సాక్షి, హైదరాబాద్: ఏపీ నుంచి తెలంగాణకు మరో 71 మంది విద్యుత్ ఉద్యోగులను కేటాయిస్తూ జస్టిస్ ధర్మాధికారి ఏకసభ్య కమిటీ బుధవారం అనుబంధ నివేదికను విడుదల చేసింది. ఏపీ స్థానికత కలిగి ఉన్నారని పేర్కొంటూ ఐదేళ్ల కింద తెలంగాణ విద్యుత్ సంస్థలు 1,157 మంది విద్యుత్ ఉద్యోగులను ఏపీకి ఏకపక్షంగా రిలీవ్ చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ముదిరింది. ఈ వివాద పరిష్కారం కోసం సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ధర్మాధికారి కమిటీ రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో తెలంగాణకు 502, ఏపీకు 655 మంది ఉద్యోగులను కేటాయిస్తూ గతేడాది డిసెంబర్ 26న తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.
ఈ కేటాయింపులను సవాలు చేస్తూ ఏపీ విద్యుత్ సంస్థలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీం ఆదేశాల మేరకు మళ్లీ ధర్మాధికారి కమిటీ రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి తుది నివేదికకు అనుబంధంగా మరో నివేదికను బుధవారం ప్రకటించింది. జీవిత భాగస్వామి, అనారోగ్యం, శారీరక వైకల్యం తదితర కారణాలతో ఏపీ నుంచి తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 71 మందిని తెలంగాణకు కేటాయిస్తున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఈ నెల 30లోగా విద్యుత్ ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సుప్రీం కోర్టు తీర్పు ఉల్లంఘించినట్లేనని స్పష్టం చేసింది.
రాష్ట్రానికి మరో 71 మంది విద్యుత్ ఉద్యోగులు
Published Thu, Mar 12 2020 2:08 AM | Last Updated on Thu, Mar 12 2020 2:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment