వారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు! నిన్నటి వరకు అధికార దర్పంతో దర్జా ఒలకబోసినవారే...కానీ ఆ క్రమంలో ప్రజలకు దూరమయ్యారు. క్షేత్రస్థాయిలో పట్టుకోల్పోయారు. ఉన్న కొద్దిపాటి ఆశలూ రాష్ట్ర విభజన నిర్ణయంతో ఆవిరయ్యాయి. రాజకీయ భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. వెంట ఉన్న నేతలు, కార్యకర్తలు జారుకుంటున్నారు. దాంతో జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే ఎన్నికల వరకు రాజకీయ రథాన్ని నెట్టుకువచ్చేందుకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ‘ఏదో ఉంది... తొందరపడొద్దంటూ’ మైండ్‌గేమ్‌కు తెరతీశారు. ఉనికి కోసం కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పాట్లూ... అగచాట్లూ ఇలా ఉన్నాయి.
అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న మాగుంట: రాజకీయ భవితవ్యంపై చీకట్లు ముసురుకుంటున్న తరుణంలో ఎంపీ మాగుంట కొత్త ఎత్తుగడ వేశారు. ‘సీఎం కిరణ్ అద్భుతం చేస్తారు... ఎవ్వరూ అధైర్యపడొద్దు... తొందరపడొద్దు... భవిష్యత్తుకు ఢోకా లేదు’అంటూ అరచేతలో వైకుంఠం చూపిస్తున్నారు. అందుకే ఒంగోలులో మంగళవారం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీఎం కిరణ్ నేతృత్వంలో రాజకీయ వ్యూహంతో తామంతా వెళుతున్నామని ఎంపీ మాగుంట చెప్పుకొచ్చారు. తమ దెబ్బకు అధిష్టానం దిగివస్తుందన్నారు. లేకపోతే సీమాంధ్ర సీనియర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులమంతా ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్యాపదేశంగా సీఎం కిరణ్ నాయకత్వంలో కొత్తపార్టీ పెడతామన్నట్టుగా సంకేతాలు ఇచ్చారు. తద్వారా కార్యకర్తలు ఎవ్వరూ జారిపోకుండా కట్టడి చేయాలన్నది ఆయన వ్యూహం. కానీ ఎంపీ మాగుంట వ్యూహం పూర్తిగా ఫలించలేదనే చెప్పాలి. ఇప్పటికే సీఎం కిరణ్‌కు వ్యతిరేకంగా సీమాంధ్ర సీనియర్ మంత్రులు ధ్వజమెత్తుతున్న విషయాన్ని కార్యకర్తలు ప్రస్తావించారు. అలాంటిది సీఎం కిరణ్ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఆయనతో నడిచేవారు ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టారు.
‘అదిగో... ఇదిగో’...ఎమ్మెల్యే సురేష్ కొత్త పల్లవి
పంచాయతీ ఎన్నికలతోనే చతికిలపడిపోయిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్ ప్రస్తుతం అంతర్మథనంలో పడిపోయారు. దాదాపుగా టీడీపీలో చేరేందుకు సిద్ధపడిపోయినా ఆయన కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిత్తరపోయారు. ఈలోగా టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన కూడా వాయిదా పడటం ఆయనకు కలసివచ్చింది. ఈ సమయంలో ఉన్న కొద్దిమంది కార్యకర్తలు జారిపోకుండా ఉండేందుకు కొత్త పల్లవి అందుకున్నారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని మెల్లగా చెబుతున్నారు. అదిగో అవకాశం వస్తోంది... ఇదిగో పిలుపు వస్తోంది అని వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లా నుంచి వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్లినా దానికి రాజకీయ రంగు పులుముతున్నారు. తద్వారా తాను ఏదో కీలక రాజకీయ మంతనాల జరుపుతున్నట్లు కార్యకర్తలు విశ్వసించాలన్నది ఆయన లక్ష్యం. అలా కార్యకర్తలను కొంతకాలం ఆశల పల్లకిలో ఊరేగించి తరువాత తన నిర్ణయం తాను తీసుకోవాలన్నది ఎమ్మెల్యే సురేష్ వ్యూహం.
‘అంతా మనోళ్లే కదా!’..
ఎమ్మెల్యే ఉగ్ర మాటల గారడీ
కనిగిరి నియోజకవర్గంలో కుదేలైపోయిన ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డి తీరు కూడా అదే విధంగా ఉంది. అందుకే తాను కీలక రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నానని ప్రచారం చేయించారు. అనంతరం వరుసగా రెండు రోజులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. విజయావకాశాలు ఉన్న రాజకీయ ప్రత్యమ్నాయ మార్గం ఆయనకు మూసుకుపోయింది. విధిలేని పరిస్థితుల్లో ఆయన టీడీపీతో మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. కానీ ఆ విషయాన్ని నేరుగా ప్రస్తావిస్తే ఉన్న కొద్దిమంది కార్యకర్తలు కూడా జారిపోతారని ఎమ్మెల్యే ఉగ్ర సందేహించారు. అందుకే ఏ విషయం కూడా చెప్పకుండా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ‘అంతా మనోళ్లే కదా!...మనకు ఎవరితోనూ విబేధాలు లేవు కదా!... మనల్ని ఎవరు కాదంటారు. నేను ఓ నిర్ణయం తీసుకుంటాను. మీరంతా నాతో ఉండండి. నేను చూసుకుంటాను’అని చెబుతూ కార్యకర్తల్లో ధైర్యం కల్పించేందుకు యత్నించారు. మాటలతో కనికట్టు చేస్తూ రాజకీయ భవిష్యత్తు కోసం ఏదో చేయనున్నాననే సంకేతాలు ఇచ్చారు. కానీ ఆయన మాటలు కార్యకర్తల్లో విశ్వాసాన్ని నింపలేకపోయాయనే చెప్పాలి. ఏం చేయనున్నారో చెప్పకుండా మాటలతో గారడీ చేస్తే తామెలా నమ్మేదని కొందరు సూటిగానే వ్యాఖ్యానించారు.
ఆమంచి ‘స్వతంత్ర’ మంత్రం
చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రూటే సెపరేటు. కాంగ్రెస్ పనైపోయిందని తేలిపోవడంతో ఆయన డైలామాలో పడ్డారు. వర్గబలం, కార్యకర్తల బలం పెద్దగా లేకపోయినప్పటికీ ప్రభుత్వ అండదండలతోనే ఇంతకాలం హవా చలాయిస్తున్నారు. కానీ ఆ ప్రభుత్వమే చరమాంకానికి చేరుకోవడంతో ఆమంచికి అంతా అగమ్యగోచరంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఆయన సరికొత్త ఎత్తు వేశారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని తన అనుచరుల ద్వారా ప్రచారంలోకి తీసుకువచ్చారు. కానీ ఆ ప్రచారాన్ని అటు ప్రజలుగానీ ఇటు కార్యకర్తలుగానీ ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో కంగుతిన్న ఆమంచి మళ్లీ సీఎం కిరణ్ నాయకత్వంలో పనిచేస్తామని చెబుతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి ప్రత్యేకవర్గంగా పోటీచేస్తామనే వాదాన్ని మెల్లగా ప్రచారంలోకి తీసుకువస్తున్నారు. ఇలా వారం పదిరోజులకో కొత్త ప్రచారంతో కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా అయోమయానికి గురిచేస్తున్నారు. అలా చేస్తేనే కార్యకర్తలు గందరగోళంలో పడిపోయి ఏమీ తేల్చుకోలేక తనతో ఉంటారన్నది ఆమంచి వ్యూహం.
‘అన్నా’... అన్నన్నా...! కాలం సాగదీద్దాం...
ఏ దారీ కనిపించకపోవడంతో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నేతగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తే ప్రజలు విశ్వసించరని ఆయనకు తెలుసు. అందుకే కొందరు ఎంపిక చేసినవారితో ఆయనే ఉద్యమాన్ని నడిపిస్తూ తాను కేంద్రబిందువుగా ఉండేలా జాగ్రత్తపడుతున్నారు. ప్రస్తుతం ఏం చెప్పినా కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరు. కాబట్టి రాజకీయ ముఖచిత్రం కొంత స్పష్టత సంతరించుకునే వరకు కాలం వెళ్లబుచ్చాలన్నది ఆయన ఎత్తుగడ. ఇవండీ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పాట్లు... అగచాట్లు! మునుముందు వారు మరెన్ని ఎత్తుగడలు వేస్తారో...! చూద్దాం...!
కార్యకర్తలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ మైండ్‌గేమ్
Published Thu, Oct 10 2013 7:23 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement