ఇంజినీర్లకు నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ సంస్థ ప్రత్యేక అకాడమీ ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, అకౌంటబుల్ మేనేజర్ అశోక్ గోపీనాథ్ తెలిపారు. జీఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ అకాడమీ కోసం రూ.50 కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘దేశంలోని విమానయాన సంస్థలకు శిక్షణ పొందిన మానవ వనరుల కొరత ఎదురవుతోంది. ఎయిర్‌క్రాఫ్ట్ నిర్వహణలో భాగంగా భవిష్యత్తులో ఇంజినీర్లకు గిరాకీ ఏర్పడుతుంది. వారికి నైపుణ్యాలు అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఆధ్వర్యంలో జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. జులై నెలలో కోర్సులు ప్రారంభించాలని ఇన్‌స్టిట్యూట్ యోచిస్తోంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో 10+2 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. కొత్త అకాడమీను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నాం. కోర్సులో భాగంగా రెండు సంవత్సరాలపాటు అకడమిక్ స్టడీ ఉంటుంది. మరో రెండేళ్లు ఉద్యోగ శిక్షణ అందిస్తాం. ఇండిగో, ఎయిరిండియా, ఆకాసా వంటి విమానయాన సంస్థలు ఇప్పటికే 1,200 కంటే ఎక్కువ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆర్డర్ చేశాయి. పరిశ్రమల అంచనా ప్రకారం, వచ్చే ఐదేళ్లలో భారతదేశానికి దాదాపు 5,000 మంది ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు అవసరం’ అన్నారు. దిల్లీ, హైదరాబాద్, గోవా విమానాశ్రయాలను జీఎంఆర్ నిర్వహిస్తోంది.
ఇదీ చదవండి: పైలట్ల కొరత తీర్చేందుకు ప్రత్యేక శిక్షణ
ఇదిలాఉండగా, పైలట్లుగా స్థిరపడాలనుకునే వారికి ఎయిరిండియా ఇప్పటికే ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకోసం మహారాష్ట్రలోని అమరావతిలో ఏడాదికి 180 మందికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీను ఏర్పాటు చేస్తోంది. అందులో ట్రెయినింగ్ పూర్తిచేసిన వారిని నిబంధనల ప్రకారం నేరుగా సంస్థలో పైలట్లుగా నియమించుకుంటామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment