The special status of the state
-
నేడు జిల్లా బంద్
ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ మంగళవారం జిల్లా బంద్ చేపట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సన్నద్ధమయ్యాయి. దీనికి విద్యాసంస్థలు సంపూర్ణ మద్దతు పలికాయి. విద్యార్థులకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఆళ్ల నాని, పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భీమవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ పార్టీల నాయకులతో బంద్ విజయవంతంపై చర్చించారు. నియోజకవర్గంలోని అన్ని పార్టీల నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. బంద్ సందర్భంగా మంగళవారం దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూసివేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు చింతలపూడిలో బైక్‌లపై తిరిగి ఆయా వర్గాలను కలసి విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలోని విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ ఎంబీఎస్ శర్మ పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరుతూ నవ్యాంధ్ర హక్కుల సాధన సమితి అధ్యక్షుడు మాముడూరి మహంకాళి ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం రాత్రి ఏలూరులో రథయాత్ర ప్రారంభించారు. -
పోరు బావుటా
సమైక్యాంధ్ర కోసం నినదిస్తే గొంతు నొక్కారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మభ్యపెట్టారు. హోదా ఏదని అడిగితే.. అంతా వట్టిదేనని చేతులు దులిపేసుకున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట చెబుతూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్న పాలకుల నయవంచనపై ‘పశ్చిమ’ కన్నెర్ర చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో పోరుబావుటా ఎత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి తీరాలంటూ నినదిస్తోంది. ఏలూరు (ఆర్ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీని తక్షణమే అమలు చేయాలంటూ జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇదే నినాదాన్ని ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనింప చేసిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో పార్టీ నాయకులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్షకు మద్దతుగా సోమవారం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలోనూ ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమాలు నిర్వహించారు. పెనుమంట్ర మండలం మార్టేరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర నాయకత్వంలో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తణుకులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు చీర్ల రాధయ్య పర్యవేక్షణలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. భీమవరంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ వివిధ పార్టీల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అనే నినాదంతో పార్టీ శ్రేణులను ఉద్యమానికి సమాయత్తం చేశారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్లో సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉంగుటూరు సీపీఎం కార్యాలయంలో కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న మునికోటికి సంతాపం తెలిపారు. ఉండిలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. -
బీజేపీది నమ్మకద్రోహం
- రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి - సీపీఎం నగర కార్యదర్శి బాబూరావు విజయవాడ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్ బాబూరావు విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రాష్ర్ట కమిటీ పిలుపు మేరకు సోమవారం విజయవాడ సబ్-కలెక్టర్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. బాబూరావు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేసిన బీజేపీ అధికారంలోకి రాగానే మాట మార్చిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా లేకుండా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి శంకుస్థాపనకు సిద్ధపడడం శోచనీయమన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు ఎక్కడ నుంచి తెస్తారో, ఎన్ని నిధులతో నిర్మించనున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హాదాను సాధించేందుకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, కె. శ్రీదేవి పాల్గొన్నారు.