ఢిల్లీ పెద్దల విభజన తంత్రం మరోమారు అగ్గి రాజేసింది. జిల్లా మొత్తం సమైక్య కాంక్షతో రగిలిపోయింది. టీ నోట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినందుకు నిరసనగా జిల్లాలో పూర్తి బంద్ పాటించిన ప్రజలు ధర్నాలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలతో తీవ్ర నిరసన ప్రకటించారు. ఉదయం నుంచీ వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ఏపీఎన్జీవో, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆర్టీసీ కార్మికులు కూడా బంద్‌లో పాల్గొనడంతో జిల్లాలో 480 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బ్యాంకులు, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. టెక్కలిలో కేంద్రమంత్రి కృపారాణి ఫ్లెక్సీని ఉద్యమకారులు చించేసి నిరసన ప్రకటించగా.. రాజాం, పలాస, పాతపట్నం, పాలకొండ తదితర ప్రాంతాల్లో విద్యార్థులతో భారీ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
- ఫొటో ఫీచర్ సెంటర్‌స్ప్రెడ్‌లో
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక, ఇతర ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో శుక్రవారం బంద్ విజయవంతమైంది. జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ వాణిజ్య, వ్యాపార, విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఉదయం ఆర్టీసీ సిబ్బంది బస్సులను డిపోల్లోనే ఆపివేసి నిరసన తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. కొన్నిచోట్ల దుకాణాలు, కార్యాలయాలను తెరవగా ఉద్యమకారులు మూసివేయించారు. శ్రీకాకుళంలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర, పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు మార్పు ధర్మారావుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా చైర్మన్ హనుమంతు సాయిరాం, కన్వీనర్‌లు జామి భీమశంకర్, దుప్పల వెంకట్రావు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాడ వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు డే అండ్ నైట్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తీరిగ్గా ఉదయం 10 గంటల తర్వాత వచ్చి ఆందోళన చేపట్టారు. వీరు జెండాలు పట్టుకుని పాలకొండ రోడ్ మీదుగా అంబేద్కర్ కూడలి వద్దకు వస్తుండగా.. మీ నేత చంద్రబాబు తెలంగాణ కు సై అంటే మీరిక్కడ జెండాలు పట్టుకుని తిరుతున్నారేంటని పలువురు వ్యంగ్యంగా ప్రశ్నించారు.
భారీ బందోబస్తు
జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక పోలీసులు, కేంద్రబలగాలను మోహరించారు. రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం, రాజీవ్ స్వగృహ వద్దనున్న ఇందిరా గాంధీ బొమ్మ వద్ద, ఇంకా విగ్రహాలు ఉన్నచోట్ల, మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పాలకొండ ఆంజనేయ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతృత్వంలో ఏలాం జంక్షన్ వద్ద రాస్తారోకో, ధర్నా చేపట్టి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. టీడీపీ నేతలు, ఎన్జీఓలు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టి బస్సులు తిరగకుండా నిలువరించారు.
సీతంపేటలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు బంద్ చేపట్టి రోడ్డుపై నినాదాలు చేశారు. బస్సులను నిలిపివేశారు
ఆమదాలవలసలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కిల్లి రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో బంద్ జరిగింది. పార్టీ నేతలు, కార్యకర్తలు విద్యార్ధులతో కలిసి ర్యాలీగా వెళ్లి రైల్వేస్టేషన్ ఎదురుగా మానవహారం నిర్వహించారు. పొందూరులో బంద్ విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీ సభ్యురాలు కూన మంగమ్మ, పార్టీ పట్టణ, మండల యూత్ కన్వీనర్‌లు దవళ అప్పలనాయుడు, సింగూరు రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. దుకాణాలు, ప్రభుత్వ కార్యా ల యాలను మూయించారు. అనంతరం జాతీ య రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ నాయకత్వం వహించారు. ఎచ్చెర్లలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిమిడి కళావెంకటరావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి పాల్గొన్నారు.
టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి వద్ద జాతీయ రహదారిని వైఎస్‌ఆర్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయ కర్త దువ్వాడ శ్రీనివాస్, మండల కన్వీనర్ బాడాన మురళీ తదితరుల ఆధ్వర్యంలో కార్యకర్తలు దిగ్బంధిం చారు. దాదాపు 3 గంటల సేపు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కేంద్ర మంత్రి కృపారాణి ఫ్లెక్సీలను ఉద్యమకారులు చించివేశారు.
ఇచ్ఛాపురంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. పార్టీ నేతలు దుకాణాలను మూసివేయించారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టి రోడ్డుపై బైఠాయిం చా రు. పాఠశాలలు, కళాశాలలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్‌ఆర్‌సీపీ మునిసిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, మునిసపల్ యువజన విభాగం కన్వీనర్ పి.కోటి, జిల్లా ఎస్సీ విభాగం కన్వీనర్ సల్ల దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలో పార్టీ నాయకులు బంద్‌ను విజయవంతం చేశారు.
పలాసలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వేకువజామున 4 గంటలకే రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూసివేయించారు. ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గరుడుఖండి గ్రామం వద్ద రోడ్డును దిగ్బంధించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ కణితి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గ బీఈటీ స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు.
పరీక్షను బహిష్కరించిన చిన్నారులు
మందస, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు నిరసనగా జి.ఆర్.పురం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం క్వార్టర్లీ పరీక్షను బహిష్కరించారు. గ్రామ సర్పంచ్ కర్రి గోపాలకృష్ణ వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలతో కలిసి పాఠశాలకు వెళ్లి బంద్ పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులను కోరారు. దీంతో విద్యార్థులు పరీక్ష రాయకుండా బయటకు వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
సమైక్య బంద్
Published Sat, Dec 7 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM