విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లాలో వరుసగా నాలుగో రోజు బుధవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు ఉద్యోగులు ససేమిరా అంటుండడంతో అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారు. అయితే అధికారులకు, ఉద్యోగులకు కుదిరిన ఒప్పందం ప్రకారం రాత్రి పూట విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అంగీకరించడం కొంత ఊరటనిచ్చే అంశం.
రాత్రి పూటే విద్యుత్..
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి పూట విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు విద్యుత్ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. పగలు కరెంట్ లేకపోవడంతో వ్యాపార వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఒంగోలు నగరంలో చిరువ్యాపారుల దగ్గర నుంచి బడా వ్యాపారుల వరకు విద్యుత్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ లేకపోవడంతో జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోందనీ, ఆయిల్ ఖర్చు తడిసి మోపడవుతోందనీ విచారం వ్యక్తం చేస్తున్నారు.
సెల్ టవర్లకూ తప్పని ఇబ్బంది
రోజుల తరబడి విద్యుత్ లేకపోవడంతో కొన్ని చోట్ల సెల్ టవర్లు పనిచేయక ఫోన్లు, ఇంటర్‌నెట్లు మూగబోతున్నాయి. ఈ-సేవ కేంద్రాలకూ ఇబ్బందులు తప్పడం లేదు. కరెంట్ లేక సర్వర్లు పనిచేయకపోవడంతో బిల్లులు కట్టించుకోలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు.
వ్యవసాయానికి తీవ్ర ఇబ్బందులు ...
జిల్లాలో ఈ సీజన్‌లో అధికంగా బోర్లపైనే ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తుంటారు. ప్రస్తుత సీజన్‌లో పొగాకు నారు మడులు, ఇటు వరి నారుమడులను విస్తృతంగా సాగు చేస్తున్నారు. పొగాకు రైతులు అధికంగా బోర్లపైనే ఆధారపడ్డారు. పగటి పూట పూర్తిగా విద్యుత్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరా లేక కొన్ని చోట్ల నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఆక్వా రైతులకు ఈ కష్టాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
పరిశ్రమలకూ తప్పని తిప్పలు: జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు, పాలింగ్ యూనిట్లతో పాటు, చిన్న తరహా పరిశ్రమలు వేల సంఖ్యలో ఉన్నాయి. పగటి పూట కరెంట్ లేకపోవడంతో ఈ పరిశ్రమలన్నీ పూర్తిగా మూతపడుతున్నాయి. పని లేక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం రాత్రిపూటే కరెంట్‌తో పరిశ్రమలు నిర్వహించడం కష్టమని కూలీలు, పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా నిలిచిన విద్యుత్ సరఫరా
Published Thu, Oct 10 2013 7:33 AM | Last Updated on Wed, Sep 5 2018 1:52 PM
Advertisement