ఉద్యమం ఉగ్రరూపం
Published Sun, Aug 18 2013 7:18 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. ఉద్యమంలో పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులతో పాటు విద్యార్థులు, సామాన్యులు అధిక సంఖ్యలో రోడ్లపైకి వచ్చి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు నగరంలో శనివారం నిరసనలు మిన్నంటాయి. సమైక్య నినాదంతో నగరం హోరెత్తింది. ఎన్‌జీఓలు చేపట్టిన సమ్మె ఐదో రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడేదిలేదంటూ నినదించారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా వారి పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్‌బషీర్, కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి రాజ్యలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగుల భారీ ర్యాలీ...
ఏపీఆర్‌ఎస్‌ఏ, వీఆర్వోల అసోసియేషన్, రేషన్ డీలర్ల అసోసియేషన్, ప్లానింగ్‌శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులంతా సమైక్యంగా ఉద్యమబాట పట్టారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్ వద్ద డీఆర్వో రాధాకృష్ణమూర్తి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. నెల్లూరు బస్టాండ్, కలెక్టరేట్ మీదుగా సీవీఎన్ రీడింగ్‌రూం వద్దగల పొట్టిశ్రీరాములు విగ్ర హం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. అక్కడి నుంచి చర్చిసెంటర్ వరకు ర్యాలీగా వచ్చి మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు, ఒంగోలు, మార్కాపురం ఆర్డీఓలు మురళి, ఎం.రాఘవరావు, జెడ్పీ సీఈఓ గంగాధర్‌గౌడ్, స్టెప్ సీఈఓ బి.రవి, సీపీఓ టి.వెంకయ్య, ఏపీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర నాయకులు తోటకూర ప్రభాకర్, శెట్టి గోపి, ఏవీ రవిశంకర్, ఎన్.సుధాకర్, పి.శ్రీనివాసులు, ఎం.వెంకటేశ్వర్లు, వీఆర్వో అసోసియేషన్ నాయకుడు కె.వీరాంజనేయులు పాల్గొన్నారు.
సంక్షేమశాఖల ఉద్యోగుల ప్రదర్శన...
జిల్లాలోని సంక్షేమశాఖల ఆధ్వర్యంలో స్థానిక ప్రగతిభవన్ నుంచి చర్చిసెంటర్ వరకు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. చర్చిసెంటర్లో మానవహారంగా ఏర్పడి వాహనాలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారిణి మయూరి, సాంఘిక సంక్షేమశాఖ అధికారిణి సరస్వతి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
విద్యుత్ ఉద్యోగుల బైక్ ర్యాలీ...
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులంతా కలిసి స్థానిక ఎస్‌ఈ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్, ట్రంకురోడ్డు, కర్నూల్ రోడ్డు మీదుగా పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు డీఈ కట్టా వెంకటేశ్వర్లు ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్‌జీఓల సమ్మెకు మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీఈలు పిచ్చయ్య, హరిబాబు, శ్రీనివాసులు, జేఏసీ చైర్మన్ ఎన్.జయాకరరావు, కన్వీనర్ టి.సాంబశివరావు, జాన్సన్, సంజీవరావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
దేవాదాయశాఖ ఆధ్వర్యంలో...
దేవాదాయ ధర్మాదాయశాఖ, జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు, అర్చకులు విధులు బహిష్కరించి స్థానిక దేవాదాయశాఖ కార్యాలయం నుంచి చర్చిసెంటర్ వరకు మేళతాళాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. చర్చిసెంటర్‌లో మానవహారం నిర్వహించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కేబీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ జి.రోశయ్య, డీఈ సీహెచ్ శ్రీనివాసరావు, అర్చక సంఘ తరఫున సీతారామాచార్యులు, శేషాచార్యులు, టీవీ శివనాగదాసు, కొత్త వెంకట్రావ్, టీవీ రమణారావు, ఎన్‌టీ రామారావు పాల్గొన్నారు.
కళ్లకు గంతలు కట్టి నిరసన తెలిపిన కార్పొరేషన్ ఉద్యోగులు...
రాష్ట్ర విభజనకు నిరసనగా నగర కార్పొరేషన్ ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన చేపట్టారు. సకల జనుల సమ్మెకు ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు. కేంద్రం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అత్యవసర సేవలను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు.
వికలాంగుల నిరసన...
సమైక్యాంధ్రకు మద్దతుగా వికలాంగులు, స్థానిక బధిరుల పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. బధిరుల పాఠశాల విద్యార్థులు తమ మూగరోదనతోనే భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఆకట్టుకున్నారు. చర్చిసెంటర్‌లో క్యారమ్స్, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాలు తదితరులు పాల్గొన్నారు.
ట్రాలీ ఆటోలతో ప్రదర్శన...
నగర ఆటో ట్రాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ట్రాలీ ఆటోలతో భారీ ప్రదర్శన చేపట్టారు. కర్నూల్‌రోడ్డు ప్లైఓవర్ బ్రిడ్జి నుంచి కొత్తపట్నం బస్టాండ్ మీదుగా చర్చి సెంటర్ వరకు కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించారు. అనంతరం చర్చి సెంటర్‌లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలకు అన్యాయం చేసే రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బైపాస్ ఆటో సంఘ నాయకుడు షేక్ మీరావలి, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగిన విద్యార్థుల ఆందోళన...
సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, సమైక్యాంధ్ర ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ నిరసనను కొనసాగించారు. రిమ్స్ ఎదుట విద్యార్థులతో కలిసి జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. సోనియాగాంధీ, చిదంబరం, ఆంటోని, చిరంజీవి, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాష్ట్ర చరిత్రలో వీరంతా ద్రోహులుగా నిలిచిపోతారని, ఇప్పటికైనా ప్రజాప్రతినిధులంతా వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఫ్రంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు చర్చిసెంటర్‌లో మోకాళ్లపై నడిచి, క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థి జేఏసీ నాయకులు రాయపాటి జగదీష్, వెంకటేశ్వర్లు, మహేష్, అశోక్, ఫ్రంట్ నాయకుడు రాజశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement