
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్‌పీడీసీఎల్), ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) తమకు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్‌కో) బుధవారం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు నివేదించింది. బకాయిలు అందక బొగ్గు సరఫరాదారులు, ఇతర రుణ దాతలకు సొమ్ము చెల్లించలేక పోతున్నామని.. బొగ్గు సరఫరా నిలిపేస్తామని సరఫరాదారులు హెచ్చరిస్తున్నారని వివరించింది. అదే జరిగితే ఏపీతోపాటు తెలంగాణపైనా ప్రభావం పడుతుందని.. ఇరురాష్ట్రాల ప్రజలకు ఇబ్బందికరమని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే తాము ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించామని, తమ దరఖాస్తును విచారణకు స్వీకరించాలని కోరింది.
బకాయిలు చెల్లించలేదంటూ..
టీఎస్‌ఎన్పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లు తమకు రూ.5,732.40 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. దీనిపై నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని ఏపీ జెన్‌కో ఇటీవల ఎన్‌సీఎల్‌టీకి ఫిర్యాదు చేసింది. ఆ సంస్థలపై ‘ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ కోడ్ (ఐబీసీ)’కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరింది. దీనిపై ఎన్‌సీఎల్‌టీ ఆదేశం మేరకు ఎన్పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్‌లు కౌంటర్లు దాఖలు చేశారు. ఈ కౌంటర్లకు ప్రతిగా తాజాగా ఏపీ జెన్‌కో రీజాయిండర్ దాఖలు చేసింది.
బకాయిల చెల్లింపు విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు చెప్పిన లెక్కలను తోసిపుచ్చింది. తమకు రావాల్సిన వాటా గురించి ప్రత్యేకంగా లెక్కలు అవసరం లేదని, ప్రస్తుతమున్న ఒప్పందం తాలూకు గణాంకాలను పరిశీలిస్తే అన్నీ విషయాలు అర్థమవుతాయని పేర్కొంది. అంతేగాక ఏపీ జెన్‌కోకు బకాయిలు చెల్లించాల్సి ఉందంటే తెలంగాణ విద్యుత్ సంస్థలు జారీ చేసిన పత్రికా ప్రకటనల్లోనూ పేర్కొన్నాయని వివరించింది.
విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య వివాదాలను విద్యుదుత్పత్తి సంస్థల మధ్యకు తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని.. రాష్ట్ర విభజన సమస్యలకు, బకాయిల చెల్లింపునకు ముడిపెట్టడం సరికాదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment