ఏపీ ‘స్థానికత’ విద్యుత్ ఉద్యోగుల విభజన | AP 'localism' electricity Employees Division | Sakshi
Sakshi News home page

ఏపీ ‘స్థానికత’ విద్యుత్ ఉద్యోగుల విభజన

Published Thu, Jun 11 2015 4:22 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

ఏపీ ‘స్థానికత’ విద్యుత్ ఉద్యోగుల విభజన - Sakshi

ఏపీ ‘స్థానికత’ విద్యుత్ ఉద్యోగుల విభజన

తుది జాబితాలను వెల్లడించిన తెలంగాణ విద్యుత్ సంస్థలు
♦ ఆన్‌లైన్‌లో తెలంగాణేతర విద్యుత్ ఉద్యోగుల వివరాలు
♦సర్వీసు రికార్డు, నియామక ఉత్తర్వులు, పోలీసు నివేదికలే ప్రామాణికం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన చివరి అంకానికి చేరింది. ఆంధ్రప్రదేశ్ ‘స్థానికత’ కలిగిన ఉద్యోగుల తుది జాబితాలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు బుధవారం ప్రకటించాయి. సర్వీసు రికార్డు, నియామక ఉత్తర్వులు, పోలీసు విచారణ (యాంటిసిడెంట్)లను ప్రామాణికంగా తీసుకుని ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ ‘స్థానికత’ను తేల్చారు.

కొందరు ఉద్యోగుల రికార్డుల్లో స్థానికతపై భిన్న సమాచారం ఉన్నవారిని సైతం ఏపీ స్థానికులుగానే పరిగణనలోకి తీసుకున్నారు. పై మూడింటిలో ఏ ఒక్క రికార్డులోనైనా ఏపీకి సంబంధించి ఉంటే సదరు ఉద్యోగిని ఆ రాష్ర్ట ఉద్యోగిగానే తేల్చేశారు. ఈ జాబితాల ప్రకారం తెలంగాణ జెన్‌కోలో 522 మంది, టీ ట్రాన్స్‌కోలో 270 మంది, ఎస్పీడీసీఎల్‌లో 398 మంది, ఎన్పీడీసీఎల్‌లో 168 మంది కలిపి మొత్తం 1,358 మంది ఏపీ స్థానికత గల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ జాబితాలను ఆయా సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లో బుధవారం నుంచి అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలపై ఇంకా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
 
త్వరలో రిలీవ్ !
‘ఆర్డర్ టూ సర్వ్’ పద్ధతిలో ఉద్యోగులు ఏడాది కాలం వరకు ఏ రాష్ట్రంలోనైనా సేవలందించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 82 అనుమతిస్తోంది. ఇప్పటికే ఈ గడువు ముగిసిన నేపథ్యంలో తుది విభజన కోసం ఓ ‘ఉన్నత స్థాయి కమిటీ’ని దాదాపు 2 నెలల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టి.ట్రాన్స్‌కో జేఎండీ నర్సింగ్‌రావు నేతృత్వంలోని ఈ కమిటీ పలుమార్లు సమావేశమై ‘స్థానికత’ ఆధారంగానే ఉద్యోగుల తుది విభజన జరపాలని మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మార్గదర్శకాలను ఆమోదిస్తూ తెలంగాణ ఇంధన శాఖ ఈ నెల 6న ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణేతర ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మార్గదర్శకాల ప్రతిని ఏపీ విద్యుత్ సంస్థలకు సైతం పంపించారు. దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఏపీ నుంచి స్పందన రాలేదు. అయితే, కొంతమంది ఉద్యోగులు ఈ మార్గదర్శకాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.  
 
కేంద్రానికి చేరిన ‘విద్యుత్’ జగడం
విద్యుత్ ఉద్యోగుల విభజన జగడం కేంద్రానికి చేరింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏకపక్షమని, దీనిపై స్పందించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తాజాగా కేంద్రానికి లేఖ రాశారు. తమతో ఏమాత్రం చర్చించకుండానే వివాదాస్పదంగా విభజన, స్థానికతపై నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.
 
విధివిధానాలను మా ముందుంచండి
విద్యుత్ ఉద్యోగుల విభజనపై తెలంగాణ ఏజీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో టీఎస్ ట్రాన్స్‌కో రూపొందించిన విధివిధానాలను తమ ముందుంచాలని హైకోర్టు తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని బుధవారం ఆదేశించింది. వీటిని పరిశీలించాకనే తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ రూపొందించిన తుది జాబితాను రద్దు చేసి, తమను ఇప్పుడున్నచోటనే యథాతథంగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ పలువురు విద్యుత్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement