సమ్మె చీకట్లు
సాక్షి, ఏలూరు : విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో సోమవారం జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. జిల్లాలోని పరిశ్రమలకు ‘జీ రో వినియోగం’ ప్రకటించారు. అంటే పరిశ్రమలు ఒక్క యూనిట్ కూడా వాడటానికి వీల్లేదు. వ్యవసాయ రంగానికి 7 గంటల పాటు ఇవ్వాల్సిన వ్యవసాయ విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.
గృహాలకు సైతం అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో విడతలవారీగా పెద్దఎత్తున కోతలు విధించారు. ఏలూరు నగరంలో 6గంటలపాటు, పట్టణ కేంద్రాల్లో 8 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలచిపోయింది. మండల కేంద్రాలు, గ్రామాల్లో పూర్తిస్థాయిలో చీకట్లు అలుముకున్నాయి. ఇక్కడ కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ కోతలకు ఉక్కపోత తోడై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు సగానికిపైగా మూతపడ్డాయి.
విధులను బహిష్కరించిన ఉద్యోగులు
శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం విధులు బహిష్కరించి ఏలూరులోని ఈపీడీసీఎల్ జిల్లా కార్యాలయం విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనర్ తురగా రామకృష్ణ, కో-కన్వీనర్లు సుబ్బారావు, శ్రీనివాస్, మురళి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉదయం నుంచి విధులు బహిష్కరించారు. తమ కోర్కెలు తీరుస్తామని చెప్పిన యాజమాన్యం మోసపూరితంగా వ్యవహరించి చివరి నిమిషంలో చేతులెత్తేయడంతో సమ్మె చేపట్టక తప్పలేదని జేఏసీ కన్వీనర్ రామకృష్ణ అన్నారు.
ట్రాన్స్‌కో సీఎండీ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు. సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీఐ టీయూ నాయకులు ఆందోళనలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. సాయంత్రం వరకూ విద్యుత్ ఉద్యోగులు విధుల్లోకి వెళ్లలేదు. కార్యాలయం ఎదుటే బైఠాయించి ఆందోళన కొనసాగించారు.
ప్రజాగ్రహం
విద్యుత్ కోతలతో అల్లాడుతున్న ప్రజలు ఆ శాఖపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బుట్టాయగూడెం మండలం రామారావుపేట సెంటర్‌లోని విద్యుత్ సబ్‌స్టే షన్ వద్ద రైతులు, గిరిజనులు ధర్నా చేశారు.కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల సాయంతో...
కొవ్వూరు : విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో జిల్లాలోని ఆ శాఖ కార్యాలయాలు మూతపడ్డాయి. అన్ని విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ముందు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ స్టేషన్లలో కాంట్రాక్టు ఉద్యోగులు సేవలందిస్తున్నారు. సమ్మెను దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా మునిసిపల్ అధికారులు జనరేటర్లు సిద్ధం చేసుకున్నారు.