సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి తుది నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు, అకౌంటెంట్స్ అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు, అసోసియేషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, దుష్యంత్ దవే, రాకేశ్ ద్వివేది, రంజిత్ కుమార్, వి.గిరి వాదనలు వినిపించారు. జస్టిస్ ధర్మాధికారి గతేడాది తుది నివేదిక ఇచ్చిన తర్వాత వివాదంతో సంబంధంలేని 584 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారని వీరు న్యాయస్థానానికి వివరించారు.
తుది నివేదిక ఇచ్చిన తర్వాత మూడు నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం, జనాభా, విద్యుత్ ఉత్పత్తిలో అధికమైనప్పటికీ ఉద్యోగులను తెలంగాణకు అధికంగా కేటాయించారని వివరించారు. ధర్మాధికారి తుది నివేదికను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ధర్మాధికారి నివేదిక పేరుతో తమను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అన్యాయంగా కేటాయించారని ఏపీ ఉద్యోగులు పిటిషన్ వేశారు. ఏపీ రిలీవ్ చేసిన ఉద్యోగుల పక్షాన సీనియర్ న్యాయవాదులు పి.ఎస్.నరసింహ, బాలసుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తాము ఏపీలో పుట్టి, అక్కడే చదువుకుని, అక్కడే ఉద్యోగంలో నియమితులైనా తమను అక్రమంగా తెలంగాణకు కేటాయించి జీతాలు ఇవ్వడం ఆపేశారని తెలిపారు. దీన్ని ఏపీ విద్యుత్ సంస్థల సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వ్యతిరేకించారు. ధర్మాధికారి తుది నివేదికలో జోక్యం అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ఏపీ విద్యుత్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది.
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం నోటీసులు
Published Thu, Aug 27 2020 5:30 AM | Last Updated on Thu, Aug 27 2020 5:30 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment