విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతున్న మంత్రులు, అధికారులు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యోగుల ఆందోళనకు తెరపడింది. గురువారం తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను కూడా వారు ఉపసంహరించుకున్నారు. పే రివిజన్‌లో భాగంగా డిమాండ్ల సాధన కోసం గత నెల 27 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఉద్యోగులు ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని వెల్లడించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యుత్ ఉద్యోగులకు తెలిపారు.
విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు యాజమాన్యం, ఉద్యోగులు ఎంతో కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు, అధికారులు సూచించారు. అనామలీస్ ఉంటే సరిచేసి పేస్కేలును నిర్ధారించడానికి ఏపీజెన్‌కో ఎండీ నేతృత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా అంగీకారం కుదిరింది.
సింగిల్ మాస్టర్ స్కేల్ పీపీతో కలిపి రూ.2.60 లక్షలు, 8 శాతం ఫిట్‌మెంట్, ఒక డీఏ విడుదల, 12 వాయిదాల్లో బకాయిలు, వైద్య పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు దాటిన వారికి తప్పనిసరిగా పర్సనల్ పే, అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి 2018 స్కేల్ ప్రకారం జీతాలతో పాటు అదనంగా 2 శాతం పెంపునకు యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు.
ఈ మేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, జేఏసీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఒప్పందం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ చర్చల్లో సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, ఏపీజెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్దన్ రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ మల్లారెడ్డి, జేఏసీ నేతలు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికష్ణ, శేషారెడ్డి, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment