'కిరణ్తో పాటు ఎంపీలను చేర్చుకునేందుకు సిద్ధం'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీలను కూడా తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమని సీమాంధ్ర పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆవేశంతో పార్టీని వీడినవారు తిరిగి కాంగ్రెస్లోకి రావచ్చని అన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాకే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని రఘువీరా అన్నారు.
సమైక్యాంధ్రకు కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహం చేశారని రఘువీరా మండిపడ్డారు. కిరణ్ ఏం త్యాగం చేశారో చెప్పాలన్నారు. స్వలాభం కోసమే కొందరు పార్టీని వీడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీమాంధ్ర అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు ఇస్తున్న హామీలను ప్రజల గమనించాలని రఘువీరా విజ్ఞప్తి చేశారు.
ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ నేతల వలసలతో పార్టీ ఖాళీ అవుతున్న నేపథ్యంలో రఘువీరా భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ను వీడే విషయంలో తొందరపడవద్దని, మాట్లాడుకుందాం రండి అంటూ పక్క పార్టీలవైపు చూస్తున్న పలువురు నేతలకు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. పార్టీ విడతారని భావిస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకూ ఫోన్ చేసి బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే పార్టీ వీడతారని అనుమానం ఉన్న నాయకుల జాబితా తనకు పంపాలని 13 జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కమిటీ అధ్యక్షులను ఆదేశించారు.