జనం విలవిల
చీకట్లో తడుముకుంటున్న వేళ కంట్లో నలుసు పడితే ఎలా ఉంటుంది? విద్యుత్ ఉద్యోగుల రెండురోజుల సమ్మెతో జనం పరిస్థితి అలాగే అయింది. అసలే వేసవి.. షరామామూలుగాకొరత, కోతతో అవస్థ పడుతున్న జనానికి ఉద్యోగుల ఆందోళన అదనపు కష్టాల్ని చవి చూపింది. సరఫరా అస్తవ్యస్తమై; కొరత ముమ్మరమై; కోతలు ఇతోధికమై.. ఇక్కట్లు మిక్కుటమయ్యాయి. కాగా సోమవారం అర్ధరాత్రి సమ్మె విరమించడంతో జనం ‘అమ్మయ్యా’ అనుకున్నారు.
సాక్షి, రాజమండ్రి : విద్యుత్తు ఉద్యోగుల రెండురోజుల సమ్మెతో ప్రజలు రెట్టింపు కరెంటు కష్టాల్ని చవి చూశారు. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుం డా గంటల తరబడి కరెంటు కోత విధించడం తో అన్ని వర్గాల వారూ విలవిలలాడారు. గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే పునరుద్ధరించే వారే లేరు. పట్టణాల్లోనూ అత్యవసర సేవలకు తప్ప సాధారణసేవలకు అంతరాయం కలిగితే పునరుద్ధరించ లేక పోయారు. సోమవారం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కరెంటు లేదు. ఇక రాత్రి ఆరు గంటల తర్వాత జిల్లావ్యాప్తంగా అంధకారం అలముకుంది. మరో పక్క జిల్లాలో పరిశ్రమలు మూతపడి, కోట్లాది రూపాయల ఉత్పత్తి నిలిచిపోయింది.
సమ్మెలో రెండోరోజైన సోమవారం ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లో ఉద్యోగులు సబ్‌స్టేషన్లు, డివిజన్ కార్యాలయాల ముందు ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ కార్యాలయం గేటు ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎలుగెత్తారు. పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకూ రాజమండ్రి సిటీ, రూరల్ పరిధిలో ఆరు గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారు. పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో ఉదయం 7.40 గంటల నుంచి రాత్రి వరకూ ఎనిమిది గంటలు కరెంటు లేదు.
రాజోలు, కొత్తపేట, అమలాపురం, రామచంద్రపురం పరిసర గ్రామాల్లో ఏడు గంటల అత్యవసర కోత విధించారు. ఇవి కాక ఉత్పత్తిలో లోటు ఏర్పడితే అర్ధరాత్రి కూడా కోత విధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. రిటైర్డు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సహాయంతో అత్యవసర సేవలు అందించగలిగినా సాధారణ సమస్యలను పట్టించుకోలేక పోయారు. దీంతో సరఫరాలో అవాంతరాలను తొలగించే వారు లేక ప్రజలు నానా అగచాట్లూ పడాల్సి వచ్చింది. కాగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మె విరమించారు.
పరిశ్రమలకు రూ.150 కోట్ల నష్టం
ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ జిల్లాలోని చిన్న మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ఉదయం మరింత కొరత ఎదురవడంతో తిరిగి పది గంటల నుంచి సాయంత్రం వరకూ నిలిపివేశారు. ప్రత్యామ్నాయ విద్యుత్తు సదుపాయం ఉన్న మధ్యతరహా పరిశ్రమలు తప్ప చిన్న పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. రెండు రోజుల విద్యుత్తు నిలిపివేతతో జిల్లాలో సుమారు రూ.150 కోట్లు నష్టపోయాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఉత్పత్తి కేవలం 800 మెగావాట్లే..
రాష్ట్రంలో 2500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉండగా సోమవారం కేవలం 800 మెగావాట్ల ఉత్పత్తే జరిగింది. బొగ్గు కొరతతో విజయవాడలోని థర్మల్ పవర్ హౌస్‌లోని ఒకటి నుంచి ఏడు యూనిట్లలో 710 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. రాయలసీమ పవర్ ప్లాంటులో 210, కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టులో 60 మెగావాట్ల ఉత్పత్తికి బొగ్గు కొరత వల్ల అంతరాయం కలిగింది.