Telangana electricity companies
-
విద్యుత్ ఉద్యోగుల విభజనపై సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యోగుల విభజనకు సంబంధించి జస్టిస్ ధర్మాధికారి తుది నివేదికను సవాలు చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు, తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు, అకౌంటెంట్స్ అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తెలంగాణ విద్యుత్ సంస్థలు, అసోసియేషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, దుష్యంత్ దవే, రాకేశ్ ద్వివేది, రంజిత్ కుమార్, వి.గిరి వాదనలు వినిపించారు. జస్టిస్ ధర్మాధికారి గతేడాది తుది నివేదిక ఇచ్చిన తర్వాత వివాదంతో సంబంధంలేని 584 మంది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించారని వీరు న్యాయస్థానానికి వివరించారు. తుది నివేదిక ఇచ్చిన తర్వాత మూడు నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వైశాల్యం, జనాభా, విద్యుత్ ఉత్పత్తిలో అధికమైనప్పటికీ ఉద్యోగులను తెలంగాణకు అధికంగా కేటాయించారని వివరించారు. ధర్మాధికారి తుది నివేదికను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ధర్మాధికారి నివేదిక పేరుతో తమను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అన్యాయంగా కేటాయించారని ఏపీ ఉద్యోగులు పిటిషన్ వేశారు. ఏపీ రిలీవ్ చేసిన ఉద్యోగుల పక్షాన సీనియర్ న్యాయవాదులు పి.ఎస్.నరసింహ, బాలసుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తాము ఏపీలో పుట్టి, అక్కడే చదువుకుని, అక్కడే ఉద్యోగంలో నియమితులైనా తమను అక్రమంగా తెలంగాణకు కేటాయించి జీతాలు ఇవ్వడం ఆపేశారని తెలిపారు. దీన్ని ఏపీ విద్యుత్ సంస్థల సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వ్యతిరేకించారు. ధర్మాధికారి తుది నివేదికలో జోక్యం అవసరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు ఏపీ విద్యుత్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది. -
రాష్ట్రానికి మరో 71 మంది విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ నుంచి తెలంగాణకు మరో 71 మంది విద్యుత్ ఉద్యోగులను కేటాయిస్తూ జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ బుధవారం అనుబంధ నివేదికను విడుదల చేసింది. ఏపీ స్థానికత కలిగి ఉన్నారని పేర్కొంటూ ఐదేళ్ల కింద తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి ఏకపక్షంగా రిలీవ్ చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. ఈ వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు 502, ఏపీకు 655 మంది ఉద్యోగులను కేటాయిస్తూ గతేడాది డిసెంబర్ 26న తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ కేటాయింపులను సవాలు చేస్తూ ఏపీ విద్యుత్ సంస్థలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీం ఆదేశాల మేరకు మళ్లీ ధర్మాధికారి కమిటీ రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి తుది నివేదికకు అనుబంధంగా మరో నివేదికను బుధవారం ప్రకటించింది. జీవిత భాగస్వామి, అనారోగ్యం, శారీరక వైకల్యం తదితర కారణాలతో ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 71 మందిని తెలంగాణకు కేటాయిస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఈ నెల 30లోగా విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది. -
మీది కోర్టు ధిక్కారమే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన మార్గదర్శకాల రూపకల్పనకు 2 నెలల్లో కమిటీని ఏర్పాటు చేయాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనని తెలంగాణ, ఏపీ విద్యుత్ సంస్థలకు హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ధిక్కారానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చిచెప్పింది. వాదనలు విన్న తర్వాత ఎవరిది కోర్టు ధిక్కారమో తేలుస్తామని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు విద్యుత్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. గురువారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు అమలు కాలేదు.. తెలంగాణ విద్యుత్ సంస్థలు తమను స్థానికత ఆధారంగా విభజించడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యల్లో ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం, స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తీర్పునిచ్చింది. ఉద్యోగుల విభజన మార్గదర్శకాలను రూపొందించేందుకు ప్రస్తుతం ఉన్న జాయింట్ కమిటీని కొనసాగించాలని, లేదా కొత్త కమిటీని రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను, విద్యుత్ సంస్థలను ఆదేశించింది. విభజన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇప్పటికే రిలీవ్ చేసిన ఉద్యోగులను ఇతర ఉద్యోగులతో సమానంగా ఎలాంటి వివక్షకు తావు లేకుండా కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఈ తీర్పును తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలు అమలు చేయడం లేదంటూ పలువురు ఉద్యోగులు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారు. వీటి విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎస్.శ్రీనివాస్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇప్పటి వరకు అమలు కాలేదని తెలిపారు. వివక్ష చూపొద్దని చెప్పాం తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించామని, ఆగస్టు 27న సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, తమ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిందా అని ప్రశ్నించింది. లేదని ఉభయ పక్షాల న్యాయవాదులు చెప్పడంతో.. స్టే లేనప్పుడు సుప్రీంకోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లతో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. ‘ ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మీరు (ఉభయ రాష్ట్రాలు, విద్యుత్ సంస్థలు) మా ఆదేశాలను అమలు చేయలేదని అర్థమవుతోంది. ఎలాంటి వివక్షకు తావు లేకుండా వ్యవహరించాలని మేం స్పష్టమైన ఆదేశాలిచ్చాం. ధిక్కార పిటిషన్లను పరిశీలిస్తే మీరు (తెలంగాణ విద్యుత్ సంస్థలు) వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది కోర్టు ధిక్కారమే’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
తెలంగాణ బకాయిలతో నష్టపోతున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) తమకు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్కో) బుధవారం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు నివేదించింది. బకాయిలు అందక బొగ్గు సరఫరాదారులు, ఇతర రుణ దాతలకు సొమ్ము చెల్లించలేక పోతున్నామని.. బొగ్గు సరఫరా నిలిపేస్తామని సరఫరాదారులు హెచ్చరిస్తున్నారని వివరించింది. అదే జరిగితే ఏపీతోపాటు తెలంగాణపైనా ప్రభావం పడుతుందని.. ఇరురాష్ట్రాల ప్రజలకు ఇబ్బందికరమని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే తాము ఎన్సీఎల్టీని ఆశ్రయించామని, తమ దరఖాస్తును విచారణకు స్వీకరించాలని కోరింది. బకాయిలు చెల్లించలేదంటూ.. టీఎస్ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు తమకు రూ.5,732.40 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. దీనిపై నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని ఏపీ జెన్కో ఇటీవల ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. ఆ సంస్థలపై ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)’కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరింది. దీనిపై ఎన్సీఎల్టీ ఆదేశం మేరకు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు కౌంటర్లు దాఖలు చేశారు. ఈ కౌంటర్లకు ప్రతిగా తాజాగా ఏపీ జెన్కో రీజాయిండర్ దాఖలు చేసింది. బకాయిల చెల్లింపు విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు చెప్పిన లెక్కలను తోసిపుచ్చింది. తమకు రావాల్సిన వాటా గురించి ప్రత్యేకంగా లెక్కలు అవసరం లేదని, ప్రస్తుతమున్న ఒప్పందం తాలూకు గణాంకాలను పరిశీలిస్తే అన్నీ విషయాలు అర్థమవుతాయని పేర్కొంది. అంతేగాక ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాల్సి ఉందంటే తెలంగాణ విద్యుత్ సంస్థలు జారీ చేసిన పత్రికా ప్రకటనల్లోనూ పేర్కొన్నాయని వివరించింది. విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య వివాదాలను విద్యుదుత్పత్తి సంస్థల మధ్యకు తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని.. రాష్ట్ర విభజన సమస్యలకు, బకాయిల చెల్లింపునకు ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. -
ఏ రాష్ట్రానికీ కానివారైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు
10 రోజుల జీతాన్నే చెల్లించనున్న టీ సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవైన ఏపీ విద్యుత్ ఉద్యోగులు ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ కానివారయ్యారు. జూన్ నెలకు సంబంధించిన జీత భత్యాలను ఏ రాష్ట్రం నుంచి పొందాలో తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 1,251 మంది ఏపీ ఉద్యోగులను ఈ నెల 9, 10 తేదీల్లో తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగులు ఈ నెలలో పనిచేసిన 10 రోజుల కాలానికి సంబంధించిన జీతభత్యాలను మాత్రమే జూలై నెలలో చెల్లించాలని తెలంగాణ విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. రిలీవ్ ఆర్డర్లు జారీ చేయకముందే ఏపీ ఉద్యోగులు కోర్టుకు వెళ్లడం వల్ల మళ్లీ వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకునే ప్రసక్తే లేదని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఏపీ ప్రభుత్వం సైతం ఈ ఉద్యోగులను విధుల్లో తీసుకోవడంలో విముఖత చూపింది. తెలంగాణ విద్యుత్ సంస్థల విభజన మార్గదర్శకాలు, రిలీవ్ ఉత్తర్వులను హైకోర్టు సింగిల్‌బెంచ్ నిలుపుదల చేసింది. ఈ నిర్ణయంపై డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు వారాల సమయం కోరింది. మళ్లీ ఈ అంశంపై హైకోర్టులో ఓ నిర్ణయం వెల్లడైతేనే ఏపీ ఉద్యోగుల భవితవ్యం తేలే అవకాశముంది. తెలంగాణ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడం, దానిపై ఏపీ ఉద్యోగులు, ప్రభుత్వం కౌంటర్ వేయడం, నిర్ణయం వచ్చే సరికి ఏపీ ఉద్యోగులు జూలై నెల జీతాన్ని సైతం కోల్పోయే ప్రమాదముంది.