విద్యుత్‌కు బొగ్గు భరోసా! | More coal supply to power cos whose mines face green hurdles | Sakshi
Sakshi News home page

విద్యుత్‌కు బొగ్గు భరోసా!

Published Fri, Dec 27 2013 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

పవర్

పవర్

న్యూఢిల్లీ: విద్యుదుత్పత్తి రంగానికి ప్రభుత్వం కాస్త చేయూతనిచ్చే నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతుల్లో అడ్డుంకుల కారణంగా బొగ్గు గనుల అభివృద్ధి చేపట్టని విద్యుత్ సంస్థలకు బొగ్గు సరఫరాను పెంచేందుకు ఓకే చెప్పింది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) గురువారం ఇక్కడ జరిపిన భేటీలో ఈ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. పర్యావరణ, అటవీశాఖ అనుసరిస్తున్న అనుకూల(గో), నిషేధిత(నో-గో) విధానం కారణంగా మొత్తం 24 విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఇందులో 9 ప్రాజెక్టులకు మరింత బొగ్గును సరఫరా చేయడానికి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

జీఎంఆర్ రెండు ప్రాజెక్టులు కూడా...
కేబినెట్ ఆమోదించిన జాబితాలో స్టెరిలైట్, జీఎంఆర్, కేఎస్‌కే మహానది పవర్‌లకు చెందిన రెండేసి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనిప్రకారం పర్యావరణ అనుమతుల జాప్యంతో మైనింగ్ అభివృద్ధి నిలిచిపోయిన పవర్ ప్లాంట్లకు మరో మూడేళ్లపాటు క్రమానుగత(ట్యాపరింగ్) బొగ్గు లింకేజీ విధానం కింద సరఫరా చేయనున్నారు. అయితే ఈ విధానం ప్రకారం ఎంత పరిమాణంలో బొగ్గు సరఫరా చేయాలనేది ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్‌ఎస్‌ఏ) ద్వారా నిర్ణయించనుండగా.. అదనపు సరఫరా పరిమాణాన్ని లభ్యతకు లోబడి అవగాహన ఒప్పందాల(ఎంఓయూ) ప్రాతిపదికన ఇవ్వనున్నారని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సరఫరా ప్రక్రియను ప్రతి ఏడాది చివర్లో బొగ్గు, విద్యుత్ మంత్రిత్వ శాఖలతోపాటు ప్రణాళిక సంఘం కలిసి సమీక్షించనున్నాయి.

రూ. 60 వేల కోట్ల పెట్టుబడులు...
ప్రభుత్వం అదనపు బొగ్గు సరఫరాలకు ఓకే చెప్పిన 9 పవర్ ప్రాజెక్టుల ఉత్పత్తి సామర్థ్యం 11 వేల మెగావాట్లుగా అంచనా. వీటికి పెట్టుబడుల మొత్తం దాదాపు రూ.60 వేల కోట్లు. ఈ ప్లాంట్లకు ఇప్పటికే సొంత బొగ్గు సరఫరా బ్లాక్‌లు ఉన్నాయి. అయితే, పర్యావరణ అనుమతుల విషయంలో అడ్డంకులతో ఈ గనుల్లో తవ్వకాలకు వీల్లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం ట్యాపరింగ్ బొగ్గు లింకేజీ కింద మూడేళ్ల సరఫరాలకు బదులు మరో మూడేళ్లు అదనంగా సరఫరా చేయాలని ప్లాంట్‌లు విజ్ఞప్తి చేశాయి. విద్యుత్ శాఖ కూడా దీనికి సిఫార్సు చేయడంతో కేంద్ర కేబినెట్ ఎట్టకేలకు ఆమోదం తెలిపింది.

ఎయిరిండియా బోయింగ్‌ల అమ్మకానికి ఓకే..
ఎతిహాద్ ఎయిర్‌వేస్‌కు అయిదు బోయింగ్ 777 విమానాలను విక్రయించాలన్న ఎయిరిండియా ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. గత నెలలోనే ఎతిహాద్‌తో డీల్‌ను ఎయిరిండియా ఖరారు చేసుకుంది. ఈ ఒప్పందంతో ఎయిరిండియాకు 30-35 కోట్ల డాలర్ల వరకూ(గరిష్టంగా రూ.2,200 కోట్లు) లభించవచ్చని అంచనా. టర్న్‌ఎరౌండ్ ప్రణాళికలో భాగంగా కంపెనీకి ఉన్న రూ.20,000 కోట్ల రుణ భారంలో కొంత మొత్తాన్ని తీర్చేందుకు వినియోగించనుంది.

11 ఖాయిలా పరిశ్రమలకు రూ.117 కోట్లు
ఖాయిలా పడిన 11 ప్రభుత్వరంగ సంస్థ(పీఎస్‌యూ)లకు  రూ.116.86 కోట్లను కేటాయించేందుకు సీఈఈఏ ఆమోదం తెలిపింది. వేతనాలు, ఇతర బకాయిల కింద ఈ నిధులను ఆయా సంస్థలు వినియోగించనున్నాయి. ఈ నిధులు అందనున్న పరిశ్రమల్లో హిందుస్తాన్ కేబుల్స్, హెచ్‌ఎంటీ మిషన్ టూల్స్, హెచ్‌ఎంటీ(వాచెస్), హెచ్‌ఎంటీ(చినార్ వాచెస్), నాగాలాండ్ పల్ప్ అండ్ పేపర్, త్రివేణి స్ట్రక్చర్స్, తుంగభద్ర స్టీల్ ప్రొడక్ట్స్, నాపా లిమిటెడ్, హెచ్‌ఎంటీ బేరింగ్స్, హిందుస్తాన్ ఫొటో ఫిలిమ్స్, టైర్ కార్పొరేషన్‌లు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యలో పీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, బోనస్ వంటి చట్టబద్ధ బకాయిలు, వేతన బకాయిల కింద ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement