పోరు బావుటా | Inspired by the conflict sharpened YS Jagan | Sakshi
Sakshi News home page

పోరు బావుటా

Published Tue, Aug 11 2015 1:11 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

Inspired by the conflict sharpened YS Jagan

 సమైక్యాంధ్ర కోసం నినదిస్తే గొంతు నొక్కారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని మభ్యపెట్టారు. హోదా ఏదని అడిగితే.. అంతా వట్టిదేనని చేతులు దులిపేసుకున్నారు. అప్పుడో మాట.. ఇప్పుడో మాట చెబుతూ ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్న పాలకుల నయవంచనపై ‘పశ్చిమ’ కన్నెర్ర చేస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమ తరహాలో పోరుబావుటా ఎత్తింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి తీరాలంటూ నినదిస్తోంది.
 
 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామనే హామీని తక్షణమే అమలు చేయాలంటూ జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇదే నినాదాన్ని ఢిల్లీ వీధుల్లో ప్రతిధ్వనింప చేసిన వైఎస్సార్ సీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో పార్టీ నాయకులు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్షకు మద్దతుగా సోమవారం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పక్షాల ఆధ్వర్యంలోనూ ప్రత్యేక హోదా కోరుతూ ఉద్యమాలు నిర్వహించారు. పెనుమంట్ర మండలం మార్టేరులో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర నాయకత్వంలో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి చంద్రమౌళీశ్వరరెడ్డి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
 తణుకులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ నాయకుడు చీర్ల రాధయ్య పర్యవేక్షణలో పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. భీమవరంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్ వివిధ పార్టీల నేతలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అనే నినాదంతో పార్టీ శ్రేణులను ఉద్యమానికి సమాయత్తం చేశారు. నరసాపురం అంబేద్కర్ సెంటర్‌లో సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉంగుటూరు సీపీఎం కార్యాలయంలో కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణం చేసుకున్న మునికోటికి సంతాపం తెలిపారు. ఉండిలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement