
మార్చి 3న వెలువడనున్న నోటిఫికేషన్
తెలంగాణ మండలిలో5 స్థానాలకు మార్చి 20న పోలింగ్
ఏపీలోని 5 స్థానాలకు కూడా అదేరోజు పోలింగ్.. కౌంటింగ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29న ఖాళీ అయ్యే ఈ స్థానాలకు గాను మార్చి 3న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అదే నెల 20న ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. అదేరోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. కాగా ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఇదే సమయంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది. మార్చి 24 లోపు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుందని తెలిపింది.
తెలంగాణలో మండలి ఎన్నికల సందడి
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల కోటా స్థానాలకు జరగనున్న ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది. మరోవైపు శానసమండలిలో ఎమ్మెల్యేల కోటాలో వచ్చే నెల 29న ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి సోమవారం షెడ్యూల్ విడుదలైంది. 40 మంది సభ్యులు ఉన్న శాసనమండలిలో 8 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండటంతో రాష్టంలో రాజకీయ సందడి జోరందుకుంది.
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముమ్మర ప్రచారం జరుగుతోంది. మంగళవారం చివరిరోజు కావడంతో పార్టీలు ఆఖరి నిమిషంలో చేయాల్సిన ప్రయత్నాలతో పాటు, పోలింగ్‌కు అవసరమైన సన్నద్ధత, ఓటర్లను ఆకర్షించే ఎత్తుగడలపై దృష్టి పెట్టాయి. ఇక ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయ్యే ఐదు స్థానాల్లో ఎవరికి ఎన్ని సీట్లు దక్కే అవకాశం ఉందనే దానిపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం వర్గాలో చర్చ జరుగుతోంది.
రిటైరవుతున్నది వీరే..
కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఎమ్మెల్యే కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు రిటైర్ అవుతున్నారు. వీరిలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, యెగ్గె మల్లేశం (ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు)తో పాటు ఎంఐఎంకు చెందిన మీర్జా రియాజుల్ హసన్ ఎఫెండీ ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు 24 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంటుంది.
అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 65, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ మూడు స్థానాలను సునాయాసంగా దక్కించుకునే అవకాశముంది.
మరోవైపు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న 28 మంది ఎమ్మెల్యేలతో ఒక ఎమ్మెల్సీ పదవి కచి్చతంగా దక్కుతుంది. ఐదో ఎమ్మెల్సీ పదవి ఎన్నికలో బీఆర్‌ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేలు, బీజేపీ శాసనసభ్యులు అత్యంత కీలకంగా మారనున్నారు. గతంలో బీఆర్‌ఎస్ మద్దతుతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ను దక్కించుకున్న ఎంఐఎం ప్రస్తుతం ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
టీచర్, గ్రాడ్యుయేట్ కోటా ఈ ముగ్గురు..
శాసనమండలిలో మార్చి 29న ఉపాధ్యాయ కోటాలో ‘మెదక్ –ఆదిలాబాద్– నిజామాబాద్ –కరీంనగర్’ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి (పీఆర్‌టీయూ), ‘వరంగల్– ఖమ్మం –నల్లగొండ’ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (స్వతంత్ర), పట్టభద్రుల కోటాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి (మెదక్– నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్) రిటైర్ అవుతున్నారు.
ఈ మూడు స్థానాల్లో ఎన్నికకు సంబంధించి ఈ నెల 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’పట్టభద్రుల స్థానంలో 56 మంది, ‘మెదక్ –నిజామాబాద్ –ఆదిలాబాద్– కరీంనగర్’ఉపాధ్యా య స్థానంలో 15, ‘వరంగల్ –ఖమ్మం– నల్లగొండ’ఉపాధ్యాయ స్థానంలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పట్టభద్రుల కోటా స్థానంలో కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు పోటీలో ఉండగా, బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉంది.
ఆగస్టులో మరొకటి ఖాళీ
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచి మండలికి ఎన్నికైన ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ఆగస్టు 6న పూర్తవుతోంది. బీఆర్‌ఎస్ నుంచి మండలికి ఎన్నికైన ప్రభాకర్ ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్నారు. గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ అయిన బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్, గోరటి వెంకన్న వచ్చే ఏడాది నవంబర్‌లో రిటైర్ అవుతారు.
మండలిలో స్థానిక సంస్థల కోటాలో 14 మంది సభ్యులకు గాను 2028లో ఏకంగా 12 మంది పదవీ కాలం పూర్తవుతుంది. మొత్తంగా 2027లో 9, 2028లో 14 మంది, 2029లో ఐదుగురు, 2030లో ఇద్దరేసి ఎమ్మెల్సీల చొప్పున రిటైర్ అవుతారు. ప్రస్తుతమున్న మండలి సభ్యుల్లో గవర్నర్ కోటాలో నామినేట్ అయిన అమేర్ అలీఖాన్ (కాంగ్రెస్), ప్రొఫెసర్ కోదండరాం (టీజేఎస్) ఆరేళ్ల పదవీ కాలం 2030లో పూర్తి చేసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment