చీకట్‌లు
ఒంగోలు, న్యూస్‌లైన్: విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో జిల్లా మొత్తం సోమవారం అంధకారం అలుముకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత 12.30 గంటల సమయంలో ఒంగోలులో సగం నగరం కటిక చీకట్లోకి వెళ్లిపోయింది. ఒంగోలు ట్రంకురోడ్డుకు పశ్చిమం వైపు ఉన్న ప్రాంతమంతా అంధకారంగా మారిపోయింది. దాదాపు రెండున్నర గంటల తరువాత
విద్యుత్ పునరుద్ధరించారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఉదయం 5 గంటల సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయాన్నే ఆకాశం మేఘావృతమవడంతో పాటు..పెనుగాలులు వీచాయి. గాలులకు చాలా చోట్ల వైర్లు తెగిపోయాయి.అన్ని ధర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో సిబ్బంది సమ్మె కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. 11 వేల మెగావాట్లకుగాను కేవలం 6 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. దీంతో అధికారులు ఆఘమేఘాల మీద పరిశ్రమలకు సోమవారం పవర్‌హాలిడే ప్రకటించారు.
ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ వినియోగించి పరిశ్రమలు నడపవద్దని హెచ్చరించారు. జిల్లాలో 7.048 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉండగా..ఆదివారం అది 6.4 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. విద్యుత్ సమస్య నివారించేందుకు సెంట్రల్ పవర్ గ్రిడ్ నుంచి విద్యుత్ తీసుకునేందుకు అధికారులు యత్నిస్తుండగా..చాలాచోట్ల లోడ్ ఎక్కువై బ్రేక్‌డౌన్లు పెరుగుతున్నాయి. బ్రేక్‌డౌన్లు నివారించాలంటే విద్యుత్ సిబ్బంది సహకారం అవసరం. జిల్లాలో 98 శాతం మంది సమ్మెలో ఉండటంతో బ్రేక్‌డౌన్లు సరిచేయడం తలకు మించిన భారంగా మారింది.
ఒంగోలులో ఉదయం విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నా..రాత్రికి రోజూలాగే గంట కరెంటు కోత విధించారు. గ్రామాల్లో పరిస్థితి యధాతథంగా ఉంది. దీనిపై విద్యుత్ శాఖ ఎస్‌ఈ జయకుమార్‌ను వివరణ కోరగా..ధర్మల్ పవర్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం వల్ల పలు ప్రాంతాల్లో సమస్యగా మారిందన్నారు. అయినా సాధ్యమైనంత వరకు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.