30 ఏళ్ల మా పోరాటం.. ధర్మమే గెలిచింది: మందకృష్ణ | manda krishna madiga reacts on supreme court sc st subclassification verdict | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల మా పోరాటం.. ధర్మమే గెలిచింది: సుప్రీం కోర్టు తీర్పుపై మందకృష్ణ

Published Thu, Aug 1 2024 11:46 AM | Last Updated on Thu, Aug 1 2024 1:06 PM

manda krishna madiga reacts on supreme court sc st subclassification verdict

న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై  మందకృష్ణ మాదిగ  స్పందించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని నిరూపితమైంది. ఈ పోరాటంలో చాలా మంది అసువులబాశారు. సుప్రీం కోర్టులో న్యాయం గెలిచింది. ఈ విజయం కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా అంకిభావంతో జాతి పోరాడింది. వర్గీకరణ పోరాటాన్ని నీరుగార్చుందుకు యత్నించారు. ఎస్సీ వర్గీకరణకు  తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు. ఈ తీర్పుతో తెలంగాణలో 11శాతం, ఆంధ్రప్రదేశ్‌లో ఏడు శాతం మాదిగలకు రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ వెంటనే చేయాలి. 

... విద్యాసంస్థల్లో కూడా వర్గీకరణకు అనుకూలంగా రిజర్వేషన్ చేయాలి. ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయి. కొంతమంది వెన్నుపోటు పొడిచారు. సమాజం యావత్తు మాదిగల వైపు నిలబడింది. ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు మా వైపు నిలబడ్డారు. న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం మా వైపు నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు. సమాజంలో పెద్దలు, మీడియాకు కృతజ్ఞతలు. అణగారిన వర్గాల వైపు, పేద వర్గాల వైపు న్యాయం నిలబడింది. ప్రధాన న్యాయమూర్తుల తో పాటు, ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు. మాకు అండగా నిలబడ్డ ప్రధాని మోదీ, అమిత్ షా, భుజాన వేసుకుని మా వైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో  అమలు చెయ్యాలి. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలి’’ అని అన్నారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • ఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసింది.
  • 2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్  జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారు.
  • వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు.
  • తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది.
  • వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా  కృతజ్ఞతలు చెబుతున్నా.
  • సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
  • ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్‌లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది.
  • ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తాం.

 

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్‌

  • మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది.
  • ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం.
  • మా పార్టీ అధినేత కేసీఆర్ గారు సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ ఇచ్చారు

 

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం: హరీష్ రావు మాజీ మంత్రి

  • గొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
  • ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది.
  • ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికి విదితమే.
  • ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారు.  
  • సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది
  • కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను.

ఎస్సీ వర్గీకరణ తీర్పు చారిత్రాత్మకం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  

  • దళితుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు ఈ తీర్పు చెంపపెట్టు
  • ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు
  • అట్టడుగునున్న వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం
  • 1997లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ తీర్మానం
  • హైదరాబాద్ ఎన్నికల సభలోనూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధాని ఉద్ఘాటన
  • ఎన్నికల అనంతరం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించాం
  • ఆ కమిటీ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
  • సుప్రీం తీర్పుతో కోట్లాది మంది దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది
  • మంద కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం కొనసాగిన 3 దశాబ్దాల పోరాటాలు ఫలించాయి
  • ఎస్సీ వర్గీకరణతో ఎవరికైనా నష్టం జరుగుతుందని భావిస్తే వారికి కేంద్రం న్యాయం చేసేందుకు సిద్ధం
  • కోర్టు తీర్పుపై అపార్ధాలకు తావివ్వకుండా దళితులంతా కలిసి మెలిసి ఉండాలని వేడుకుంటున్నా
  • రాజకీయ లబ్ది కోసం తీర్పును చిలువలు చేసి సమాజాన్ని చీల్చే కుట్రలు చేయొద్దని కోరుతున్నా

30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది: మంత్రి దామోదర రాజనర్సింహ
ఎస్సి, వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ‘అణగారిన వర్గాలకు న్యాయం జరిగింది. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచింది. మా ప్రభుత్వం ఎస్సిల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది. ఇన్ని ఏళ్ల ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారు’అన్నారు.

అసెంబ్లీ లాబీలో  మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి శుభాకాంక్షలు  తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు.

కడియం శ్రీహరి  కామెంట్లు..

  • అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలనే మా కల సాకారం అయింది.
  • సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పంపి అక్కడ అడ్వకేట్‌ను పెట్టారు.
  • అనుకూలమైన తీర్పు రావడానికి మా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర పాత్ర ఉంది.
  • ప్రతి ఒక్క దళిత  సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement