విద్యుత్ ‘సమ్మె’ట!
సాక్షి, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. పీఆర్‌సీ అమలు చేసేవరకు విధులకు హాజర య్యేదిలేదంటూ ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రెండ్రోజులుగా కరెంటు ఉత్పత్తి నిలి చిపోవడంతో ఆ ప్రభావం సరఫరాపై పడింది. దీంతో సోమవారం గృహా అవసరాలకు విద్యుత్ కోతలు భారీగా విధించారు. అటు వాణిజ్య సరఫరాకు తీవ్ర అం తరాయం ఏర్పడింది. ఫలితంగా రోజువారీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. గృహ విద్యుత్ సరఫరాలో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు కోత పడగా.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సరఫరా నిలిచిపోయింది.
పరిశ్రమలు బంద్..
జిల్లాలో దాదాపు 25వేల పరిశ్రమలున్నాయి. వీటిలో 550 భారీ పరిశ్రమలు కాగా, మిగతావి మధ్య తరహా, కుటీర పరిశ్రమలు. తాజాగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో సోమవారం పలుచోట్ల పరిశ్రమలకు తాళాలు పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిరువ్యాపారులు సైతం ఇబ్బంది పడ్డారు. వారి రోజువారీ కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాలోని సాతంరాయి, గగన్‌పహాడ్, కాటేదాన్ పారిశ్రామికవాడల్లో త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పరిశ్రమల్లో ఉత్పత్తులు నిలిచిపోయాయి. కొన్ని పరిశ్రమలు మాత్రమే జనరేటర్ల సాయంతో నడిచాయి.
దీంతో పరిశ్రమల్లో పనిచేసే దినసరి కూలీలు ఇబ్బందులు పడ్డారు. పారిశ్రామికవాడలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడే పలు వ్యాపారాలు కూడా స్తంభించిపోయాయి. వేసవి కావడంతో మూడు నెలలుగా ప్రతి బుధవారం పరిశ్రమల్లో పవర్ కట్ కొనసాగుతోంది. ప్రస్తుతం విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా వారంలో మరో రోజు అదనంగా పరిశ్రమలను మూసివేయాల్సి రావడంపై పరిశ్రమల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సమస్యలు పరిష్కరించాలి: విద్యుత్ జేఏసీ
ఆలంపల్లి: విద్యుత్ ఉద్యోగులందరికీ వేతన సవరణ చేయాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని వికారాబాద్ విద్యుత్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు మధుసూదన్ డిమాండ్ చేశారు. సోమవారం వికారాబాద్ డివిజన్ కార్యాలయం ఎదుట అధికారులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు సమాన వేతనాలు ఇవ్వాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తూ 27.5 శాతం పీఆర్‌సీ ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విషయాలపై ఏప్రిల్ నెలలో మేనేజ్‌మెంట్‌తో చర్చలు జరిపామని, సమస్యలను పరిష్కరించేందుకు మేనేజ్‌మెంట్ ఒప్పుకుందని అన్నారు. ఈ నెల 21న అగ్రిమెంట్ చేసుకునేందుకు వెళితే మేనేజ్‌మెంట్ మాటమార్చిందని, అందుకే జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొంటున్నామని వెల్లడించారు. గవ ర్నర్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని, లేకుంటే అత్యవసర సేవలనూ నిలిపివేస్తామని వెల్లడించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల పరిధిలోని జేఏసీ నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యుత్ డీఈ సాంభశివరావు, డివిజన్ అధ్యక్షుడు నీలకంఠరావు, యూనియన్ నాయకులు జైసింగ్, బాల్‌రాజ్, బషీరుద్దీన్, గోపాలకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.