సాక్షి, న్యూఢిల్లీ : ధర్మాధికారి నివేదిక పేరుతో తమను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అన్యాయంగా కేటాయించారని ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రంకోర్టు బెంచ్ బుధవారం విచారించింది. ఏపీ రిలీవ్ చేసిన ఆంధ్ర ఉద్యోగుల తరపున సీనియర్ న్యాయవాది నరసింహ వాదనలు వినిపించారు. తాము ఏపీలో జన్మించి, విద్యను అభ్యసించి అక్కడే ఉద్యోగంలో చేరినా, తమను అక్రమంగా తెలంగాణకు కేటాయించి జీతాలు ఇవ్వడం నిలిపివేశారని కోర్టుకు నివేదించారు. చదవండి : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఏపీ వైశాల్యం, జనాభా, విద్యుత్ ఉత్పత్తిలో అధికమైనా ఉద్యోగులను మాత్రం తెలంగాణకు అధికంగా కేటాయించారని, ఈ నివేదికను తోసిపుచ్చాలని కోరారు. ఈ వాదనను ఏపీ విద్యుత్ సంస్థల సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వ్యతిరేకించారు. ధర్మాధికారి తుది నివేదికలో జోక్యం అవసరం లేదని అన్నారు. ఇక జస్టిస్ ధర్మాధికారి గత ఏడాది తుది నివేదిక ఇచ్చిన అనంతరం వివాదంతో సంబంధంలేని 584 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారని తెలంగాణ తరపు న్యాయవాదులు వివరించారు. ఇరుపక్షాల వాదనలను విన్న సర్వోన్నత న్యాయస్ధానం ఏపీ విద్యుత్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల అనంతరం విచారణను తిరిగి చేపడతామని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment