డుపై టెంట్లు వేసి వంటావార్పు చేశారు. రాజస్తాన్ యువత బంద్‌కు సంఘీభా వం తెలిపింది. భీమవరంలో ఉపాయులు, ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. నర్సాపురంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహిళా గర్జన నిర్వహించారు. తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకోవాలి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, హోం మంత్రి షిండే తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకోవాలం టూ ఎన్జీవోలు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో ఎన్జీవోల ఆధ్వర్యంలో సీమాంధ్ర ఎం పీలు, మంత్రులు, కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు పిండప్రదానం చేశారు. భీమవరంలో ప్రకాశం సెంటర్లో సెయింట్ జోన్స్ స్కూల్ ఆధ్వర్యంలో కేసీఆర్, సోనియా, దిగ్విజయ్, షిండే మాస్క్‌లతో రాక్షస వేషధారణలతో నిరసన తెలిపారు. దెందులూరు, గోపన్నపాలెం, శ్రీరామవరం గ్రామాల్లో సమైక్యవాదులు షిండే, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేసి, శ వయాత్ర నిర్వహించారు. -
తెలంగాణ నోట్‌ను రాహుల్ చించేయాలి: కొణతాల
నేరచరితుల ఆర్డినెన్స్‌ను చించేసిన రాహుల్ ... కేబినెట్లో పెట్టిన తెలంగాణ నోట్‌ను కూడా చించేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ శుక్రవారం అనకాపల్లిలో అభిప్రాయపడ్డారు. అలా చేయకుంటే రాహుల్ చరిత్ర హీనులవుతారని పేర్కొన్నారు. రాజకీయ సంక్షోభంతోనే సమైక్యాంధ్ర సాధ్యమవుతోందని రామకృష్ణ తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోదరుడు కొణతాల లక్ష్మీనారాయణ చేపట్టిన నిరాహర దీక్షను రామకృష్ణ నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు.