Coal supply
-
బొగ్గుకు బకాయిలేం లేవు.!
సాక్షి, అమరావతి: అవే పైత్యపు కథనాలు.. నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు.. విలువలు లేకుండా అడ్డగోలుగా అచ్చేస్తున్న అవాస్తవాల పరంపరలో మరో నీతిమాలిన వార్తను రామోజీరావు ‘బొగ్గు రాదు.. బకాయిలే కారణం’ శీర్షికతో ఈనాడులో వండివార్చారు. కళ్లముందు నిజాలు కనిపిస్తున్నా.. టీడీపీ హయాంలో బొగ్గు సేకరణ ఇప్పటి కన్నా తక్కువే ఉన్నా ఆ నిజాన్ని దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు ఆ కథనంలో విశ్వప్రయత్నం చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసిన కంపెనీలకు ఇంధన సరఫరా ఒప్పందాల (ఫ్యూయల్ సప్లయి అగ్రిమెంట్స్–ఎఫ్ఎస్ఏ) ప్రకారం సకాలంలో బకాయిలు చెల్లిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యుదుత్పాదక సంస్థ (ఏపీజెన్కో) మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఈనాడు కథనంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ‘సాక్షి’కి ఏపీజెన్కో ఎండీ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ‘ఎఫ్ఎస్ఏ’ ప్రకారం సకాలంలో చెల్లింపులు మహానది కోల్ ఫీల్డ్స్ (ఎంసీఎల్)కు ఏపీజెన్కో సెప్టెంబర్‌లో రూ. 554.57 కోట్ల బకాయిలు చెల్లించింది. గడువులోగా చెల్లించాల్సిన బకాయిలు ఏమీలేవు. సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు చెల్లింపులకు ‘బిల్ ఆఫ్ ఎఎక్స్చేంజ్’ విధానం వల్ల ఆ సంస్థకు పెండింగ్ బకాయిలు లేవు. ఎస్సీసీఎల్, ఎంసీఎల్ నుంచి ఎఫ్ఎస్ఏ ప్రకారం ఏపీజెన్కో బొగ్గు సేకరిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం నిర్ణీత గడువులో బకాయిలు చెల్లిస్తోంది. ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా పెరిగిన విద్యుత్ డిమాండ్ మేరకు బొగ్గు సరఫరా కానందున అన్ని రాష్ట్రాలు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. పైగా నైరుతీ రుతుపవనాల సీజన్లో బొగ్గు తవ్వకాలకు అంతరాయం కలిగింది. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన ఏపీజెన్కో వారం వారం జరిగే కేంద్ర ఉపసంఘం సమీక్షల్లో, ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ (ఐఎంసీ) సమావేశాల్లో బొగ్గు సరఫరా పెంచాలని పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తోంది. ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుకోవడానికి, పెరిగిన ఏపీ గ్రిడ్ డిమాండ్ మేరకు విద్యుదుత్పత్తి పెంచేందుకు ఏపీజెన్కో ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే అదనపు బొగ్గు సేకరణ కోసం కోల్ కంపెనీలతో నిత్యం సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుత బొగ్గు కొరత పరిస్థితుల్లో సైతం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్) ఎఫ్ఎస్ఏ లక్ష్యంలో 95.67 శాతం మేరకు బొగ్గును ఏపీ జెన్కో సేకరించగలగడం విశేషం. టీడీపీ అధికారంలో ఉన్న 2018 ఇదే కాలంలో ఒప్పందంలోని 81.02 శాతం బొగ్గు మాత్రమే సేకరించడం గమనార్హం. పెరిగిన విద్యుత్ ఉత్పత్తికి తగ్గట్టు ప్రణాళిక ఈ ఏడాది విద్యుత్ ఉత్పత్తి పెరిగినందున ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం కూడా పెరిగింది. మరోవైపు ఏపీజెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 75 శాతం పవర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు, థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పెంచుకునేందుకు, బొగ్గు నిర్వహణ యూనిట్‌ను ఏపీజెన్కో పటిష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకుని లక్ష్యాల సాధన దిశగా ముందుకెళుతోంది. జెన్కోను దెబ్బతీసింది చంద్రబాబే చంద్రబాబు హయాంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలను బలవంతంగా మూసివేయడం వల్ల ఏపీ జెన్కోకు భారీ నష్టం వాటిల్లింది. నాసిరకం బొగ్గును అధిక ధరకు గత టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాగ్ సైతం ఈ విషయాన్ని బయటపెట్టింది. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్), రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం (ఆర్టీపీపీ) 2011–12లో 22.235 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయి. కానీ 2015–16 నాటికి విద్యుదుత్పత్తి 19.359 మిలియన్ యూనిట్లకు పడిపోయింది. దీనివల్ల విద్యుదుత్పత్తి ధర యూనిట్‌కు రూ. 2.94 నుంచి రూ. 4.34కు పెరిగింది. బలవంతంగా మూసివేయడం వల్ల ఆ రెండు విద్యుత్ కేంద్రాలకు రూ. 675.69 కోట్లు నష్టం వాటిల్లింది. మహానది కోల్ లిమిటెడ్ (ఎంసీఎల్) బొగ్గు సరఫరా చేయడం లేదనే సాకు చూపి 2014 జూలైలో 26.61 లక్షల మిలియన్ టన్నుల బొగ్గును, 2015–16లో ఎలాంటి అవగాహనా ఒప్పందం కుదుర్చుకోకుండానే 63.5 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి నుంచి ప్రీమియం ధరకు టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014 నుంచి 2016 వరకూ కోల్ ఎనాలిసిస్ నివేదికలు, కోల్ ఇన్వాయిస్లను సమీక్షిస్తే జెన్కో కొనుగోలు చేసిన బొగ్గు నాణ్యతలో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. నాణ్యతలేని రూ. 3,179.32 కోట్ల విలువైన 86.02 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును అధిక ధరను కొనుగోలు చేయడం వల్ల జెన్కోకు రూ. 918.61 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కాగ్ తేల్చింది. అప్పట్లో విదేశీ బొగ్గునూ నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థలను ముందు పెట్టి తెరవెనుక కోల్‌మాఫియా చక్రం తిప్పింది. రూ. 500 కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యింది. -
విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తగినన్ని బొగ్గు నిల్వలు ఉండేలా ప్రతీరోజూ బొగ్గు రవాణా చేస్తున్నామని, కొరత ఏర్పడే ప్రసక్తే లేదని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ స్పష్టం చేశారు. తమ గనుల నుంచి లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాకు పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రోజుకు లక్షా 90 వేల టన్నుల బొ గ్గు రవాణా చేస్తున్నామని, నవంబర్ నుంచి రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కేంద్రబొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన లక్ష్యాల మేరకు ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సంస్థ డెరైక్టర్లు, ఏరియా జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి పెంపుపై సమీక్ష నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రానివ్వబోమని స్పష్టం చేశారు. -
తెలంగాణలో బొగ్గు కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం 5 రోజుల కు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం లేదని సింగరేణి బొగ్గు గనుల సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ స్పష్టంచేశారు. సింగరేణితో ఒప్పందం చేసుకున్న అన్ని రాష్ట్రాల థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాల మేరకు బొగ్గు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం ఇక్కడి సింగరేణి భవన్లో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన చర్యలు, వర్షాలు తగ్గుముఖం పట్టినందున నిర్దేశిత లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించే విషయంలో దిశానిర్దేశం చేశారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పెంచడంలో ఏరియాలకు ఎదురవుతున్న ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై డెరైక్టర్లు అన్ని ఏరియాల జీఎంలకు మార్గనిర్దేశం చేశారు. ఒప్పందం ఉన్న ప్లాంట్లకు సరఫరా.. సింగరేణితో ఒప్పందం చేసుకున్న తెలంగాణ జెన్కో థర్మల్ ప్లాంట్లతో పాటు ముద్దనూరు(ఏపీ జెన్కో), పర్లీ(మహారాష్ట్ర జెన్కో) రాయచూర్ కేపీసీఎల్ (కర్ణాటక), మెట్టూర్ టాన్ జెడ్కో (తమిళనాడు), రామగుండం ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి రోజూ ఉత్పత్తి చేసే బొగ్గు లో 1.5 లక్షల టన్నులను (86 శాతం) థర్మల్ కేంద్రాలకే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. -
విద్యుత్‌ను పొదుపుగా వాడండి
సాక్షి, అమరావతి: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొన్న కారణంగా మన రాష్ట్రంపైన కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యుత్ సంస్థలకు సహకరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడు విద్యుత్ పొదుపుపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీక్ అవర్స్‌గా పిలుచుకునే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీల వంటి పరికరాల వాడకం తగ్గించుకోవాలన్నారు. ఈ మేరకు విజయవాడలో శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారమందించాలి.. బొగ్గు కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు. వాటికి ఓఎన్జీసీ, రిలయెన్స్ నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే బొగ్గు కొనుగోలు ధరలు, విద్యుత్ మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినందున రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పడిపోయిన జెన్కో ఉత్పత్తి.. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగింది. ఒకవేళ కోవిడ్ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్ ఏపీ జెన్కో ద్వారా అందుతోంది. ప్రస్తుతం జెన్కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్ ఉత్పత్తి 25 మిలియన్ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా.. కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి.. రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా ఈ నెల 8 నుంచి యూనిట్ సగటు ధర రూ.15కు పెరిగింది. ఇండోనేషియా నుంచి సరఫరా అయ్యే బొగ్గు ఏప్రిల్‌లో టన్ను 86.68 డాలర్లుండగా ఇప్పుడు 162 డాలర్లు అయ్యింది. మనరాష్ట్రంలో ఉన్న 5 వేల మెగావాట్ల థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. జెన్కో ప్లాంట్లకి రోజుకు 70,000 టన్నుల బొగ్గు అవసరం. గత నెలలో 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులో ఉంది. కేంద్రాన్ని కోరాక అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు చేరింది. 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.. బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం నిల్వలు పెంచుతాయి. ఈ నేపథ్యంలో 2022 కోసం రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అలాగే దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేని కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేసిన కొన్ని ప్లాంట్లలో వెంటనే తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించాం. విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసింది. దాదాపు రూ.34,340 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుకే రూ.9,165 కోట్లు చెల్లించింది. మార్చి 2019 నాటికి రూ.27,239 కోట్లు ఉన్న విద్యుత్ సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ.27,552 కోట్ల వద్దనే నిలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించేసింది. బొగ్గు కొరత సంక్షోభం ప్రభావం విద్యుత్ రంగంపై తాత్కాలికమేనని భావిస్తున్నాం. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తాయి. -
బొగ్గు సంక్షోభం తీవ్రం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత, ధరలు విపరీతంగా పెరగడం మన దేశంపైనా ప్రభావం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బొగ్గు కొరత మొదలైంది. పలు రాష్ట్రాల్లో థర్మల్ విద్యుదుత్పత్తి నిలిచిపోయి, అంధకారం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి విద్యుత్ సరఫరా చేసే థర్మల్ ప్లాంట్లలో కేవలం ఒక్క రోజుకు సరిపడానే బొగ్గు నిల్వలు ఉన్నాయని.. తక్షణమే బొగ్గు సరఫరా జరగకుంటే ఢిల్లీలో చీకట్లు అలముకుంటాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ శనివారం కేంద్రానికి లేఖ రాశారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 110 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిల్లో సగటున 4 రోజుల విద్యుదుత్పత్తికి సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయి. బొగ్గు లేకపోవడంతో శనివారం పలు రాష్ట్రాల్లోని 16 ప్లాంట్లలో (మొత్తం 16,880 మెగావాట్ల సామర్థ్యం) విద్యుదుత్పత్తి జరగలేదు. సింగరేణి నుంచి తరలింపు సింగరేణి సంస్థ రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరాను తగ్గించి.. ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లకు మళ్లిస్తోంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుత అవసరాలకు మించి బొగ్గును నిల్వ ఉంచడానికి బదులు.. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయే స్థితిలో ఉన్న ప్లాంట్లకు సరఫరా చేస్తున్నారు. అయితే సింగరేణికి తొలి ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రమేనని.. ఇక్కడి అవసరాలు తీరాకే ఇతర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తున్నామని సింగరేణి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో బొగ్గు కొరత ఉన్నా.. రాష్ట్రంలోని ప్లాంట్లకు కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో 4 రోజులకు సరిపడానే.. బొగ్గు కొరత ప్రభావం తెలంగాణపైనా పడింది. రాష్ట్రంలోని జెన్కో, సింగరేణి, ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సాధారణంగా 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ప్రస్తుతం నాలుగైదు రోజులకు సరిపడా నిల్వలే ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. 810 మెగావాట్ల భద్రాద్రి టీపీపీ, 1,000 మెగావాట్ల కొత్తగూడెం టీపీఎస్(న్యూ), 2,600 మెగావాట్ల ఎన్టీపీసీ రామగుండం, 1,200 మెగావాట్ల సింగరేణి టీపీపీ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు 4 రోజులకే సరిపోతాయని పేర్కొంటున్నాయి. పిట్‌హెడ్ (బొగ్గు గనులకు సమీపంలో ఉన్న) ప్లాంట్లలో 5 రోజులకన్నా తక్కువకు సరిపడా బొగ్గు నిల్వలే ఉంటే ‘ఆందోళనకర (క్రిటికల్)’ పరిస్థితిగా పరిగణిస్తారు. రాష్ట్రంలోని జెన్కో, ఎన్టీపీసీ, సింగరేణి ప్లాంట్లలో సజావుగా విద్యుదుత్పత్తి జరగడానికి రోజుకు 96 వేల టన్నుల బొగ్గు అవసరం. అంటే 15 రోజుల అవసరాలకు కనీసం 14.37 లక్షల టన్నుల బొగ్గు నిల్వ ఉండాలి. ప్రస్తుతం 5.92 లక్షల టన్నులే ఉన్నట్టు సీఈఏ తమ వెబ్సైట్లో పేర్కొంది. ‘పిట్‌హెడ్’ కాబట్టి ఇబ్బంది లేదు! బొగ్గు గనులకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటే ‘పిట్‌హెడ్’ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు అంటారు. ఈ ప్లాంట్లకు బొగ్గు రవాణా చేసేందుకయ్యే వ్యయం, పట్టే సమయం తక్కువగా ఉంటుంది. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంటు తప్పిస్తే.. మిగతా థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నీ ‘పిట్‌హెడ్’ ప్లాంట్లే. సింగరేణి గనులకు సమీపంలో ఉండటంతో వీటికి బొగ్గు రవాణా తక్కువ సమయంలో జరుగుతుంది. అందువల్ల ఈ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గినా ఆందోళన అవసరం లేదని, అవసరమైతే తక్షణమే బొగ్గు సరఫరా చేయగలమని సింగరేణి అధికారులు చెప్తున్నారు. కొరత ఎందుకంటే? కరోనా మహమ్మారి, లాక్డౌన్ల అనంతరం ఇప్పుడిప్పుడే అన్ని రంగాలు కుదుటపడుతున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు పుంజుకోవడం, ఇతర రంగాలు కూడా సాధారణ స్థితికి చేరుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. దీనితో విద్యుదుత్పత్తికి వినియోగించే బొగ్గుకు సైతం డిమాండ్ పెరిగి కొరత ఏర్పడింది. పొరుగుదేశం చైనాలో వారం, పది రోజులుగా తీవ్ర బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి పరిశ్రమలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాదితో పోల్చితే అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు రెట్టింపునకు పైగా పెరిగాయి. మన దేశంలోనూ విద్యుత్ డిమాండ్ పెరిగి బొగ్గు కొరత వచ్చింది. -
దక్షిణ మధ్య రైల్వే జీఎంతో జెన్కో సీఎండీ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర జెన్కో కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకరరావు బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మ్యాతో భేటీ అయ్యారు. సరుకు రవాణాలో అత్యధిక రికార్డు సాధించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగులు, అధికారుల బృందాన్ని, తెలంగాణలోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో జోన్ ఇస్తున్న సహకారాన్ని ప్రభాకరరావు ప్రశంసించారు. ఇదే విధమైన సహకారాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా దక్షిణ మధ్య రైల్వే కొనసాగిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణలోని మణుగూరు భద్రాద్రి పవర్‌ప్లాంట్, విష్ణుపురం యాదాద్రి పవర్‌ప్లాంట్, భూపాలపల్లి పవర్‌ప్లాంట్ వంటి విద్యుత్ ఉత్పాదక కేంద్రాల అనుసంధానంపై వారిద్దరూ చర్చించారు. ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎన్.మధుసూదనరావు, చీఫ్ ఫ్రైట్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్ బి.నాగ్యతో కూడా ప్రభాకరరావు సమావేశమై సరుకు రవాణాలో విశేషమైన రికార్డు సాధించినందుకు వారిని అభినందించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ నుండి దక్షిణ మధ్య రైల్వే రవాణా సౌకర్యం ద్వారా తెలంగాణ రాష్ట్ర జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు గత సంవత్సరం 2,969 రేక్ బొగ్గు సరఫరా చేస్తే, ఈ సంవత్సరం 3,194 రేక్ బొగ్గును సరఫరా చేసింది. అంటే గత ఏడాది కంటే 225 రేక్‌లు అధికం. తెలంగాణలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేను అనుసంధానించే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభాకరరావు కోరారు. వేసవిలో పెరిగే విద్యుత్ డిమాండ్ దృష్ట్యా, పాల్వంచ వద్ద కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణ ప్రణాళికకు అనుగుణంగా సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి అవసరమైన బొగ్గును పంపడానికి సరిపడినన్ని రేక్‌లను సరఫరా చేయాలని రైల్వే ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. -
21 కి.మీ. రైలు మార్గం.. 44 కి.మీ. వాటర్ పైపు లైన్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి సంస్థ సుమారు రూ.766 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు భారీ నిర్మాణాలను ప్రారంభించేందుకు ఆ సంస్థ చురు గ్గా ఏర్పాట్లు చేస్తోంది. మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాకు అవసరమైన 21 కి.మీ రైలుమార్గం, రెండు టీఎంసీల నీటి సరఫరాకు సంబంధించి 44 కి.మీ పొడవైన పైపులైన్లను సింగరేణి సంస్థ నిర్మించింది. ఈ రెండు నిర్మాణాలను ఈ నెల 15న ట్రయల్‌రన్‌తో ప్రారంభించనున్నారు. ఈమేరకు ఆ సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ మీడియాకు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంపై జరిగిన సమీక్షలో కొత్త నిర్మాణాల ట్రయల్ రన్‌కు సంబంధించి అధికారులతో చర్చించారు. ఏటా రూ.50లక్షల టన్నుల బొగ్గు సరఫరా కొత్తగా ప్రారంభించనున్న రైలు మార్గం ద్వారా ఏడాదికి అవసరమైన రూ.50 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనున్నారు. రూ.460 కోట్లతో రెండున్నరేళ్లలోనే ఇంత పొడవైన రైలు మార్గాన్ని నిర్మించారు. ఈ రైల్వే లైనుతో పాటు లోడింగ్, అన్ లోడింగ్ వద్ద సైడింగ్ తదితరాలకు మరో 20 కి.మీ. పొడవుగల రైలు మార్గాన్ని నిర్మించారు. రూ.306 కోట్లతో పైపులైను సింగరేణి సంస్థ రూ. 306 కోట్లతో 44 కి.మీ. పొడవైన పైపులైను ద్వారా ప్రాణహిత నది నుంచి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. నీటి పంపింగ్ కోసం దేవులవాడ వద్ద 1,050 కిలోవాట్ల సామర్థ్యంతో మూడు పంపులను, మార్గమధ్యంలో చెన్నూరు వద్ద 1,200 కిలోవాట్ల సామర్థ్యంగల మరో మూడు పంపులు ఏర్పాటు చేశారు. వీటితో గంటకు సగటున ఏడు వేల క్యూబిక్ మీటర్ల నీటిని తీసుకునే అవకాశం ఉంది. -
తెలంగాణ బకాయిలతో నష్టపోతున్నాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్), ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) తమకు బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఏపీజెన్కో) బుధవారం జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు నివేదించింది. బకాయిలు అందక బొగ్గు సరఫరాదారులు, ఇతర రుణ దాతలకు సొమ్ము చెల్లించలేక పోతున్నామని.. బొగ్గు సరఫరా నిలిపేస్తామని సరఫరాదారులు హెచ్చరిస్తున్నారని వివరించింది. అదే జరిగితే ఏపీతోపాటు తెలంగాణపైనా ప్రభావం పడుతుందని.. ఇరురాష్ట్రాల ప్రజలకు ఇబ్బందికరమని స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే తాము ఎన్సీఎల్టీని ఆశ్రయించామని, తమ దరఖాస్తును విచారణకు స్వీకరించాలని కోరింది. బకాయిలు చెల్లించలేదంటూ.. టీఎస్ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు తమకు రూ.5,732.40 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని.. దీనిపై నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదని ఏపీ జెన్కో ఇటీవల ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. ఆ సంస్థలపై ‘ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ)’కింద దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరింది. దీనిపై ఎన్సీఎల్టీ ఆదేశం మేరకు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు కౌంటర్లు దాఖలు చేశారు. ఈ కౌంటర్లకు ప్రతిగా తాజాగా ఏపీ జెన్కో రీజాయిండర్ దాఖలు చేసింది. బకాయిల చెల్లింపు విషయంలో తెలంగాణ విద్యుత్ సంస్థలు చెప్పిన లెక్కలను తోసిపుచ్చింది. తమకు రావాల్సిన వాటా గురించి ప్రత్యేకంగా లెక్కలు అవసరం లేదని, ప్రస్తుతమున్న ఒప్పందం తాలూకు గణాంకాలను పరిశీలిస్తే అన్నీ విషయాలు అర్థమవుతాయని పేర్కొంది. అంతేగాక ఏపీ జెన్కోకు బకాయిలు చెల్లించాల్సి ఉందంటే తెలంగాణ విద్యుత్ సంస్థలు జారీ చేసిన పత్రికా ప్రకటనల్లోనూ పేర్కొన్నాయని వివరించింది. విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య వివాదాలను విద్యుదుత్పత్తి సంస్థల మధ్యకు తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని.. రాష్ట్ర విభజన సమస్యలకు, బకాయిల చెల్లింపునకు ముడిపెట్టడం సరికాదని పేర్కొంది. -
సింగరేణి ప్లాంట్‌కు బొగ్గు రవాణా
► మొదటి యూనిట్ ప్లాంటులో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ► శ్రీరాంపూర్, మందమర్రి, ► భూపాల్పల్లి నుంచి బొగ్గు సరఫరా ► ప్లాంటులో 2.80లక్షల టన్నుల బొగ్గు నిల్వలు జైపూర్ : మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంటుకు అసరమైన బొగ్గును రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న 1200 మెగా వాట్ల ప్లాంటు పనులు తుది దశకు చేరాయి. మార్చిలో బొగ్గు, ఆయిల్‌తో యూనిట్-1 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా ఈ నెలాఖరుకు యూనిట్-2 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, నీరు ప్రధానం కావడంతో ఇప్పటికే షెట్పల్లి నుంచి 1టీఎంసీ నీటిని తరలించారు. రిజర్వాయర్-1 సిద్ధం చేశారు. కాగా ప్లాంటుకు రైల్వేట్రాక్ ద్వారా బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించినా అది ఇప్పట్లో పూర్తి అయే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ జైపూర్ ప్లాంటు నుంచి మంచిర్యాల వరకు ప్రసుత్తం ఉన్న 63నంబరు జాతీయ రహదారిని రూ.19కోట్లతో నాలుగు వరుసల రోడ్డు విస్తరించింది. అలాగే జాతీయ రహదారి నుండి కోల్-హ్యాడ్లింగ్ ప్లాంటు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. శ్రీరాంపూర్ ఓసీపీ, మందమర్రి వాచర్, భూపాల్పల్లి ఏరియాలోని గనుల నుంచి లారీల ద్వారా ప్లాంటుకు బొగ్గు రవాణా చేస్తున్నారు. ఒక యూనిట్ ప్లాంటుకు (600మెగావాట్లు) ఒక రోజుకు 6 వేల టన్నుల బొగ్గు అవసరం అంటే రెండు యూనిట్లకు ఒక్కరోజుకు 12 వేల టన్నుల బొగ్గు అవసరం. బొగ్గు నాణ్యతలోపిస్తే 12వేల నుంచి 15వేల టన్నుల వరకు అవసరం పడుతుంది. అయితే ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అరుుతే 12వేల నుంచి 15వేల టన్నుల బొగ్గు కావాల్సి వస్తుందని, కాని ప్రారంభ దశలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అరుునా ప్లాంటులో 2లక్షల 80వేల టన్నుల బొగ్గును నిల్వ చేశారు. మొదటి యూనిట్ ప్లాంటు నుంచి ఉత్పత్తి 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటులో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంటు ను మార్చి 13న సింక్రనైజేషన్ చేయగా శుక్రవారం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సింక్రనైజేషన్ చేసి బొగ్గు, ఆయిల్‌తో ప్రయోగాత్మకం గా ఒక్క రోజు విద్యుత్ ఉత్పత్తి చేసినా ఇక నుం చి యూనిట్-1 ప్లాంటు ద్వారా బొగ్గుతో ఉత్పత్తి చేయనున్నారు. మొదటి యూని ట్ ద్వారా వచ్చిన విద్యుత్‌ను 400కేవీ స్విచ్‌యార్డు ద్వారా గజ్వేల్ గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు. -
థర్మల్ విద్యుత్‌కు బొగ్గు సరఫరాపై కోటి ఆశలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశంలో ఏర్పాటైన ప్రతి థర్మల్ విద్యుత్కేంద్రానికి అవసరాలకు తగ్గ బొగ్గు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రతిపాదన వెంటనే అమల్లోకి వస్తే తక్షణమే 7,230 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. మరో 10,930 మె.వా. విద్యుదుత్పత్తి వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా సిద్దమవుతుంది. తాజా ప్రతిపాదన పట్ల ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్కేంద్ర నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ప్రస్తుతం నిర్వహణలో ఉన్న ప్రాజెక్టులకే కాక కొత్తగా ఏప్రిల్ 2017 వరకు ఏర్పాటయ్యే థర్మల్ విద్యుత్కేంద్రాలకు కూడా ఇది వర్తించేలా చర్యలు చేపట్టనున్నారు. ఆయా ప్రాజెక్టులు చేసుకున్న ఇంధన ఒప్పందాలతో సంబంధం లేకుండా అన్ని యూనిట్లకు బొగ్గు సరఫరా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం దేశంలో 12 వేల మె.వా. సామర్థ్యంకల ప్లాంట్లకు ఇంధన ఒప్పందాలు లేవు. దీంతో ఏటా రూ. 32 వేల కోట్ల రెవెన్యూ నష్టం వాటిల్లుతోంది. క్యాప్టివ్ కోల్‌మైన్స్ లెసైన్స్ ఉండి ఏ కారణం చేతనైనా అది రద్దయినా, ఆలస్యమైనా అలాంటి ప్రాజెక్టులకు కూడా ఈ పథకాన్ని విస్తరించనున్నారు. ఈ ప్రతిపాదనపై ‘‘థర్మల్ విద్యుత్కేంద్రాలకు అవసరమైనంత బొగ్గు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను స్వాగతిస్తున్నాం. మా అనుబంధ సంస్థ గాయత్రీ ఎనర్జీ వెంచర్స్ ద్వారా 2,640 మె.వా. థర్మల్ విద్యుదుత్పత్తి చేస్తున్నాం. నిరంతర బొగ్గు సరఫరా హామీ ఉంటే సామర్థ్యాన్ని మరింత పెంచే ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే దేశీయంగా లభించే బొగ్గు కేలరీ నాణ్యత విషయం కొంత ఆందోళనకరం. ఏదేమైనా బొగ్గు సరఫరా ప్రతిపాదన దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ఊతాన్నిస్తుంది’’ అని సందీప్ రెడ్డి, గాయత్రీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అభిప్రాయపడ్డారు. ‘‘నిరంతర బొగ్గు సరఫరా హామీ అమలైతే 100 మె.వా.లోపు థర్మల్ యూనిట్లకు ఆక్సిజన్ ఇచ్చిన ట్లవుతుంది. క్యాప్టివ్ యూనిట్లకే కాక కోజనరేషన్ యూనిట్లకు కూడా పూర్తి స్థాయి సామర్థ్యాన్ని అందుకొనే వీలుంటుంది. అయితే అంతర్జాతీయ, దేశీయ కోల్ ధరల్లో పెద్ద వ్యత్యాసమేమీ లేదు. నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తే ఉత్పత్తి మరింత నాణ్యంగా అందించవచ్చు’’ అని హరి కుమార్, సింహాద్రి పవర్ తెలిపారు. -
ఆర్టీపీపీపై సవతి ప్రేమ
- ఒప్పందం మేరకు బొగ్గు సరఫరా చేయండి - సింగరేణి కాలరీస్ ఎండీకి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి లేఖ సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమకు మణిహారంగా నిలుస్తున్న ఆర్టీపీపీకి అవసరమైన బొగ్గు సరఫరాలో సవతిప్రేమ చూపొద్దని, జెన్కో సంస్థతో చేసుకున్న అగ్రిమెంటు మేరకు బొగ్గు సరఫరా చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కోరారు. ఆర్టీపీపీలో బొగ్గునిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) ఎండీ సుతిత్రభట్టాచార్యకు సోమవారం లేఖ రాశారు. 1050 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ఆర్టీపీపీలో బొగ్గు నిల్వలు లేక యూనిట్లను నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొందని తెలిపారు. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 2030 వరకూ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేయాలనే ఒప్పందం ఉందన్నారు. రాష్ట్ర విభజన నాటినుంచి ఇప్పటి వరకూ అక్కడి నుంచి మోతాదు మేరకు సరఫరా లేకుండా పోయిందని ఆయన వివరించారు. జెన్కోకు ఉన్న ఒప్పందం ప్రకారం ఆర్టీపీపీకి ప్రతి ఏడాది 38.8లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా, ఆమేరకు బొగ్గు సరఫరా కావడం లేదని అవినాష్‌రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు. జెన్కోలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆర్టీపీపీ ఏరోజుకారోజు బొగ్గు కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈపరిణామానికి ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన కోరారు. ఎస్సీసీఎల్ కారణంగా ఉత్పత్తి ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఎస్సీసీఎల్ ఛెర్మైన్‌కు రాసిన లేఖలో తెలిపారు. -
విద్యుత్‌కు బొగ్గు భరోసా!
న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి రంగానికి ప్రభుత్వం కాస్త చేయూతనిచ్చే నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతుల్లో అడ్డుంకుల కారణంగా బొగ్గు గనుల అభివృద్ధి చేపట్టని విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరాను పెంచేందుకు ఓకే చెప్పింది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) గురువారం ఇక్కడ జరిపిన భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పర్యావరణ, అటవీశాఖ అనుసరిస్తున్న అనుకూల(గో), నిషేధిత(నో-గో) విధానం కారణంగా మొత్తం 24 విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఇందులో 9 ప్రాజెక్టులకు మరింత బొగ్గును సరఫరా చేయడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జీఎంఆర్ రెండు ప్రాజెక్టులు కూడా... కేబినెట్ ఆమోదించిన జాబితాలో స్టెరిలైట్, జీఎంఆర్, కేఎస్కే మహానది పవర్లకు చెందిన రెండేసి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిప్రకారం పర్యావరణ అనుమతుల జాప్యంతో మైనింగ్ అభివృద్ధి నిలిచిపోయిన పవర్ ప్లాంట్లకు మరో మూడేళ్లపాటు క్రమానుగత(ట్యాపరింగ్) బొగ్గు లింకేజీ విధానం కింద సరఫరా చేయనున్నారు. అయితే ఈ విధానం ప్రకారం ఎంత పరిమాణంలో బొగ్గు సరఫరా చేయాలనేది ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) ద్వారా నిర్ణయించనుండగా.. అదనపు సరఫరా పరిమాణాన్ని లభ్యతకు లోబడి అవగాహన ఒప్పందాల(ఎంఓయూ) ప్రాతిపదికన ఇవ్వనున్నారని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సరఫరా ప్రక్రియను ప్రతి ఏడాది చివర్లో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతోపాటు ప్రణాళిక సంఘం కలిసి సమీక్షించనున్నాయి. రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు... ప్రభుత్వం అదనపు బొగ్గు సరఫరాలకు ఓకే చెప్పిన 9 పవర్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 11 వేల మెగావాట్లుగా అంచనా. వీటికి పెట్టుబడుల మొత్తం దాదాపు రూ.60 వేల కోట్లు. ఈ ప్లాంట్లకు ఇప్పటికే సొంత బొగ్గు సరఫరా బ్లాక్‌లు ఉన్నాయి. అయితే, పర్యావరణ అనుమతుల విషయంలో అడ్డంకులతో ఈ గనుల్లో తవ్వకాలకు వీల్లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ట్యాపరింగ్ బొగ్గు లింకేజీ కింద మూడేళ్ల సరఫరాలకు బదులు మరో మూడేళ్లు అదనంగా సరఫరా చేయాలని ప్లాంట్లు విజ్ఞప్తి చేశాయి. విద్యుత్ శాఖ కూడా దీనికి సిఫార్సు చేయడంతో కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఎయిరిండియా బోయింగ్‌ల అమ్మకానికి ఓకే.. ఎతిహాద్ ఎయిర్వేస్కు అయిదు బోయింగ్ 777 విమానాలను విక్రయించాలన్న ఎయిరిండియా ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. గత నెలలోనే ఎతిహాద్‌తో డీల్‌ను ఎయిరిండియా ఖరారు చేసుకుంది. ఈ ఒప్పందంతో ఎయిరిండియాకు 30-35 కోట్ల డాలర్ల వరకూ(గరిష్టంగా రూ.2,200 కోట్లు) లభించవచ్చని అంచనా. టర్న్‌ఎరౌండ్ ప్రణాళికలో భాగంగా కంపెనీకి ఉన్న రూ.20,000 కోట్ల రుణ భారంలో కొంత మొత్తాన్ని తీర్చేందుకు వినియోగించనుంది. 11 ఖాయిలా పరిశ్రమలకు రూ.117 కోట్లు ఖాయిలా పడిన 11 ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)లకు రూ.116.86 కోట్లను కేటాయించేందుకు సీఈఈఏ ఆమోదం తెలిపింది. వేతనాలు, ఇతర బకాయిల కింద ఈ నిధులను ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈ నిధులు అందనున్న పరిశ్రమల్లో హిందుస్తాన్ కేబుల్స్, హెచ్ఎంటీ మిషన్ టూల్స్, హెచ్ఎంటీ(వాచెస్), హెచ్ఎంటీ(చినార్ వాచెస్), నాగాలాండ్ పల్ప్ అండ్ పేపర్, త్రివేణి స్ట్రక్చర్స్, తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్, నాపా లిమిటెడ్, హెచ్ఎంటీ బేరింగ్స్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్, టైర్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో పీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, బోనస్ వంటి చట్టబద్ధ బకాయిలు, వేతన బకాయిల కింద ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. -
జెన్కో ఎండీకి ఉత్తమ సీఈవో పురస్కారం
సాక్షి, హైదరాబాద్: గ్యాస్, బొగ్గు సరఫరా లేక దేశంలో 45 నుంచి 50 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుదుత్పత్తి ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఫలితంగా రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు నిరర్థకంగా మారాయన్నారు.కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీ సంస్థ శుక్రవారం నగరంలో నిర్వహించిన ఇండియన్ పవర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ అందించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన విద్యుత్ రంగ నిపుణులను కోరారు. అలాగే, విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జెన్కో ఎండీ విజాయానంద్‌కు ఉత్తమ ముఖ్య కార్యనిర్వహణాధికారి(బెస్ట్ సీఈఓ) పురస్కారాన్ని అందించారు. ఉత్తమ ఆర్థిక నిర్వహణ(బెస్ట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్) అవార్డును జెన్కో మాజీ జేఎండీ ప్రభాకర్‌రావుకు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీ సంస్థ అధ్యక్షుడు సీవీజే వర్మ పాల్గొన్నారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో రచ్చబండకు సీఎం మూడో విడత రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జిల్లాల పర్యటన అనంతరం సోమవారం సాయంత్రం 4.20 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. -
పల్లెకు విద్యుత్ ‘షాక్’!
సాక్షి, హైదరాబాద్: వేసవికి ముందే రాష్ట్ర ప్రజలకు చెమటలు పడుతున్నాయి. ఒకవైపు ఎండల వేడిమి... మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. గ్రామాలైతే ఏకంగా 12 గంటల పాటు విద్యుత్ సరఫరా లేక అల్లాడుతున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కూడా 2 నుంచి 3 గంటలు మాత్రమే సరఫరా అవుతోంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో రోజుకు 2 గంటల చొప్పున విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటల చొప్పున కోతలు విధిస్తున్నారు. అయితే ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకూ అని అధికారికంగా ఎక్కడా ప్రకటించడం లేదు. అనధికారికంగా ఇష్టమొచ్చినట్టు కోతలను అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు అక్టోబర్ మొదటివారంలో విద్యుత్ కోతలు అమలుచేసిన సందర్భం లేదు. గత ఏడాది మాత్రమే సింగరేణిలో సమ్మె కారణంగా బొగ్గు సరఫరాకు ఆటంకం ఏర్పడి కొద్దిమేరకు విద్యుత్ కోతలను అమలు చేశారు. ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నప్పటికీ విద్యుత్ కోతలు ఎందుకు అమలవుతుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గృహ వినియోగదారులకు అడ్డదిడ్డంగా కోతలు అమలు చేస్తున్న ప్రభుత్వం... మరోవైపు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను కూడా తీవ్రంగా తగ్గించింది. వ్యవసాయ ఫీడర్లకు రోజుకు 7 గంటల చొప్పున ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఎక్కడా 7 గంటలు సరఫరా కావడం లేదు. కేవలం 2-3 గంటల మేరకు మాత్రమే విద్యుత్ వస్తోంది. అది కూడా పదే పదే ట్రిప్ అవుతూ మూడు, నాలుగు విడతలుగా వస్తోంది. దీంతో తడిపిన మడినే మళ్లీ మళ్లీ తడపాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో విద్యుత్ కోతల వల్ల తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా చేస్తే జీతాల్లో కోత విధిస్తామని ఉద్యోగులను ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా దారుణంగా పడిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో వ్యవసాయానికి ఏరోజైనా 7 గంటలు సరఫరా కాకపోతే... మరుసటి రోజు ఆ మేరకు అదనంగా విద్యుత్ సరఫరా చేసేవారు. ఈ విధానాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. ఉత్పత్తి పెంచని సర్కారు!: భారీ వర్షాలతో రిజర్వాయర్లు నీళ్లతో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుత్ ఉత్పత్తి జోరుగా సాగుతోంది. వీటితో పాటు జూరాల, సీలేరు బేసిన్‌లోని విద్యుత్ ప్లాంట్లలోనూ ఉత్పత్తి బాగా జరుగుతోంది. అయితే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీపీసీకి చెందిన వైజాగ్‌లోని సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒక యూనిట్లో బొగ్గు కొరత కారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మిగిలిన మూడు యూనిట్లలోనూ పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరగడం లేదు. దీంతో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన విద్యుత్ వాటా తగ్గిపోయింది. ఈ ప్లాంట్లకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచేందుకు వీలుంది. తద్వారా రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ కూడా పెరుగుతుంది. అయితే ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వేసవిని తలపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పల్లెలు తేడా లేకుండా అనధికారిక విద్యుత్ కోతలు అమలవుతున్నాయని చెబుతున్నారు.