ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం జిల్లా బంద్ చేపట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీనికి విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు పలికాయి. విద్యార్థులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఆళ్ల నాని, పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ పార్టీల నాయకులతో బంద్ విజయవంతంపై చర్చించారు.
నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. బంద్ సందర్భంగా మంగళవారం దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు చింతలపూడిలో బైక్‌లపై తిరిగి ఆయా వర్గాలను కలసి విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.
జిల్లాలోని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ ఎంబీఎస్ శర్మ పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మాముడూరి మహంకాళి ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం రాత్రి ఏలూరులో రథయాత్ర ప్రారంభించారు.
నేడు జిల్లా బంద్
Published Tue, Aug 11 2015 1:14 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement